ఉద్యమాల నేలలో, సేంద్రియ విప్లవం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆరు దశాబ్దాల క్రితం ఈ సవర గిరిజన గ్రామంలో వెంపటాపు సత్యం అనే బడిపంతులు భూమికోసం, భుక్తి కోసం ఉద్యమిస్తూ, ప్రజలకు సాయుధ విప్లవపాఠాలు బోధించాడు. నేడు అదే చోట మరో కొత్త ఉద్యమం పుట్టింది. రసాయన ఎరువుల నుండి భూమిని కాపాడడానికి మరో ఉపాధ్యాయుడు సేంద్రియ విప్లవం సృష్టించాడు…

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుకు దగ్గరలో మారుమూల ఆది వాసీ పల్లె అది. అక్కడి పొలాల్లో అడుగుపెడితే, భూమిలోంచి పైకి లేచిన వాన పాములు పాదాలకు గిలిగింతలు పెడుతుంటాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు, మిత్రకీటకాలు మన చుట్టూ తిరుగుతుంటాయి. గోరింకలు,పాలపిట్టలు,పిచ్చుకల రెక్కలు రెపరెప కొట్టుకుంటూ గాలిలోకి లేస్తుంటాయి. రసాయన ఎరువులు లేని ఈ మట్టిపరిమళం ఈ జీవాలకు నీడైంది. ఇక్కడి ప్రజలు ఐక్యతా, ఆలోచనా తీరే ఆ నేలను స్వచ్ఛంగా మార్చింది. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గ్రామ సంఘాలుగా ఏర్పడి, ప్రకృతి సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. తమ పంటలకు స్వయంగా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. పురుగుమందులను తమ దరిదాపుల్లోకైనా రానివ్వకుండా, ఆంధ్ర ప్రదేశ్‌లో తొలి సేంద్రియ గ్రామంగా గుర్తింపు తెచ్చారు.

కొండల మధ్య కొలువైన కుగ్రామం
విజయనగం జిల్లా, కురుపాం మండలంలో పెదకొండ,తోటకొండ,తివ్వకొండల మధ్య ఉన్నదే కొండబారిడి. అక్కడ వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేదు. అక్కడి 70 కుటుంబాలలో, 63 మంది రైతులు. ఒకపుడు వీరికి రసాయన ఎరువులంటే తెలీదు కానీ, అధిక దిగుబడుల కోసం,మైదాన ప్రాంత రైతుల సాగును చూసి, వారి ప్రభావంతో యూరియా,డిఎపీ,సూపర్‌ పాస్ఫేట్‌ ,పొటాష్‌ వంట రసాయన ఎరువులకు అలవాటు పడి అప్పుల పాలవ్వసాగారు.

‘జట్టు ట్రస్టు’ తో జతకట్టి…
ఈ నేపథ్యంలో వారి మధ్యకు ‘జట్టు ట్రస్ట్‌’ వచ్చింది. ఆ కొండ ప్రజలకు పెట్టుబడి లేని ప్రకతి వ్యవసాయాన్ని పరిచయం చేసింది. వారంతా సంఘాలుగా ఏర్పడి ‘జట్టు ట్రస్టు’ తో జతకట్టి, శిక్షణ తీసుకున్నారు. 2017లో 95 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు.
నారు వేసింది మొదలు కోత కోసి, దాన్ని విక్రయించే వరకూ గ్రామస్తులే కీలకపాత్ర పోషిస్తారు. ఇలా సాగు చేసి, గతంలో కంటే, 40 శాతం ఎక్కువ దిగుబడి సాధించారు. ఈ మార్పు వెనుక, ‘జట్టు ట్రస్ట్‌’ వ్యవస్ధాపకుడు డి.పారినాయుడు కృషి ఉంది. కొంతకాలం ప్రభుత్వ టీచర్‌గా పని చేసి, ఉద్యోగం వదిలేసి, గిరిజనులందరినీ ఒక జట్టుగా మార్చి కొండబారిడి గ్రామాన్ని ప్రకృతి సాగుకు ప్రయోగ శాలగా మార్చారాయన.

జీలుగ కల్లుతో పిచికారీ…
తూరుపు కనుమల ప్రాంతాల్లో జీలుగ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. పగలంతా కాయకష్టం చేసిన గిరిజనులు జీలుగ కల్లుతో సేదతీరుతారు. ఈ ఊరి ప్రజలు మాత్రం, అదే కల్లును జీడిమామిడి తోటలపై పిచికారీ చేసి, తెగుళ్లను నివారిస్తున్నారు.పొలం మధ్య జీలుగ చెట్టు కొమ్మలు నాటి, వరి,రాగుల పంటలను శత్రు కీటకాలనుండి కాపాడుతున్నారు.
ఈ గ్రామస్తుల ప్రకృతి సాగును వైవిద్యంగా.. ఈ వీడియోలో వీక్షించండి… https://youtu.be/Nns2rviKHis

Share.

Leave A Reply