నిజామ్‌ల కాలంలో నిజమైన పారిశుద్ధ్యం-1

Google+ Pinterest LinkedIn Tumblr +


మానవ వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోతే మానవ జాతి మనుగడే ప్రశ్నార్దకం అవుతుంది. ఈ సమస్యకు శాశ్వతమైన , పర్యావరణహిత పరిష్కారం చూపగలిగిన విధానమే ఉన్నతమైన సంస్కృతి. ఈ సత్యాన్ని గ్రహించి, నిజాం పాలకులు మానవ జీవన మెరుగుదలకు పారిశుద్ధ్య వ్యవస్థను ప్రపంచ దేశాలతో, సమాంతరంగా ఎలా అభివృద్ధి పరిచారో, ‘నిజాం పాలన, 
పారిశుద్ధ్య ప్రగతి’ పుస్తక రచయిత, పరిశోధకుడు, ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ చేసిన గాదె వెంకటేష్‌ రూరల్‌మీడియా ఎడిటర్‌ కి వివరించారు. 

నిజాంల కాలంలో పైపుల ఏర్పాటు పనులు 


స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా నిజాం హయాంలో లాగా పారిశుద్ద్యం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. దేశంలో వున్న మొత్తం 5161పట్టణాల్లో కేవలం 269 పట్టణాలకు మాత్రమే మురుగునీటి నిర్వహణ వ్యవస్థ ఉంది. అదికూడా పాక్షికంగానే ఉందన్న విషయం బహు బాధాకరమైన అంశం. ఇప్పటి ప్రభుత్వాలు పారిశుద్ధ్య పనులను చేపడుతున్న విధానంలోనైతే అన్ని పట్టణాలకు మురుగునీటి నిర్వహణ వసతులు కల్పించాలంటే.. మరో 3వేల సంవత్సరాలకు పైగా పడుతుందని ఓ అంచనా. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చాలా అధ్వాన్నంగా ఉంది. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో బహిరంగంగా మలవిసర్జన శాతం ఎక్కువ. గ్రామీణ అభివృద్ధి విషయంలో గుజరాత్‌ (సింధూ నాగరికత విలసిల్లిన ప్రాంతం అయినందుకు కాబోలు) బీహార్‌లు ఆదర్శంగా నిలుస్తున్నాయి అనడంలో సందేహం లేదు. కానీ మొత్తంగా చూస్తే దక్షిణ భారతదేశంలో పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థ మెరుగ్గా వున్నది. 
పారిశుద్ధ్య నిర్వహణ నేపధ్యం 
ఒక మనిషి రోజుకు గరిష్టంగా 100గ్రాముల మలం, 1.25 లీటర్ల మూత్రము, 250-450 ఘన వ్యర్థ పదార్థాల వుత్పత్తికి కారణమవుతాడు. ఏది ఆగినా వ్యర్థం రావడం ఆగదు. ఇది ఎల్లప్పుడు ఉండే, సర్వసాధారణ అతి ప్రధాన అంశం. అటువంటి దానికి శాశ్వతమైన, పర్యావరణహిత పరిష్కారం చూపగలిగిన విధానమే ఉన్నతమైన సంస్కృతి. 
మొదటి పారిశుద్ధ్య వ్యవస్ధ 
మొదట పారిశుద్ధ్య వ్యవస్థ ఆనవాళ్ళు తూర్పు మధ్య భాగంలో అంటే ఇరాన్‌ దగ్గర్లో జాబోల్‌లో వున్నట్లు చరిత్ర చెబుతోంది. సింధూలోయ నాగరికత పారిశుద్ధ్య వ్యవస్థ చాలా శాస్త్రీయతను జోడించుకొని మహోన్నతమైనదిగా విలసిల్లింది. దాని తర్వాతనే ఇతర నాగరికతల పారిశుద్ధ్య వ్యవస్థలను గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. 
16 శతాబ్దంలో ఇంగ్లాండులో రాణీ ఎలిజబెత్‌ కోసం సర్‌ హనింగ్టన్‌ మురుగునీటి శుద్ధి పద్ధతిని కనుగొన్నాడు. తర్వాత ఆధునిక కాలంలో అంటే 19వ శతాబ్దంలో వృథానీటి/ మురుగు నీటి సేకరణ, శుద్ధి ఆలోచనలు పదునెక్కాయి. నాగరికత అనే మాట ‘నగరం’ అనే మాట నుంచి ఏర్పడింది. సింధు లోయ ప్రజల నాగరికత అక్షరాలా నగర నాగరికత. సింధూ నాగరిత ఈ నాటికీ ఆశ్చర్యం గొలిపేటంత గొప్పది. 
