ఉపాధికి, ఊతం

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత రాజ్యాంగంలోని ‘అందరికీ పనిహక్కు’ అనే ముఖ్యమైన అంశమే ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ‘ గా మారింది. కరవు ప్రాంతాల్లో, వ్యవసాయం లాభసాటిగా లేక వలసబాట పడుతున్న పేదలకు ఉపాధి కల్పించడానికి ఈ పథకాన్ని(ఎంఎన్‌జీఆర్‌ఈఎస్‌) యూపీఏ ప్రభుత్వం 2006లో ప్రారంభించింది. ఏడాదిలో కనీసం 100రోజుల ఉపాధి కల్పించడం దీని లక్ష్యం. తెలంగాణలో ఈ పథకం అమలవుతున్న తీరు, పేదల జీవితాల్లో వచ్చిన మార్పు పై క్షేత్ర స్దాయి పరిశీలన ఇది. 
భారత రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌ ప్రకారం ప్రతివ్యక్తి పనిచేయటానికి అనువైన పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి. అయితే స్వాతంత్య్రం వచ్చిన 46 సంవత్సరాలకు గానీ కేంద్రానికి ఈ ఆలోచన రాలేదు. 2005లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. 2006 ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంతపురంలోని బండ్లపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. నలుగురు సభ్యులు ఉండే కుటుంబానికి 
సంవత్సరానికి 100 రోజులు పని కల్పించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. 
పని అడిగిన వారికి విధిగా పని కల్పించాలి. అలా కాని పక్షంలో పనిచేయకపోయినా వారికి సొమ్ము చెల్లించాలి. 2008లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమైనప్పుడు మన దేశంలో ఈ పథకం వల్ల పేదలకు మేలు కలిగింది.. ఈ అంశమే ప్రపంచ ద ష్టిని ఆకర్షించింది. 
ఈ పథకంతో పేదలకు వంద రోజల పని కల్పించడం వల్ల వారి జీవితాల్లో వచ్చిన మార్పు, బీడు భూముల అభివ ద్ది, పండ్లతోటల సాగు వల్ల జీవనోపాధుల పెంపు, ఉపాధి కూలీల హక్కులు తదితర అంశాలపై తెలంగాణలో క్షేత్రపర్యటన చేశాం.  ఉపాధి హామీ పనుల వల్ల గ్రామీణ పేదరికం తగ్గి, సుస్ధిర జీవనో పాధులు పెరగడం, బడి మానేస్తున్న పిల్లల శాతం తగ్గడం గమనించాం. ఈ పథకం అట్టడుగు వర్గాల పై ఎంత గొప్ప ప్రభావం చూపిందో చెప్పడానికి ఒక ఉదాహరణ, దళిత కూలీదంపతుల బిడ్డ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ లో సీట్‌ పొందడమే. 
తొలిసారి, 500 రూపాయల నోటు చూశారు 
”’ఇంతకు ముందెన్నడూ, మేము 500 రూపాయల నోటు ముఖం చూడలేదు. ఇప్పుడు మాకు రూ.7,000 నుంచి రూ.8,000 దాకా బ్యాంకు బ్యాలెన్సు ఉంది’ అని ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక ఆదివాసీ మహిళ సంతోషంగా చెప్పా రు. 
‘ గతంలో ఆసుపత్రికి వెళ్లే స్తోమతు లేక దొరికిన మూలికలు తినేటోళ్లం . అవి పని చేయకపోతే ప్రాణాల మీదికి వచ్చేది. ఇప్పుడు మాకు మలేరియా వంటి రోగాలొచ్చినా, ఒక ఆటో మాట్లాడుకొని ఆసుపత్రికి వెళ్ల గలుగుతున్నాం. ‘ అని మరో మహిళ అన్నారు. ఖమ్మం జిల్లా ,కామేపల్లి కి చెందిన దారావత్‌ హేమ్లా బిఏ బిఇడి చదివినప్పటికీ, ప్రకృతి పాఠాలు నేర్చుకుని వ్యవసాయం చేపట్టాడు.ఉపాధి హామీ పథకం ఆసరాతో తమకున్న నాలుగెకరాల్లో బొప్పాయి పంట వేశాడు. పండ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఎకరాకు25 టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు మార్కెట్‌లో రూ. 8 నుండి 11 వేలు వరకు ధర వస్తోందని హేమ్లా అంటాడు. 2018-19 లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఈ పథకం కింద తెలంగాణలో ఉపాధి పొందిన వారిలో 8,20,624 మంది గిరిజనులే. ఆ కుటుంబాల లో క్రమంగా పేదరికం తగ్గడం కూడా ఉపాధి హామీ ఆవశ్యకతను చాటి చెబుతున్న నిజం. అలాగే మహిళల సాధికారతకు కూడా ఈ పథకం చాలా సహాయపడింది. 
