దేశమంతా ఒకే పన్ను, ఒకే తన్ను!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక దేశం ఒకే పన్ను,,,

దేశపు పన్నుల విధానంలో కీలకమైన, విప్లవాత్మకమైన సంస్కరణగా పాలకవర్గాలు ప్రచారం చేస్తున్న వస్తు, సేవల పన్ను – గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ – అసలు స్వభావాన్ని, పరిణామాలను వివరిస్తున్నారు సీనియర్  పాత్రికేయుడు,ఆర్థిక రంగ విశ్లేషకులు  ఎన్ వేణుగోపాల్

జి ఎస్ టి అంటే ఏమిటి?

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జి ఎస్ టి – వస్తువుల మీద, సేవల మీద విధించే పన్ను, క్లుప్తంగా వస్తు, సేవల పన్ను) దేశ ఆర్థికవ్యవస్థ చరిత్రలో ఒక విప్లవాత్మకమైన, కనీ వినీ ఎరగని సమూలమైన మార్పు తెచ్చే చర్య అని, అది అమలు లోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రజలకు, వినియోగదారులకు పన్ను భారం తగ్గిపోతుందని, పన్ను చెల్లింపు సులభతరం అవుతుందని, జాతీయాదాయంలో రెండు శాతం పైన వృద్ధి ఉంటుందని పాలకవర్గాలు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నాయి. ఇంతకూ ఈ జి ఎస్ టి ఏమిటి?

జి ఎస్ టి అంటే వస్తువుల, సేవల ఉత్పత్తి, రవాణా, అమ్మకాల మీద ప్రభుత్వం వేసే పన్ను. ప్రభుత్వాలు శతాబ్దాలుగా పన్నులు వేస్తూనే ఉన్నాయి గదా, ప్రజలకు చెప్పీ చెప్పకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా గోళ్లూడగొట్టి వసూలు చేస్తూనే ఉన్నాయి గదా, ఇది ఇంకో కొత్త పన్ను, దానిలో అంత గగ్గోలు పెట్టవలసింది ఏముంది అనిపించవచ్చు. అయితే ఇది ఒకానొక కొత్త పన్ను మాత్రమే కాదు. ఇది మొత్తంగా ఒక కొత్త పన్నుల విధానం. ఇంతకాలంగా అమలులో ఉన్న పన్నుల విధానానికి భిన్నమైన పన్నుల విధానం. ఈ కొత్త పన్నుల విధానం 2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతున్నది. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరోక్ష పన్నులన్నిటినీ తొలగించి వాటి స్థానంలో ఈ కొత్త పన్నుల విధానం రానున్నది.

దేశంలో ప్రస్తుత పన్నుల విధానం

కొత్త పన్నుల విధానం గురించి చర్చించబోయే ముందు ప్రస్తుతం అమలులో ఉన్న పన్నుల విధానంలో ఏ లోపాలు ఉన్నాయో వాటిని సంస్కరించడం సాధ్యమో కాదో, ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, సంపూర్ణంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందో లేదో చూడాలి.

ఏ దేశంలోనైనా ప్రజల వినియోగం మీద, ప్రజల మధ్య జరిగే వినిమయం మీద, వేరువేరు ప్రజా రంగాల మధ్య జరిగే పంపిణీ మీద, ఆ ప్రజా సమూహాలకు అవసరమైన సరుకుల, సేవల ఉత్పత్తుల మీద ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. ప్రభుత్వ నిర్వహణ అంతా కూడ ఆ పన్నుల ఆదాయంతోనే సాధ్యమవుతుంది. దాదాపుగా రాజరికాలు ఏర్పడిన నాటి నుంచీ ప్రజల మీద పన్నులు వేసి, ఆ పన్నుల ఆదాయంతో రాజ్యాంగయంత్రాన్ని నిర్వహించడం అమలులో ఉంది. భూస్వామ్య, రాచరిక యుగాలలో విస్తారంగా విధించిన పన్నులను, పెట్టుబడిదారీ విధానం తర్వాత కొంత క్రమబద్ధం చేయడం జరిగింది. అంతకుముందు జుట్టు పన్ను, వక్షోజాల పన్ను, పండుగల పన్ను, శుభకార్యాల పన్ను వంటి సహజమైన, నైసర్గికమైన, సాంస్కృతికమైన అంశాల మీద కూడ రాజులు పన్నులు విధించారు. కాని, పారిశ్రామిక విప్లవం, పెట్టుబడిదారీ విధానం తర్వాత పన్ను విధింపు ఉత్పత్తి, పంపిణీ, వినిమయం, వినియోగం అనే నాలుగు స్థాయిలకు పరిమితమయింది.

