‘నా ఊరంటే నాకు భయం’ – ఒక జర్నలిస్ట్ జీవన చిత్రం

Google+ Pinterest LinkedIn Tumblr +

పత్రికల్లో ఎన్నో కంట తడి పెట్టించే కథనాలు చదువు తుంటారు. వాటిని రాసిన జర్నలిస్ట్ జీవితం లోకి ఎప్పుడైనా చూశారా…ఇది చదవండి

నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో పీజీ డిప్లమో చేస్తున్నప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ మీద పుస్తకం రాయాలన్నప్పుడు నేను నా సబ్జెక్ట్ పేదరికం అని ఇచ్చాను. కొందరు విచిత్రంగా ఇంకొందరు విడ్డూరంగా మరికొందరు అసహ్యంగా చాలా మంది ఇష్టంగా చూశారు.. నా బతుకు నేపథ్యం తెలిసిన మా కోఆర్డినేటర్ విశ్వనాధరెడ్డిగారు నేను ఎంచుకున్న సబ్జెక్ట్ గురించి పెద్దగా ఆశ్చర్యపోలేదు..మార్పులేనిది మార్పుకి ఒక్కదానికే.. రాసెయ్ అన్నారు. పేదరికం మీద ఎందుకు రాయాలనిపించిది అని అడిగితే నేను అప్పుడు చెప్పాలనుకున్నాను..నాకు తెలిసింది పేదరికం మాత్రమే అని..కానీ ఆయన అడగలేదు..

కరడుగట్టిన పేదరికం మీద ఆకలి చావుల మీద చెత్తకుప్ప జీవితాల మీద నేను 120పేజీల పుస్తకం స్వహస్తాలతో టైప్ చేసి బుక్ ని తయారు చేసి ఇచ్చాను.. అద్భుతంగా రాశావని ఎవరూ అనలేదు..అలాగని బాగాలేదనిఎవరూ తిట్టలేదు..నిజానికి ఆ పుస్తకం మీద పేదరికం అనే టైటిల్, దానికింద తినేదెలా..బతికేదెలా అంటూ క్యాప్షన్.. ఆకలితో చేతులు చాచి అడుక్కుంటున్న ముసలావిడి ఫొటోని చూసి బహుశా అర్థాకలితో బతికినోళ్లకి తప్ప వేరేవాళ్లకి బహుశా ఎవరికీ చదవాలనిపించదు కూడా.. కానీ మా గురువు మాచిరెడ్డి విశ్వనాధరెడ్డిగారు చదివారు. పుస్తకాన్ని తెచ్చి నా భుజం మీద రెండుసార్లు తట్టి.. నువ్వు రాతగాడివి.. నీ జీవితం బాగుంటుంది పో..అన్నారు..అదే నాకు దొరికిన అత్యద్భుతమైన ఉత్సాహాన్ని ఇచ్చిన అభినందన.. … ఎందుకో నా జీవిత భూత, వర్తమాన, భవిష్యత్తు గురించి విడమరిచి నేనే రాసుకున్నానా ..అనిపిస్తుంటుంది అప్పుడప్పుడూ..

ఇంట్లో అలమరా సర్దుతుంటే నేను రాసిన నా పుస్తకం కంట పడింది..పోయిందనుకున్నా..ఎక్కడికి పోతుంది అది పేదరికం మీద రాసిన పుస్తకం కదా..చెక్కుచెదరకుండా నన్ను అంటిపెట్టుకుని అలాగే ఉంది. కాకపోతే పుస్తకం మొదటిపేజీ మీద పిల్లలు పెన్నుతో గీసిన గీతలతో మరింత అందంగా కనిపించింది.. నన్ను ఎప్పుడూ వెక్కిరిస్తూ నా భుజస్కంధాల మీద బరువుగా కూర్చుని ఉండే నా దరిద్రం చెంపమీద గిచ్చినట్టనిపించింది. బాల్యం అందంగా ఉండాలి కానీ అసహ్యంగా ఉండకూడదు.. అది జీవితమంతా వెంటాడుతూనే ఉంటుంది. అది ఎంత వయసు వచ్చినా ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. అది సంతోషాన్ని.. ఎప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంటుంది.

