మట్టి తయారీలో మహిళల పాత్ర …

Google+ Pinterest LinkedIn Tumblr +

మట్టి రేణువుల అణువణువు పులకరించేలా..

భూమికి మహిళలకు అవినాభావసంబంధం ఉంది. హిందూ కథనాలలో మహిళలను భూమి, పృథ్వి తో పోల్చుతారు. భూమిలాగే మహిళలు కూడా పునరుత్పత్తి శక్తిని కలిగిఉంటారు. మరో ప్రాణి కి జీవితాన్ని ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. భూమి, మహిళలు ఒకరితో ఒకరు బాగా కనెక్ట్ కావడానికి కారణం ఇదే కావచ్చు. భూమి పొరలను చీల్చుకుని గింజ మొలకెత్తుతుంది. చెట్టయై ఆహారం ఇస్తుంది. మహిళ గర్భాన్ని చీల్చుకుని మరో జీవికి ఈ భూమి మీదకు వస్తుంది. భూమి మొక్కకు ప్రాణం పోస్తుంది. అమ్మ జీవికి ప్రాణం పోస్తుంది. అందుకే భూమికి ఆమెకు మధ్య బంధం విడదీయరానిది. భూమిసాగులో ప్రతిఅడుగులో మహిళ మమేకం కావడానికి కారణం బహుశా ఇదేనేమో..!

భూమి తయారీకి ముందు మహిళల పాత్ర మొదలవుతుంది. విత్తనం జాగ్రత్తగా భద్రపరచబడి నిల్వ చేయబడుతుంది. దక్షిణ భారతదేశంలోని మెట్ట ప్రాంతాలలో, మే లేదా జూన్ చివరిలో రుతుపవనాలు వచ్చిన వెంటనే భూమి తయారీ ప్రారంభమవుతుంది. పంట వేసే సమయం కన్నా ముందే ఆమె సాగు భూమిలో అడుగుపెడుతుంది. నేలను చదును చేస్తూ పొలాన్ని సాగుకు సిద్ధం చేస్తుంది. నేటికి చాలా చోట్ల పంటపొలాలను దుక్కిదున్నడానికి తమకు ఉన్న సంప్రదాయ పనిముట్లనే వాడుతున్నారు. ఎక్కువ ఎకరాలు ఉన్నవారు మాత్రమే ఆధునిక యంత్రాలతో పొంటభూములను దున్నుతున్నారు.

తొలకరి చినుకులు పడిన వెంటనే పొలంలోని ఎండిన చెట్లు, గడ్డి ని తొలగిస్తారు. నేేేలను దున్నుటకు కొద్ది రోజుల ముందు కంపోస్టింగ్ కోసం కొన్ని మొక్కలు, ఆకులు కత్తిరించి చదును చేేస్తారు. పొలం దున్నిన తరువాత, అక్కడక్కడ నాగలిని తప్పించుకున్న మట్టిగడ్డలను పగలగొట్టడం, ఆవు పేడ వంటి సేంద్రియ ఎరువును పొలంలో చల్లడం ద్వారా భూమిలో పోషకాలను పెంచుతారు. మనం చిన్నచిన్న కమతాలలో వ్యవసాయం చేసేవారికి గమనిస్తే వారి కుటుంబంలోని ఆడవారు పొలం పనుల్లో ప్రతి అంకంలో భాగం పంచుకుంటారు. పొలంలోని రాళ్లురప్పలు ఎరడం నుంచి పెద్దపెద్ద మట్టిపెళ్లలని పగలగొట్టే వరకు ఎంతో శ్రమిస్తారు. మట్టి రేణువుల అణువణువును గింజ మొలకెత్తడానికి అనువుగా మార్చుతారు.

Vishal Reddy

ఈ పనులన్నీ మహిళలు తమ చేతులతో, చిన్న వ్యవసాయ పనిముట్లు, సాధనాలను ఉపయోగించి చేస్తారు. ఇది చాలా కష్టమైన శారీరక శ్రమ. కానీ మహిళలు దీన్ని చాలా ఇష్టంగా చేస్తారు. పనిలా కుండా ఒక దైవకార్యంగా చేస్తారు. మట్టితో ఉన్న ఇష్టాన్ని చెప్పేలా వారి పనులు ఉంటాయి. పొలంలోని ప్రతిమూల ఆమె చెమటతో తడుస్తుంది. అందుకే అంటారు స్వేదం చిందించని సేద్యం ఎక్కడైనా ఉంటుందా అని.. వ్యవసాయ శ్రామిక మహిళల చేతి తగిలితేనే భూమి పొరలు పులకరించిపోతాయి. సాగుకు అనువైన పంటపొలాలుగా మారుతాయి. సేద్యంలో మొదటి అంకం భూమిని చదును చేయడంలో మహిళాశక్తి ఎంతో ఉంటుంది. మనసుతో మట్టిని తాకుతూ సాగుకు సిద్దం కావాలంటూ సంకేతం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఈనెల 15న జాతీయ మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా వ్యవసాయంలో మహిళా సాయం, సహకారం తెలియజేసేలా మహిళా రైతులు, మహిళా వ్యవసాయ కార్మికుల కథలను మేము తీసుకువస్తున్నాము. మీరు మీ పరిధిలో, మీ దృష్టికి వచ్చిన కథనాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాం.
#DaughtersofSoil#NationalWomenFarmersDay2020 అనే హ్యాష్ట్యాగ్ను ఉపయోగించడం ద్వారా మీరు మీ కుటుంబం & సమాజంలోని మహిళా రైతులతో సంబంధం ఉన్న కథలు, జ్ఞాపకాలను పంచుకోవచ్చు. మిల్లెట్ బ్యాంక్ బృందం చేస్తున్న కృషిలో మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాం.

Vishala Reddy, (Founder at Millet Bank)#

Share.

Leave A Reply