ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్‌లు

Google+ Pinterest LinkedIn Tumblr +

మహిళలు రుతుక్రమం సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్‌లను అమెరికాలో పెరిగే కొన్ని జాతుల చెట్ల కలప గుజ్జుతో ఎకో ఫ్రెండ్లీగా తయారుచేస్తున్నారు తెలంగాణ మహిళలు. ఆ సమయంలో స్త్రీలకు దాదాపు 7 ప్యాడ్‌లు వరకూ అవసరం ఉంటుంది. మార్కెట్లో వాటి ధరలు కూడా ఎక్కువే. అయితే, సామాన్య మహిళలకు వాటిని కొనే స్థోమత లేక ఇంకా పాతగుడ్డలను, మోటు పద్దతులను ఉపయోగిస్తూ పలు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. అలాంటి సమస్యలు రాకుండా, చౌక ధరకే చెట్టుబెరడుతో పర్యావరణహిత శానిటరీ ప్యాడ్‌లు ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. 
వీటి ప్రత్యేకత ఏమిటీ? 
‘మార్కెట్‌లో దొరికే శానిటరీ ప్యాడ్‌లను సాధారణంగా సింథటిక్‌, ప్లాస్టిక్‌తో రూపొందిస్తారు. వాటిని ఎక్కువసేపు ఉంచడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అదే 
ఉడ్‌పల్ప్‌తో తయారుచేసే ప్యాడ్‌లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. అలాగే, మామూలు ప్యాడ్‌లు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి, ఈ ప్యాడ్‌లు మాత్రం భూమిలో తొందరగా కలిసిపోతాయి.’ అని, వుడ్‌పల్ప్‌ ప్యాడ్స్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్న షైన్‌ స్యచ్ఛంద సంస్థ వ్యవస్ధాపకురాలు చదురుపల్లి పరమేశ్వరి అన్నారు. 
ఆ మహిళలు ఇసుకను వాడుతున్నారు… 
ప్యాడ్స్‌ తయారీ యూనిట్‌ పెట్టే ముందు కొన్ని మారుమూల గ్రామాలకు వెళ్లి రుతుక్రమం సమయంలో అక్కడి మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరమేశ్వరి స్టడీ చేసినపుడు ఆశ్యర్యకరమైన విషయాలు తెలిశాయన్నారు. 
” మహబూబ్‌ నగర్‌ జిల్లా తండాలకు వెళ్లినపుడు అక్కడి మహిళలు ‘ఆ సమయంలో…’ ఇసుకను వస్త్రంలో చుట్టి వాడుతున్నారు. మరి కొందరు జనప నారను వాడటం చూశాం. నల్ల మల అటవీ ప్రాంతం దేవరకొండలో అయితే మరీ ఘోరంగా కట్టెల పొయ్యిలోని బూడిదను పాతబట్టలో పెట్టి వాడుతున్నారు. దీని వల్ల విపరీతంగా బ్యాక్టీరియా ఫాం అయి వాళ్లకు తెలియకుండానే దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నారు. ” అన్నారు పరమేశ్వరి. 
కలప గుజ్జు ఎక్కడి నుండి వస్తుంది? 
మహిళారోగ్యానికి రక్షణ.. పర్యావరణానికి మేలు.. అనే రెండు లక్ష్యాలతో కేంద్ర ఐటీ శాఖ చేపట్టిన పథకం, స్త్రీ స్వాభిమాన్‌. దీనిలో భాగంగా 2017 సెప్టెంబర్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ఇండియాలో తొలిసారిగా ఎకోఫ్రెండ్లీ ప్యాడ్స్‌ తయారీని, షైన్‌ ఎన్జీఓ ద్వారా అమలు చేయగా ,విజయవంతమవ్వడంతో దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఈ పథకం కింద ప్యాడ్‌ల తయారీ ప్రారంభించారు. 
ఐటీ శాఖ అమెరికా నుండి దిగుమతి చేసుకున్న చెట్ల గుజ్జును రంగారెడ్డిజిల్లా, తుర్కయాంజల్‌ లో’ షైన్‌’ సంస్ధకు పంపిస్తారు. అక్కడ 8 దశల్లో వుడ్‌పల్ప్‌ను ప్యాడ్‌గా రూపొందిస్తారు. వీటిని పూర్తిగా హ్యాండ్‌ మేడ్‌గా తయారు చేస్తున్నారు. 
అందుబాటు ధరలో… 
మార్కెట్‌లో దొరికే ఇతర రకాల శానిటరీ న్యాప్కిన్లకు ఎక్కువ ధరే ఉంది. పేద మహిళలందరికీ అందుబాటులో ఉండేలా ఎనిమిది ప్యాడ్‌ల ప్యాక్‌ను రూ.28కే వీరు అందజేస్తున్నారు. 
” మేం కేవలం ప్యాడ్స్‌ తయారు చేసి ఆగిపోం. వాటి వాడకం పట్ల అవగాహన కల్పించే బాధ్యత తీసుకుంటాం. మనదేశంలో ప్రతీ ఏడు నిముషాలకు ఒక మహిళ సెర్వికల్‌ క్యాన్సర్‌ని బారిన పడుతున్నారు. యవ్వన దశ నుండీ ప్రారంభమయ్యే నెలసరి గురించి బాలికలు తప్పని సరిగా అవగాహన కలిగి ఉంటే సెర్వికల్‌ క్యాన్సర్‌ని నివారించవచ్చు. రుతు స్రావం విషయంలో సిగ్గుపడకుండా అవగాహన పెంచుకోవాలి…” అంటారు పరమేశ్వరి. 

Share.

Leave A Reply