గుడివాడ దగ్గర అటు రామన్నపూడికి ఇటు చినఎరుకపాడుకి మద్యలో నూజెళ్ల వెళ్లే దారిలో అంటే డొంక పోరంబోకు భూమిలో ఉన్న పూరిగుడిసెలో జీవితం..అంటే నిజానికి నీ ఊరేంటి అంటే నేను డొంక అని మాత్రమే చెప్పేవాడిని.. ఎందుకంటే అక్కడ ఉన్నది మూడే మూడు ఇళ్లు..నేను పదో తరగతి చదివేవరకూ మాకు కరెంటే లేదు.. దీపం పెట్టుకుని రాత్రిపూట చదువుకున్న రోజులు, బస్సు టికెట్ కు డబ్బులు లేక మూడున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన రోజులు, కులాల గురించి తెలీని ఆ వయసులో ఎస్సీ హాస్టల్ కు వెళ్లి చేరతానని అడిగితే మీది ఫలానా కులంగా కాబట్టి ఇక్కడ చేర్చుకోవడం కుదరదని చెబితే ఏడ్చుకుంటూ వచ్చిన రోజులు ఇప్పటికీ ప్రతిరోజూ గుర్తొస్తుంటాయి.. కూర వండుకునే స్తోమత లేక అమ్మ బాక్సులో పండుమిరపకాయ పచ్చడి వేస్తూ స్కూల్లో తింటున్నప్పుడు స్నేహితులు నవ్వుతారేమోనని దూరంగా వెళ్లి తిన్నరోజులు ఎన్నెన్నో.. కాళ్లకి వేసుకోవడానికి చెప్పులు లేక ఎవరో వాడి పారేసిన చెప్పుల్ని సొెంతంగా కుట్టుకుని వేసుకుని తిరిగి సందర్భాలు అన్నీ గుర్తొస్తుంటాయి..

గుడివాడ టౌన్ హైస్కూల్లోే పదోతరగతి చదువుతున్న రోజులు..ఉన్న ఒకే ఒక్క యూనిఫార్మ్ చొక్కా చిరిగిపోతే దాన్ని కుట్టుకుని అది కనపడకుండా దాచుకుని క్లాసులో కూర్చున్న రోజు మీ నాన్నని హాస్పిటల్ లో పెట్టారు రా..అంటూ బంధువు ఒకాయని సైకిల్ పై తీసుకెళ్లాడు.. 34వయసులో నాన్న గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో మంచంపై అచేతనంగా పడి ఉంటే పక్కన అమ్మ ఏడుస్తోంది..ఏం జరిగిందో తెలీదు.. కానీ ఏం జరగబోతోందో తెలుసు..గతం బాగుంటే కదా భవిష్యత్తు అంధరాకం అవుతుందేమోనని భయపడడానికి .అంటే ఇక పై నాన్న లేకుండానే బతకాలి.. అంతే అలాగే ఫిక్స్ అయిపోయా.. నాకు అర్థమైంది ఒక్కటే.. ఇక మాకు రేషన్ కార్డు మీద వచ్చే ఐదుకేజీల బియ్యం, కేజీ పంచదారల తగ్గుతుంది అంతేగా.. ఇక రేపటి నుంచి నాన్న చొక్కాలు, ప్యాంట్లు అన్నీ నేను వేసుకోవచ్చు..స్కూల్ కి నడిచి వెళ్లకుండా నాన్న సైకిల్ ని తొక్కుకోవచ్చు..నాన్న టైటాన్ వాచ్ ని నేను పెట్టుకోవచ్చు..అంతే..

