తిట్లకు అలవాటైన వాడు దూసుకెళ్లి విజయాలు అందుకుంటాడు …

Google+ Pinterest LinkedIn Tumblr +

By Bharadwaja Rangavajhala

తిట్లకి ఆవేశపడకుండా … ఉండాలి …
అవతలివాడు తిట్టినా మనం అనుకున్నది మనం మాట్లాడేయాలి …
వాడు మరింతగా రెచ్చిపోయి తిట్టినా వాడ్ని మన్నింపు వేడుకుని మరీ మనం చెప్పదల్చుకున్నది చెప్తూనే ఉండాలి …
అంతే తప్ప వాడ్ని వ్యక్తిగతంగా దూషించకూడదు.
మనం చెప్పాల్సింది మానకూడదు …
….
బూతులు తిట్టినా తట్టుకోగలగాలి ..
వ్యక్తిగతం గా తీసుకుని బాధ పడకూడదు …
హర్ట్ అవకూడదు ..
మన పని నచ్చనివాడు మన్ని తిట్టినప్పుడు మనం ఆ పని మానేశామంటే …
మనం చేసిన పని మీద మనకి గౌరవం లేనట్టే కదా …
అంతగా మనకే గౌరవం లేని పని మనమేల చేయవలె?
మనం గౌరవిచ్చే పని గురించి ఎవరెన్ని విధాల తిట్టినా దుమ్మెత్తి పోసినా …
పట్టించుకోరాదు … ఆవేశపడరాదు …
మనం ఏ భావజాలాన్నైతే టార్గెట్ చేస్తామో ఆ భావజాలాన్ని మోసే వారు ఖచ్చితంగా మన మీద దాడి చేస్తారు.
అలా దాడి చేయకపోతే ఆశ్చర్యపోవాలి …
వాళ్లతో చర్చల్లోకి దిగరాదు …
వారికంటే బయట ఉండే విస్తృత ప్రజానీకానికి నీ ఆర్గ్యుమెంటు అర్ధం చేయించి తద్వారా నీవు తప్పనుకుంటున్న భావజాల వ్యాప్తిని అడ్డుకోవాలి గానీ …
ఈ తిట్టేవాళ్లతో చర్చిస్తూ కూర్చుంటే పనవదు…
అలా నిన్ను నిల్చున్నచోటే నిలబెట్టేయడానికే ఈ తిట్ల దాడి జరుగుతుంది …
అదే దాని లక్ష్యం.
మనసులను గాయపరచి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని …
తన మీద జరిగిన దాడిని తిప్పికొట్టే పనిలో అవతలవాడిని ఎంగేజ్ చేయడం కోసమే మెసెంజర్లలోకి వచ్చి తిడుతూ ఉంటారు కొందరు గ్యానులు …
నిజానికి ఇట్టి గ్యానుల కొరకే ఇది రాస్తున్నాను …
ఆ మధ్య మెసెంజర్లోకి వచ్చి మరీ కొందరు పడ్డ ఆవేశమే నాచే ఇలా రాయిస్తోంది …
వాటిని చదవాలి.
ఒకటికి రెండు సార్లు చదవాలి తప్ప …
రియాక్ట్ కాకూడదు …
ఇలా తిట్లకు అలవాటు పడడడం …
తిట్లను తట్టుకోగలగడం …
తిట్లకు ప్రాపర్ గా రియాక్ట్ కావడం ఇవన్నీ కూడా సామాజిక జీవనంలో కాస్త బలంగా ఉన్న వారు ప్రాక్టీసు చేయాల్సిన అవసరం చాలా ఉందనిపించింది.
ఇదేదో కేవలం ఆరెస్సెస్ వారికే పరిమితం కాదు …
మన నానా విధ కమ్యునిస్టుల్లో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది …
తమ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్న వారి మీద తిట్ల దాడి చేయడంలో వారూ తక్కువ వారేం కాదు …
వాటినీ భరించాలి …
తిట్టు అనేది అవతలివారి మానసిక దౌర్బల్యంగా మాత్రమే చూడాలి తప్ప మనని వాడు గాయపరుస్తున్నాడనుకోరాదు ..
పాత రోజుల్లో కొసరాజు గారు రాసినట్టు దూషణ భూషణ తిరస్కారములను ఆశీస్సులుగా తలచేవారికి …
ఈ ప్రపంచంలోకి మనం రావడమే ఇల్లరికం అల్లుడులా వచ్చామనుకుంటే ఎంత పిలాసఫీ అండీ ఆ పాటలో ..
పీకపుచ్చుకుని బయటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడీ … అంటే … ఏమిటీ …
ఆసుపత్రులకు కోట్ల రూపాయలు కట్టి అలా సినిమా నడిపించేస్తూ ఉంటారే వాళ్లన్నమాట …

ఇలా … బోల్డు జీవితం రాశారు గురువుగారు … మహానుభావుడు …
మళ్లీ వేదాంతంలో పడిపోతున్నాను …
అంచేత తిట్ల విషయంలో సాధ్యమైనంత ప్రజాస్వామికంగా వ్యవహరించేలా మన్ని మనం తర్ఫీదు చేసుకుందాం …
నిజానికి అమీర్ పేటలో ఇలా తిట్లకి అలవాటు పడించేందుకు ఒక ఇన్స్ టిట్యూట్ పెట్టి నడపాల్సిన అవసరం కూడా ఉందని గుర్తించాన్నేను.
ఉద్యోగంలో కావచ్చు …
జీవితంలో కావచ్చు …
ఉద్యమాల్లో కావచ్చు
ఎక్కడైనా తిట్లకు అలవాటైన వాడు దూసుకెళ్లి విజయాలు అందుకుంటాడు ..
కనుక కెరీర్ ఓరియంటేషన్ లో భాగంగా తిట్ల ఇన్స్ టిట్యూట్లను కూడా పెట్టాలి …
నిజానికి ప్రతి కళాశాలలోనూ స్కూల్లోనూ కూడా ఇందు కోసం క్లాసులు పెట్టాలి …
తిట్ల మేనేజ్మెంటు కోర్స్ లాంటిది ఒకటి విశ్వవిద్యాలయాల వాళ్లు పెట్టొచ్చు …
అయ్యా మరి ఉంటా…
స్వస్తి …

Share.

Leave A Reply