విద్యలోని వెలుగు…

Google+ Pinterest LinkedIn Tumblr +

మారుతున్న మీడియా ధోరణుల పై రాజస్ధాన్‌, ఆబూ లో అంతర్జాతీయ సెమినార్‌ జరుగుతోంది.
వేదిక మీద వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన రచయితలు, మీడియా ప్రతినిధుల తో పాటు లక్ష్మీపార్వతి గారు కూడా ఉన్నారు. తమిళనాడు,గుజరాత్‌ నుండి వచ్చిన ఇద్దరు వక్తలు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడాక, లక్ష్మీపార్వతి గారి వంతు వచ్చింది. ఇంగ్లీషులో మాట్లాడలేక ఆమె పడిన ఇబ్బంది మామూలుగా లేదు. చివరికి ఎవరో ఆమెను తెలుగులోనే మాట్లాడమని చెప్పి, ఇంగ్లీషులో సోసోగా అనువాదం చేశారు.
నిజానికి లక్ష్మిగారు మీడియా రంగం మీద చాలా అద్భుతమైన ఉపన్యాసం చేశారు. తెలుగు తెలిసిన నేను, పక్కనే ఉన్న సీనియర్‌ జర్నలిస్టు గంగాధర్‌ తప్ప ఎవరూ చప్పట్లు కొట్టలేక పోయారు.
విషయపరిజ్ఞానం, తెలివితేటలున్న తెలుగు వాళ్లు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ సరిగ్గా లేక, తమను తాము సరిగ్గా ప్రెజెంట్‌ చేసుకోలేక ఎలా ఇబ్డందులు పడతారో అప్పుడు అర్ధం అయింది. అదే వేదిక మీదున్న ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ ఫొటో జర్నలిజం మీద ఇంగ్లీషులో కూల్‌గా మాట్లాడి, తెలుగువారి గౌరవం కాపాడారు.
ఏ సమస్య లేనట్టుగా, ఏపీలో ప్రభుత్వపాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టడం వలన తెలుగు భాషకేదొ ద్రోహం జరిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జక్ట్‌ని కూడా తీసేస్తున్నారా ? అని. చాలా మంది టీచర్లను అడిగాను. ” తెలుగు భాష ఉంటుంది. బోధనామాధ్యమం మారుతుంది, తెలుగు నేర్పేవాళ్లు, చదివేవాళ్లు అందరూ ఉంటారు. తెలుగు భాషకొచ్చిన నష్టమేమీ లేదు. ” అని వారన్నారు.
సర్కారీ బడుల్లో తెలుగు మీడియంకు బదులు ఇంగ్లీషు మీడియం పెట్టగానే తెలుగుకి ద్రోహం చేసినంత కలర్‌ యిస్తున్నారు. పోనీ, ఇన్నేళ్లుగా ప్రయివేటు స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియం ఉంది కదా, మెజారిటీ శాతం పిల్లలు అక్కడే చదువుతున్నారు కదా!! మరి తెలుగు భాషా పరిరక్షకులు ఇంతకాలం ఏమై పోయారు?