పక్కనే డాక్టర్ తాతతో అంటుంటే విన్నాను.. మీ అబ్బాయిని విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ఉంటే కచ్చితంగా బతికేవాడే అని.. కానీ డబ్బు లేదు..ఉన్నా ఎవరూ ఇవ్వలేదు.. సాయం చేయడానికి ముందుకు రాలేదు.. ఏమీ చేయలేని చేతగాని తనం.. స్కూల్లో రాసుకోవడానికి పెన్ను కూడా కొనుక్కోలేని పేదరికంలో ఉన్న నేను తండ్రిని ఏమి బతికించుకోగలను.. ఫలితం అందరూ దీపావళికి ఇంటి గుమ్మాల ముందు దీపాలు వెలిగిస్తే నేను మా నాన్న తల ముందు దీపం వెలిగించాల్సి వచ్చింది.
దీపావళి అంటే గుర్తొచ్చింది.. ప్రతి దీపావళికి ఊళ్లో అందరూ బొమ్మ పిస్టల్ కొనుక్కుని అందులో రీల్ పెట్టి టపాటపా మాని కాలుస్తుంటే అది చూస్తూ కూర్చునేవాడిని.. అలాంటిది నేను కొనుక్కుందామంటే డబ్బులెక్కడివి.. అందులే ఎవరో ఒకర్ని బతిమాలుకుని అందులో పావలా పెట్టి రీల్ కొని కాల్చేవాడిని.. పండగరోజు భూచక్రాలు తిప్పేయాలని, లక్ష్మీబాంబులు ఢమాల్ అని పేల్చేయాలని, అవ్వాయ్ సువ్వాయ్ లు గాల్లోకి ఎగరేయాలని ఎన్నెన్నో కోరికలు. కానీ ఇంట్లో తయారు చేసిన మతాబులు, నేల టపాకాయలు పేల్చుకోవాల్సి వచ్చేది.. అక్కడ నుంచి బతుకు బండిని లాగడానికి నేను కాడె భుజానకెత్తుకున్నాను.. మా పొట్టపోయడానికి అమ్మ రైస్ మిల్లులో కూలిపనికి వెళ్లేది.. అదే పనికి నేనూ వెళ్లాల్సి వచ్చింది..రాత్రంతా రైస్ మిల్లు లో పని చేయడం తెల్లవారుజామున పడుకుని అక్కడే స్నానం చేసి స్కూల్ బ్యాగ్ తీసుకుని గుడివాడ స్కూల్ కి వెళ్లి పదోతరగతి దిగ్విజయంగానే పూ ర్తి చేశా..
ఇంతవరకూ ఓకే..కూలిపని వల్ల పూటగడుస్తోంది.. పదోతరగతి పాసయ్యా..వాట్ నెక్స్ట్..ఏవేవో ఆశలు..ఏదో చదవాలని..కలెక్టర్ అవ్వాలని కోరికలు.. అంతా రైస్ మిల్లులో వచ్చే దుమ్ములో కలిసిపోయాయి.. అదే రైస్ మిల్ లో కూలి నుంచి ఆపరేటర్ గా మారిపోయింది జీవితం..అప్పటివరకూ భుజాల మీద డబ్బాతో బియ్యం మోసిన నేను ఇప్పుడు కూలీీలతో మోయించాలి.రైస్ మిల్లుని నడపాలి.. అంటే జీవితంలో ప్రమోషన్ వచ్చినట్టే.. జీవితం గాడిన పడుతోంది. ఇప్పుడు కూర వండుకుని తినే పరిస్థితికి వచ్చేశాం.. 16ఏళ్ల వయసుకే ఒంటిమీదకు ఖాకీ బట్టలు వచ్చాయి.అది మిల్లు వాళ్లే ఇస్తారు ఉచితంగా.. అక్కడే జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది.. మనుషులు-మనస్తత్వాలను చదివే అవకాశం కల్పించింది.. ఒక విధంగా ప్రస్థానం ప్రారంభమైంది.. చలికాలంనైట్ డ్యూటీలో చలిని తట్టుకోలేక, దోమల్ని భరించలేక అప్పుడే బయటపడుతున్న వేడివేడి బియ్యంలో పీకల్లోతు వరకూ కూర్చున్న రోజులు ఇప్పటికీ గుర్తుంటాయి,…వేడి వేడి బియ్యంలోంచి వచ్చే ఆ వాసన ఇప్పటికీ ముక్కుపుటాల్లో తగులుతూనే ఉంటుంది. తెల్లవారుజాము డ్యూటీకి రావడానికి కష్టమవుతుందేమోనని రాత్రి వెళ్లి రైస్ మిల్ బయట గోనెసంచులు పర్చుకుని పడుకున్న సందర్భాలు ఎన్నెన్నో..

రైస్ మిల్ లో మేస్త్రిగా పిలవబడే సీనియర్ ఆపరేటర్ టీ తీసుకురమ్మంటే నీకు నేనెందుకు టీ తేవాలి నీకు వర్కర్ ని కాదంటూ తిరగబడే ధైర్యం అప్పుడే అలవడింది.. నా దరిద్రం మీదనాకు కసి కోపం.. ఏదో ఒకటి చేయాలి..ఈ దరిద్రం నుంచి విముక్తి పొందాలి.. ఈ దుమ్ము-ధూళి నుంచి పారిపోవాలి.. ఎలా ఎలా..ఎలా అని నన్నునేనే ప్రశ్నించుకున్ సందర్భాలు ఎన్నెన్నో.. అదంతా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది..నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ నేను అనుకున్న మార్పు ఏది.. లేదు ఇక రాదేమో.. నా బతుకింతేనేమో అనుకునేవాడిని.. అందుకే ఇన్నేళ్ల వయసు వచ్చినా..నా పేదరికం నుంచి నాకు విముక్తి దొరికినా సరే..ఏదో తెలీని భయం వెంటాడుతూనే ఉంటుంది..

Asok Vemulapalli

అందుకే నా ఊరంటే నాకు భయం..నా తండ్రి చస్తుంటే బతికించడానికి సాయం చేయలేని నా బంధువులంటే నాకు అసహ్యం.. నేను చదువుకున్న స్కూలంటే నాకు వణుకు.. తప్పనిసరై ఎప్పుడైనా నా ఊరు వెళ్తే..నా దౌర్భాగ్యం నన్ను మళ్లీ పలకరించినట్టే ఉంటుంది.. బాల్యంలో నేను ఒంటరితనంతో లెక్కపెట్టిన తాటిచెట్లన్నీ మళ్లెందుకొచ్చావిక్కడి అని మందలించినట్టుగా ఉంటుంది. పోతావా..పోవా ఇక్కడి నుంచి అని ఎవరో నా జుట్టు పట్టుకుని ఈత చెట్టుకేసి ధబీధబీమని బాదినట్టుగా నొప్పిగా అనిపిస్తుంది. బాల్యంలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఈ తరానికి తెలిస్తే బాగుంటుందని నా దరిద్రాన్ని ఇక్కడ రాస్తున్నాను. దీన్ని ఇన్ స్పిరేషన్ గా తీసుకుంటారో.. ఏంటి మాకీ నస అంటూ తిట్టుకుంటారో మీ ఇష్టం…. – అశోక్ వేములపల్లి

Share.

Leave A Reply