ఆంధ్రా మన్యంలో,అందని వైద్యం !!

Google+ Pinterest LinkedIn Tumblr +

‘ ఈ కొండ మీద వంద కుటుంబాలున్నాయండీ, కానీ రోగం వస్తే తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ రాదండీ. అది వెళ్లడానికి దారి లేదు. కాలిబాటలో మేమే కిందికి దిగాలి… ఈ లోపు నొప్పులు భరించ లేక దారి లోనే ప్రసవాలు జరిగి పోతున్నాయి….” అన్నారు, తూరుపు కనుమల్లోని హుకుంపేట మండలం, గాలి పాడు గ్రామస్తులు. అరకు నుండి ఎనభై కిలో మీటర్ల దూరంలో మన్యంలోని గిరిజన గ్రామం అది.
సమస్త ప్రాణకోటికి ప్రాణవాయువునిచ్చే, అడవులు,గుట్టలను కాపాడుతున్న గిరిజనులకు అనారోగ్యం కలిగితే ఆదుకునే పరిస్ధితులు అంతంత మాత్రంగానే ఉండటం విషాదం.
గత రెండు వారాలుగా, కురుస్తున్న వర్షాలకు విశాఖ,పార్వతీపురం మన్యంలో జనజీవనం స్తంభించింది. మారుమూల గ్రామాల్లో, వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు అతికష్టం మీద వాగులు దాటుకుంటూ, ద్విచక్ర వాహనాలను దాటించుకుంటూ వెళ్తున్నారు. డుంబ్రిగుడ మండలంలోని చంపాపట్టి, కోసంగి, గోరాపూర్‌, లో గెడ్డలు ప్రవహిస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో రహదారులు లేని మన్యం గ్రామాల ప్రజలకు సకాలంలో వైద్యమందక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తూరుపు తీరపు మన్యం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై క్షేత్రస్ధాయి పరిశీలన.
మరి కొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోయిన నిండు గర్భిణి లక్ష్మి (28) వైద్యం కోసం కొండ ప్రాంతాల్లో 20 కి.మీ నడిచి వెళ్లిన ప్రాణాలు కోల్పోయింది. 20.8.2019న జరిగిన ఈ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం జమదంగిలో చికిత్స కోసం, జి.మాడుగుల మండలం బొయితిలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన మహిళ.. చికిత్స అనంతరం, తిరుగుపయనమై, మార్గమధ్యలో నొప్పులు రావడంతో బంధువులు డోలీలో ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. ఇలాంటి సంఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఆసుపత్రికి వెళ్లే లోపే రోడ్డుమీదనే డెలివరీ అయిన వార్తలు వచ్చాయి.
కొండలు దాటని ప్రభుత్వ లక్ష్యం ?
మన్యం ప్రాంతంలో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని గత ప్రభుత్వాలు చెప్పినప్పటికీ అడవి తల్లికి గర్భశోకం తప్పడం లేదు.
ప్రతి తల్లి ఆసుపత్రిలో ప్రసవించాలనే ప్రభుత్వ లక్ష్యం కొండలు దాటి గిరిజనుల చెంతకు వెళ్లడం లేదు. ఫలితంగా వారు పడుతున్న వేదన ఆరణ్యరోధనగా మిగిలి పొతున్నది.
గిరిజన ప్రాంతాల్లో అమ్మ తనం ఆపదలో పడింది.
సమస్యకు కారణాలు ఇవి
1, గర్భిణులకు సేవల కోసం అన్ని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను 24గంటలు పనిచేసేలా మార్చారు కానీ, ఈ సేవలు అన్ని చోట్ల అందుబాటులో లేవు. పార్వతీపురం ఐటిడిఏ పరిధిలోని, కురుపాంలో పేరుకే 30 పడకల ఆసుపత్రి ఉంది కానీ,సేవలు అంతంత మాత్రం గానే అందుతున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు.
2, కొన్ని నెలల క్రితం పార్వతీపురం ఐటీడిఏ పరిధిలో కొండల మీద తండాలకు చెందిన యువకుడిని పాము కరిస్తే, నెలరోజులైనా ఆసుపత్రికి రాలేదు. కాలు మొత్తం డ్యామేజీ అయ్యాక వెళ్లాడు .కొంత వరకు కాలును తొలగించాల్సి వచ్చింది. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటే, ఆ యువకుడికి వైకల్యం కలిగేది కాదు.
3, కొండ శిఖర గ్రామాల్లోకి ఆంబులెన్స్‌లు రావడానికి రహదారులు లేక, డోలీల్లో రోగులను కిందికి దించు తున్నారని వీరికి సాయంగా దశాబ్దం క్రితం ప్రభుత్వమే ‘సెర్ఫ్‌’ సాయంతో ఇనుప డోలీలు అందచేశారు. ఇపుడవి ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలియదు.
4, శిశువు కడుపులోనే మృతిచెందడం, నెలలకు నిండకుండానే పుట్టడం లాంటివి ఎక్కువగా రక్తలేమి వల్ల జరుగుతుంటాయి. గర్భాధారణ నుండి క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు,మంచి ఆహారం తీసుకుంటే ఇలాంటివి జరగవని, ఆరోగ్యశాఖ వారు గిరిజనుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
5, ఏజెన్సీలో తమ గ్రామాలను కలుపుతూ, రహదారులు వేయమని దశాబ్దాలుగా గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. విశాఖ, విజయనగరం జిల్లా గిరిజన ప్రాంతాల్లో దాదాపు 500 తండాలకు రహదారుల అనుసంధానం లేదు. దాదాపు అవన్నీ కొండ ప్రాంతాల్లే కావడంతో అత్యవసరంగా వైద్యం అవసరమైన వారికి ప్రాణాల మీదికి వచ్చినట్టే..
6, కొండల పై నుండి రోగులను కిందికి తీసుకు రావడానకి, గత ప్రభుత్వంలో బైక్‌ అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు కానీ, చాల తక్కువగా ఉన్నాయి. వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రమే…
7, హిల్‌టాప్‌లో ఉండే తండాల నుండి కిందికి రావాలంటే నిలువునా కాలి బాటలో రావాలి. ఇలాంటి కొండదారిలో 5 నుండి 10 కిలో మీటర్లు ఉంటాయి. నడవాలంటే నాలుగు గంటలు పడుతుంది.

