కేసీఆర్‌ వద్దన్న అధికారిని జగన్‌ ఎందుకు తీసుకున్నారు?

Google+ Pinterest LinkedIn Tumblr +

మారుమూల ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే ఐఎఎస్‌ అధికారి ఆకునూరి మురళి, పనిలేని చోట కూర్చొని జీతం తీసుకోవడం ఇష్టం లేక, తెలంగాణ ప్రభుత్వంలో ఆయన ఉండననుకున్నారు. ఆయన్ను కూడా ప్రభుత్వం వద్దనుకుంది.
సీన్‌ కట్‌ చేస్తే , ఒక సామాజిక దృక్పధంతో విద్య,వైద్యం మెరుగుదలకు కృషి చేస్తున్న జగన్‌ ప్రభుత్వం మురళి సేవలు పొందాలనుకొని, ఏకంగా ప్రభుత్వ సలహాదారుడి పదవి కట్టబెట్టింది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా చేరిన వారితో పోలిస్తే ఆకునూరి మురళి వల్లనే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందని, తెలంగాణలో గురుకుల విద్యను సుసంపన్నం చేసిన ప్రవీన్‌కుమార్‌లా , మురళి దూసుకుపోతారని, జగన్‌ తీసుకున్న అద్భుతమైన నిర్ణయం అని, రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.
ఆకునూరి మురళి పాలనాధికారిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఏ అంశమైనా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారని, అధికార వర్గాలు చెబుతూ ఉంటాయి. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ గా ఉన్న సమయంలో కొన్ని వివాద స్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ స్టేట్‌ ఆర్కీవ్స్‌ కార్యదర్శిగా ప్రాధాన్యత లేని పోస్టులో నియమించింది. ఫలితంగా ఆయన స్వచ్చంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్నారు.
ఆ సందర్బంలో మీడియాతో మాట్లాడుతూ, ” విద్యా వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉంది. తెలంగాణలో కూడా స్కూళ్లలో మౌలిక వసతులు సరిగ్గా లేవని, ఏదైనా స్వచ్ఛంద సంస్ధతో కలిసి, విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఉంది..” అన్నారు.
ఆయన ఆశయానికి తగినట్టుగానే, ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్య, మౌళిక వసతుల కల్పిన సలహాదారుడిగా నియమిస్తూ, నిర్ణయం తీసుకుంది. విద్యావిధానం పై ఆయనకు కొన్ని నిర్ధష్టమైన ఆలోచనలున్నాయి. పాలనాధికారిగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుల తీరును ప్రత్యక్షంగా చూసి, తల్లిదండ్రులతో మాట్లాడి ఒక కేస్‌ స్డడీ చేశారు.
నాలుగు గదులు,నల్లబోర్డు, పైన కప్పు అదేనా స్కూలంటే? కాదు. రేపటి సమాజాన్ని నిర్మించే అద్బుత ప్రయోగశాల. ఎవ్వరికీ కాకుండా పోతున్న ప్రభుత్వ బడుల పరిస్ధితి అతడిని కదిలించింది. సమస్యలకు కారణాలను అనేక కోణాల్లో విశ్లేషించారు.
” నేను కలెక్టర్‌గా పని చేసిన ఒక జిల్లాలో ప్రైవేట్‌ విద్య, ప్రభుత్వ విద్య ఎలా ఉందో విశ్లేషించి చెబుతాను. జిల్లాలో వున్న ఒక ప్రైవేట్‌ బడిలో ప్రతి 38 మంది విద్యార్థులకు ఒక టీచరు వుంటే, ఆ జిల్లాలో ప్రభుత్వ బడులలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ వున్నారు. ప్రైవేట్‌ యాజమాన్యం ప్రతీ విద్యార్థి మీద సగటున ప్రతి సంవత్సరం రూ.6,200 ఖర్చు పెట్టి, 86 శాతం విద్యార్థులకు నాణ్యతలో ‘ఏ’ గ్రేడ్‌లో తీర్చి దిద్దగలిగితే, మన సర్కారు బడులలో ప్రభుత్వం సగటున విద్యార్థికి ప్రతీ సంవత్సరం రూ.35,000- ఖర్చు పెట్టినా 67శాతం విద్యార్థులు ‘సీ’ గ్రేడు కంటే దాటలేకపోతున్నారు. ప్రైవేట్‌ యాజమాన్యం ఒక టీచరుకు నెలకు రూ.5,000 -నుండి రూ.20,000 వరకు (సబ్జెక్టును బట్టి) చెల్లిస్తుంటే ప్రభుత్వం నెలకు ఒక టీచరుకు రూ.35000 నుండి రూ.1,20,000వరకు చెల్లిస్తుంది. మరి, లోపం ఎక్కడ వుంది? ప్రభుత్వ పరిపాలనలోనే అని చెప్పక తప్పదు.
