మనదేశంలో ఉరకలెత్తున్న జీవనది పేరు కులం…

Google+ Pinterest LinkedIn Tumblr +

దళిత రక్తాశ్రుజ్వాల

HISTORIC KARAMCHEDU LIVES FOREVER
——————————————————————

మనదేశంలో ఉరకలెత్తుతూ ప్రవహిస్తున్న
జీవనది పేరు కులం. అది దాహం తీరుస్తుంది. వేసవిలో కొబ్బరి నీళ్ళలా సేదదీరుస్తుంది.

రాజకీయాలను శాసిస్తుంది.
చరిత్రను చెయ్యిపట్టుకు నడిపిస్తుంది.
నాయకులను నిర్ణయిస్తుంది.

నీ కొడుక్కీ నా కూతురికీ పెళ్ళి చేస్తుంది.
కులం నీడనిస్తుంది. కులం శాంతియిస్తుంది.
దరిజేరి ప్రేమగా హత్తుకుంటుంది.
ఆ కులమే వెర్రితలలు వేస్తుంది.
వికటాట్టహాసం చేస్తుంది.
జట్టు పట్టుకుని కుత్తుక నరికేస్తుంది.
నెత్తురు తాగేస్తుంది.

CASTE IS AN INDIAN REALITY.
కులాన్ని విస్మరిస్తామంటే కుదరదు ఇక్కడ !

భిన్నత్వంలో ఏకత్వం అని బోధిస్తాం
భిన్నత్వంలో కులతత్వాన్ని ప్రేమిస్తాం

నీకూ, నాకూ, నా తండ్రికీ, నీ తాతకీ
మా నాయనమ్మకీ, మీ జేజికీ కులం వుంది.

ఈ దేశంలో కులం లేనిది ఒక్కడికే !
ఇక్కడ కులం లేని దరిద్రుడు దళితుడు ఒక్కడే .
వాడు ఛండాలుడు. చిల్లిగవ్వ లేని వాడు
అంటరానివాడు, వూరి బయట మాత్రమే వుండాల్సిన వాడు. మన దొడ్లో వెట్టి వాడు.
పొలంలో కూలివాడు.
నీ మోచేతి నీళ్ళు తాగడానికి మాత్రమే అర్హుడు.
చెప్పుతో కొడితే కిక్కురు మనకుండా
పడి ఉండాల్సినవాడు.
అలాంటి పనికిమాలిన వాళ్ళు ఈ దేశంలో పాతిక కోట్లమంది వున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో రెండు కోట్ల మంది దాకా వున్నారు. బాధ్యత ఫీల్‌ అయితే, concern అంటూ వుంటే…
ఈ దేశ సౌభాగ్యాన్ని నిజంగానే కోరుకుంటే కంచికచర్ల..బెల్చీ..చుండూరు.. కీలవేన్మణి…కారంచేడు… హత్యకాండ జరిగిన
వూరు ఏదైనా… నోరు విప్పాల్సిందే.
ఉత్తరప్రదేశ్‌, బీహార్ల నుంచి ఆంధ్ర,కేరళ దాకా అత్యాచారాలన్నీ, మారణకాండలన్నీ దళితులమీదే. అవతలివాళ్ళు అగ్రకులం కావచ్చు. బీసీలు కావచ్చు. బలి అవుతున్నది మాలమాదిగలే ! దాని గురించి మాట్లాడకపోవడం క్షమించరాని నేరం.బాధితుల పక్షాన నిలబడకపోవడం సిగ్గుమాలిన పని !

*** *** ***

ప్రసిద్ధ రచయిత రా.వి. శాస్త్రి గారు ఒకసారిలా అన్నారు. కమ్యూనిస్టు నాయకుడు శ్రీపాద అమృత డాంగే దళితుడు అయినా, జగజ్జీవన్‌ రామ్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా ఈ దేశ రాజకీయాలు మరోలా వుండేవి !

