అట్లూరి పిచ్చేశ్వరరావు ‘జిందా హై’

Google+ Pinterest LinkedIn Tumblr +

life is short … his art lives forever

గతం పిలుస్తోంది. సన్నటి నీటి గలగలల సంగీతమేదో వినిపిస్తోంది. వెన్నెల్లో మట్టి రోడ్ల మీద వొట్టి పాదాల్తో నడిచిన కాలమేదో కళ్ళలో కదలాడుతోంది. యేటి నీటి అలల్ని దాటి మొగలిపొదల మలుపునుంచి వీస్తున్న గాలేదో గుసగుసగా గుండెల్ని తాకుతోంది. అట్లూరి పిచ్చేశ్వరరావు అనే ఒక పాతకాలం మనిషితో కలిసి నడుస్తున్నాను… కొన్ని నెలలుగా! కబుర్ల పోగు. కథలు చెబుతున్నాడు. వినడం ఒక దివ్యానుభవం. 41 సంవత్సరాలు మాత్రమే బతికిన యీ సాహితీవేత్త, మనం విభ్రమంతో చలించిపోయే, కలకాలం నిలిచిపోయే కొన్ని గొప్ప కథలు రాశారు.

కృష్ణా జిల్లా చౌటపల్లిలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో 1925, ఏప్రిల్ 12న పుట్టారు. తెలుగు కథని కొత్తదారుల్లో నడిపించి,సాహితీ సుగంధాన్ని అద్దిన అట్లూరి పిచ్చేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు!

కొన్ని కథలు ఎప్పటికీ మనల్ని వొదిలిపోవు. How much land does a man need? అనే టాల్ స్టాయ్ కథ, the bet – ఆంటన్ చెహోవ్ కథ, చాసో వాయులీనం, కుంకుడాకు, ఏలూరెళ్ళాలి… కళ్యాణసుందరీ జగన్నాథ్ ‘అలరాసపుట్టిళ్ళు’, పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్ళు’, ‘పూర్ణాహుతి’, ‘దగ్ధగీతం’, శ్రీపాద ‘గులాబీ అత్తరు’, అల్లం శేషగిరిరావు ‘వరడు’, ‘death of a maneater, గోపిని కరుణాకర్ ‘కానగ పూలవాన’, మెహర్ ‘రంగు వెలసిన రాజుగారి మేడ, సి. రామచంద్రరావు ‘వేలుపిళ్ళై’, ఏనుగుల రాయి, పతంజలి గోపాత్రుడు, నామిని సుబ్రహ్మణ్యం నాయుడి ‘మిట్టూరోడి కతలు’, యద్దనపూడి సులోచనారాణి – i love you,పీ. సత్యవతి “సూపర్ మామ్ సిండ్రోమ్”, రావిశాస్త్రి ‘వెన్నెల’ (కథ కాదది, కవిత్వం అన్నా సరే), పురాణం సుబ్రమణ్యశర్మ నీలి, రెండు రూపాయల నోటు, జంపన పెద్దిరాజు ‘ఫౌల్, ఫౌల్’, త్రిపుర ‘చీకటి గదులు’, ఉనుదుర్తి సుధాకర్ ‘తెగిన నూలుపోగు’, స.వెం. రమేష్ ‘ఉత్తర పొద్దు’ ఇలా ఎన్నెన్నో కథలు… గుడిపాటి వెంకట చెలం నుంచి మహమ్మద్ ఖదీర్ బాబు దాకా, మధురాంతకం రాజారామ్, కలువకొలను సదానంద నుంచి వెంకట్ సిద్ధారెడ్డి, సోలొమోన్ విజయకుమార్ దాకా, జీఆర్ మహర్షి నుంచి అట్టాడ అప్పలనాయుడు దాకా, ప్రమాదకరమైన రంగనాయకమ్మ నుంచి అమాయకమైన ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి దాకా వెన్నాడే కథలు, వేధించే కథలు… కన్నీళ్ళని తుడిచి, వెలుతురు దారులు పరిచి రండి అని చిటికెన వేలు పట్టుకుని భవిష్యత్తు లోకి, ఆకాశపు అంచుల్లోకి నడిపించేవెన్నో..అలాంటి అరుదైన, అపురూపమైన కథల్ని పిచ్చేశ్వరరావు గారు 50 సంవత్సరాల క్రితమే మనకోసం రాసి వుంచారు. దినపత్రికల్లో ప్రతి వారమూ వచ్చే సాహిత్య పేజీల్లో ఆయన కథలు, సాహిత్య కృషి గురించి వ్యాసాలు రావడం, చర్చ జరగడం నా దృష్టికి రాలేదు. ఇది అన్యాయం. దారుణం. మన కాళ్ళని మనమే నరుక్కోవడం!పిచ్చేశ్వరరావు కథలపై నేనేమీ critique అనగా, analysis లేదా evaluationకి పాల్పడడం లేదు. గుణదోష విచారణేమీ చేయడం లేదు. 30 ఏళ్ళ క్రితం చదివి, మళ్లీ మూడు నెలల క్రితం చదివినా ఆ కథలు తాజాగా, స్వచ్ఛంగా, జీవం తొణికిసలాడుతూ, ఉద్వేగంతో ఊపేశాయి. నాకు బాగా నచ్చాయి, మీరూ చదవండని రెచ్చగొట్టడానికే ఇది రాస్తున్నా. అయినా, అలా చెప్పడానికి నేనెవర్ని?మురికిపట్టిన రాజకీయ వార్తలు రాసుకునే ఒక జర్నలిస్టు గాడు సృజనాత్మక సాహిత్యం గురించి లెక్చర్లు దంచుట తగునా?