హరిత హారంలో… 
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ”హరితహారం” కార్యక్రమం విజయవంతం కావడానికి ఉపాధిహామీ పథకంలో వననర్సరీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కరీంనగర్‌ సమీపంలోని పడ్కల్‌ గ్రామంలోని ఒక ఎకరా విస్తీర్ణంలో టేక్‌, ఉసిరి, ఖర్జూర, ఈత మొక్కలతో నర్సరీని కొమరయ్య అనే వన సేవకుడు నిర్వహిస్తూ లక్ష మొక్కలకు పైగా పెంచి రైతులకు అందించారు. తెలంగాణలో తొలిసారిగా ఈ నర్సరీలో ఖర్జూర మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలు ఉద్యాన పంటల మధ్య పెంచడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా పర్యావరణ పరిరక్షణ కలుగుతుంది.ప్రస్తుతం రాష్ట్ర వ్యావ్తంగా 50 కోట్ల మొక్కలను నర్సరిలలో పెంచుతున్నారు. వీటిలో టేకు,ఎర్రచందనం, వేప మొదలైనవి ఉన్నాయి. 
ఉన్నత చదువుకు, ఊతం 
జహీరాబాద్‌ మండలం, షైకాపూర్‌ పల్లెలో జమీరుద్దీన్‌ అనే యువకుడు రోజూ కూలీ చేసుకొని బతుకుతున్నాడు. ఈ పని చేయక పోతే అతని కుటుంబం గడవదు. అయితే అన్ని సార్లు పనులు దొరకవు కదా? అందుకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు పొంది గత నాలుగేళ్లుగా కరువు పనులు చేస్తున్నాడు. 
” చదువుకోవాల్సిన వయసులో కూలీ పనులు చేస్తున్నావ్‌ భవిష్యత్‌ గురించి బెంగగా లేదా ?అని జమీరుద్దీన్‌ అడిగినపుడు… 
” నిజమే నా తోటి వారంతా కాలేజీలకు పోతున్నారు. కానీ మా కుటుంబంమంతా పని చేయక పోతే మాకు పూట గడవదు. అయితే అలాగని చదువును పక్కన పెట్ట లేదు. ఉపాధి హామీపనులు వల్ల వచ్చిన కూలీలో కొంత పొదుపు చేసి ప్రైవేట్‌గా చదువుతున్నాను. ఇలాగే చదివి ఎంబీఏ పూర్తి చేశాను. అయితే ఆ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకలేదు. ” అన్నాడు. 
దళితుల బతుకు మారింది 
కరీంనగర్‌ జిల్లా కాటారం మండలం, కొత్తపల్లికి చెందిన దళిత రైతు సాగే రాజయ్య కు రెండెకరాల పట్టా భూమి ఉంది, కానీ అదంతా రాళ్లు , రప్పలతో నిండి ఉంది. ఉపాధి హామీలో 120 పండ్ల మొక్కలు పొందాడు. వాటిలో మామిడి, దానిమ్మ జామ కాతకు వచ్చాయి. అదనపు ఆదాయం కోసం కూరగాయలు పండిస్తున్నారు. 
”గత ఐదేళ్లుగా నేను,నా భార్య ఉపాధి పనుల మీదే బతుకుతున్నాం. కొంత పొదుపు చేసి ఇద్దరు పిల్లల చదువు కోసం ఖర్చు చేశాం. మా కష్టం ఫలించి ఒక పిల్లగాడికి హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో సీటు వచ్చింది. మా కష్టానికి తగిన ఫలితమిది” అన్నాడు. 
మెదక్‌ జిల్లా, కోహీర్‌ మండలం, పర్సపల్లి గ్రామానికి చెందిన పేద దళిత రైతు సంగని అనిల్‌. భూస్వాముల దగ్గర కూలీపనులు చేసుకుని బతికే వాడు. ఎదుగూ, బొదుగూ లేని జీవితం. తన పిల్లల భవిష్యత్‌ కూడా తనలాగే కాకూడదని ఆలోచించేవాడు. పర్సపల్లి రోడ్‌ ప్రక్కనే ఉన్న 3 ఎకరాల పనికి రాని బంజరు భూమి అది. ఉపాధి హామి ద్వారా 210 మామిడి మొక్కలు తన పొలంలో నాటాడు. గత 3 సం|| నుండి మామిడి దిగుబడి వస్తోంది. చెట్లు పూత మీద ఉన్నప్పుడే మార్కెటింగ్‌ చేసుకుంటున్నాడు అనిల్‌. ఎకరం భూమిలో అల్లం పండిస్తూ 30 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నాడు. ఖర్చులన్నీ పోనూ అల్లం మీద రూ 80 వేలు మామిడి మీద రెండు లక్షలు ఏడాదికి సంపాదిస్తూ విజయవంతమైన రైతుగా గౌరవంగా బతుకుతున్నాడు. 11,60,119 మది ఎస్సీలు ఉపాధి హామీలో జాబ్‌ కార్డులు పొందారు.  
