ఇలాంటి రైతును ఎక్కడైనా చూశారా?

Google+ Pinterest LinkedIn Tumblr +

మానవ సంబంధాలన్నీ రియల్‌ ఎస్టేట్‌ బంధాలుగా మారుతున్న కాలంలో జీవిస్తున్న ఒకానొక మానవుడిని మీకు పరిచయం చేయబోతున్నాను.
మహబూబ్‌ నగర్‌ జిల్లా ,జడ్చర్లకు అతి సమీపంలో బెంగుళూరు హైవేలో ఎన్‌హెచ్‌44లో వెళ్తుంటే రహదారి పక్కనే 3 ఎకరాల పొలం కనిపిస్తుంది. అది జానం పేట . అక్కడే ఎర్రచందనం చెట్లకు పాదులు తీసి నీళ్లు పెడుతూ కనిపించాడు బోగి ఆంజనేయులు.
ఆయన కోసం అప్పటికే రోడ్డు పక్కన రెండు ఇన్నోవాలు, ఒక ‘ఆడి’ ఆగి ఉన్నాయి. వాటి వెనుకే మా డొక్కు స్విఫ్ట్‌ ని ఆపి పొలం వైపు నడిచాం…
” పదేళ్ల క్రితం ఇదందా జంగిల్‌…. మాకున్న ఆస్తి ఇదొక్కటే … ఎంత కాలం కూలీకి పోవాలె… ఎట్లయినా ఈ నేలలో పంటలు పండించాలి. మా కుటుంబమంతా కలిసి ఇక్కడి రాళ్లు రప్పలు తీసేసి దున్ని, సాగుకు పనికొచ్చేలా మార్చుకున్నాం. జొన్న, కూరగాయలు వేశాం. బాగానే పండినై…” అని గతం గుర్తుకు తెచ్చుకున్నాడు ఆంజనేయులు.
” ఇంతలో 2011లో ఇక్కడ ఉపాధి పనులు ఇక్కడ మొదలైనయి, జాబ్‌ కార్డు తీసుకొన్నా… మాకు ప్రభుత్వం నుండి వందకు పైగా మామిడి, ఎర్రచందనం,టేక్‌ కలిపి 500 మొక్కలు అందాయి వాటిని జాగ్రత్తగా పెంచుతున్నాం. దీంతో పాటు తెలంగాణ హరిత హారం కింద నర్సరీలో లక్ష మొక్కలు పెంచుతున్నాం. వీటిలో సిల్వర్‌ ఓక్‌,సీతాఫలం, నిమ్మ, సుబాబుల్‌ , ఉసిరి, ఉన్నాయి. వీటిని 12నెలలు పెంచి పేద రైతులకు పంచుతారు. ఇదంతా చేసినందుకు ఉపాధి హామీ తరుపున నాకు నెలకు రూ.2,500 ఇస్తున్నారు” అని వివరించాడు.
తన పొలంలోని ప్రతీ మొక్కను నాకు పరిచయం చేశాడు. మామిడి మొక్కలు ముదురాకు పచ్చదనంతో మురిపిస్తున్నాయి. టేక్‌ చెట్లు ఆకాశంలోకి దూసుకుపోతన్నాయి. వీటి మధ్య మిర్చి,టమాటా కూరగాయలు పెగుగుతున్నాయి.. నర్సరీలో వరుసగా అమర్చిన ప్లాస్టిక్‌ బ్యాగుల నుండి సైనికులు కవాతు చేస్తున్నట్టు లక్ష మొక్కలు సందడి చేస్తున్నాయి.
అయితే ఇదంతా సాగు చేయడానికి ఆంజనేయులు భూమిలో చుక్క నీరు లేదు. రోడ్‌ కి అవతల వైపున్న తన ఎకరం పొలంలో భూగర్బ జలాలను బోరు ద్వారా రోడ్డు కింద నుండి పైపు లైను ద్వారా రప్పించి సాగు చేస్తున్నాడు. దీని కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశాడు.
” ఎదురుగా, బెంగుళూరు నేషనల్‌ హైవే… బంగారు పంటలు పండిస్తున్నావు… ఈ భూమికి ఎలాంటి డిమాండ్‌ ఉంది? ” అని అడిగాను.
” రోడ్డుమీద పోయేటోళ్లు వచ్చేటోళ్లు మేం పొలం పనులు చేస్తుంటే వింతగా చూస్తుంటారు. అదిగో అక్కడ కార్లలో ఉన్న వారు ఈ భూమిని అమ్మమని వచ్చినోల్లే… ఇట్లనే రోజూ ఎవరో ఒకరు వచ్చి అడుగుతున్నారు. చాలా ఎక్కువే ఆఫర్‌ చేస్తున్నారు. కానీ, నేను అమ్మదలుచుకోలేదు సారు… సీఎం అడిగినా ఇవ్వను. నా పిల్లలు కూడా అమ్మడానికి ఇష్టపడటం లేదు. ఎంత డబ్బు ఇచ్చినా ఉండదు. ఈ భూమి నా తల్లి లాంటిది దానిని కాపాడుకుంటాం. పంటలు పండించుకొని తినడంలో ఉన్న సంతోషం ఎక్కడ దొరుకుతుంది?” అన్నాడు,
ఆంజనేయులుకు చేతులెత్తి నమస్కారం చేసి వెనక్కితిరిగాం.

Share.

Comments are closed.