బుద్దుడిని ఎట్లా చదవాలి ?

Google+ Pinterest LinkedIn Tumblr +

సివిల్ సర్వీసెస్ కోసం సిద్దపడేవాళ్లకి “అన్ని విషయాల గురించి కొంచమైనా తెలిసివుండాలి”. ఈ క్రమంలో కనిపించిన ప్రతిదాన్నీ చదవాల్సి వొస్తుంది, ఇట్లా చదువుతూ పోతే జీవితకాలం సరిపోదు. నిజానికిదే పెద్ద సమస్య. లక్ష్యం కోసం ఏది చదవాలనేదానికన్నా ఏది చదవకూడదు అనేది తెలుసుకోవడమే ముఖ్యం. బుద్ధుడి గురించి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.

బుద్దుడి విషయానికొస్తే ఏది చదవాలి, ఏవైపునుండి చదవాలి, అసలు బుద్దుడిని ఎట్లా అర్థంచేసుకోవాలి, అతని సిద్దాంతం గురించి ఎవరు చెబితే వినాలి? అసలు బుద్దిని అభిమతానికీ, బౌద్దమతానికీ తేడా ఏమిటి? వంటి ప్రశ్నలేకాదు, బుద్దుడిగురించి మాట్లాడే పదాల విషయం కూడా నిశితత్వం, ఖచ్చితత్వం వుండాలి, బుద్దుడి ధమ్మ(పాళీ పదం)ధర్మకీ, హైందవ ధర్మానికీ, బుద్దుడు చెప్పిన కర్మకీ, హిందూ పదం ఖర్మకీ చాలా తేడావుంది. రెండో రకం పదాలమీద గొప్ప మేధావినుండి, హత్యలు చేసే కౄరుడు, చదువురాని సన్యాసి.. ఇలా ఎవరైనా అనర్గళంగా మాట్లాడవచ్చు. వాటికి తెలివి, హేతుబద్దత వుండవు. కానీ బుద్దుడి ప్రతిపదంలో పద్దతి వుంటుంది. చిత్రంగా అత్యంత హేతుబద్దత వుండి చర్చకు పనికొస్తుంది. నిజానికి ఏ మతం, మత ప్రవక్త మాట్లాడిన మాట కాలానికి, వాదనకి, హేతుబద్దతకి, తార్కికతకి పనికిరాదు. అసలు ఈ ప్రపంచానికి తార్కికతని ఇచ్చిందే బుద్దుడు అనిపిస్తుంది చరిత్ర చదివినవారికి. అతడు సమకాలీన కన్ఫ్యూషియస్, లావోత్సే, జొరాస్ట్రర్, మహావీర, గ్రీకు సోఫిస్టులకంటే చాలా ముందుకుపోయి మనిషి జీవితానికి సంబంధించిన విలువల్ని హేతుబద్దంగా తొలిసారి మాట్లాడాడు.

అంబేద్కర్ చాలా తెలివైనవారు. అతడు హిందూమతం నుండి విముక్తి కోరేటప్పుడు అప్పుటికాలానికి అత్యంత అనుకూలమైన క్రిష్టియానిటీనిగానీ, అందుబాటులోని హిందూ విరుద్ద ఇస్లాం ని కానీ అనుసరించలేదు. అతడు బుద్దుడు, మార్క్స్ తర్వాత పుట్టిన విముక్తిదారుడు, తెలివైనవాడు. అతడికి తెలుసు దేవుడులేడని. కానీ ఈ జనానికి ఒక రాయినైనా సరే దేవుడిగా నిలబెట్టకపోతే కట్టుచెదిరిపోతారనే సత్యం తెలిసినవాడిగా బాగా ఆలోచించి బౌద్దాన్ని కిందికులాలకి ప్రత్యామ్నాయం చేశారు. అంటే ఆయన దృష్టిలో అది మతంకాదు, ఈ రోజు కాకపోయినా రేపైనా దేవుడులేడని తెలుస్తుంది. కిందికులాల్ని ఇదేమతంలో నిలబెడితే రాబోయే కాలానికి బుద్దుడి అభిమతం తెలుస్తుంది. అంటే తెలివిగా హిందూ మతాన్ని తృణీకరించి, బుద్దునిలోని హేతుబద్దతని అతికించి రెండు ప్రయోజనాల్ని ఏకకలంలో సాధించదలిచారు.

ఒక మతంగా బౌద్దాన్ని అవలంభించేవారు, పుస్తకాలు ప్రచురించేవారు, గుండుచేసుకునేవారూ, దుస్తులు వేసుకునేవారూ, ఆశ్రమాలు నిర్వహిచే వారిపట్ల నాకు పెద్ద అంగీకారమేం లేదు. పదాలు తప్ప వాళ్ళు అన్ని మతాల్లానే పిచ్చితనాల్ని మోస్తున్నారు మరోరూపంలో. (పుస్తకాలతో పాటు వివరాలు రాస్తాను మరోసారి). నిజానికి ప్రపంచంలో ఏ మతంలోలేనన్ని శాఖలుకూడా బౌద్దంలో వున్నాయి.

దుకాణాల్లో ముందు “లాఫింగ్ బుద్దని” పెట్టుకుంటే లాభాలొస్తాయనీ, ఇంట్లో పెట్టుకుంటే సంతోషం వుంటుందనీ నమ్మేంత నవ్వులాటగా బుద్దుడు వుండడనీ, అతడి వాదన చూస్తే మనకు వెన్నులో వొణుకు పుడుతుందనీ, మన భ్రమల్నీ, నమ్మకాల్నీ, ధ్వంచేస్తుందనీ నమ్మండి. – Siddharthi Subhas Chandrabose

Share.

Leave A Reply