‘ మల్లేశం ‘ చూసి నేర్చుకోండిరా భయ్‌ !!

Google+ Pinterest LinkedIn Tumblr +

చూడు…. ” మల్లేశా…” 
ప్రెస్‌క్లబ్‌లో కనిపిస్తే, ఆత్మీయంగా పలకరించే ఆనంద చక్రపాణిని మల్లేశం నాన్నగా స్క్రీన్‌ మీద చూడగానే సంతోషం వేసింది. ఎస్వీరంగారావుకి ఎక్కువ, గుమ్మడికి తక్కువగా బావోధ్వేగాలను చూపించాడు. 
ఇక అమ్మగా యాక్ట్‌ చేసిన ఝాన్సీ నటన అద్భుతం అన్నాననుకోండి , స్మితాపాటిల్‌ నటన గురించి రాసినట్టుంటుంది. 
తెలంగాణ మాండలికాన్ని పలకడం రాని హీరో పాత్రను క్షమించేద్దాం… ఎందుకంటే సినీ ప్రమోషన్‌ జోష్‌లో ఉన్నారు కాబట్టి ఎంజాయ్‌ చేయ నివ్వండి.
‘సైన్స్‌’కి సంబంధించిన విషయాలు ఆరోక్లాసు పిల్లగాడికి ఎలా తెలుస్తాయి? 
ఆసు మిషన్‌ తయారు చేయడానికి డబ్బులెక్కడివి…? లాంటి వెర్రి ప్రశ్నలేసుకోకుండా 
” పట్టుదల వుంటే ఇలాంటి అవరోధాలను దాటి, అసాధ్యాలని సాధ్యం చేసుకోవచ్చును..” అనే సాను కూల భావనతో సినిమా చూస్తే కూల్‌గా ఉంటుంది. నేతన్నల జీవితాన్ని తెరపైకి తెచ్చినందుకు మల్లేశం టీమ్‌కి కంగ్రాట్స్‌ !! 
ఎలాంటి ఉధ్వేగాలు, మెరుపులు లేకుండా సడన్‌గా ముగిసిన సినిమా 
నుండి బయట పడ్డాక, రీల్‌ మల్లేశం కంటే, రియల్‌ మల్లేశం గుర్తుకు వస్తాడు. 
పోచంపల్లి నేత కార్మికుల మీద గ్రౌండ్‌ రిపోర్ట్‌ చేసిన సందర్భంలో చింతకింది మల్లేశంతో మాట్లాడాను. తన నేపథ్యాన్ని చక్కగా వివరించారు. 
అతన్ని చూసి ఈ తరం చాలా నేర్చుకోవాలి. అసుయంత్రం తయారీ కంటే కూడా, మార్కెటింగ్‌ టెక్నిక్‌ని అందిపుచ్చు కోవడంలో మల్లేశం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టమే అతడికి పద్మశ్రీని, అతడి జీవితాన్ని ఇపుడు తెరమీదికి తీసుకెళ్లింది. 
తెలంగాణ గడ్డ మీద ఇలాంటి Ennoveters చాలా మంది ఉన్నారు, కానీ వారికి ప్రమోట్‌ చేసుకోవడం రాక, మార్కెటింగ్‌ నైపుణ్యం లేక మరుగున పడి పోయారు. 
రాత్రిపూట పొలంలో మోటార్‌ అన్‌ చేయడానికి వెళ్లి పాముకాటులకు బలవుతున్న రైతుల కోసం రిమోట్‌ స్టార్టర్‌ని తయారు చేసిన నల్గొండ మల్లేశం ఎంతమందికి తెలుసు..? 
శ్రీవరిలో కలుపు నివారణ కోసం చేతితో నడిపే అతి చౌక కల్టివేటర్‌ కనిపెట్టిన కడివెండి మహిపాల్‌ ని వరంగల్‌లో ఎపుడైనా చూశారా…? 
బైక్‌ టైర్లు పంచర్‌ కాకుండా ఒక అద్భుత ద్రావణాన్ని కనిపెట్టిన కంటాలి పాండురంగ, సంగారెడ్డి సెంటర్‌లో ఉపాధి లేక తిరుగుతున్నాడు. 
రంగారెడ్డిజిల్లాలో, 30 మంది చేసే మొక్కలు నాటే పనిని, ముగ్గురితో చేయించే అరుదైన యంత్రాన్ని కనిపెట్టిన విశ్వనాధం ఎంతమందికి తెలుసు…?
ఈ మేలిమి ముత్యాలు పద్మా అవార్డులకు అర్హులు కాదా..? 
వీరంతా కొత్త ఆవిష్కరణలు చేయగలరే తప్ప, ప్రమోట్‌ చేసుకోలేరు. చెమటోడ్చి, అధిక దిగుబడి సాధించిన రైతుకు మార్కెట్‌ చేయడం రాక పోతే ఏం జరుగుతుందో, వీరూ అంతే. 
వీళ్లకు , మల్లేశం జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం కావాలి. 
అందుకే చింతకింది మల్లేశం అందనంత ఎత్తుకు ఎదిగాడు, లేక పోతే, అతడి కంటే ముందే 1992లో అసుయంత్రం కనిపెట్టిన ఎలుగందుల సత్యనారాయణ లాగా, ఎవరికీ తెలీకుండా చెట్టుకిందనే మిగిలిపోయేవాడు.

Share.

Leave A Reply