మరో వెనకబడిన జిల్లాలోని ఒక మండలంలో పరిస్థితి విశ్లేషిస్తే నాలుగు పెద్ద గ్రామాలలో వున్న ప్రైవేట్‌ బడులలో 4500 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే అదే మండలంలో 36 గ్రామాలలో వున్న ప్రభుత్వ బడులలో 1400 మంది చదువుతున్నారు. ఆ మండలంలో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పులు చేసి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి రూ.15,000 నుండి రూ. 30,000 వరకు ఫీజులు కడుతున్నారు. మిగతా మధ్యతరగతి కుటుంబాలు, ఒక మోతాదులో వున్న పెద్ద రైతులు వారి కుటుంబాలను పెద్ద పట్టణాలలో పెట్టి, పిల్లలను ప్రైవేట్‌ కాన్వెంట్‌ స్కూళ్లలో చదివించుకుంటున్నారు. ‘ప్రభుత్వ బడులలో చదివించాలంటే నామోషీగా అనిపిస్తుంది’ అని ఒక గ్రామంలో తల్లిదండ్రులు నాతో అన్నారు. పక్క ఇంటి వాళ్ల పిల్లలు టిప్‌ టాప్‌గా తయారై టై, బూట్లు వేసుకొని మండల కేంద్రంలోని ప్రైవేట్‌ బడికి వ్యాన్‌లో పోతుంటే మా పిల్లలను దీనావస్థలోవున్న ఊళ్లోని ప్రభుత్వ బడికి ఎలా పంపించాలని వారు వాపోయారు. ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో ఒక ‘బొమ్మ’ విస్త తంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రైవేట్‌ బడి భవనం బ్రహ్మాండంగా వుంటుంది కాని ప్రైవేట్‌ టీచరు ఒక పెంకుటింటిలో నివసిస్తుంటారు. అదే ప్రభుత్వ బడి విషయానికి వస్తే ప్రభుత్వ బడి భవనం అధ్వాన్న స్థితిలో వుంటుంది. కాని ప్రభుత్వ టీచరు ఇల్లు జిల్లా ముఖ్య పట్టణంలో బ్రహ్మాండంగా వుంటుంది. మన చదువుల పరిస్ధితి అర్థం చేసుకోవడానికి చాలా చక్కని ఉదాహరణ అది.
నేను 16 సంవత్సరాల క్రితం చైనాకు వెళ్ళినప్పుడు గ్రామాలలో నాకు కనిపించిన ద శ్యాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అక్కడ గ్రామంలో ఆధునికమైన భవనంలో ప్రభుత్వ బడులు, ప్రభుత్వం కట్టించిన భవనాలలో టీచర్లు నివాసం వుంటారు. అక్కడి ప్రభుత్వం 1950లలో ప్రాథమిక విద్య మీద పెట్టిన పెట్టుబడి, శ్రద్ధ వల్లనే ఈ రోజు చైనా ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ఎదిగింది.
‘మీరు ప్రభుత్వ బడులకు మీ పిల్లలను ఎందుకు పంపించరు?’ అని నేను చాలా గ్రామాలలో తల్లిదండ్రులను అడిగితే వారు ఇలా అంటారు : ఇంగ్లీషు మీడియం లేదు, మరుగు దొడ్లు, శుభ్రమైన తాగు నీరు, తరగతి గదిలో ఫర్నీచర్‌ వంటి కనీస సౌకర్యాలు ఉండవు, బోధనలో నాణ్యత వుండదు అన్నారు. అంతేకాదు, ఎల్‌కేజీ, యూకేజీలు లేకపోవడాన్నీ వారు ఎత్తి చూపారు.