పురాతన సింధులోయ నాగరికతలో నిర్మించిన ఈ మురుగు నీటి, డ్రైనేజీ వ్యవస్థ ఆ కాలంలో మధ్యప్రాచ్యంలో గాని వేరెక్కడైనా గాని నిర్మించిన డ్రైనేజీ విధానాలకంటే చాలా అభివృద్ధి చెందినది . అక్కడి ప్రజలు వ్యక్తిగత శుచి శుభ్రతలకు నగర పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. మొహెంజోదారోలో ప్రతి ఇంటికీ మంచినీటి బావి ఉండేది. ఇళ్ల క్రింద మురుగు నీరు పారడానికి తూములున్నాయి అవి పోయిపోయి వీధుల ప్రక్కగా భూగర్భంలో త్రవ్విన మురుగు కాల్వల్లో కలుస్తాయి. ప్రతి ఇంటికీ ప్రత్యేకమైన స్నానపుగదులు ,వ్యక్తిగత మరుగుదొడ్లు శాస్త్రీయ పద్ధతిలో నిర్మించుకున్నారు. అంతేకాకుండా అవి పర్యావరణ హితమైనవిగా ఉండేవి. మరుగుదొడ్ల నుంచి మురుగునీటిని తరలించడానికి అనువుగా మరుగుదొడ్లు, వీధివైపు ప్రధాన ద్వారం నిర్మించేవారు. నేటి ఆధునిక స్థాయి మురుగునీటి శుద్ధి కేంద్రాలను తలపించే సాంకేతికతను వినియోగించారు. దానికి సాక్ష్యంగా గ్రిట్‌ చాంబర్‌, సెప్టిక్‌ ట్యాంకుల నమూనాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. మురుగునీటి తరలింపు ప్రధాన కాల్వలకు లో మ్యాన్‌ హోల్స్‌ ఉండేవి. ఎలాంటి చెత్త కాలువలో పడకుండా చాలా పకడ్బందీగా చెక్కతో చేసిన జాలీలు (మెష్‌లు) అమర్చి, పర్యవేక్షించేవారు. 
నిజాంల కాలంలో పారిశుద్ధ్య విధానం 
మురుగునీటి వ్యవస్థకు ప్రజా ఆరోగ్యానికి సంబంధం ఉందనే లోతైన ఆలోచన, దూరదృష్టి వున్న అతి కొద్దిమంది రాజులలో ఏడవ నిజాం ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఒకరు. తన పాలనా రాజధాని హైదరాబాద్‌.. ఇవాళ ఆసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాలను కలిగి ,రోజుకు 10 లక్షల లీటర్ల సామర్థ్యం అంటే 339 ఎంఎల్‌డీ ఉందంటే, మురుగు నీటి శుద్ధికి ప్రయోగశాలగా హైదరాబాద్‌ మారిందంటే.. అది నాటి నిజాం వేసిన పునాదుల ఫలితమే. నిత్యం ప్రజలు వాడే నీటిలో దాదాపు 80% మురుగునీరుగా మారుతుంది. మరి ఆ మురుగు నీటి నిర్వహణ సరైన పద్ధతిలో లేకపోతే డయేరియా, కలరా వంటి వ్యాధులు సోకి జనజీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఆరవ నిజాం 1908లో మూసీ వరదల తర్వాత సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి వృధా నీటి, మురుగు నీటి నిర్వాహణ వ్యవస్థకు పునాదులు వేసి, పారిశుద్ధ్య వ్యవస్థకు పురుడు పోశాడు. ఒక శతాబ్దం ముందే బయటి ప్రపంచంతో సమాంతరంగా పారిశుద్ధ్య వ్యవస్థకు ఉన్న ఆవశ్యకతను నిజాం గుర్తించారు. జంట నగరాలకోసం వరదనీటి నిర్వహణతో పాటు, మురుగునీటి పారిశుద్ధ్య ప్రణాళికలను ఇంజనీరు ఎ.డబ్ల్యు.స్టోన్‌ బ్రిడ్జ్‌ సహాయంతో రూపొందించారు. ఆ పారిశుద్ధ్య పనులను (మురుగునీటి పారిశుధ్య కాలువలు కట్టడం) 1922 సంవత్సరంలో మొదలుపెట్టి, 1937 నాటికి పూర్తి చేశారు. ఇవి మినహా 2015వరకు తెలంగాణలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగనేలేదు. 
ఆ నాటి స్లమ్స్‌ అబివృద్ధికి నిజాం ఏం చేశారంటే… 
మూసీ నది పక్కనున్న మురికి వాడలు సుల్తాన్‌ శహి, మొగుల్‌ పుర, నాంపల్లి గన్‌ఫౌండ్రిలను అభివృద్ధి పరిచాడు ఏడవ నిజాం. అంతే కాకుండా ఇప్పుడు కనిపిస్తున్న రెడ్‌ హిల్స్‌, మల్లేపల్లి, డబ్బీర్‌పూరలను కొత్తగా నిర్మించాడు. ఏడవ నిజాం దృష్టిలో పట్టణ అభివృద్ధికి దిశానిర్దేశం చేశాడు. పేద వారికి గృహాలు నిర్మించడం, మిగులు భూములను సేకరించి పంచడం, భూగర్భ మురుగు నీటి పారుదలను ఏర్పాటు చేయడం, పథ్థర్‌ గట్టి బజారు వెడల్పు చేసి, బస్సులు తిరగడానికి వీలుగా రోడ్ల నిర్మాణం చేశారు. 

  • shyammohan-9440595858


Share.

Leave A Reply