ఈ ఊర్లో పాలు,పెరుగు అమ్మరు..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ రోజుల్లో కూడా ఇచ్చిన మాట నిలుపుకొనే వారు మన చుట్టూ ఉన్నారంటే,
నమ్మశక్యంగా ఉండదు కానీ, అలాంటి నిజాయితీపరులున్న ఒక గ్రామం కథ ఇది. కరవు కష్టాలు ఎదురైనా కట్టుబాటు తప్పని ప్రజల నిజాయితీ ఇది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం, గంజహళ్లిలోకి వెళ్లాలంటే, ప్రశాంతమైన పచ్చని పొలాలు మధ్య మలుపుల దారిలో ప్రయాణించాలి. ఇక్కడ దాదాపు అందరూ మధ్యతరగతి వారే, ప్రతీ ఒక్కరికీ ఎంతో కొంత పొలం, లేదా పశువులు ఉంటాయి.
గ్రామంలో ఒక ఇంటి ముందు పాలు పోస్తుంటే కొందరు తీసుకెళ్తున్నారు. లీటర్‌ ఎంత అని మేం అడిగితే? ”ఇక్కడ పాలు అమ్మరు. ఉచితంగానే ఇస్తారు.” అన్నారు.
” మా పూర్వీకులకు ఇచ్చిన మాటకు ఇప్పటికీ కట్టుబడి, ఈ ఊర్లో పాలు,పెరుగు అమ్మం. ఎవరికైనా అవసరమైతే ఉచితంగా ఇస్తాం తప్ప విక్రయించం.” అన్నారు, ఇంటి ముందు కూర్చున్న అవ్వ రామంజనమ్మ,అంజనమ్మ.
ఏనాడో పెద్దల మాటకు కట్టుబడి గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం, కొద్ది రోజుల తరువాత ఎంతో కష్టంగా మారింది. వరస కరవులు… సాగుబడి లేని ప్రతికూల పరిస్థితులున్న ఆ ప్రాంతంలో చుట్టు పక్క గ్రామాల్లో రైతులు పాడినే ప్రధాన జీవనాధారంగా మార్చుకున్నారు. ఇలాంటి కష్టాల్లోనూ గంజహళ్లి గ్రామస్తులు మాత్రం వెనుకడుగు వేయకుండా, పూర్వీకుల మాట మరవకుండా జీవనం కొనసాగిస్తున్నారు.
మాట వెనుక కథ…
” కొన్ని శతాబ్దాల క్రితం, గంజహళ్లిలో మహాత్మ బడే సాహెబ్‌ అనే ఆధ్యాత్మికవేత్త
ఉండేవారు. ఓ రోజు తన కుమారుడితో పాలు తీసుకురావాలని చెప్పారు. గ్రామంలోకి వెళ్లి ఉట్టి చేతులతో వెనక్కి వచ్చిన ఆ కుమారుడు పశువులు వ్యాధులకు గురై మరణించాయి, కరవుతో రైతులు పోషించలేక అమ్ముకున్నారని, ఎక్కడా పాలు దొరకలేదని తిరిగి వస్తారు. బడేసాహెబ్‌ గ్రామంలో ఓ రైతు పేరు చెప్పి ఆయన ఇంట్లో గోవు ఉంది అక్కడ నుంచి తీసుకురమ్మని సూచిస్తారు. కుమారుడు ఆ గోవు దగ్గరకు వెళ్లేసరికి అదీ ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. అలా పడి ఉన్న గోవు నుంచే పాలు పితికి తీసుకెళ్తారు. అప్పడే బడేసాహెబ్‌ స్వామి గ్రామంలో గోవధ వద్దని, పాలు అమ్మకూడదని, ఆవుదూడలకు పాలు లేకుండా చేయరాదని ప్రజలకు చెబుతారు. ఆయన మాట మీరకుండా నాటి నుంచి నేటి వరకు వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఎవరూ పాలు అమ్మరు, పాడి ఉన్న వారు పిల్లల కోసం ఎవరైనా అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారు.” అని, బడేసాహెబ్‌ దర్గా గౌరవ అధ్యక్షుడు సయ్యద్‌ చిన్న ముద్గోల్‌, మాతో అన్నారు. ఈయన బడే సాహెబ్‌ వంశంలో 8వ తరానికి చెందిన వాడు. ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
మహాత్మ బడే సాహెబ్‌ జ్నాపకార్ధం గ్రామం మధ్యలో దర్గాను నిర్మించారు. అన్ని మతాల ప్రజలు ఇక్కడ ప్రార్ధనలు జరుపుతారు.
తరాలుగా తప్పని మాట :
” పాలు విక్రయించవద్దని పూర్వీకుల చెప్పిన మాటను ఇక్కడ తరతరాలుగా పాటిస్తున్నారు. 843 ఇళ్లు, 4వేలమంది జనం నివశించే మా ఉన్న గ్రామంలో ఏ ఒక్కరిలోనూ భేషజాలుండవు,భిన్న వర్గాల వారు కలిసికట్టుగా ఉంటారు. వ్యవసాయమే ప్రధానాధారమైన ఇక్కడ పాడికి కొదవలేదు. అయితే ఏ ఒక్కరూ పాలను అమ్మరు. గ్రామంలో ఎవరైనా చిన్నారుల కోసం, వివాహాలు, పండగల సమయంలో అడిగితే ఉచితంగా పంపిణీ చేస్తారు.” అంటారు గ్రామ మాజీ సర్పంచ్‌ పైఇంటి శ్రీనివాసులు.
ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న గ్రామం ఇది. అందుకే ఈయన ప్రతీ రోజు బడిపిల్లలను చేరదీసి ఉచితంగా ట్యూషన్‌ చెబుతారు.
ఇక్కడ 233 ఎకరాల్లో వేరుశెనగ,వరి,మిర్చిని , సుమారు 50 ఎకరాల్లో పశుగ్రాసం పండిస్తున్నారు. పూర్వం బడేసాహెబ్‌ తాత చెప్పారు, పెద్దలు అనుసరించారు. వారు చెప్పిన మాటను మేం పాటిస్తున్నామని ఇక్కడి యాదవులు చెబుతున్నారు. గ్రామంలోని ఇతర సామాజిక వర్గాలు, రైతుల్లో పశుపోషణ చేసేవారు చాలా తక్కువ. అలా చేసే వారు పాలను ఇంటి అవసరాలకు వాడుకుంటారు తప్ప మాట తప్పరు.

Share.

Leave A Reply