ప్రైవేట్‌ బడులలో విద్యా నాణ్యతకు సంబంధించి, బడిలోని సౌకర్యాలకు సంబంధించి తీసుకునే చర్యలు మనకు ప్రభుత్వ బడులలో కానరావు. అక్కడ ఉపాధ్యాయులు స్కూలు యజమానులకు జవాబుదారీగా వుంటారు. మరి ప్రభుత్వ బడుల ఉపాధ్యాయులు ఎవరికి జవాబుదారీగా వుంటారు అనేదే పెద్ద ప్రశ్న. కొంత మంది అనొచ్చు వారు ప్రభుత్వానికి జవాబుదారీతనం వహించాలి అని, కానీ ఇక్కడ రెండు ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఒకటి, విద్యకు సంబంధించినంత వరకు ప్రభుత్వం కనపడని ఒక విచిత్ర వ్యవస్థ. రెండు, ప్రభుత్వానికి ఉపాధ్యాయులు భయపడుతున్నారా? లేక, ఉపాధ్యాయులకు ప్రభుత్వాలు భయపడుతున్నాయా? అన్నది. దీనికి పరిష్కార మార్గంగా తల్లిదండ్రులను సమీకరించి కమిటీగా ఏర్పరచి ఆ కమిటీలను పటిష్ఠ పరిచి వారికి బడి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించి ప్రతి తల్లి/ తండ్రి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు స్కూల్‌ కార్పస్‌ ఫండ్‌ కింద కట్టించగల్గితే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులను ప్రశ్నించే అధికారం వస్తుంది. విద్య నాణ్యతను సమీక్ష చేసుకునే సామర్థ్యం సహజంగా వస్తుంది. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రభుత్వ బడులు బాగుపడవు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి తల్లిదండ్రుల కమిటీ ద్వారానే ఖర్చు పెట్టించగలిగితే పనుల నాణ్యత, వేగం పెరుగుతుంది.
అమెరికాలోనూ, యూరప్‌ దేశాలలోనూ ‘స్కూల్‌ డిస్ట్రిక్ట్‌’ అనే విధానం వుంటుంది. అంటే ఆవాసంలోని పిల్లలందరూ ప్రభుత్వ బడులలో విధిగా చదివించాలి. అక్కడ రెసిడెన్షియల్‌ స్కూళ్లు చాలా తక్కువగా వుంటాయి. మన ఊరికి దగ్గరలోనే మంచి స్కూల్‌ ఉన్నట్లయితే దూరంగా వున్న గురుకుల పాఠశాలలకు (ప్రైవేట్‌ కార్పొరేట్‌, ప్రభుత్వం.. ఏదైనా కావొచ్చు) పిల్లలను పంపాల్సిన అవసరం వుండదు కదా! నాణ్యమైన విద్యకు ఖరీదైన గురుకుల పాఠశాలలు పరిష్కారమే కాదు. గురుకుల పాఠశాలలో చదివే పిల్లలు వారి బాల్యాన్ని, తల్లిదండ్రుల తో గడపాల్సిన సంతోష సమయాన్ని కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని తరగతులకు ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెట్టవలసిన అవసరం వుంది. ఇక్కడ చర్చించిన విషయాలను, మన సమాజ పరిస్థితులను, రాజకీయ వ్యవస్థను, కుల వ్యవస్థను పరిశీలిస్తే నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది.

Akunuri Murali with rural women


అప్పుడు సంపన్నుల, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది. దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత మెరుగవుతాయి. అన్ని కులాల విద్యార్థులు ఒకటే బడికి పోవడం ద్వారా విద్యార్థుల మధ్య సమానత్వం ఏర్పడి, కుల వ్యవస్థ కూడా బలహీన పడటానికి అవకాశం ఉంది. నాణ్యమైన విద్య అందించే మానవ వనరులు, సాంకేతికత, ఆర్థిక వనరులు మన తెలుగు రాష్ట్రాలలో పుష్కలంగా ఉన్నాయి. కావాల్సిందల్లా.. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా అందించాలి అనే నిబద్ధత ప్రభుత్వాలకు ఉండడమే! ఈ విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపితే, పేదరికం లేకుండా చేయొచ్చు. ఒక లౌకిక సమాజాన్ని, బంగారు భారతాన్ని నిర్మించవచ్చు.” అని వివరించారు,మురళి. pic/akunuri murali/facebook

Share.

Leave A Reply