AP లో ఇసుజు కార్ల ప్లాంట్‌ విస్తరణ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ నుండి పరిశ్రమలు పారి పోతున్నాయి… అనే ప్రచారం జరుగుతున్న సమయం లో ఒక అరుదైన అభి వృద్ది ని చూపించే వార్త ఇది…చదవండి

శ్రీసిటీలోని జపనీస్ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్ ఇండియా, తమ రెండవదశ కార్యకలాపాలను సోమవారం ప్రారంభించింది. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్  ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టోరు నకాటా, మిత్సుబిషి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయీడి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ముఖ్యఅతిదులుగా పాల్గొని ఇసుజు అదనపు ఉత్పత్తి కేంద్రాన్నిలాంఛనంగా ప్రారంభించారు. 
అదనపు ఉత్పత్తి కేంద్రంలో 400 కోట్ల పెట్టుబడితో ప్రెస్ షాప్ సదుపాయం, ఇంజిన్ అసెంబ్లీ యూనిట్ ను ఏర్పాటుచేశారు. ఈ రెండవ దశ కార్యకలాపాల ప్రారంభం, భారత్ లో ఇసుజు ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ప్రెస్ షాప్ సదుపాయం, ఇంజిన్ అసెంబ్లీ ద్వారా ఇసుజు తయారీ కార్యకలాపాలు మరింత బలోపేతం కానుంది. 
ఈ సందర్భంగా జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యఖియామా మాట్లాడుతూ, తమ అంతర్జాతీయ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఈ ప్లాంట్ ను తీర్చిదిద్దడానికి ఇసుజు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. రెండవ దశ కార్యకలాపాల ద్వారా భారతదేశంలో ఇసుజు నిబద్ధతను పునరుద్గారించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగ వృద్ధి మరింత వేగవంతం చేస్తుందని తాను నమ్ముతున్నానన్నారు. నూతన మైలురాయిని అధిగమించిన ఇసుజు బృందానికి అభినందనలు తెలిపారు. 

అనివార్య పరిస్థితులలో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తరపున శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఇసుజు బృందాన్ని అభినందిస్తూ, మంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. మంత్రి తన సందేశంలో ఇసుజుకు అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వ మద్దతుకు భరోసా ఇస్తూ, రాష్ట్రంలో ఆటోమొబైల్ తయారీకి ఇసుజు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి కార్ల తయారీ పరిశ్రమ ఇసుజు అంటూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. లైట్ కమర్షియల్ వెహికల్ మార్కెట్లో శ్రీసిటీ ప్లాంట్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చాలన్న వారి ప్రణాళికను ప్రశంసించారు. దేశంలో కుటుంబ సగటు పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని మల్టీ ప్యాసింజర్ వాహనాన్ని తీసుకురావాలని ఇసుజు యాజమాన్యానికి సూచించారు.
 టోరు నకాటా మాట్లాడుతూ, పోటీ మార్కెట్లో అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులు, సేవలను అందించడానికి ఇసుజు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందన్నారు.  ఉత్పాదక సామర్థ్యంపై బలంగా దృష్టి సారించడంతో పాటు  ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయతకు భరోసా అందిస్తున్నామని తెలిపారు. రెండవ దశ కార్యకలాపాలు తమ వృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ సామర్ధ్యాన్ని విస్తరించనుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలకు కృతఙ్ఞతలు తెలిపారు. పరస్పర ప్రయోజనాలు పొందేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగివుంటామన్నారు. 

ఇక శ్రీసిటీలో భారతదేశంలో ఇసుజు మొదటి ప్లాంట్ ను ప్రారంభించామన్నారు. డీ-మ్యాక్స్ ప్లాట్ ఫారంపై పికప్స్, ఎస్వీయు వాహనాలను తయారుచేసినట్లు తెలిపారు. ఈ ప్లాంట్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన నైపుణ్యవంతులైన సిబ్బందిని నియమించామన్నారు. అత్యున్నత నాణ్యతతో కూడిన తయారీపై దృష్టి సారిస్తూ, మౌళిక సూత్రాల ఆధారంగా నిర్వహణ సామర్ద్యంకు భరోసా అందిస్తున్నామన్నారు. శిక్షణ, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి, యువత కెరీర్ సహాయంగా తిరుపతి ఐటీఐ కళాశాలలో ఇసుజు మోటార్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 
కాగా, జపాన్ కు చెందిన ఇసుజు మోటార్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా లిమిటెడ్ 2012 ఆగస్టు లో చెన్నైలో ప్రారంభమైంది. ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన భారతదేశ మొట్టమొదటి లైఫ్ స్టైల్, అడ్వెంచర్ యుటిలిటీ వాహనం ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్, ప్రీమియం 7 సీటర్ ఎస్ యు వి, వ్యక్తిగత వాహన విభాగంలో ఇసుజు ఎంయు-ఎక్స్, కమర్షియల్ వాహన విభాగంలో ఇసుజు డీ-మ్యాక్స్ పికప్స్ ను ఎస్-క్యాబ్, రెగ్యులర్ క్యాబ్ లుగా అందిస్తోంది. ఈ వాహనాలన్నీ శ్రీసిటీ ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తుండగా, 107 ఎకరాలలో ఇక్కడ ప్లాంట్ విస్తరించివుంది. 2016 ఏప్రిల్ లో ఇక్కడ తయారీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి . (Ravindranath.C)

Share.

Leave A Reply