‘చప్పట్లు కొట్టే చేతుల్ని, నేనెప్పుడూ నమ్మను !!’

Google+ Pinterest LinkedIn Tumblr +

( ‘ కాలం వాయులీనం మీద కమానునై ,చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానునై…” అంటూ తన అద్భుత కవితా శక్తితో ఒక తరాన్ని కదిలించి, తెలుగు కవిత్వంలో సంచలనం సృష్టించిన దిగంబర కవుల్లో ఒకరు మహాస్వప్న .
ప్రకాశం జిల్లా,లింగసముద్రంలో, జూన్‌ 25న కన్నుమూసారు. 1960లో తెలుగు సాహిత్యంలో పెను తుపాను సృష్టించిన ఆరుగురు కవుల్లో మహాస్వప్న నిష్క్రమణతో ఇపుడు మిగిలింది ముగ్గురే… 5దశాబ్దాల క్రితం
మహాస్వప్న రాసిన అరుదైన ఉధ్వేగ భరిత రచన ఇది…)
” ఎంతో శ్రమించి బలమంతా ప్రయోగించి కల్మషాన్ని దొర్లించుకుంటూ, కల్మశాన్ని చిమ్ముకుంటూ రాజకీయాల పెంటకుప్ప పైకి ఎగబాకుతున్నాయి పేడపురుగులు. వాటికి వెనుక చూపు లేదు – పక్క చూపులేదు. ఒకటే చూపు ముందు చూపు. వాటికీ వుంది నీతి నిజాయితీ. వాటికి వుంది విశ్వాసం, సహనం, లక్ష్యం.
దిగంబరులారా,
అజ్ఞానం మీ కవచం, అహంకారం మీ ఆయుధం, ఆత్మ వంచన, పర పంచన మీకు కొత్తగా మొలిచిన కొమ్ములు, దౌర్జన్యం మీ పంథా. మీకు ఎదురులేదు. దిగ్విజయం మీదే. ఎందుకంటే చరిత్ర నిండా కనిపించే విజేతలంతా మీ లాంటి వాళ్లే. మీకు ఎక్కడా, ఎప్పుడూ సందేహాలు లేవు. సమస్యలు లేవు. మీకు ప్రశ్నలు లేవు. వున్నా వాటికి సమాధానాలక్కరలేదు. మీరు ప్రపంచ ఏకైక సత్యాన్ని దర్శించిన ద్రష్టలు. కేవలం జ్ఞాన స్వరూపులు. మీ జ్ఞానాధిక్యత పట్ల మీకున్న ప్రగాఢ విశ్వాసం ప్రశస్తం.
నిజంగా మీరు గొప్పవారు మీ ‘ ప్రజలు’ గొప్పవారు. మీ జెండాలు గొప్పవి. మీ నినాదాలు గొప్పవి. మీ విశ్వాసాలు గొప్పవి. మీరు కనుక్కున్న సత్యం గొప్పది. మీరు తొడుక్కున్న పందొమ్మిదో శతాబ్దపు ఐరోపా కోటు (చిరిగి, మాసి, అంతులేని గబ్బు కొడుతున్నా సరే) గొప్పది. ఎదుటి వాడిని చిత్తు చేయడం కోసం వేసిన ఎత్తుగడలు గొప్పవి. గొప్పగా చెప్పిన అబద్దాలు గొప్పవి. పన్నిన వ్యూహాలు గొప్పవి. అందుకే మీరు నిజంగా గొప్పవారు.
నేను జీవితంలోకి, సాహిత్యంలోకి దిగంబరం గానే వొచ్చాను. ఆయుధాలు సిద్ధం చేసుకోలేదు. యుద్దానికి రాలేదు కాబట్టి. నేను చిన్నవాణ్ని, కొద్దివాణ్ని, నాకు అన్నీ సమస్యలే. అన్నీ సందేహాలే. నా కెదురుగా అన్నీ క్రాస్‌ రోడ్లే…
