ఎందుకే సీతక్కా నువ్విట్లజేస్తున్నవ్?

Google+ Pinterest LinkedIn Tumblr +
ఎందుకు సీతక్కా… ఎందుకే సీతక్కా….?

సర్కారు మాకు సగం జీతమిచ్చిందని
నెత్తీ నోరూ బాదుకుంటున్నం
మార్కెట్ లో కాప్సికం దొరుక్తలేదని
తెగ బాధవడ్తన్నం
మా ప్రాణాలు కాపాడ్డానికే లాక్డౌన్ పెడితే
పోలీసులాపుతున్నరని తెగ గింజుకుంటున్నం
ఇంట్ల పంకాలేసుకుని అమెజాన్ ప్రైమ్లో
తీరొక్క సినిమాలు జూస్తున్న

నువ్వు మాత్రం దేన్నీ లెక్కజేయకుండా
అట్ల నీ బిడ్డలకాడికీ ఉరుకులు
పరుగులు బెడుతున్నవ్
ఎందుకు సీతక్కా నువ్విట్లజేస్తున్నవ్?

ఎండ నీకు గొడుగైందిగదా
రాళ్ళూ రప్పలే నీకు సెప్పులైనయ్ గదా
కొండా కోనా,గట్టూ పుట్టా నీకు
రక్షకభటులైనయ్ గదా
ఎందుకు సీతక్కా
నువ్విట్ల బుగుల్వడుతున్నవ్?
ఎందుకే సీతక్కా నువ్విట్లజేస్తున్నవ్?
ఎవ్వరేడున్నరో జాడదీసి
ఎవ్వరెక్కడ ఎంతగోస వడుతున్నరో ఇట్ల పసిగట్టి
అట్ల అక్కడికి జేరుతున్నవ్
అడవి బిడ్డల్ని అక్కున జేర్చుకుంటున్నవ్
వాగుల నీళ్ళు తాగుతున్నవ్
వంకలెంబటి తిరుగుతున్నవ్
మూటలు మోస్తున్నవ్
బరువు బుజాలకెత్తుకుంటున్నవ్
గుండెల్ల భారాన్ని జర దింపుకుంటున్నవ్
ఎడ్లబండిలో పోతున్నవ్
ట్రాక్టర్ లెక్కుతున్నవ్
కడుపుల అన్నందీసి
సాపిన సేతుల్లో కలిపి మరీ పెడుతున్నవ్
ఎందుకు సీతక్కా నువ్విట్ల జేస్తున్నవ్
నేను అయోధ్యలో రాముడ్ని సూడలేదుగాని
మా సీతక్కను జూస్తున్న
దేవుడసొంటోడు ఉంటే
సీతక్కతీరిగనే ఉంటడు
నిన్ను జూస్తుంటే ఏ వనదేవతో
మా మధ్య తిరుగుతున్నట్లుంది
నిన్ను వింటాంటే దేవుడ్ని వింటున్నట్టుంది
ఎందుకు సీతక్కా నువ్విట్లజేస్తున్నవ్
ఎందుకే సీతక్కా మాకు సిగ్గు నేర్పుతున్నవ్….?

– Ravulapati Seetharam
(పసునూరి శ్రీధర్ బాబుకి ప్రేమతో)

Share.

Leave A Reply