ఇది జగిత్యాల పిల్లగాళ్ల కీకీ చాలెంజ్
కారు లోంచి దూకి.. ‘కీకీ డు యు లవ్ మీ’ అంటూ డ్యాన్స్ చేయడం.. ఆ వీడియోలను మీ టూ అంటూ కీకీ చాలెంజ్‌కు ట్యాగ్ చేసుకోవడం! ఇపుడు ప్రపంచమంతా జరుగుతున్న ఒక వెర్రి… దీనికి రివర్స్ ఛాలెంజ్ చేస్తున్నారు తెలంగాణ యువకులు. రోడ్డుమీద కాకుండా పొలంలో బురదలో డ్యాన్స్చేస్తూ, సాగు పనులు చేస్తూ శ్రామిక ఛాలెంజ్ విసురుతున్నారు.
ఇంతకీ కీకీ అంటే ?
కెనడా ర్యాప్ సింగర్ డ్రేక్ పాడిందే ‘కీకీ డు యు లవ్ మీ’. ఆయన లేటెస్ట్ ఆల్బమ్ ‘స్కార్పియన్’లోని ‘ఇన్ మై ఫీలింగ్స్’తో సాగుతుందీ పాట. ప్రపంచమంతా నానో నుంచి మెర్సిడెజ్‌బెంజ్ దాకా.. నడుస్తున్న కారు లోంచి దూకి.. ‘కీకీ డు యు లవ్ మీ’ అంటూ పాటకు డ్యాన్స్ చేయడం.. స్మార్ట్ ఫోన్‌తో షూట్ చేసుకోవడం.. ఆ వీడియోలను మీ టూ అంటూ కీకీ చాలెంజ్‌కు ట్యాగ్ చేయడం, ఇదీ కీకీ హ్యాష్‌ట్యాగ్ చాలెంజ్ లేదా ఇన్‌మైఫీలింగ్స్ చాలెంజ్. . సోషల్ మీడియాలో వైరల్‌గా అంతా అవే పోస్ట్‌లు. సగటు మనుషుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ పిచ్చిగా ఫాలో అవుతోంది దీన్నే. ఇటీవల రెజీనా కసాండ్రా, ఆదా శర్మ.. కదులుతున్న కార్లోంచి దూకి పాటకు స్టెప్పులేసి ఆ వీడియోను పోస్ట్ చేశారు. కరిష్మా శర్మ తన్మయత్వంతో చిందేసింది. ఇంకా ఎందరో సెలబ్స్ తమ వెర్రిని నడుస్తున్న ఆటోలోంచి దూకి చూపించుకున్నారు.
ఆడుతూపాడుతూ రోజు గడవాలి. ఎప్పుడూ కొత్తగా ఉండాలి. లైఫ్ బిందాస్‌గా ఉండాలి. అలాగని ఎలాంటి తిక్కచాలెంజ్లైనా చేసే టైపు కాదు ఈ ముగ్గురు కుర్రాళ్లు. అనిల్ గీలా,పిల్లి తిరుపతి,శ్రీరాం శ్రీకాంత్ లంబాడపల్లి(జగిత్యాల జిల్లా) గ్రామానికి చెందిన రైతుబిడ్డలు. రోడ్డుమీద కార్లోంచి దూకి పిచ్చి డ్చాన్సులు చేస్తున్న చాలెంజ్‌లు వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం వీరు గమనించారు. ఈ కీకీ కి ధీటుగా వ్యవసాయం పై చైతన్యం కలిగించేలా నాగలితో పొలం దున్నుతూ, ‘కీకీ డు యు లవ్ మీ’ అంటూ డ్యాన్స్ చేస్తూ పల్లె ప్రజలను వినోదపరుస్తున్నారు.
ఎవరీ యువకులు?
ఈ ముగ్గురు కుర్రాళ్లు గతంలో ఒక టీవీ ఛానెల్లో పనిచేశారు. సొంతంగా మైవిలేజ్ షో అనే
యూ ట్యూబ్ చానెల్ నిర్వహిస్తు, తెలంగాణ గ్రామీణజీవితం, రైతుల సమస్యల వైవిధ్యమైన షార్ట్ ఫిలిమ్స్ తీసి ప్రపంచానికి పంచుతున్నారు. అదే వరుసలో కీకీ ఛాలెంజ్‌ని సమాజ హితానికి అనువుగా మార్చి వీడియో తీసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
పీక్కు వెళ్లిన పిచ్చిని ఆపడానికే…
”విదేశాల్లో మొదలైన కీకీ చాలెంజ్ ఆట పోలీసులకు ప్రాణసంకటంగా మారింది. ఈ స్టంట్స్ చేస్తున్నవాళ్లకే కాదు ఇతర వాహనదారులకూ ప్రమాదాలను తెచ్చిపెడ్తోంది. పీక్‌కి వెళ్లిన ఈ పిచ్చిని ఆటను ఒక పాజిటివ్ గా మార్చి, జీవితాన్ని చాలెంజ్‌గా తీసుకొని, నా మిత్రుడు పిల్లి తిరుపతితో కలిసి నేను పొలంలో నాగలి దున్నుతూ డ్యాన్స్ చేస్తుంటే, శ్రీరాంశ్రీకాంత్ వీడియో షూట్ చేస్తారు. ‘విలేజ్ కీకీ వీడియో’ పేరుతో ఇన్‌స్టాగ్రాంలో రెండు రోజుల క్రితం రిలీజ్ చేశాం. లక్షలాది మంది చూశారు. బీబీసీ వరల్డ్ టీవీలో కూడా టెలికాస్టు అయింది. యూట్యూబ్ చందాదారుల నుండి వచ్చిన డబ్బుకు మరి కొంత వేసి మా ఊరి రైతుల కోసం ఒక కమ్యూనిటీ భవనం లంబాడపల్లి లో నిర్మిస్తున్నాం.” అని ‘రూరల్‌మీడియా’ కు వివరించారు అనిల్ గీలా.
……..