లైసెన్స్ లేకుండా చానల్స్ నడపొచ్చా !

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం కోసం నమో టీవీ పేరుతో ఒక చానల్ ప్రసారం కావటం, దానికి ఎలాంటి లైసెన్సూ లేకపోవటం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అలా లైసెన్స్ లేకుండా కూడా ఒక చానల్ నడుస్తుందా అని సామాన్యులు ఆశ్చర్యపోవటంలో అర్థముందిగాని స్వయానా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులే విస్తుబోయినట్టు వార్తలు రావటం మాత్రం మరింత ఆశ్చర్యకరం. వాళ్ళ నిబంధనల్లో డొల్లతనం గురించి ఇన్నాళ్ళూ కళ్ళు మూసుకొని ఇప్పుడు అమాయకంగా ప్రశ్నించటంలో అర్థం లేదు.

దేశంలో ఎన్ని న్యూస్ చానల్స్ ఉన్నాయో ప్రభుత్వానికి తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? నిజమే.. నిజంగానే తెలియదు. లైసెన్స్ ఇవ్వటానికి చానల్స్ ను న్యూస్, నాన్ న్యూస్ చానల్స్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. న్యూస్ చానల్ విభాగంలో లైసెన్స్ తీసుకున్నవాళ్ళు వందశాతం వినోద కార్యక్రమాలు నడిపినా పరవాలేదు. అదే నాన్-న్యూస్ విభాగంలో లైసెన్స్ తీసుకుంటే ఒక్క శాతం కూడా న్యూస్ ప్రసారం చేయకూడదు. అందువలన కాస్త ముందు చూపు ఉన్నవాళ్ళు న్యూస్ విభాగంలోనే లైసెన్స్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలైనా ప్రసారం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం లెక్కలో అది న్యూస్ చానల్ మాత్రమే. ఉదాహరణకు జెమిని, జెమిని లైఫ్, జెమిని మ్యూజిక్ … ఇవన్నీ న్యూస్ చానల్స్ జాబితాలో ఉండటానికి కారణం అదే.

అసలు లైసెన్స్ అంటూ లేకుండా చానల్ నడపటం ఎలా సాధ్యమన్నది ఇప్పుడు చర్చిస్తున్న అంశం. నిజానికి ఇలాంటి వ్యాపారం చాలా కాలంగా సాగుతూనే ఉంది. లైసెన్స్ ఉన్న చానల్ ను లీజుకు తీసుకొని చానల్ నడిపిన వాళ్ళు, నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. తెలుగులో 6టీవీ పేరుతో దాదాపు రెండేళ్ళపాటు నడిచిన శాటిలైట్ చానల్ కు లైసెన్స్ లేదు. కొంతకాలానికి 6టీవీ తెలంగాణ పేరుతో ఒక చానల్ ను, 6టీవీ దర్శనం అనే ఆధ్యాత్మిక చానల్ ను జోడించింది. ఈ పేర్లతోనూ లైసెన్సులు లేవు. ఇంకా విచిత్రమేంటంటే ఈ ఆధ్యాత్మిక చానల్ ను హైదరాబాద్ లో స్వయానా అమిత్ షా ఆవిష్కరించటం. లైసెన్స్ పొందిన చానల్స్ జాబితాలో 6టీవీ పేరు లేకపోవటంతో సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించి లైసెన్స్ లేని విషయాన్ని ధ్రువీకరించుకున్నప్పుడు కూడా మంత్రిత్వశాఖ ఆ చానల్ గురించి పట్టించుకోలేదు. మూతబడి రెండేళ్ళయ్యాక నిరుడు అక్టోబర్ 30 న ఆ చానల్ యాజమాన్యం సొంత లైసెన్స్ కింద దరఖాస్తు చేసుకున్నట్టు, అది పరిశీలనలో ఉన్నట్టు తాజాగా మంత్రిత్వశాఖ తన వెబ్ సైట్ లో పేర్కొంది.

