ఒక రైతు చెప్పిన ప్రకృతి రహస్యం

Google+ Pinterest LinkedIn Tumblr +

పుస్తకాల్లో వెతికి, నోట్‌ చేసుకొని, దిగుబడి పెంచే మార్గాలను మట్టి మనుషులకు చెప్పాలని వెళ్తామా ? మైండ్‌ బ్లాంక్‌ అయ్యే పాఠం వాళ్లే మాకు నేర్పి పంపుతున్నారు.. అలా ఒక రైతు నేర్పిన అద్భుతమైన సంగతి ఇది…
వెల్‌చాల్‌ (వికారాబాద్‌ జిల్లా) దారిలో వెళ్తుంటే, పక్కనే ఉన్న పొలంలో చిక్కుడు,వంకాయ,మిర్చి , కోసి గంపకు ఎత్తుతున్నారు కూలీలు .పొలం మధ్య గట్టు మీద ముద్దబంతిలా మెరుస్తూ కనిపించాడు మానెయ్య.
పంట బాగుంది..ఏం ఎరువు వాడుతున్నావని అడిగాం. పక్కనే ఉన్న చింత చెట్టుకిందికి తీసుకెళ్లి, గట్ల చుట్టూ ఉన్న సన్‌ఫ్లవర్‌,బంతి పూల మొక్కను చూపిస్తూ…
‘‘ ఈ పంటలు బాగుండటానికి కారణం ఈ పువ్వులే. సీతాకోకచిలుకలు , తేనెటీగలు లాంటి కీటకాలు లేకపోతే పరపరాగ సంపర్కం జరగదు. వాటి ద్వారా వ్యాపించే పుప్పొడి వల్ల నే
పంటలు పండుతాయి. అంతే కాదు, ఆ పూలు కీటకాలను ఆకట్టుకొని ప్రధాన పంటల వైపురాకుండా నివారిస్తున్నాయి. ’’ అని ప్రకృతి నుండి నేర్చుకున్న జ్నానాన్ని వివరించే ప్రయత్నం చేశాడు.
పంటకు చీడు పట్టకుండా వేపకషాయం తయారు చేసుకొని పిచికారీ చేస్తున్నాడు. వర్మీకంపోస్ట్‌, వేపపిండి తో భూసారం పెరిగింది. తన 8 ఎకరాల్లో ఒకే పంట కాకుండా కంది, చిక్కుడు, మిర్చి, టమాట పండిస్తున్నాడు. మిశ్రమ పంటల వల్ల, ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం వస్తుంది. అంటాడు మానెయ్య. ఖర్చున్నీ పోనూ, ఏడాదికి 1లక్ష నుండి 2.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు.
మానవాళి మనుగడకు కీటకాలే శరణ్యం. పరపరాగ సంపర్కం లేనిదే మామిడి, నిమ్మ, నారింజ, బొప్పాయి, లాంటి పండ్లు, ఉల్లి, మిర్చి, కొత్తిమీర, బెండ, చిక్కుడు క్యాబేజీ, వంటి కూరగాయలు కూడా దొరకవు.పొద్దుతిరుగుడుతో పాటు నూనెగింజులు సైతం పరపరాగ సంపర్క కీటకాల వల్ల నే పండుతున్నాయి.
భూతాపం వల్ల వర్షపాతంలో మార్పులు వస్తూ, వృక్ష సంపదకు చేటు తెస్తున్నాయి. వనాలతోపాటు వాటిని ఆశ్రయించుకున్న క్రిమికీటకాలు కనుమరుగవుతున్నాయని గమనించిన ఈ రైతు తన
పొలం చుట్టూ పొదలు, ఆముదం, పొద్దుతిరుగుడు తదితర మొక్కలను పెంచుతూ, పుప్పొడిని వ్యాపింపజేసే కీటకాలకు చక్కని నెలవుగా మార్చాడు.

Share.

Leave A Reply