హాలీవుడ్‌లో నటించబోతున్న, పనిమనిషి కూతురు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆమె విధిరాతను తిరిగి రాసింది 
” మా అమ్మ ఒక నేవీ ఆఫీసర్‌ ఇంట్లో పని చేసేది, అప్పుడప్పుడు నన్ను తనతో పాటు తీసుకు వెళ్ళేది. ఆమె పడే కష్టాన్ని కళ్ళారా చూసేదాన్ని. పనిలో సాయం చేసేదాన్ని. ఇలాగే బతకాలా అమ్మా, వేరే పని చేసుకోవచ్చుగా అంటే? మీ అమ్మమ్మ కూడా ఇదేపనిచేసి నన్ను పెంచిదమ్మా… ఇదంతా మన తలరాత అనేది… ఈ తలరాత ఏంటో నాకు అర్ధం అయ్యేది కాదు. దీనిని మార్చక పోతే నేను కూడా పనిమనిషిగా బతకక తప్పదని అన్పించి,చదువు మీద శ్రద్ధ పెట్టాను. ఈ రోజు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ” ఇటీవల విజయనగరంలో మాతో మాట్లాడారు స్వాతి. ఆమె కళ్లల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. 
ఉవ్వెత్తున ఎగిరిపడే కెరటాలకు ఎదురెళ్ళడం అంత సులభం కాదు. అలాంటిది సప్త సముద్రాలను చుట్టి వచ్చారు ఆరుగురు భారత నావికా మహిళాదళం. సముద్ర యానంతో ప్రపంచాన్ని చుట్టొచ్చిన ఈ బందంలో తెలుగు మహిళ లెఫ్టినెంట్‌ కమాండర్‌ పాతర్లపల్లి స్వాతి ఒకరు. ఎనిమిదన్నర నెలలు 48 వేల కిలోమీటర్లు తెరపడవలో అలలపై ప్రయాణించడం అరుదైన సాహసం. ఇది భారత నావికాదళ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం.
దాదాపు గంట సేపు మాతో తన అనుభవాలను పంచుకున్న స్వాతి తన సాహసం వెనుక ఉన్న నేపధ్యాన్ని ఇలా వివరించారు.
మళ్ళీ ఆడపిల్లేనా.. అన్నారు!
” నేను పుట్టగానే, మగ పిల్లాడు పుట్టలేదని, మూడో సంతానమూ ఆడపిల్లేనని మా వాళ్ళందరూ  బాధ పడ్డారు. కొన్నాళ్ళ తరువాత నేను బాగా చదువుతుండటం, నా గురించి మా టీచర్లంతా బాగా చెప్పడంతో వాళ్ళలో ఆ బాధ పోయింది. ముగ్గురం ఆడపిల్లలమైనా మా అమ్మానాన్న మమ్మల్ని బాగా చదించారు.
నాన్న ఆదినారాయణ నేవీలో చిరు ఉద్యోగి. అమ్మ పేరు రాణి.
సర్కారీ స్కూల్లో చదువు… 
విశాఖలోనే పుట్టి పెరిగాను. నా బాల్యం నేవీ బాల్వాడీలో గడిచింది. మా స్కూల్‌కి ఇంటి నుంచి ఆరు కిలోమీటర్లు. నడిచే వెళ్ళేదాన్ని. పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాను. షిప్‌యార్డ్‌ హైస్కూల్లో పదవ తరగతి పాసయ్యాను. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఇంటర్‌ , 2010లో బిఎస్సీ పాసైన తరువాత ఎమ్మెస్సీలో చేరాను. ఎమ్సెస్సీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుండగానే నేవీ పరీక్షకు వెళ్ళి సెలెక్ట్‌ అయ్యాను. కేరళలో ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌’గా 2011లో ఉద్యోగంలో చేరాను.
మా బోట్‌ బోల్తా పడినా … 
‘నావికా సాగర్‌ పరిక్రమ’ కోసం 2015లోనే కార్యచరణను ప్రారంభించారు నేవీ అధికారులు.దీని కోసం ముంబయిలో సెయిలింగ్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి సెయిలింగ్‌ ఆంటే ఇష్టం. సెలెక్షన్స్‌కి వెళతానంటే అమ్మ కూడా నన్ను ప్రోత్సహించింది. సెలెక్షన్స్‌లో నాతో పాటు మరో అమ్మాయిని అరగంట పాటు సముద్రంలోకి వెళ్ళిరమ్మని బోటు ఇచ్చారు. మేము ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళాం. లోనికి వెళ్ళిన పది నిమిషాలకే మా బోటు తిరగబడింది. మాకు గాయాలు అయ్యాయి,బోటు తిరిగి సరిచేసి, ఒడ్డుకు వచ్చాం. మా ధైర్యం చూసిన సెలెక్షన్‌ అధికారులు మమ్మల్ని సెలక్ట్‌ చేశారు. తరువాత నాన్‌స్టాప్‌ సెయిలింగ్‌ టెస్ట్‌లో కేప్‌టౌన్‌ నుంచి రియో వరకు సెయిలింగ్‌ చేశాం. అప్పటికి నేవీకి మాపై నమ్మకం కలిగింది. కెప్టెన్‌ దిలిప్‌ డోండే సారధ్యంలో టీమ్‌ ఏర్పాటైంది. ఇందులో నాతో పాటు, హైదరాబాద్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ ఐశ్వర్య బొడ్డుపల్లి,ప్రతిభా జాంబ్వాల్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌), విజయదేవి (మణిపూర్‌), వర్తికా జోషి (రిషికేష్‌), పాయల్‌ గుప్తా (డెహ్రడూన్‌)లు ఎంపికయ్యారు.
సాగర యాత్ర ఇలా… 
భారతీయ మహిళా నావికుల సామర్థ్యాన్ని ప్రపంచాన్ని చాటేందుకు ఇండియన్‌ నేవీ 2017 సెప్టెంబర్‌ 10న ‘నావికా సాగర్‌ పరిక్రమ’ పేరుతో యాత్రను గోవా పోర్టు నుంచి మొదలైంది. ఈ యాత్ర ఒక చోట నుంచి మొదలై, వెళ్లిన దారిలో తిరిగి ప్రయాణించకుండా, యాత్ర మొదలుపెట్టిన ప్రదేశానికి చేరుకోవాలి.