తగదుగనక, సాక్షాత్తూ కొడవటిగంటి కుటుంబరావు అంతటి మనీషి, పిచ్చేశ్వరరావు కథలకి ముందుమాట రాస్తూ…“అతను చనిపోయాడంటే నేను నమ్మలేను. అతను ఇంకా నా కళ్ళకుకట్టినట్టు కనబడుతూనే వున్నాడు” ఈ మాటలు ‘బతకడం తెలియనివాడు’ అనే కథలో పిచ్చేశ్వరరావు రాసినవి. నేను పిచ్చేశ్వరరావు గురించి ఇప్పటికీ ఈ మాటే అంటున్నాను… మనిషితోపాటు సజీవంగా మిగిలిపోయేదేదో వుంటుంది. అదే మనిషి చావును నమ్మశక్యం కాకుండా చేస్తుంది. కొందరు చిరంజీవులున్నారని అందరమూ గుర్తిస్తాం. కాళిదాసు చిరంజీవి. షేక్ స్పియర్, గురజాడ, టాల్ స్టాయ్, కార్ల్ మార్క్స్, ఇల్యీచ్ లెనిన్… మానవ చరిత్రలో ఎందరో చిరంజీవులున్నారు. వారిని ప్రపంచం గుర్తిస్తుంది. … పిచ్చేశ్వరరావు విషయంలో అట్లా అనుకునే కొద్దిమందిలో నేనూ వొకణ్ణి.కథలు, విమర్శలు రాశాడు. అనువాదాలు చేశాడు. సినిమాలకు సంభాషణలు రాశాడు. ఏది రాసినా విశిష్టంగా, తన వ్యక్తిత్వం వుట్టిపడేట్టు రాశాడు. రాసేటప్పుడు అతను ఆత్మసంతృప్తి చూసుకున్నాడు. కీర్తిప్రతిష్టలు చూసుకున్నట్టు కనబడలేదు. మహాసముద్రం లాంటి సినీరంగంలో కూడా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నవాడు. పిచ్చేశ్వరరావు నేవీలో పనిచేసిన అనుభవాల నుంచి “జీవచ్ఛవాలు”, “చిరంజీవి” వచ్చాయి. కళాకారుడికి శిల్పంలో పొదుపు అత్యవసరం. ఈ పొదుపునకు ఆదర్శప్రాయమనదగినది “నెత్తురు కథ”. తెలంగాణ పోరాటంలో ఒక గ్రామంలో ప్రజావిజయాన్ని చిత్రించే కథ “విముక్తి”! ‘బతకడం తెలియనివాడు’లో ప్రధాన పాత్ర కమ్యూనిస్టు. 1948 – 50 మధ్య కలిగిన వుద్రిక్తతల్లో అతను తుపాకులకెదురుగా తుపాకీ పట్టి చనిపోతాడు. ఈ రెండూ కూడా పిచ్చేశ్వరరావు రాసిన ఉత్తమ కథలలో చేర్చదగినవే. నేనెరిగినంతలో అతని కథలు కనీసం నాలుగైదు వుత్తమ తెలుగు కథానికా సాహిత్యంలో శాశ్వతంగా నిలవగలిగినవిగా వున్నాయి”- 1967 సెప్టెంబర్ 26న కొ.కు ఇది రాశారు. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా వుండే కొ.కు. ఒక రచయితని ఇలా మెచ్చుకోడం అరుదైన అద్భుతం!

