మానవత్వం పరిమళిస్తే…

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్ అంటే, అటు ఛార్మినార్,ఇటు హైటెక్ సిటీ, ఆ పక్కన ట్యాంక్బండ్ మాత్రమేనా..?.
అపుడపుడూ ప్యారడైజ్ లో బిర్యానీ అంతేనా ? ,
కుదిరితే గార్డెన్లో ఇరానీ ఛాయ్ ఇంతేనా ? అంతకు మించిన జీవితం లేదా?


సూర్యుడు రాక ముందే రోడ్ మీదకు రావడం బాగుంటుంది. చిరుచినుకుల మధ్య చిక్కడ పల్లి వీధుల్లో నడుస్తూ, క్రాస్ రోడ్స్ మలుపులో ప్రెష్ గా వచ్చిన కాడపూలు,క్యాబేజీ బుట్టలు ట్రాలీ నుండి కిందకు దించుతున్న దృశ్యం ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ఫీలింగ్స్ ని ఒక గరం ఛాయ్ తో షేర్ చేసుకోవాలని,బస్ భవన్ దాటి వెళ్తుంటే, కుడివైపు గల్లీలో దాదాపు రెండొందల మంది ఒక పద్దతిగా నిలబడి వెయిట్ చేస్తున్నారు. వీధుల్లో చెత్తను ఎత్తేవారి నుండి బిల్డింగ్ పనులు చేసుకునే కూలీల వరకు ఏ పూటకాపూట బతుకు తెరువు వెతుక్కునేవారంతా అక్కడే ఉన్నారు.
‘‘ ఇక్కడ మాకు టిఫిన్ పెడుతున్నారు…’’ అన్నాడు ఒక స్ట్రీట్ బోయ్.
‘‘ ప్రతీ రోజూ ఈడ టిఫిన్ ఫ్రీగా పంచుతారు…గత మూడేళ్లుగా ఇక్కడే ఆకలి తీరుతుందన్నా… !!’’ అంది మరో పేద మహిళ.
ఆర్టీసీ కళ్యాణ మండపం రోడ్ లో ఉన్న పాత ఇంటి ముందు ఒక పెద్దాయన ఇడ్లీలు వడ్డిస్తున్నాడు. పక్కనే, ఆతని భార్య మైసూరు బజ్జీలు కూడా, కొసరి కొసరి వేస్తోంది.ఖాళీ అవుతున్న గిన్నెల్లో వేడి వేడి ఇడ్లీలు ఇంటిలోంచి తెచ్చి వేస్తున్నారు.
గోడ పక్కన మినరల్ వాటర్ క్యాన్లు పెట్టారు. అందరూ కూల్ గా టిఫిన్ తిని , నీళ్లు తాగి వెళ్తున్నారు. కొందరు వెంట తెచ్చుకున్న బాటిల్స్లో నీళ్లు పట్టుకుంటున్నారు.అందరి ముఖాల్లో అంతులేని సంతృప్తి…
గత ఐదేళ్లుగా ఆ కుటుంబం ఇలాగే, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం తో పేదల కడుపు నింపుతున్నారు…రోజుకు కనీసం మూడొందల మందికి ఇక్కడ ఆహారం అందుతోంది.
మొబైల్ తో కొన్ని ఫోటోలు తీశాను. ఇదొక హ్యూమన్ ఇంట్రస్టింగ్ స్టోరీగా మలచాలని ప్లాన్ చేసుకున్నాను.
అందరూ టిఫిన్ చేసి వెళ్లాక, ఆ కుటుంబం దగ్గరకు వెళ్లి నమస్కరించాను.
వారు నవ్వుతూ, టిఫిన్ చేస్తారా…? అన్నారు. వారి వివరాలు కావాలని అడిగాను.
‘‘ ఏదో మాకు తోచిన సాయం చేస్తున్నాం. దీనికి ప్రచారం వద్దండీ, మా గురించి ఏమీ రాయకండి. మీరు తీసిన ఫోటోలు డిలిట్ చేయండి. ’’ అని చేతులు జోడించారు.
ఏదీ శాశ్వతం కాదని, బతికినంత కాలం మంచి చేయడం ఒక్కటే జీవన విధానం కావాలని, నిశ్శబ్దంగా నిరూపించిన ఆ మానవుల మధ్యకు వెళ్లినందుకు జీవితానికి కొత్త అర్ధం తెలిసింది !!

Share.

Leave A Reply