న్యూస్ లైసెన్స్ లేకపోయినా, న్యూస్ ప్రసారం చేయటం కూడా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వారి లైసెన్సింగ్ నియమాలకు విరుద్ధం. అయినా సరే యధేచ్ఛగా ప్రసారం చేసిన చానల్స్ ఉన్నాయి. తెలుగులో ఎ టీవీ మొదట్లో కొన్ని న్యూస్ బులిటెన్స్ ప్రసారం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమాచార, పౌరసంబంధాల శాఖ ఆ చానల్ వార్తాసిబ్బందికి అక్రెడిటేషన్లు కూడా మంజూరు చేసింది. ఆ తరువాత ఒక ఎమ్మెల్సీ ఆ చానల్ ను లీజుకు తీసుకొని పూర్తి స్థాయి న్యూస్ చానల్ గా నడిపారు. అయినా సరే, ఇలాంటి అవకతవకలేవీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఇప్పుడు కూడా వై టీవీ, టాలీవుడ్ అనే నాన్-చానల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా కరెంట్ ఎఫైర్స్ మీద ఇంటర్వ్యూలు సాగుతున్నాయి.
ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా కనీసం 50 చానల్స్ లీజుల మీద నడుస్తున్నాయి. తెలుగులోనే అలాంటివి అర డజన్ చానల్స్ ఉన్నాయి. లీజుకు తీసుకోవటం నిబంధనలకు విరుద్ధం. అందుకే స్లాట్స్ అమ్ముకునే అవకాశాన్ని అడ్డం పెట్టుకొని రోజుకు 23 గంటల 55 నిమిషాల సమయాన్ని కొనుగోలు చేసినట్టు ఒప్పందం చేసుకుంటున్నారు. అలా లీజుకు ఇచ్చినందుకు న్యూస్ చానల్ అయితే నెలకు రూ.3 లక్షలు, నాన్- న్యూస్ చానల్ అయితే నెలకు లక్షన్నర దాకా చెల్లింపులు జరుగుతున్నాయి. చానల్ నడపలేనివాళ్ళు అది నడవకపోతే లైసెన్స్ రద్దవుతుందన్న భయంతో ఇలా ఎవరికైనా లీజుకిచ్చి చానల్ లైసెన్సును కాపాడుకుంటున్నారు.

అయితే, టీవీ తెరమీద కనబడే లోగోలు లైసెన్స్ పొందిన చానల్స్ జాబితాలో లేకపోవటంతో ఈ మధ్యనే వాటిమీద కొంత నిఘా పెరిగింది. దీంతో లైసెన్సుకు ఇచ్చేవాళ్ళే పేరు మార్పు కోసం దరఖాస్తుచేసి కొత్త లోగో తెప్పించి పెడుతున్నారు. కొంతకాలం రెండు లోగోలు పెట్టి, ఆ తరువాత అనుమతి రాగానే కొత్త లోగో ప్రదర్శించటం, అనుమతి రాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో పాత లోగో ప్రదర్శించటం ఈ మధ్యనే మొదలైంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వారి లైసెన్స్ పొందిన చానల్స్ జాబితాలో చూస్తే చానల్ యాజమాన్య సంస్థ పేరు, ఊరు స్పష్టంగా తెలుస్తాయి. సంస్థనే పూర్తిగా కొనుక్కున్న ఐ న్యూస్, ఎక్స్ ప్రెస్ టీవీ, 99% టీవీ మినహాయిస్తే మిగిలిన ఇతర రాష్ట్రాల సంస్థల లైసెన్సులన్నీ లీజు మీద నడుస్తున్నవే.

లైసెన్సులు తీసుకోకుండా లీజు లైసెన్సులమీద చానల్స్ నడపటానికి కారణాలున్నాయి. న్యూస్ చానల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలంటే ఆ కంపెనీకి రూ.20 కోట్ల నెట్ వర్త్ ఉండాలి. ( నిజానికి ట్రాయ్ మరీ దారుణంగా బడా సంస్థలకు మాత్రమే సాధ్యమయ్యేలా రూ. 100 కోట్లు అని సిఫార్సు చేస్తే మంత్రిత్వశాఖ చాలా ఉదారంగా రూ.20 కోట్లకు పరిమితం చేసింది.) అదే నాన్ న్యూస్ చానల్ అయితే రు. 5 కోట్లు. బ్లాక్ మనీ తో చానల్ పెట్టాలనుకుంటే కుదరదు. పైగా, లైసెన్స్ కోసం కనీసం ఏడాది పాటు ఎదురు చూడాలి. ఈ సమస్యలేవీ లేకుండా ఉండాలని ఇలా అడ్డదారిలో లీజులకు మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో నమో టీవీ లైసెన్స్ గురించి ఆలోచించాలి. ఇది మరేదైనా శాటిలైట్ చానల్ లైసెన్స్ ను లీజుకు తీసుకొని నడుపుతుంటే ఆ విషయం తెలుసుకోవటం మంత్రిత్వశాఖకు ఐదు నిమిషాల పని. అప్ లింక్ చేస్తున్న టెలిపోర్ట్ నుంచి సమాచారం తెప్పించుకోవచ్చు. ఇలాంటిది ముందెన్నడూ చూడలేదని అధికారులు అంతగా ఆశ్చర్యపోనక్కర్లేదు. నమో టీవీ పరిమితంగా కొన్ని పంపిణీ వేదికల ద్వారా మాత్రమే అందుబాటులోకి వస్తున్నది కాబట్టి అది శాటిలైట్ చానల్ కాదని, ఎలాంటి అనుమతులూ అవసరం లేని కేబుల్ చానల్ అని సులభంగానే అర్థ చేసుకోవచ్చు.