*** *** ***

డజన్ల కొద్దీ దుర్మార్గాలు జరిగిపోతున్నా…
కొన్ని మాత్రమే జాతి మొత్తాన్ని కదిలిస్తాయి. కారంచేడుకి ఆ అరుదైన గౌరవం దక్కింది.
సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది.జాతీయ సమస్యగా నిలిచి వెలిగింది. నిందితుణ్ణి నిలదీసింది. కులాధిపత్యాన్ని ఎదిరించింది. నిర్మించడం, ప్రవహించడం, ప్రజ్వలించడం కారంచేడు ఉద్యమ ధర్మంగా సాగింది. దాని అగ్రభాగాన నిలిచి నడిపించిన వాడు రాజకీయనాయకుడు కాదు. సంపూర్ణంగా చదువుకున్నవాడు. సంస్కృతాంధ్రభాషా పండితుడు. పొన్నూరు మాలవాడు. కత్తి పద్మారావు నామధేయుడు.
ఆయన భార్య కాపు. ఒక కోడలు కమ్మ.
మరో కోడలు మాదిగ… దళితుల కోసం ఆయన ఇరవై వేల పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేశాడు. అక్కడ చదువుకోవడానికి వచ్చేవాళ్ళకి ఉచిత భోజనం పెడుతున్నాడు. దళిత సమస్యల పైన అంబేద్కర్‌ మీద అరవై పుస్తకాలు రాశాడు. గుక్కతిప్పుకోకుండా వందల పద్యాలు చెప్పగలడు.

కారంచేడు ఘోరం తర్వాత,విజయవాడలో అక్టోబర్ 6న జరిగిన మహాసభలో పోలీసులు లాఠీలతో వందలమందిని చావగొట్టారు. ఆడవాళ్ళనీ పిల్లల్నీ భయకంపితుల్ని చేశారు. లక్ష్యం ఒక్కటే. దళిత ఉద్యమాన్ని దెబ్బతీయాలి. పద్మారావు గొంతు నొక్కేయాలి. వేదిక మీద ప్రసంగిస్తున్న కత్తిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. నాకెందుకొచ్చిన గొడవ ! అని ఆనాడే పద్మారావు పాలకుల ముందు మోకరిల్లి వుంటే, ఏ యూనివర్సిటీకో వైస్‌ ఛాన్సలర్‌ అయ్యుండేవాడు. ఏ సాహిత్య అకాడమికో అధ్యక్షుడై కులికేవాడు. గవర్నర్‌ పక్కనో, ముఖ్యమంత్రి చెంతనో కూర్చునేవాడు. కత్తి పద్మారావు నిప్పుకణిక అనీ, నిలువెత్తు నిజాయితీ అనీ అనడం లేదు. మన రాజకీయనాయకుల్లా వందల కోట్లు వెనకేసినవాడు మాత్రం కాదు. నిక్కచ్చిగా, నిష్కర్షగా నలబై సంవత్సరాలు దళితుల కోసమే మాట్లాడినవాడు. కొట్లాడినవాడు. తర్ఫీదు యిచ్చి సైన్యాన్ని తయారుచేసినవాడు. మరీ ముఖ్యంగా ” అరేయ్‌, చదువుకోండిరా ” అని చెప్పిన గురుతుల్యుడు పద్మారావు ఒక్కడే.