పేద పిల్లలకు ఇంగ్లీషు నేర్చుకునే అవకాశం వస్తున్పపుడే, వీరికి మాతృ భాష పరిరక్షణ గుర్తుకు వచ్చిందా?
తెలుగులో నా ఆర్టికల్స్‌ రెగ్యులర్ గా ఫాలో అవుతూ, , ఇంగ్లీషు మీడియా లో పని చేస్తున్న లేడీజర్నలిస్టు ‘ మీ ఆర్టికల్‌కి ఎంతిస్తారు ?’ అని అడిగింది.
‘ వెయ్యి నుండి మూడు వేలు… ‘ అని గొప్పగా చెప్పాను.
‘ అదే ఆర్టికల్‌ ఇంగ్లీషులో రాస్తే First Post లో 10 వేలిస్తారు. ఫోటోలకు అదనం. ఎందుకంటే మీ రిపోర్ట్‌ ప్రపంచమంతా కమ్యునికేట్‌ అవుతుంది! ‘ అని ఇంగ్లీషు వల్ల స్కిల్‌ విలువ ఎలా పెరుగుతుందో చెప్పారామె.
అనేక భాషల్లో అనర్గళంగా అద్భుతంగా మాట్లాడే వెంకయ్యనాయుడు గారంటే, ఉపరాష్ట్రపతి కాక ముందు నుండే అపార గౌరవం. రాజకీయాల్లోని అవినీతిని, అడ్డగోలుతనాన్ని పంచ్‌ల తో కడిగేస్తుంటారు. అంత గొప్ప విజనరీ కూడా…’ నేను ,మోడీ, మాతృ భాషలో చదివే యింతటివారమయ్యాం…’ అని అన్నారు.
ఆయన బాల్యంలో అన్నీ ప్రభుత్వ స్కూళ్లే. ఇంగ్లీషు మీడియం ఎక్కడుంది? ఆయన స్వతహాగా చురుగ్గా ఉంటారు, దానికి తోడు కుటుంబ నేపథ్యం వల్ల హిందీ,ఇంగ్లీషులో ప్రావీణ్యం సాధించారు. అది అందరికీ సాధ్యమా? ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తెలుగు మీడియంలో చదివినవాడు , ఇంగ్లీషు మీడియం వాడితో పోటీ పడగలడా…?
ఈ ఇంగ్లీషు మీడియం వాదవివాదాల్లో …” తెలంగాణాలో కేసీఆర్‌ని చూసి జగన్‌ నేర్చుకోవాలి…” అని పవన్‌ కల్యాణ్‌ గారు మాత్రం ఒక నిర్మాణాత్మకమైన కామెంట్‌ చేశారు. ఆయన ఏ ఉద్ధేశ్యంతో అన్నారోకానీ, ఒక వాస్తవాన్ని తెలుసుకునే అవకాశం సమాజానికి కలిగించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక , తెలంగాణ గురుకులాల్లో ఇంగ్లీషు మీడియంలోనే బోధిస్తున్నారు. పేదపిల్లలను అంతర్జాతీయ స్ధాయిలో నైపుణ్యం సంపాదించేలా కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌గారికి స్వేచ్ఛనిచ్చారు ముఖ్యమంత్రి.

ఒక్కో తరగతికి ఇరవై, ముప్ఫయి మంది పిల్లలు మాత్రమే చదివే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం పెడితే, క్రైస్తవ మత వ్యాప్తి జరుగుతుందని, మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు. మరి ఇంతకాలం వందలాది కార్పొరేట్‌ స్కూళ్ళలో, లక్షలమంది ఇంగ్లీషు మీడియం చదువుతుంటే, క్రైస్తవం ఎందుకు వ్యాప్తి చెందలేదు?

మా ఫీల్డ్‌ విజిట్‌లో ఇటీవల ప్రకాశం జిల్లాలో, ఒక రైతు కుటుంబాన్ని కలిసినపుడు
వారిలా అంటారు. ‘మా లాంటి పేదోడు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పోరేట్‌ ఆసుపత్రులకు వెళ్లేలా వైయస్‌ రాజశేఖర రెడ్డి చేశారు. ఇపుడు జగన్‌, కార్పోరేట్‌ స్కూల్లో చెప్పే ఇంగ్లీషు మీడియంను సర్కారు బడుల్లోకి తెచ్చి, మా పిల్లలకు బతుకు తెరువు చూపిస్తున్నాడు…’ అని సంతోషంగా అన్నారు. అంటే , విద్యలోని వెలుగును పేద వర్గాలు గుర్తించాయి.
దీంతో జగన్‌ ఓటు బ్యాంకులో వడ్డీశాతం ఎలా పెరిగిపోతుందో గమనించాలి.
కొన్ని దశాబ్దాలుగా సామాన్యుడి కష్టార్జితం అంతా, విద్య, వైద్యం, మద్యానికి ఖర్చయి పోతుంది. మద్యాన్ని కంట్రోల్‌ చేస్తూ, మిగతా రెండింటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన పాలకుడికి సమాజం ఎప్పుడూ జేజేలు పలుకుతుంది!!
... శ్యాంమోహన్‌,రూరల్‌ మీడియా

Share.

Leave A Reply