ప్రజలే ప్రమోటర్లుగా మరో తెలుగు ఛానెల్‌ ?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు మీడియా రంగంలో మరో ప్రయోగం మొదలైంది. ప్రజలే షేర్‌ హోల్డర్లుగా ఒక ఎలక్ట్రానిక్‌ ఛానెల్‌ ప్రారంభం కాబోతుంది. ఇలాంటి పద్దతిలోనే వామపక్ష భావజాలమున్న ఓ రాజకీయ పార్టీ ఏడాది క్రితం ఛానెల్‌ పెట్టిన సంగతి మీకు తెలిసిందే… 


 ఎన్నారైలతో సహా భారత దేశమంతా నెట్‌ వర్క్‌కలిగి, గత పాతికేళ్లుగా బడుగు,బలహీన వర్గాల సమస్యలపై పనిచేస్తున్న ఒక ఎన్జీఓ సంస్ధ ఆధ్వర్యంలో ఈ ఛానెల్‌ రూపుదిద్దుకుంటోంది. ప్రేక్షకుల నాడి తెలుసుకోవడానికి ఆరు నెలల పాటు కొన్ని ఛానెల్స్‌లో స్లాట్స్‌ తీసుకొని కార్యక్రమాలు ప్రసారం చేయాలని ఈ సంస్ధ ముందుగా ప్లాన్‌ చేసి, దానికోసం ‘రూరల్‌మీడియా’ ను ప్రాజెక్ట్‌ రూపొందించ మని కూడా కోరారు. అయితే స్లాట్‌ ధరలు విపరీతంగా ఉండటం, వారు స్లాట్స్‌ తీసుకోవాలనుకున్న ఛానెల్స్‌ ప్రసారాలు తెలంగాణలో రాకపోవడంతో ఆ ప్రయత్నం ఆపి, డైరెక్టుగా మీడియా రంగంలోకి వస్తున్నారు. 
మాకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ‘పీపుల్స్‌ మీడియా’ ఇప్పటి వరకు ప్రజల నుండి షేర్ల రూపంలో రూ.75 కోట్లు సేకరించినట్టు తెలిసింది.  ఇటీవల  జరిగిన షేర్‌ హోల్డర్స్‌ సమావేశంలో మరికొంత క్యాపిటల్‌ సమీకరించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మాజీ ఐఏఎస్‌,ఐపీఎస్‌,ఐఆరెస్‌ అధికారులు ఈ ఛానెల్‌కు అండగా ఉన్నట్టు తెలిసింది. ప్రమోషన్‌లో భాగంగా కొన్ని వారాల్లో వెబ్‌ ఛానెల్‌ మొదలువుతోంది.  
జనం తరపున,జనం కోసం… 
”యాజమాన్యాల స్వేచ్ఛే పత్రికా స్వేచ్ఛగా మారిన కాలంలో ప్రజల స్వేచ్ఛే పత్రికా స్వేచ్ఛ అని నిరూపించడానికి ఈ ఛానెల్‌ ప్రారంభిస్తున్నాం. ప్రజల స్వరాన్ని ప్రభుత్వాలకు వినపడేలా , అధికారులు పేదోడి ఇంటి గుమ్మం మందు నిలబడి వారి కష్టాలు తీర్చేలా ఈ మీడియాను రూపొందిస్తున్నాం. సామాన్య ప్రజలే విలేఖరులుగా పనిచేయడం ఈ ఛానెల్‌తోనే చూస్తారు…” అని ఈ ఛానెల్‌లో కీలక పాత్ర వహిస్తున్న ఒక ప్రమోటర్  ‘రూరల్‌మీడియా’  తో అన్నారు.

Share.

Comments are closed.