కోర్ట్ కేసు లో గమ్మత్తు

కారంచేడు బాధితుల కోసం తేళ్ళ జడ్సన్‌ న్యాయపోరాటం చేశాడు. బొజ్జా తారకంలాంటి పెద్దలు అండగా నిలిచారు.అటు పోలీసులు పెట్టిన ప్రభుత్వ కేసు, ఇటు దళితుల కోసం జడ్సన్‌ దాఖలు చేసిన ప్రైవేటు కేసు. ఈ రెండిట్లో నిందితులు మొత్తం 164 మంది. వీళ్ళలో 140 మందిపై ప్రాథమిక సాక్ష్యాధారాలు వున్నాయని చీరాల థర్డ్‌ అడిషనల్‌ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎం. రాందాస్‌ భావించారు.తారకం, మట్లె వెంకటసుబ్బయ్య, సిరిల్‌రెడ్డి అడ్వకేట్లు. బాధితుల ఆందోళనతో కేసు గుంటూరుకి బదిలీ అయింది. 1992 ఫిబ్రవరి17న విచారణ మొదలైంది. 1994 అక్బోబర్‌ 31న తీర్పు యిచ్చారు. అయిదుగురికి యావజ్జీవం, 46 మందికి మూడేళ్ళ జైలు, నలుగురికి పదివేల జరిమానా! నిందితులు హైకోర్టుకి వెళ్ళారు . 1998లో హైకోర్టు కేసు కొట్టివేసింది. బాధితులు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ని 1998 నవంబర్‌లో సుప్రీంకోర్టు తీసుకుంది. హైకోర్టు తీర్పుని తిరస్కరించింది. గుంటూరు కోర్టు వేసిన శిక్షల్ని ఖరారు చేసింది. 13 ఏళ్ళ న్యాయపోరాటంలో నిందితులు కొందరు చనిపోయారు.ఒకడికి జీవితఖైదు, 30 మందికి మూడేళ్ళ జైలుశిక్ష విధించింది. బాధితుల తరపున ఎం.ఎన్‌.రావు వాదించారు. హత్యానేరం (302) కింద శిక్ష పడిన వాళ్ళలో 1.రాయనీడి ప్రసాద్‌ 2. చాగంటి సత్యనారాయణ 3. చాగంటి సుబ్బారావు 4. రాయని అలియాస్‌ గమ్మత్తు రాఘవయ్యలు చనిపోవడంతో ఒక్క రాయని అలియాస్‌ గమ్మత్తు అంజయ్యకి యావజ్జీవ శిక్ష పడింది.

హత్యలు జరిగిన రోజు, ఉదయం దినపత్రిక ప్రత్యేక విలేకరి ఎస్‌.ఎస్‌.ఆర్‌ ఆంజనేయులు ( కమ్మ) విజయవాడ నుంచి కారంచేడు వెళ్ళారు. ఆయన తిరిగి రాగానే అందరం అసలేం జరిగింది? అని క్యూరియస్‌గా అడిగాం. ఆంజనేయులు తేలిగ్గా నవ్వేస్తూ “ఏముందీ కమ్మోళ్లు మాదిగోళ్ళని చంపారు ” అనేశాడు. జర్నలిజం తొలి పాఠాల్లోనే చెబుతారు. FACTS ARE SACRED, BUT COMMENTS ARE FREE అని, మేం వాస్తవాలే రాశాం. ఎబికేగారయినా, నేనయినా, కె.శ్రీనివాస్‌గారైనా, ధర్మాగ్రహంతోనే కామెంట్‌ చేశాం. ఎస్‌.ఎస్‌.ఆర్ ఆంజనేయులు రిపోర్టునే తిరగరాసి, మరింత సమాచారం జోడించి కె.శ్రీనివాస్‌ హృదయం ద్రవించి పోయేలా ఆ విషాదకథ ఆవిష్కరించారు. దానికే “పంటపొలాల్లో పులి చంపిన లేడి నెత్తురు ” అని ఎప్పటికీ గుర్తుండిపోయే శీర్షిక పెట్టారు.

*** *** ***

చెంచురామయ్య నిర్దోషి. ఇన్నోసెంట్‌ అని చెప్పారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు . అంటే తన తండ్రిని అన్యాయంగా చంపారనీ అది దుర్మార్గమనీ దగ్గుబాటి ఆవేదన. దానిని కాదనం. నిజమే అయివుండొచ్చు. కీలవేణ్మనిలో స్త్రీలు పురుషుల్తో పాటు 23 మంది చిన్నపిల్లల్ని మంటల్లోకి తోసేశారు. ఆ బిడ్డలు భూస్వాములకు ఏం ద్రోహం చేశారు? కారంచేడులో దురాగ్రహంతో హత్యలు చేశారు సరే, ఆడవాళ్ళని మానభంగం ఎందుకు చేసినట్టు ? వాళ్ళు కారంచేడు భూస్వాములకి చేసిన అన్యాయం ఏమిటి?
అవునూ పశువాంఛ తీర్చుకునే ఆత్రుతలో అంటరానితనం గుర్తుకురాలేదా?
లేక అది ఆడవాళ్ళకి వర్తించదా?