http://ruralmedia.in/wp-content/uploads/2019/01/Mana-Telangana-04-01-2019-page-5.jpg

http://ruralmedia.in/wp-content/uploads/2019/01/Mana-Telangana-04-01-2019-page-5.jpg

తారణి (తెరపడవ)లో బయలుదేరి 43 రోజులు ప్రయాణం చేసి ఆస్ట్రేలియా చేరాం. అక్కడ నుంచి న్యూజిలాండ్‌ 25 రోజుల్లో చేరుకున్నాం. అక్కడ నుంచి దక్షిణ అమెరికా వెళ్ళడానికి 45 రోజులు, అక్కడ నుంచి దక్షిణాఫ్రికాకు 30 రోజులు ప్రయాణం చేశాం. మధ్యలో మా బోట్‌ స్టీరింగ్‌ పాడవ్వడంతో మారిషస్‌కి వెళ్ళాం. అందుకోసం 35 రోజులపాటు ప్రయాణం చేశాం. అక్కడి నుంచి మరో 35 రోజులు ప్రయాణం చేసి, గోవా చేరుకున్నాం.

http://ruralmedia.in/wp-content/uploads/2019/01/Patharlapalli-Swathi-with-parents.jpg

http://ruralmedia.in/wp-content/uploads/2019/01/Patharlapalli-Swathi-with-parents.jpg