2012 లో కాశ్మీర్ లో కొన్ని పాకిస్తానీ చానల్స్ ప్రసారమవుతున్నట్టు గుర్తించినప్పుడు ఈ విషయం మీద పార్లమెంటులో చర్చ జరిగింది. కేబుల్ చానల్స్ కు ఎలాంటి అనుమతులూ అవసరం లేదని తెలిసి ఆశ్చర్యపోయానని అప్పటి సమాచార, ప్రసారాల శాఖామంత్రి తివారీ వ్యాఖ్యానించారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. పైగా, ఇప్పుడు డిజిటైజేషన్ పూర్తవటం వలన పంపిణీ సంస్థల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 1000 మంది ఎమ్మెస్వోలు ఉంటే ఇప్పుడు 80 మందికి తగ్గిపోయింది. అంటే, పరిమిత సంఖ్యలో ఉన్న ఈ డిజిటల్ ఎమ్మెస్వోలకు బ్రాడ్ బాండ్ ద్వారా ప్రసారాలు అందిస్తే ప్రేక్షకులకు చేరతాయి. అలాగే డిటిహెచ్ కేంద్రాలకు అందజేసినా అవి కారేజ్ ఫీజు తీసుకొని ప్రసారం చేస్తాయి. శాటిలైట్ బాండ్ విడ్త్ ఖర్చులు, అప్ లింకింగ్ ఖర్చులు, లైసెన్స్ గొడవ ఉండదు. అందుకే ఇలాంటి చానల్స్ పెరుగుతున్నాయి. తెలుగులో మెట్రో, విహంగం లాంటి అనేక చానల్స్ అలాగే నడుస్తున్నాయి. ఇలా ఎమ్మెస్వోలు కానివారు నడుపుతున్న చానల్స్ చాలా ఉన్నాయి.

డిజిటైజేషన్ సాగుతున్న క్రమంలోనే మంత్రిత్వశాఖ కార్యదర్శి 2013 జనవరి 17న ట్రాయ్ కి లేఖ రాస్తూ కేబుల్ చానల్స్ ను క్రమబద్ధం చేయటానికి ఎలా ముందుకెళ్ళాలో సిఫార్సులు పంపమని అడిగారు. దీంతో బ్రాడ్ కాస్టింగ్ రంగంలోని అందరి అభిప్రాయాలూ తెలుసుకోవటానికి ట్రాయ్ 2014 జూన్ 23న ఒక చర్చా పత్రం విడుదల చేసింది. ఆ అభిప్రాయాలమీద అభ్యంతరాలు కూడా కలిపి దాదాపు 150 అంశాలను తన వెబ్ సైట్ లో పెట్టింది. నేరుగా అభిప్రాయాలు తెలుసుకోవటానికి ఢిళ్లీలో, ముంబయ్ లో బహిరంగ చర్చలు నిర్వహించింది. అభిప్రాయాలు చెప్పటానికి 2014 సెప్టెంబర్ 29 వరకు చివరి అవకాశం ఇచ్చింది. మొత్తానికి నవంబర్ 19 న తన సిఫార్సులు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు పంపింది.

Bhavanarayana Thota

ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు నడిపే సొంత చానల్స్ కు లైసెన్సులు అవసరంలేదని, ఇతరుల చానల్స్ కు మాత్రం లైసెన్స్ తప్పనిసరి అని ట్రాయ్ సూచించింది. అలాంటి సంస్థల చానల్స్ ఎన్ని రాష్ట్రాలకు అందుతాయనే అంశం ఆధారంగా కనీస నెట్ వర్త్ పరిమితి కూడా నిర్ణయించింది. పంపిణీ వేదికలు తమ ద్వారా ప్రసారమయ్యే అన్ని చానల్స్ నూ కనీసం మూడు నెలలపాటు రికార్డు చేసి ఉంచాలని, అభ్యంతరకరమైన అంశాలుంటే పంపిణీ వేదిక లైసెన్స్ సైతం రద్దు చేయాలని ఆ సిఫార్సులలో ట్రాయ్ స్పష్టం చేసింది. అయితే, గడిచిన నాలుగున్నరేళ్ళలో ప్రభుత్వం ఆ సిఫార్సులను పక్కన పెట్టిందే తప్ప అమలు చేయటానికి ఎంత మాత్రమూ ఆసక్తి చూపలేదు. దాని ఫలితంగానే ఎలాంటి లైసెన్సులూ అవసరం లేదన్న ధీమాతో ఇప్పుడు నమో టీవీ లాంటివి పుట్టుకొస్తున్నాయి.

తోట భావనారాయణ

Share.

Leave A Reply