ఇది కాదా ?మార్పు అంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

గతం కంటే వర్తమానంలో బతకడం నాకిష్టం కానీ, కొన్ని సార్లు భవిష్యత్‌కు దారి చూపే జ్నాపకాలూ ఉంటాయి.చిత్తూరు నడిబొడ్డులో ఉన్న కలెక్టర్‌ బంగ్లాలోకి అడుగు పెట్టగానే,’ హైదరాబాద్‌ నుండి వచ్చింది…మీరేనే ?’ అని అటెండర్‌ ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్లాడు. ఒక చల్లని ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చాడు. తరువాత శిల్పా గారొచ్చారు. ” మీ రూరల్‌ కేస్‌స్టడీలు చదివాను.. ఈ స్టోరీ కూడా ఆలాంటిదే. అందుకే మీకు కబురు చేశా…” కర్నాటక స్లాంగ్‌లో కలిసిన తెలుగులో పలకరిస్తూ, కొన్ని ఫొటోలు చూపించారు.’అంగన్‌వాడీ అనేది దేశవ్యాప్తంగా ఉన్న సిస్టమ్‌ దానిని మీరు మార్చాలి అనుకోవడం రిస్కేమో… మేడం ? ‘ అన్నాను.’ నిజమే కానీ, పేద తల్లులు కూలీ కెళితే వాళ్ల పిల్లల ఆలనాపాలనా కోసం ఏర్పాటుచేసేవే అంగన్‌వాడీలు. వాటిల్లో కాస్త చదువు, పౌష్టికాహారం పెట్టాలి కానీ, పరిస్ధితిలు అలా లేవు… అందుకే ఈ ప్రయత్నం..” అని ఆమె చెప్పడం మొదలు పెట్టారు.

Before Anganwadi center at Mahasamudram
After ….. Anganwadi center at Mahasamudram

ఆమె ఒక తరాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తున్నారని ఆ క్షణంలో నేను ఊహించలేదు.”చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం సమీపంలో మహాసముద్రం గ్రామంలో ఓ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లా. అక్కడంతా ముళ్లపొదలు, చుట్టూ అపరిశుభ్రత.. ఇలాంటి పరిస్థితిలో ఈ పిల్లలు ఎలా ఎదుగుతారు? వారి భవిష్యత్‌ ఏమవుతుంది ? అని ఆలోచించినపుడు ఆ అంగన్‌వాడీ కేంద్రాన్ని దత్తత తీసుకోవడం ఒక్కటే మార్గం అని డిసైడ్‌ అయ్యా.. ‘ అన్నారు శిల్ప.సమాజంలో అవసరాలు మారలేదు.పారిశుద్ద్యం,పౌష్టికాహార లోపమూ,పేదరికమూ ఎప్పుడూ ఉండే సమస్యలే.అయితే సమస్యల పట్ల అవగాహన ఉండి,పరిష్కారం దిశగా ఆలోచిస్తే మార్పు వస్తుందని నిరూపించారు ఆమె.ప్రభుత్వాలు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో ఖర్చు చేస్తున్నాయి కానీ, అనేక కారణాల వల్ల చేరవలసిన వారికి అవి పూర్తిగా చేరడం లేదు. అలాంటి చోట ఆమె చొరవ తీసుకొన్నారు. అనుకున్నట్టే మూడు నెలల్లో ఆ కేంద్రాన్ని సమూలంగా మార్చేశారు. పడిపోతున్న గోడలతో శిథిలావస్థకు చేరుకున్న అంగన్‌ వాడీ కేంద్రానికి ఊపిరి పోసే పని మొదలు పెట్టారు. కొత్త భవనం నిర్మించి, పిల్లలు మెచ్చే రంగులు వేయించారు. అక్కడితో ఆగలేదు… అక్కడ పనిచేసే వారితో ఎదురుగా ఉన్న ఖాళీ నేలలో ప్రకృతి సాగు చేయించారు. అక్కడ పండిన కాయగూరలతోనే పిల్లలకు ఆహారం వండిస్తున్నారు…

ఇది కాదా ?మార్పు అంటే? మార్పు ఇలాగే ఎవరో ఒకరితోనే మొదలవుతుంది. ఇపుడు సర్కారు అంగన్‌ వాడీలను తీర్చిదిద్దే పనిలో ఆమె చూపిన మార్గంలో అడుగులు వేస్తోంది… ఇదంతా చదివాక, ఇంతకూ ఈ శిల్ప ఎవరూ అనుకుంటున్నారా? ఆమె సీనియర్‌ ఐఎఎస్‌ ప్రద్యుమ్న గారి సతీమణి .
మిడిల్‌క్లాస్‌ ఫ్యామ్లీ నుండి వచ్చి,లోయర్‌ క్లాస్‌ జనం కోసం ఆలోచించే ముందు తరం మహిళ!!

Share.

Leave A Reply