వర్షపునీటితో గొంతు తడుపుకున్నాం 
సముద్ర ప్రయాణం గురించి.. బాగా తెలుసుకున్నాకనే, అన్నిటికీ సిద్ధపడే వెళ్ళాం. కానీ నెలలు తరబడి ప్రయాణం చేయడంతో చాలా ప్రయాసలు ఎదుర్కోవలసి వచ్చింది. చల్లని ఈదురుగాలులు, ఎముకలు కొరికే చలిలో కొన్నిసార్లు రోజంతా నిద్ర ఉండేదికాదు. సముద్రంలో ప్రశాంతంగా ఉన్నపుడు మాత్రమే నిద్ర. పసిఫిక్‌, అంట్లాంటిక్‌ సముద్రాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలుండేవి. సమయం దొరికితే స్లీపింగ్‌ బ్యాగ్స్‌లో పడుకునే వాళ్ళం. కొన్నిసార్లు భయంకరమైన గాలులు వీచేవి. రైస్‌, పప్పు, చెనా వంటివి ఉడకబెట్టుకొని తినేవాళ్ళం. డ్రై ఫ్రూట్స్‌, పాలు, ఎనర్జీ డ్రింక్స్‌ తాగే వాళ్లం. యాత్ర ప్రారంభించిన కొద్దిరోజులకే పెద్ద తుఫాన్‌ వచ్చి, మేము తెచ్చుకున్న నిత్యవసర సరుకులన్నీ తడిసిపోయి తినడానికి వీలు లేకుండా పోయాయి. మా దగ్గరున్న మ్యాగీని చేసుకుని ఆకలిని తీర్చుకున్నాం. బోటులో ఉన్న ఆర్వోప్లాంట్‌ పాడైంది. దీంతో మంచినీళ్లు లేక వర్షపునీటిని పట్టుకుని కాచి చల్లార్చుకుని దాహం తీర్చుకున్నాం.
కెరటాలను ఎదురించి… 
ఈ యాత్రలో కమ్యునికేషన్‌ అండ్‌ నేవిగేటింగ్‌ చూసుకునే బాధ్యత నాది. రోడ్డు మార్గంలో యాత్ర చేస్తున్నపుడు కమ్యునికేషన్‌కు ఏదైనా ఇబ్బంది కలిగితే బాధ్యత వహిస్తున్న వారిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. అటువంటిది సముద్రం లోపల నేవిగేటింగ్‌ అండ్‌ కమ్యునికేషన్‌ను కంట్రోల్‌ చేయడం చాలా కష్టం. రెండు సార్లు తుఫాన్‌ వచ్చినప్పుడు నెట్‌వర్క్‌ పూర్తిగా పోయింది. నేవిగేషన్‌ ఎటు చూపిస్తోందో అర్థం కాలేదు. రెండు గంటల పాటు అవతలి దేశం వారికి కమ్యునికేషన్‌ కనెక్ట్‌ చేసేందుకు చాలా కష్టపడ్డాను. ఆ సమయంలో మా బోటును తాకిన అలలను చూస్తే అందరం భయపడాల్సి వచ్చింది.” అని స్వాతి చెబుతుంటే, ఆమె తల్లి రాణి ఇలా అన్నారు…

http://ruralmedia.in/wp-content/uploads/2019/01/Patharlapalli-Swathi-with-husband.jpg

http://ruralmedia.in/wp-content/uploads/2019/01/Patharlapalli-Swathi-with-husband.jpg

” ఈ యాత్రలో రెండు సార్లు తుఫాన్‌ వచ్చిన సంగతి మాకు స్వాతి చెప్పలేదు. ఆమె స్నేహితుల ద్వారా తెలుసుకున్నాం. ప్రతి రెండు రోజులకోసారి ఫోన్‌ చేసి మమ్మల్ని పలకరించేది. యాత్ర విజయవంతం అయ్యి తిరిగొచ్చాక నా కూతురు ఏదైనా సాధిస్తుందనే నమ్మకం మాలో కలిగింది. ఆడపిల్లలకే ప్రతి తల్లిదండ్రులు ప్రాధాన్యతను ఇవ్వాలి. మేము మా అమ్మాయిలోని సాహసాన్ని ప్రోత్సహించాం, ఇప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.”
అసలీ పడవ ప్రయాణం వెనుక ఉన్న కారణం ఏమంటే.. సముద్రపు కాలుష్యపు ప్రాంతాలను గుర్తించడం, దేశంలోని మహిళాశక్తిని లోకానికి చాటి చెప్పడం. అలాగే సెయిలింగ్‌ ప్రాముఖ్యతను ప్రచారం చేయడం, వివిధ సముద్రాల మెట్రలాజికల్‌ డేటా తయారుచేయడం.
స్వాతి భర్త సంతోష్‌ జైశ్వాల్‌. ఐఎన్‌ఎస్‌ కళింగలో లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌గా పని చేస్తున్నారు.
సముద్రంలో ఆమె సాహసాన్ని గుర్తించిన హాలీవుడ్‌ స్వాతి జీవితం పై సినిమా తీయబోతున్నట్టు మాకు తెలిపారు. 

Share.

Leave A Reply