మనం ఎందుకని రాయలేక పోతున్నాం?

Google+ Pinterest LinkedIn Tumblr +

సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగి, చాలా మందికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత, కొత్తగా రచనలు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. రచనా రూపాల్లో కూడా సృజనాత్మకత పెరిగింది. అయినప్పటికి సోషల్ మీడియాలో రచనలు చేయడం అంటే అది మేధావులు చేసే పని అని చాలా మందికి అపోహ ఉంటుంది. నిజానికి రాయడం మాట్లాడటానికి మరో రూపంగా అర్థం చేసుకోవాలి.

నేను సొషల్ మీడియాలో రాయను అని గట్టిగా తీర్మాణించుకొని రాయనివాళ్లు చాలా తక్కువ ఉంటారు. అలా అనుకున్న వారు కూడా కొన్ని బాధాకరమైన అనుభవాలు ఎదుర్కున్నవాళ్లు, అలాంటి అనుభావాలు తమకు ఎదురవుతాయని భావించినవారు తాము రాయకూడదని అనుకొని ఉంటారు.

రచనలు చేయడంలో ఎక్కువ మందిని ఆపుతున్న కారణాలు చాలానే ఉంటాయి. రాయాల్సిన ఆవశ్యకత గురించిన స్పష్టమైన అవగాహన చాలామందికి ఉండదు. రాయడానికి సంబంధించిన ప్రాధాన్యత, పరిధి పట్ల తగినంత అవగాహన ఉండదు.

రాయడానికి మనం కారణాలను వెతుక్కోవడం కంటే, రాయకుండా ఉండటానికి ఎక్కువ కారణాలను వెతుక్కుంటాము. మనం రాయాలంటే ఈ స్థాయిలో మాత్రమే రాయాలని తీర్మానించుకుంటాం. ఆ ప్రమాణాన్ని మన రచనను అభివృద్ది పరుచుకోవడానికి కాకుండా, రచనకు ఒక ప్రతిబంధకంగా పెట్టుకుంటాం. ఈ కోవలో పరిపూర్ణత కూడా వస్తుంది. మనం రాస్తే పరిపూర్ణంగా రాయాలనుకుంటాం లేదా రాయకపోవడమే మేలు అనుకుంటాం.

పరిపూర్ణత అనేది ఒక చోట ఆగిపొయే మజిలీ కాదు అది నిరంతరం జరిగే ప్రక్రియ అని మరిచిపోతాం. ప్రతిదీ మెరుగుపరచడానికే ఉంటుంది. ప్రతిసారి మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందన్న ఎరుక ఉండదు. రాస్తే తప్పులు లేకుండా రాయాలి లేకుంటే రాయరాదు అన్నటువంటి ఆలోచనలతో రాయకుండా ఉండటం కంటే, తప్పులతో అయిన రాస్తూ ఆ క్రమంలో నిరంతరం తమ రచనలను మెరుగుపరుకోవడం గొప్ప విషయం. రాయడం అన్నది ఇలాగే జరుతుంది.

తప్పులు రాస్తామేమో అనే భయంతో రచనలకు దూరంగా ఉంటు, తప్పుల్లేకుండా రాయాలన్న ఆశతో ఉండే వారు, నీళ్లలో దిగితే మునిగిపోతాం అనుకుంటూ ఒడ్డున కూర్చొని, గజ ఈతగాళ్లుగా మరిన తరువాతనే నీళ్లలోకి అడుగుపెట్టాలని అనుకున్నట్లు ఉంటుంది. రచన అంటే ఈ స్థాయిలోనే ఉండాలి, ఇలాగే రచనలు చేయాలి అనే ఖచ్చితమైన ప్రమాణాలు వాస్తవికతకు దూరంగా ఉంటాయి. ఇలాంటి ఖచ్చితమైన ప్రమాణాలు నిజంగా పెట్టుకుంటే ఎవరు రాయలేరు.

ప్రస్థుతం రాయలేని వారు అవగాహన లేని వారో లేదా వ్యక్తీకరణ నైపుణ్యాలు తగినంత లేనివారో కాదు. వారు మట్టిలో దాగిన మాణిక్యాల్లా ఉంటారు. వారికి తగిన ప్రోత్సాహం, అవకాశాలను కల్పిస్తే, వారిలో ప్రపంచ రికార్డునే బ్రద్దలు కొట్టిన మలావత్ పూర్ణలు ఉంటారు. వారిని ప్రోత్సహించిన వారి అంచనాలకు అందనంత మెరుస్తారు. నా స్నేహితురాలు ఒకరు, తాను మెరుగ్గా పుస్తక పరిచయం చెప్పలేను ఏమో అనుకుంటు నెలల తరబడి సంకోచిస్తూ, చివరికి దైర్యం చేసి పుస్తక పరిచయం చేశారు. పుస్తక పరిచయం అంటే ఇలా చేయాలి అనేంత గొప్పగా పరిచయం చేశారు.

