మంత్రి గారు, మా బడి కి దారి ఏదీ…?

Google+ Pinterest LinkedIn Tumblr +

అందరికీ విద్య మన ప్రాధమిక హక్కు. 
కానీ ఇక్కడ విద్య అందాలంటే ఈ పాఠశాలకి కిలో మీటర్‌ దూరం కొండకిందికి నడవాలి. మధ్యలో నీటి ప్రవాహాన్ని పుస్తకాలు నెత్తిమీద పెట్టుకొని దాటాలి. గట్టిగా వాన పడితే ఈ నీటిమట్టం పెరిగి పిల్లలు కొట్టుకు పోయే ప్రమాదం కూడా ఉంది.అయినప్పటికీ ఈ కష్టాలను ఈదుతూ చదువుకుంటున్నారు. వారినొక సారి పలకరిద్దామా? 
కొండ దిగి రావాలి… 
విజయనగరం జిల్లా, కురుపాం మండలం ఏజెన్సీ ఏరియా.పార్వతీపురం ఐటిడిఏ లో ఉంది. ఇక్కడి గొటివాడ పంచాయితీలోని హిల్‌టాప్‌ ప్రాంతం బోరి బండలగుడ్డి. ఇక్కడి నుండి పది మంది విద్యార్దులు గెడ్డ(వర్షాలు ఎక్కువ పడినపుడు ఏర్పడే నీటి ప్రవాహం) దాటుకుంటూ వెళ్లి తడిసిన దుస్తులను ఆరబెట్టుకొని, గొటివాడ ప్రాధమిక పాఠశాలకు వెళ్తున్నారు. జూలై నుండి అక్టోబర్‌ వరకు వానల వల్ల ఈ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి ఈ చిన్నారులు అవస్ధలు పడుతున్నారు. 
సర్వేలో బయట పడిన నిజం!! 
గిరిజనులు ప్రగతి కోసం పనిచేస్తున్న ఆర్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల్లో 57 పాఠశాలల్లో ప్రధానమైన సమస్యలు, విద్యాహక్కుల చట్టం అమలు తీరును చట్టం పరిధిలో విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతుల అమలును సంస్థ పరిశీలించినపుడు ఈ అడవిబిడ్డల సమస్య బయట పడింది. 
ప్రవాహాన్ని దాటుతూ ప్రమాదకర పరిస్థితుల్లో బడికి వెళ్తున్న పిల్లలను కాపాడుకోవాలంటే అక్కడ చిన్న వంతెన నిర్మిస్తే సరిపోతుందని ఇంజనీరంగ్‌ నిపుణులంటున్నారు. రూ.15లక్షల నుండి 20లక్షల వరకు నిధులు ఖర్చు అవుతాయని అంచనా. లేదా వీరికి బోరిలోనే బడిని ఏర్పాటు చేయాలి. ఈ సమస్యను గత రెండేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇంత వరకు పరిష్కారానికి ప్రయత్నం జరుగ లేదు. ఫలితంగా గత ఎడాదికంటే ఈ సారి నీటి ప్రవాహం పెరిగి పిల్లలు ఈత కొడుతూ వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడిందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. 
గిరిజన సంస్కృతికి అనువైన విద్య
‘ఇక్కడి కొండ ప్రాంతంలో సవర గిరిజనులు నివశిస్తున్నారు. వీరు జీవిస్తున్న భౌగోళిక పరిస్దితులకు అనువుగా మౌలిక వసతులు కల్పించాలి. కొండ శిఖరం మీద కుగ్రామాల నుండి వీరు చదువుకోవడానికి కిందికి దిగి రావాలి. ఆ క్రమంలో నీటి ప్రవాహాలు దాటాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. ఇలాంటి హిల్‌టాప్‌ గ్రామాలు విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో 450ఉన్నాయి. ఈ సమస్యనుండి కాపాడాలంటే వీరుండే చోటునే సబ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి చదువు చెప్పాలి. పిల్లలకు 1నుండి 3వ తరగతి వరకు సవర భాష తెలిసిన టీచర్లు బోధిస్తేనే వారు పాఠాలను అర్దం చేసుకోగలరు. దీనికి ఇంటర్మీడియట్‌ చదివిన ఇక్కడి నిరుద్యోగ యువతను టీచర్లను నియమించాలి…” ఆర్ట్స్‌ స్వచ్ఛంద సంస్థ సిఇఓ సన్యాసిరావు మాతో అన్నారు. 
ఒకప్పుడు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన పుష్సశ్రీవాణి ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆమె నియోజక వర్గం కురుపాం సమీసంలో బడిపిల్లల దుస్ధితి ఇది. ఈ పిల్లలు స్కూల్‌కి వెళ్లడానికి ఒక వంతెన నిర్మిస్తారని ఆశిద్దాం. 

Share.

Leave A Reply