ప్రసిద్ధ కవి ఎండ్లూరి సుధాకర్‌ ఒక కవితలో
నా చెల్లెళ్ళని గడ్డివాముల్లో,గొడ్ల సావళ్ళలో కుమ్మి పారేసే లమ్డికొడకల్లారా…అప్పుడేమైందిరా.
మీ అంటరానితనం ! అని అడిగారు.
మూకుమ్మడి హత్యలూ, ప్రతీకారదాడులూ న్యాయంగా హేతుబద్ధంగా జరగవని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఎవరూ చెప్పనవసరం లేదు.

*** *** ***

ఒకసారి బేగంపేట ఎయిర్‌పోర్టులో కలిసిన ఎడిటర్ ఎబికె ప్రసాద్‌గార్ని, నిర్మాత దగ్గుబాటి రామానాయుడు అభినందించారు. అభినందన దేనికీ అని ఎబికె అడిగారు. “కారంచేడు కండకావరం” అంటూ రాసిన సంపాదకీయాలు బాగున్నాయి. వాళ్ళ తరపున కూడా మనమే నిలబడినట్టయింది కదా, అభినందనలు అందుకే “అన్నారు రామానాయుడు.

*** *** ***

KattiPadmarao,T.Prakash

మద్దూరి నగేష్‌బాబు కవిత్వం చదివినపుడు…
శివసాగర్‌ విప్లవగీతం వింటున్నప్పుడు,
పైడి తెరేష్‌బాబు ‘హిందూ మహా సముద్రం ‘లో ఈదినపుడు, కలేకూరిప్రసాద్‌ ఆగ్రహ ప్రకటన చేసినపుడు, శిఖామణి గొంతులో
వేదన కన్నీరయినపుడు…

getup standup, stand up and fight for your rights అని ఉస్మానియా బాబ్‌మార్లే నలిగంటి శరత్‌ పాడినపుడు, కోయి కోటేశ్వరరావు, మంగిపూడి వెంకటశర్మని తలుచుకుంటున్నప్పుడు, ఎండ్లూరి నల్లద్రాక్ష పందిరి నీడలో నిలబడినపుడు, చంద్రశ్రీ నల్ల సూరీడు పాట సుడిగాలై చుట్టుకున్నప్పుడు,
వేముల ఎల్లయ్య కన్నీటి ‘కక్క’ చదువుతున్నపుడు, లెల్లె సురేష్‌ గొంతులో జాషువా పద్యం వింటున్నప్పుడు… డప్పునిప్పల తప్పెట అవుతోందని కృపాకర్‌ మాదిగ యుద్ధం ప్రకటించినపుడూ,
అందెశ్రీ గొంతెత్తి పాడుతోన్నపుడూ
దళిత పులులంటూ గద్దర్‌ రాసినపుడు,

నయీముగాడో, ఫహీముగాడో నారాచంద్రబాబు నువ్వు తయారుచేసిన తల్వార్లే కద నార చంద్రబాబుఅని వేదికపై ఎగిరెగిరి గోరటి వెంకన్నపాడుతున్నపుడూ, కళ్యాణరావు ‘అంటరాని వసంతం’ నా గుండెల్లో విరిసినపుడూ…
వున్నవ ‘మాలపల్లి’లో నడిచినపుడూ,
నాగప్పగారి సుందరరాజు ఆత్మఘోష వెంటాడినప్పుడూ, మోషే నీటిరంగుల చిత్రం పాటలా పెనవేసుకున్నప్పుడూ, రోహిత్‌ వేముల నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానం విన్నప్పుడూ….. నాకెందుకో వాళ్ళంతా అంబేద్కర్‌ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతున్నారనిపిస్తుంది.

ఈ దిక్కుమాలిన ప్రజాస్వామ్యానికి కూడా మంచిరోజులు వస్తాయని అంబేద్కర్‌ చెబుతున్నట్టు నా సుకుమార హృదయానికి వినిపిస్తోంది.
25 కోట్ల మంది భారతీయ దళితుల ఆశలూ, ఆకాంక్షలన్నీ నీలి సముద్రకెరటాలై
ఎగిసిపడుతున్న దృశ్యం నన్ను పరవశింపజేస్తోంది !

కామ్రేడ్స్‌ ! మీకు వినిపిస్తోందా ?

-తాడి ప్రకాష్‌, 97045 41559

Share.

Leave A Reply