వాళ్లు రాస్తున్నారు, నేను కూడా వాళ్లు రాసిన వాటినే రాయలి కదా అని మరి కొందరు అనుకుంటూ ఉంటారు. మొదటగా గుర్తించాల్సిన విషయం, ప్రపంచంలో రాయాల్సిన విషయాలకు కొదువ ఉండదు. ఒకే విషయాన్ని రాసినప్పటికి అవగాహనలో, వ్యక్తీకరణలో భిన్నత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం “భాను సిగిల్ పీస్” అన్నట్లు ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితానుభవాలు వేరుగా ఉంటాయి. ఈ అనుభవాలు, వారు విషయాలను చూసే పద్దతిలో, విషయాలకు ఇచ్చే ప్రాధాన్యతలో, విభిన్న కోణాలను చూడటంలో, వ్యక్తీకరణ భిన్నంగా ఉండాటానికి కారణం అవుతుంటాయి.

కొత్తగా రాయాలనుకునే వారికి, తమ అవగాహన పట్ల, వ్యక్తీకరణ పట్ల ఎన్నో సందేహాలు ఉంటాయి. రాస్తున్నవారు ఎంతో గొప్పగా రాస్తుంటారు అనే వాస్తవ సంబంధం లేని భావనలతో ఉంటారు. ఇలాంటి వారు కొంతకాలానికి దైర్యం చేసి ఏమైన రాస్తే, రచయితలుగా ఉన్నవారు, కొత్తగా రాస్తున్న వారి రచనను మెచ్చుకొని, ప్రొత్సహించడం అరుదుగా జరుగుతుంది. రచయితలు, కొత్తవారి రచనలను మెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అదేదో వారి అస్థిని త్యాగం చేయమన్నట్లు ఫీలవుతుంటారు. ఇలాంటివారు, కొత్త రచనలు చేయాలనుకుంటున్న వారిని మొదట్లోనే నిరుత్సాహపరిచి, ఆమాత్రం ఉన్న వారి నమ్మకాన్ని దెబ్బతీసి, వారిని రాయకుండా చేస్తారు.

చాలా మంది రాస్తున్నారు అంటే తాము రాయగలం అన్న దైర్యం వారికి ఉండటం, రాయాలన్న లక్ష్యాన్ని కలిగి ఉండటం, 1000 అడుగుల ప్రయాణం అయినా మొదట ఒక అడుగుతోనే మొదులవుతుందని భావించడం, తమకున్న అవగాహనతోనే రచనలు చేయాలన్న చొరవ ఉండటం, తమ జ్ఞానాన్నే కాదు అజ్ఞాన్ని కూడా లోకంతో పంచుకోవడానికి, నేర్చుకోవడానికి సంసిద్దతను కలిగి ఉండటం లాంటి కారణాల వల్ల రాస్తుంటారు.

రాయడం అన్నది ఒక కళ. రాస్తున్న అంశాల పట్ల అవగాహనను నిరంతరం పెంపొందించుకోవాలి మరియు వ్యక్తికరణను మెరుగుపరుచుకుంటు పోవాలి. ప్రతిదీ మెరుగుపరుచడానికే ఉంటుంది. ప్రతిసారి మెరుగుపరిచే అవకాశం ఉంటుందన్న స్పృహ నిరంతరం ఉండాలి. విషయాల పట్ల అవగాహన పెంపొందించుకోవడం, వ్యక్తీకరణ తీరును మెరుగుపరుచుకోవడం నిరతరం నేర్చుకోవాల్సిన ప్రక్రియ అన్న అవగాహన ఉండాలి. నేర్చుకునేందుకు అవసరమైన వినమ్రత, శ్రద్ద, స్థిరమైన సాధన కలిగి ఉండాలి.

పోరాటాలు భిన్న రూపాల్లో, వివిధ స్థాయిలలో ఉంటాయని ఎరుక మనకు ఉంటే, రాయడం ఒక పోరాట రూపమని, సోషల్ మీడియా ఒక పోరాట రూపాల్లో ఒకటిగా గుర్తించగలం.

పేదల, అణచిపెట్టబడిన ప్రజల సమస్యలు, కష్టాలు, బాధలను చెప్పుకునే ఒక గొంతుకగా సోషల్ మీడియాను ఉపయోగించడం పెరిగింది. సమాజంలో కొనసాగుతున్న దోపిడి, అసమానతలు, వివక్షతలు, అణచివేతలను స్థిరంగా కొనసాగించేందుకు ఆధిపత్య కులాల, వర్గాల ప్రతినిధులు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా సమానత్వం, న్యాయం, మానవీయ విలువల ప్రాతిపాధికన ప్రశ్నించే వారి సంఖ్య పెరిగింది. ఎన్నికైన పాలకులు, మెజరిటీ ప్రజల ఆకాంక్షలను వదిలేసి, 1% కూడా మించని అత్యంత సంపన్న వర్గాల సంక్షేమం, హక్కులు, అస్థులు పెంచడమే ద్యేయంగా పనిచేస్తున్న తీరును, రూపొందిస్తున్న విధానాలను ప్రశ్నించాల్సిన ప్రస్థుత పరిస్థితుల్లో రచయితలు ఎక్కువ సంఖ్యలో, భిన్న రూపాల్లో రచనలు చేయడం అవసరం. – Venkat Kolagari

Share.

Leave A Reply