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను కూడా 30 శాతం మేర పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నరేగాలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల జీతాలను రూ. 10 వేలకు, మిగతా వారి జీతాలను 20 శాతం మేర పెంచాలని నిర్ణయించారు. అయితే 20 శాతం మేర పెంచినా ఉద్యోగుల వేతనాలు తక్కువగానే ఉన్నందున, 30 శాతం మేర పెంచాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో సెర్ప్‌, నరేగాలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు మినహా అందరికీ 30 శాతం మేర జీతాలు పెరిగినట్లయింది. 
అధ్యయనంలో గుర్తించిన అంశాలు 
ఈ చట్టం ప్రాథమికంగా పూర్తి నైపుణ్యం లేని లేదా కొద్దిపాటి నైపుణ్యము గల పనులు, దారిద్య్ర రేఖ దిగువనున్న పనివారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టారు. ఈ పథకం దేశంలో ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు క షి చేస్తుంది. సుమారు మూడవ వంతు పనులను ఆడ కూలీలకు ప్రత్యేకంగా కేటాయించబడినవి. 
1, వర్ధమాన దేశాల్లో నిధుల కొరత వల్ల పేదరిక నిర్మూలన లక్ష్యం కుంటు పడగా నరేగా(ఉపాధి హామీపథకం) తెలంగాణలో తన విశిష్టతను నిరూపించుకుంటోంది. కూలీలే తమ ఊరి సమస్యలను గ్రామసభలో చర్చించి రహదారులు, అంగన్‌ వాడీ భవనాలు వంటి ఆస్తులను సమకూర్చుకుంటున్నారు. 
2, అదిలాబాద్‌ , మహబూబ్‌ నగర్‌ జిల్లాల గిరిజనులు ప్రాణం మీదికి వస్తే ఆసుపత్రికి వెళ్లడానికి, పండిన పంటను అమ్ముకోవడానికి రహదారుల లేవ. ఈ పథకం వల్ల మారుమూల పల్లెలకు రహదారులు ఏర్పడ్డాయి. 
3, ఏడాది పొడవునా ప్రతీ కుటుంబంలో కనీసం ఒకరికి వంద రోజుల పని కల్సిస్తోంది. దీని వల్ల పౌష్టికాహార లోపం వల్ల శిశుమరణాలు పెరగడం తగ్గింది. కరవు వల్ల వ్యవసాయ పనులు తగ్గిన సమయంలో ఈ పధకం రైతు కూలీలకు అండగా ఉంది. 
4, నీటివనరుల కల్పన కోసం పెద్ద ఎత్తున జియాలజిస్టుల సేవలను ఇంజనీరింగ్‌ విభాగం సేవలను కూడా ఈ పథకం కోసం వినియోగించుకోవడం వల్ల సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కలిగాయి. 
5, గ్రామీణ రహదారులు మెరుగవ్వడంతో గ్రామాల మధ్య రాక పోకలు పెరిగాయి. రైతులు బహుళ పంటలు పండించడంతో పాటు, ఫలసాయాన్ని సులభంగా మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు. 
9, బావులు,మరుగుదొడ్లు,పంటకుంటల నిర్మాణం, భూమిచదును వంటి పనులు నరేగా ద్వారా సాధ్యమయ్యాయి. చిన్న రైతుల బీడు భూములు సాగులోకి వచ్చాయి. సాగు విస్తీర్ణం పెరిగింది. గిరిజనులు తమ భూములను ఈ పథకం లో చదును చేసుకోవడం వల్ల పండ్ల తోటలతో పాటు అంతర పంటలు పండిస్తూ సుస్దిర ఆదాయం పొందుతున్నారు. 
10,తెలంగాణ గ్రామీణ ప్రజల సామాజిక భద్రతకు ఈ పథకం గట్టి భరోసానిచ్చింది. 
11, ఈ పథకం వల్ల పేదలకు పని దొరుకుతున్నప్పటికీ వేతనాలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు పలువురు ఉపాధి కూలీలు మా వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ఒక ప్రైవేట్‌ బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించడం వల్ల ఆలస్యం అవుతున్నట్టు తెలిసింది. అలా కాకుండా జాతీయ బ్యాంకుల్లో వారి వ్యక్తిగత ఖాతాలకు వారి వేతనాలు పంపితే మరింత పారదర్శకంగా ఉంటుంది. 
12, శాశ్వత ప్రయోజనాలనిచ్చే ఆస్తుల కల్పన కోసం పథకంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.  అంతిమంగా ‘ఉపాధి హామీ’ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల పెద్ద ఎత్తున చెరువుల తవ్వకం, మొక్కలు పెంపకం ద్వారా పథకం అసలు లక్ష్యాన్ని సాధించవచ్చు. 
…… శ్యాంమోహన్‌ 

Share.

Leave A Reply