ఈ గ్రామం నేడు పచ్చగా…

Google+ Pinterest LinkedIn Tumblr +

వరంగల్‌ జిల్లా, ఆత్మకూరు మండలం, పసరగొండ గ్రామంలో 464 కుటుంబాలున్నాయి. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి బతికేవారే. మొక్కజొన్న, వరి, కూరగాయలు పండించడానికి అనువైన భూములన్నప్పటికీ నీటి వసతి లేక రైతులు సరైన దిగుబడిని పొందలేకపోయేవారు. వ్యవసాయపనులు తగ్గడంతో ఉపాధి కోసం చాలామంది పట్టణాలకు వలసపోయేవారు… 
ఇలాంటి నేపథ్యంలో గ్రామస్తులంతా కలిసి పంటలు బాగా పండాలంటే భూగర్భ జలాలను పెంచుకునే పనులు చేయాలని నిర్ణయించుకున్నారు. గుట్టల దిగువన ఉన్న తమ గ్రామంలో నీటి నిలువ కందకాలు, నీటిగుంతలు తవ్వుకుంటే, బోర్లు, బావులు నిండుతాయని గ్రహించిన గ్రామస్తులు ముందుగా పెద్దగుట్ట సమీపంలో బి. బతుకమ్మకు చెందిన భూమిలో ఒక ఫారం పాండ్‌ తవ్వారు. వానలు పడినపుడు ఇది నిండి సమీపంలోని 3 బోర్లు, ఒకబావి రీచార్జ్‌ అవుతున్నాయి. జలమట్టం పెరగడంతో చుట్టూ ఉన్న ఇరవై ఎకరాలకు నీరు అందుతోంది. 
ఈ ఫారంపాండ్‌ నిర్మించక ముందు ఇక్కడ పత్తిమాత్రమే పండేది. దిగుబడి కూడా తక్కువగా ఉండేది. కానీ గ్రామస్తులు ముందు చూపుతో నీటికుంటను నిర్మించడం వల్ల గుట్టమీద పడిన నీరంతా వృధా కాకుండా భూమిలోకి ఇంకిపోయి, వేసవిలో కూడా భూగర్భజలాలు ఎండక పోవడం వల్ల వరి, కూరగాయలు పండిస్తూ మంచి దిగుబడి పొందుతున్నామంటారు ఈ ప్రాంతపు రైతులు బిక్కరాజు, మురారి రమేష్‌. 
నీటి మట్టం పెరిగింది 
”గతంలో మా పసర గొండ గ్రామంలో వానలు లేక పంటలు సరిగా పండేవి కాదు. బావులు,బోర్లు ఎండిపోయేవి. సాగు లేక పనులు లేక పేదోళ్లు ఎన్నో బాధలు పడేవారు. కొందరు వలసలు పోయే వారు. ఇలాంటి పరిస్ధితుల్లో గుట్టల వాలులో చిన్న నీటికుంటలు ఏర్పాటు చేసకున్నాం. దీనివల్ల బోరులు నిండాయి. పంటలు బాగా పండి దిగుబడి కూడా పెరిగింది” అంటారు రైతులు జన్ను సాంబయ్య, సారయ్య. 
ఇవీ ఫలితాలు.. 
1, నీటి జాడ లేక కరవుతో అల్లాడిన ఈ గ్రామం నేడు పచ్చగా మారింది. రైతులంతా గుట్టల మీది నుండి వచ్చే వర్షపు నీటిని నిలువచేసుకోవడానికి తమ పొలంలో చిన్న నీటి కుంటలు తవ్వుకుంటారు. 
2, ఎండాకాలంలో కూడా, పొలంలో పశువులకు, పక్షులకు దాహం తీర్చడానికి, కూరగాయలు, పండ్ల తోటల సాగుకు, నీటికుంటలు ఉపయోగపడుతున్నాయి. 
3, దిగుబడులు పెరిగి రైతులు సుస్థిర జీవనోపాధులు పొందుతున్నారు. 

Share.

Leave A Reply