పిచ్చేశ్వరరావు కథలు 1959 – 60కే పుస్తకంగా వచ్చాయి. 1966 సెప్టెంబర్ 26న మద్రాసులో ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. ఆయన రాసిన 22 కథలతో 1967లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, “అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు” పేరిట సంకలనం తెచ్చింది. పిచ్చేశ్వరరావు 1945లో, అంటే 20 ఏళ్ల వయసుకే భారత నౌకాదళంలో చేరారు. 1953 దాకా నేవీలో ఇంజనీరుగా చేశారు. తర్వాత విశాలాంధ్ర దినపత్రికలో కొన్నాళ్లు పనిచేశారు. 1962లో మద్రాసు వెళ్లి స్క్రిప్ట్ రైటర్ గా నిలదొక్కుకున్నారు. ఆరు సినిమాలకి మాటలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. గోదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, గాడిద ఆత్మకథ వంటి ప్రసిద్ధ అనువాదాలు ఆయనవే! గౌతమబుద్ధ, వీరేశలింగం డాక్యుమెంటరీలకు గొప్ప స్క్రిప్టు సమకూర్చారు. కనిపించిన ప్రతీ పుస్తకం కొనే అలవాటు. నిత్య సాహిత్య అధ్యయనశీలి పిచ్చేశ్వరరావు సొంత లైబ్రరీలో రెండు వేల ఆంగ్ల సాహిత్య గ్రంథాలు, వెయ్యికి పైగా తెలుగు పుస్తకాలూ వుండేవి. కథ అనే కళారూపంతో ఇంద్రజాలం చేసినవాడాయన. ఒకింత అసహనం, అశాంతి, మానసికోద్వేగం నిండిన కొన్ని కథల్లో ఒక అంతర్లయాన్విత క్రమశిక్షణ మనల్ని కట్టిపడేస్తుంది. జనజీవన చిత్రణ లక్ష్యమైన సాహిత్య రచన యీ రచయితకొక సామాజిక చర్య. అందువల్లే పిచ్చేశ్వరరావు కథలు ప్రాణదీప్తినందిస్తాయి. ఆ కథే ఒక మేల్కొలుపు పాటగా పాఠకుల గుండెలయలో కలిసి స్పందిస్తుంది.

కథల మలి ముద్రణకు 1993లో ఆరుద్ర ముందుమాట రాశారు. పిచ్చేశ్వర్రావు నాకు మిత్రుడు. అభ్యుదయ, సినీ రచయితలుగా ఇద్దరివీ సమాన ఆశయాలే! కొన్ని చిత్రాలకు కలిసి పనిచేశాం. అతడు మాటలు రాస్తే నేను పాటలు రాశాను. ఆ చిత్రాల్లో ‘చివరకు మిగిలేది’ చెప్పుకోదగ్గది. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక శిష్ట్లా ఉమామహేశ్వరరావు ఆర్మీలోనూ, అట్లూరి పిచ్చేశ్వరరావు నేవీలోనూ, నేను ఎయిర్ ఫోర్స్ లోనూ వుద్యోగాలు చేశాం. శ్రీశ్రీ ఆర్మీలో చేరినా ట్రయినింగ్ పూర్తికాకముందే పోలీసు రిపోర్ట్ వ్యతిరేకంగా వుండటం వల్ల అతనికి ఉద్వాసన జరిగింది. నేవీ అనుభవాలతో పిచ్చేశ్వరరావు అయిదు కథలు రాశారు. మన విశ్వవిద్యాలయాల్లో లెక్కలేనంత మంది పీ.హెచ్.డీలు చేస్తున్నారు. “తెలుగు కథానికా సాహిత్యంలో సాయుధ దళాల ఇతివృత్తాలు” అనే అంశాన్ని ఎవరైనా స్వీకరిస్తే, పిచ్చేశ్వరరావు నేవీ కథలకు న్యాయం చేకూరుతుంది. నేవీ నేపథ్యంలోని ‘చిరంజీవి’ కథ మన తెలుగు కథా సాహిత్యంలో చిరంజీవే! పురోగమనం కోసం మానవుడు పోరాటం జరపాలన్నాడు. పోరాటంలో చావటం చేతకానివారికి బతకడం అంటే ఏమిటో తెలియడం కష్టం అని చెప్పాడు. ప్రజలలో చాలామంది చావంటే వున్న భయంతో బతుకుతున్నారుగానీ, బతుకంటే వున్న మమతతో కాదని పిచ్చేశ్వర్రావు స్పష్టపరిచాడు” అని ముగించారు ఆరుద్ర. ఒక కథకుడికి ఇంతకంటే greatest compliment ఏముంటుంది?

