ఏపీలో నిశ్శబ్ద విప్లవం…

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ప్రజలు రాజకీయంగా అత్యంత చైతన్యవంతులు. వారిని కులమో, మీడియానో, ప్రలోభాలో మరోటో ప్రభావితం చేస్తాయని అనుకుంటారు కానీ, అదంతా భ్రమ. ప్రజల తీర్పు చాలా సార్లు సుస్పష్టంగా ఉంటుంది. అన్ని పార్టీల వాగ్దానాలను వింటారు. అధికార పార్టీ ఏం చేసిందో చూస్తారు… వారు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేస్తారు. 
చాలా సహజంగా, బ్యాలెన్స్‌గా ఉంటుంది ఏపీ ప్రజల తీర్పు. అదే నేడు ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. ఈ తీర్పు వెలువడటానికి 40 రోజులు పడితే పట్టొచ్చు కానీ.. ఈ రోజు మాత్రం ఓటరు చైతన్యం వెల్లువెత్తింది. మీడియా అంతా ఏకమైనా మార్చలేని రాజకీయ అంశాన్ని, ప్రజల ఓటు మార్చగలదు. కాబట్టి హక్కున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స వినియోగించుకున్నారు. 
ఉదయం ఆరు గంటలకే తయారై, ఓటర్లు క్యూలు కట్టారు. ఓటు వేయడానికి ఎంతో ఎగ్జయిటింగ్‌ గా, మధ్యాహ్నం మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా , దాదాపు 80 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు అనధికార అంచనా. 
మార్పు వైపే ఓటరు తీర్పు.. 
ఇప్పటి వరకు ఎపీ ఎన్నికల పై వచ్చిన సర్వేలన్నీ, ప్రధాన పార్టీల మేనిఫెస్టోలు రాక ముందు వచ్చినవి. ఆ సర్వేల అంచనాలు కొంత మారే అవకాశం ఇపుడు కనిపిస్తోంది. 
ఇక ఓటర్ల ట్రెండ్‌ విషయానికి వస్తే మార్పు బలంగా కనిపిస్తోంది. గ్రామీణ స్థాయి పరిశీలనల్లో ఫ్యాన్‌ గాలి బలంగా వీస్తున్నప్పటికీ , అర్బన్‌లో సైకిల్‌ కూడా వేగంగానే ఉంది. అయితే ఈ రెండు ప్రధాన పార్టీల గెలుపోటములపై ‘గాజు గ్లాసు’ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని పరిశీలకులు అంటున్నారు. విశాఖ,ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించిందని ఆ ప్రాంతాల నుండి అందిన సమాచారం వల్ల తెలుస్తోంది. ఈ రోజు పోలింగ్‌ తో అది మరింత స్పష్టం అయింది. రాబోయే ఫలితాలతో చాలా మందికి జ్నానోదయం కలుగబోతుంది. 
ఫ్యాన్‌ వేగానికి కారణాలు ఇవీ… 
వైఎస్సార్‌సిపీ రిలీజ్‌ చేసిన ఎన్నికల ప్రణాళికలో, నిరుద్యోగులకు ప్రభుత్వ కాంట్రాక్టులు, అర్చకులకు రిటైర్‌ మెంట్‌ రద్దు, యాదవులకు తిరుమల గుడితలుపులు తెరిచే అవకాశం, డ్వాక్రారుణాల రద్దు, పోడుపై గిరిజనులకు హక్కు, ఇళ్ల రుణాల రద్దు, గ్రామాల్లో వాలంటీర్ల నియా మకం, దళితులకు కరెంట్‌ పై రాయతీ.. ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేశాయి. వీటన్నింటికంటే, దశలవారీ మద్యనిషేధం హామీ పట్ల అన్ని ప్రాంతాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాయకష్టం చేసి సంపాదించిందంతా, మద్యానికే ఖర్చయి ,ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయనేది కాదనలేని సామాజిక విషాదం. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామనే వాగ్దానం కూడా, రైతులను బాగా ఆకట్టుకుంది. ఉద్యాన పంటలు పండించే రైతులు కూరగాయలను నిలువ ఉంచుకునే సదుపాయం లేక వచ్చిన ధరకు అమ్మేసి నష్టపోతున్నారు. ఆ కష్టాల నుండి రైతన్నలను కాపాడే గొప్ప ఆలోచన ఇది. ఇవన్నీ నిలబెట్టుకునే అవకాశం జగన్‌ కు జనాలు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకహోదా పై మొదటి నుంచీ ఒకే స్టాండ్‌పై ఉండడం, పాదయాత్రతో ప్రజలకు చేరువ కావడం, జగన్‌కి కలిసి వచ్చే అంశాలు .