8, ‘ప్రసవ సమయం దగ్గరపడినా గర్భిణులను ఆసుపత్రుల్లో చేర్పించక పోవడం వల్ల అనేక ప్రసవాలు గ్రామాల్లోనో , అంబులెన్సుల్లోనో, ఒక్కోసారి రహదారుల పక్కనే జరుగుతున్నా అధికారయంత్రాంగంలో కదలిక రావడం లేదు.
9, ఆఖరికి 108 వాహనాలు కూడా, సక్రమంగా పనిచేయడం లేదు, కొన్ని చోట్ల బైక్‌ ఆంబులెన్స్‌లు రావడానికి దారి ఉండదు, చీకటి పడితే గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లో వైద్యం అందట్లేదని, పాడేరు ఏజెన్సీ ప్రాంత వాసులు అంటున్నారు.
10, ఏడాది క్రితం పార్వతీపురం ఏజన్సీకి చెందిన కొండతామర గిందే అనే మహిళ ను డోలీలో తీసుకొస్తున్నపుడు పడిన ప్రసవ కష్టాలు మీడియాలో రావడంతో దాన్ని సుమోటాగా తీసుకున్న జాతీయ మానవహక్కుల కమిషన్‌ పార్వతీపురం ఐటీడిఎ గిరిజన ప్రాంతాల్లో, రహదారుల సమస్య, వైద్య సదుపాయాల తీరు పై అప్పటి తెలుగు దేశం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
ఇవీ పరిష్కారాలు …
1, కొండల పై నివశించే గిరిజనులు అవసరమైతేనే తప్ప కిందికి దిగరు.
ఆరోగ్యం బాగాలేక పోతే ఆసుపత్రికి వెళ్తే సూదిమందు ఇస్తారనే అపోహ చాలా మందిలో
ఉంది. ప్రాణాల మీదికి వస్తే తప్ప రారు. వారు రాకున్నా, వైద్యబృందం వెళ్లి ఆరోగ్యపరిస్ధితి, మహిళల గర్భధారణ పై ఆరాతీస్తే కొంత వరకు సమస్యలు తీరవచ్చు.
2, ఆవాస ప్రాంతాలకు రహదారుల అనుసంధానం లేదు. ఉపాధి హామీ పథకం నిధులతో సిసి రోడ్లు నిర్మించ వచ్చు.
3, మారుమూల ప్రాంతాల్లో సకాలంలో వైద్య సహాయం అందించడానికి తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో కలెక్టర్‌ దివ్య గారు ‘ప్రాజెక్టు రెక్కలు’ అనే పథకం ద్వారా, ఏఎన్‌ఎంలకు గేర్‌లెస్‌ బైక్‌లు చాలా తక్కువ ధరకే అందచేశారు. ఇది సక్సెస్‌ అయి చాలా వరకు మరణాలు తగ్గాయి. ఇలాంటిదే ఆంధ్రా ప్రాంతంలో అమలు చేయాలి.
4, కనీసం మూడు ఆవాసాలకు, ఒక బైక్‌ అంబులెన్స్‌ని ఏర్పాటు చేయాలి. టూవీలర్‌ వెళ్లగలిగిన రహదారుల్లో ఇవి వెళ్తాయి. రోగిని ప్రధాన రహదారి వరకు వీటిలో తీసుకెళ్ల వచ్చు. వీటి నిర్వహణను స్ధానిక గిరిజనులకే అప్పగించి, ఉపాధి కల్పించ వచ్చు.

5, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24గంటలు పనిచేయాలి కానీ, చాలాచోట్ల రాత్రివేళల్లో మూసేస్తున్నారు. ఒకవేళ తెరిచినా వైద్యాధికారులు స్థానికంగా , అందుబాటులో లేని పరిస్థితులున్నాయి.ఈ పద్దతిని వెంటనే మార్చాలి.
6, క్షేత్రస్థాయిలో ఉండే ఎఎన్‌ఎంలు, సూపర్‌వైజర్‌లు గర్భిణీలను ప్రసవ తేదీకి కనీసం వారం ముందుగానే ఆసుపత్రికి చేర్చాల్సి ఉన్నా ఈ మారు మూల ప్రాంతంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా హైరిస్క్‌ గర్భిణుల నమోదు, వారిని ఎప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించడంలోను వైద్యసిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. దీని పై వైద్య శాఖ దృష్టిపెట్టాలి.
నిధుల సేకరణ ఇలా…
ఈ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కోసం ప్రభుత్వం కొంత చొరవ తీసుకుంటూ నిధుల సమస్య కూడా ఉండదు. విశాఖ,శ్రీకాకుళం జిల్లాల్లో అనేక ఫార్మా పరిశ్రమలున్నాయి. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీలో భాగంగా వారి వద్ద సిఎస్‌ఆర్‌ నిధులుంటాయి. వారిని సంప్రదించి, సాయం పొందవచ్చు.
…………………………………………………………………………..
శ్యాంమోహన్‌. (9440595858)

Share.

Leave A Reply