ముఖ్యంగా ఈ దేశంలో ఎవరు ఎవరో తెలుసుకోవడం కష్టం. ఎవరు ఏ పనిచెయ్యాలో ఆ పని చేయరు. ఎవరు ఏ పని చెయ్య కూడదో ఆ పనిచేస్తారు. ఇక్కడ కుక్కలు ఓండ్రపెడతాయి. గాడిదలు మెరుగుతాయి. గొర్రెలు గర్జిస్తాయి. సింహాలు ఇకిలిస్తాయి. అందుకే ఒక కాపిటలిష్టు మార్క్సిజాన్ని గురించి మహోపన్యాసం ఇచ్చినా, ఒక నపుంసకుడు బండ్ల కొద్దీ సెక్స్‌ సాహిత్యాన్ని సృష్టించినా, ఒక పరమ దుర్మార్గుడు పరమశివుడి పోజు పెట్టినా ఆశ్చర్య పడనక్కరలేదు.
వర్గపోరాటం – వర్గ సంఘర్షణ అంటున్న మీరూ, మీ ప్రజలూ ఏ వర్గానికి చెందుతారో మీకు తెలీదు. మావో మ్యాజిక్కుకి వొళ్లు మరిచి కదం తొక్కుతూ కదన కతూహలంతో సాయుధ విప్లవం పదం పాడుతున్న మీకు, అర్జంటుగా శత్రువులు కావలసిన మాట నిజమే. పున్న పిడికెడు మంది శత్రువులు మీ పిడికెళ్ల కెట్లాగూ అందరు. ఈ చీకటి తిర్నాళ్ల సంతలో మిగతా నిజమైన శత్రువులు అడ్రసేదో మీకు అంతు పట్టదు.
అజ్ఞానంతో ఆవేశంతో సాయుధ విప్లవం జిందాబాద్‌ అని మీరంటే లక్ష దోపిడీ కంఠాలు మీ వెనుక మంచి జిందాబాద్‌ అని ప్రతిధ్వనిస్తున్నాయి. నక్సలైట్‌ తత్వం వర్థిల్లాలి అని మీరంటే, వర్థిల్లాలి అని లక్ష దోపిడీ హస్తాలు పైకి లేస్తున్నాయి.
మీ అజ్ఞానాన్ని మీ ప్రజలూ, మీ ప్రజల అజ్ఞానాన్ని మీరూ దోపిడీ చేసుకుంటున్నారు.
చప్పట్లు కొట్టే చేతుల్ని నే నెప్పుడూ నమ్మను. మీరూ, ‘ మీ సవాలక్ష కుక్క గొడుగు పార్టీలూ’ సవాలక్ష ఇజాల్ని గురించి కొట్లాడుకుంటూ, వుండండి. దేశం. సమాజం మీకెవరికీ అంద కుండా, అతి సహజంగా మరో ‘ఇజం’ కేసి, మరో నిజంకేసి సాగిపోతూ వుంటుంది.
నిజం తెలుసుకోవాలనుకుంటే నిశ్శబ్దంగా సమాజ నీవనాడుల్లోకి ప్రవహించండి. కవిత్వం కావాలనుకుంటే సిద్దాంతాల్ని, సూత్రాల్ని తెగ దెంచి, ముందు మిమ్మల్ని మీరు బంధ విముక్తుల్ని చేసుకోండి.
నేను అరాచక వాదిని కావచ్చు నేమోకాని, అజ్ఞానాన్ని మాత్రం ఆశ్రయించలేదు. కవిగా నేనెప్పుడూ సర్వస్వతంత్రుడినే వ్యక్తి స్వేచ్ఛను అంటే భావస్వాతంత్య్రాన్ని అరికట్టే ఏ వ్యవస్థనయినా, ఏ ఉద్యమాన్నయినా ద్వేషిస్తాను, దూషిస్తాను. శాసించే ప్రతి దౌర్జన్య హస్తాన్నీ నిలబెట్టి నరుకుతాను. కట్టుబడు అంటే తంతాను. ఆత్మహననం కానంతవరకే సమిష్టి బాధ్యతకు విలువ.
మార్క్సిజం మీ సొంతమైనట్లు వాదిస్తున్న మీ అజ్ఞానానికి, ఇతర ఇజాలనూ, ఇతర కవులనూ సహృదయతతో, సానుభూతితో చూడలేని మీ బుద్ధి జాడ్య జనితోన్మాదానికి విచారిస్తున్నాను…” అని మహాస్వప్న అంటారు.
ఇది మొదటి భాగం.. రెండవ భాగం మరోసారి
(తనపై వచ్చిన విమర్శకు ‘ తెలుగు -వెలుగు వారపత్రిక 17-24 జూలై 1970’ సంచికల్లో ప్రచురితమైన మహాస్వప్న సమాధానం ఇది. )

Share.

Leave A Reply