సైకిల్‌కు దారి, రహదారేనా? 
గత రెండు నెలల్లో పది జిల్లాల్లో రూరల్‌మీడియా టీం క్షేత్ర పర్యటనలో అన్ని వర్గాల ప్రజలు హర్షించిన ప్రభుత్వ పథకం ‘చంద్రన్న బీమా’. 
3 ఏళ్లలో రూ.3,303 కోట్ల పరిహారంతో, 2.3 లక్షల కుటుంబాలకు ఆసరాగా నిలిచి, చెదిరిన బతుకుల్లో కొత్త వెలుగునిచ్చిందా పథకం. 
సంపాదించే భర్త అకస్మాత్తుగా దూరమైతే.. ఇల్లుతప్ప బయట ప్రపంచం తెలియని ఆ భార్య తన సంతానాన్ని ఎలా పోషిస్తుందో, కొండంత కొడుకు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ అమ్మకు ఈ పథకం ఎలా దిక్కు అయిందో మా పరిశీలనలో కళ్లారా చూశాం. ఇలాంటి అభాగ్యుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా ఈ రోజు జరిగిన పోలింగ్‌లో తిరుగు లేని ప్రభావం చూపబోతుంది. 
ఇక మారుమూల గ్రామాల్లోనూ సిమెంట్‌ రోడ్లు, ఎల్‌ఈడీ వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించడాన్ని ప్రజలు గుర్తించుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త వాగ్దానాల్లో ” ఇళ్లకు సంబంధించి పాత బకాయిలు రద్దు, చంద్రన్న బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం, పసుపు-కుంకుమ మూడుసార్లు ఇస్తాం. వ్యవసాయ పంపుసెట్లన్నీ సోలార్‌ పంప్‌ సెట్‌లుగా మారుస్తాం, రైతులు వాడుకోగా మిగిలిన కరెంట్‌ని గ్రిడ్‌కి ఇస్తే తిరిగి డబ్బులిస్తాం…” వంటి వాగ్దానాలు కూడా టీడీపికి ఓట్లను తెచ్చిపెడతాయని రాజకీయ పరిశీలకులు మాతో అన్నారు. 
ఈసారి మహిళలు, వద్దులు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. వద్దాప్య పింఛను పెంచిన ప్రభావంతో టీడీపీ పట్ల కతజ్ఞతతో వచ్చారని కృష్ణా జిల్లా నుండి టాక్‌. 
బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన పసుపు కుంకుమ డబ్బులు బాగా పనిచేశాయని అందుకే మహిళలు ఉత్సాహంగా ఓట్లు వేశారని గోదావరి జిల్లాల నుండి స్పందన వినిపిస్తోంది. మహిళల్లో కూడా చీలిక వచ్చిందని, విడతల వారీగా మద్యనిషేదం అన్నందుకు జగన్‌ కు అవకాశం ఇద్దామని వచ్చారని చిత్తూరు జిల్లా నుండి మరో టాక్‌. 
” ఈ ఎన్నికల్లో గెలుపును నిర్ణయించేది… జన్మభూమి కమిటీలు, అగ్రిగోల్డ్‌ బాధితులు, అమరావతి గ్రాఫిక్స్‌, రుణమాఫీ. 
జగన్‌ గెలిస్తే.. ఆయన పాదయాత్రకు ప్రతిఫలం దక్కినట్టు. చంద్రబాబు గెలిస్తే.. ఆయన మాటలింకా జనాలు నమ్ముతున్నట్టు.. 
ప్రజలు చాలా తెలివైనవారు.. ఏం కావాలో, ఎవరు కావాలో వారికి బాగా తెలుసు.. ప్రలోభాలకు అతీతంగా స్పష్టమైన తీర్పు ఇస్తారు, వెయిట్‌ అండ్‌ సీ. ” అంటారు ఈనాడుతో సహా పలు దిన పత్రికల్లో పనిచేసిన సీనియర్‌ పాత్రికేయుడు విశేష్‌. 

Share.

Leave A Reply