పిచ్చేశ్వర్రావు భార్య చౌదరాణి. ఆమె కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి చిన్నకూతురు. సాహిత్యాభిలాష వున్న చౌదరాణి మద్రాసులో ఎన్నో ఏళ్లపాటు తెలుగు పుస్తకాల షాపు నడిపారు.ఈ దంపతుల ఏకైక కుమారుడు అనిల్ అట్లూరి. ఆయన మంచి చదువరి. పది కథలదాకా రాశారు. ‘సారంగ’లో తండ్రి పిచ్చేశ్వర్రావ్ గురించిన చిన్ననాటి జ్ఞాపకాలను ఒక లాంగ్ పోయంలా అనిల్ రాశారు. నాన్న కథా సంపుటిని ఈ ఏప్రిల్ 12లోగానే తేవాలని అనిల్ ప్రయత్నించారు. మరో పదిపదిహేను రోజుల్లో, అంటే ఈ ఏప్రిల్లోనే ఆ పుస్తకం మనముందుకి రానుంది.పిచ్చేశ్వర్రావ్ కథని నేలమీద నడిపించడంలో దిట్ట. ఆ కథన కౌశలం, కల్పనా చాతుర్యం… ఒక పాత్ర మనసులో చెలరేగే కలవరాన్ని, గాఢమైన అనుభూతినీ పాఠకుడి మనసుకి హత్తుకునేలా, ఒక మరపురాని మధురానుభవంగా తీర్చిదిద్దడం అనే ఫీట్ ని ఎంతో ease తో సాధిస్తారు. ఆధునిక జీవద్భాషతో అలరారే సహజత్వం వల్ల కథకి పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. వొట్టి ప్రాపగాండా మెటీరియల్లా కాకుండా, ఒక సృజనాత్మక ఉద్వేగంతో ప్రతి కథనీ piece of art గా మనకిచ్చిన నిండైన కళాకారుడు పిచ్చేశ్వర్రావ్. చివరిమాట :భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (R.I.N. mutiny) చరిత్రాత్మకమైనది. ఒక స్వాతంత్ర్య సమరయోధునిగా అందులో పాల్గొన్న పిచ్చేశ్వర్రావ్ అరెస్టయ్యారు. మనమూ, మనముందు తరమూ స్వేఛ్చా స్వాతంత్ర్యాలని అనుభవిస్తున్నాం అంటే పిచ్చేశ్వర్రావ్ లాంటి అనేక వందల వేల మంది యోధుల త్యాగఫలం కారణమని గుర్తుపెట్టుకోకపోతే కృతఘ్నులుగా, మూర్ఖులుగానే మిగిలిపోతాం. గతం పిలుస్తున్నట్టే వుంది కదూ… శివసాగర్ చెప్పినట్టు చిరుగాలి సితారా సంగీతంలా పిచ్చేశ్వర్రావ్ గొంతు వినిపిస్తోందా? రండి… ఆయన అక్షరాలతో కలిసి నడుద్దాం… పదండి …ఆయన కథల్లో సజీవ పాత్రలం అవుదాం!

prakash

గమనిక : రష్యన్ రచయిత్రి galina nikolyiva రాసిన (new comer) ‘అపరిచిత’ నవలని ఎప్పటికీ గుర్తుండిపోయేలా (1959లో) అనువదించింది పిచ్చేశ్వర్రావే. విశాలాంధ్ర తెచ్చిన ‘అపరిచిత’ మలి ముద్రణకి ఆర్టిస్టు మోహన్ రంగుల ముఖచిత్రం చూడొచ్చు. – TADI PRAKASH 9704541559

Share.

Leave A Reply