భారతదేశంలో కూడ క్రీ.పూ. రెండో శతాబ్దం నాటికే ప్రభుత్వాల పన్నుల విధానం పకడ్బందీగా తయారయి ఉందని కౌటల్యుడి అర్థశాస్త్రం, మనుస్మృతి వంటి గ్రంథాలు తెలియజేస్తాయి. అటువంటి పన్నుల విధానమే తరతమ భేదాలతో వలసపాలన వరకూ కొనసాగింది. బ్రిటిష్ వలసవాదం పారిశ్రామిక విప్లవంతో, బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలతో వచ్చిన మార్పులను కొనసాగుతున్న భూస్వామ్య పన్నుల విధానానికి జత చేసింది. అదే పన్నుల విధానం చిన్న చిన్న మార్పు చేర్పులతో 1947 తర్వాత కూడ కొనసాగింది. అయితే దేశం విభిన్న రాష్ట్రాల సమాఖ్య గనుక, రాజ్యాంగం పన్నుల విధింపు, వసూలు అధికారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేసింది. ప్రత్యేకంగా రాజ్యాంగపు ఏడో షెడ్యూల్ లో కేంద్ర ప్రభుత్వ అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, ఉమ్మడి అధికారాలు జాబితా తయారుచేసి, ఏ పన్నులు విధించే, వసూలు చేసే అధికారం ఎవరికి ఉందో విస్పష్టంగా నమోదు చేసింది.

కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా విధించే పన్నులను మరొక రకంగా విభజిస్తే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని రెండు రకాలు. ప్రత్యక్ష పన్నులు స్పష్టంగా కనబడేవి, పరోక్ష పన్నులు ధరలో ఇమిడి కనబడకుండా ఉండేవి. ఒక సంస్థ అయినా, వ్యక్తి అయినా నేరుగా తమకు తాము చెల్లించవలసిన పన్నులు ప్రత్యక్ష పన్నులు. తాము ప్రత్యక్షంగా అది చెల్లించనవసరం లేకపోయినా ఉత్పత్తిలో, పంపిణీలో, వినిమయంలో, వినియోగంలో చెల్లించే పన్నులు పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులను విధించడానికి, వసూలు చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అనే యంత్రాంగం ఉంది. పరోక్ష పన్నులు విధించడానికి, వసూలు చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కిందనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అనే యంత్రాంగం ఉంది. ఈ రెండు యంత్రాంగాల అజమాయిషీలో రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మంత్రిత్వ శాఖల పన్నుల యంత్రాంగాలు కూడ పని చేస్తాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్ లలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు తమ పరిధిలోని పన్నులలో మార్పులు, చేర్పులు ప్రకటిస్తుంటారు.

దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రత్యక్ష పన్నులు వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను, మూలధన ఆదాయ పన్ను అనే మూడు రూపాలలో ఉన్నాయి. సంపద పన్ను అనే ప్రత్యక్ష పన్ను 2015 వరకూ అమలులో ఉండేది గాని, 2015లో దాన్ని రద్దు చేశారు. దేశంలో ప్రత్యక్ష పన్ను విధించగల అవకాశం ఉన్న సంపన్నులు కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ పాలకవర్గాలు ఈ పన్ను పరిధిలోకి రావలసిన వారందరినీ తీసుకురావడం లేదు. దేశ జనాభా 120 కోట్లలో ప్రత్యక్ష పన్ను పరిధిలోకి వచ్చేవారు నాలుగు కోట్ల మంది మాత్రమే. అందులోనూ దాదాపు మూడు కోట్ల మంది ఉద్యోగులే. వారిలో కూడ మినహాయింపులు పోగా సగం మంది దగ్గర మాత్రమే ప్రభుత్వం నిర్బంధంగా ఆదాయపన్ను వసూలు చేస్తున్నది. దేశంలో దాదాపు ఆరు కోట్ల ముప్పై లక్షల వ్యాపార సంస్థలు, పదహారు లక్షల రిజిస్టర్డ్ కంపెనీలు ఉండగా ఎనబై లక్షల వ్యాపార సంస్థలు, తొమ్మిది లక్షల కంపెనీలు మాత్రమే కార్పొరేట్ పన్ను పరిధిలో ఉన్నాయి. వారు కూడ ఎటువంటి దొంగలెక్కలు సమర్పించి ఎంత పన్ను ఎగ్గొడుతున్నారో పరిశోధించవలసిందే. కార్పొరేట్ పన్ను చెల్లింపులలో 70 శాతం ప్రభుత్వ రంగ సంస్థల నుంచే వస్తున్నదని ఒక అంచనా. తమ వార్షికాదాయం పది లక్షల రూపాయల కన్న ఎక్కువ అని చెప్పి పన్ను చెల్లించినవారు 24 లక్షలలోపు ఉండగా, సాలీనా 25 లక్షల పైన కార్లు, ఖరీదైన, విలాసవంతమైన కార్లు అమ్మకం అవుతున్నాయంటే పన్ను చెల్లింపు లెక్కలలోకి రాని ఆదాయం దేశంలో విపరీతంగా ఉన్నదని అర్థం. ఎందరో నిజమైన సంపన్నులు, పెట్టుబడిదారులు, భూస్వాములు, కంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, సినిమా నటులు, క్రీడాకారులు వంటి ప్రత్యక్ష ఆదాయ వర్గాలు చెల్లించవలసిన పన్ను చెల్లించకుండానే పబ్బం గడుపుతున్నాయి. వారిని అంతకంతకూ ఎక్కువగా పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, వారి మీద పన్నులు పెంచి ఆదాయం పెంచుకోవలసిన ప్రభుత్వం, అందుకు బదులుగా పరోక్ష పన్నుల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నది.

ప్రత్యక్ష పన్నులు నేరుగా కొద్ది మంది వ్యక్తులు, లేదా సంస్థలు వారి ఆదాయాన్ని, సంపదను బట్టి చెల్లించేవి కాగా, ప్రతి ఒక్కరూ చెల్లించక తప్పని, పైకి కనిపించని నిర్బంధంతో చెల్లించే పన్నులు పరోక్ష పన్నులు. అవి ప్రతి మనిషీ వినియోగించే ప్రతి సరుకు మీద, ప్రతి సేవ మీద వేరు వేరు స్థాయిల్లో విధించే పన్నులు. చిట్టచివరి వినియోగదారు ఆ వస్తువును కొనేటప్పుడు, ఆ సేవను వినియోగించుకుని దాని ధర చెల్లించేటప్పుడు ఆ వినియోగదారుకు తెలిసినా తెలియకపోయినా ఈ పరోక్షపన్ను ఆ ధరలో భాగం అయి ఉంటుంది.

ప్రస్తుతం దేశంలో పరోక్ష పన్నులు ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, సేల్స్ టాక్స్, ఎంటర్ టెయిన్ మెంట్ టాక్స్, ఆక్ట్రాయి వంటి చాల రూపాల్లో ఉన్నాయి. ఎక్సైజ్ డ్యూటీ సాధారణంగా ఉత్పత్తి అయిన వస్తువులు కార్ఖానా దాటి బైటికి వచ్చేటప్పుడు వాటి విలువ మీద నిర్ణీత శాతం పన్నుగా విధించేది. ఉత్పత్తిదారులు దాన్ని కూడ ధరలో కలుపుతారు. కస్టమ్ డ్యూటీ ఎగుమతి, దిగుమతి వస్తువుల మీద విధించే పన్ను. అమ్మకపు పన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వసూలు చేసేవి గాని, అది పన్ను మీద పన్నుగా మారుతున్నదనే కారణంతో దాని స్థానంలో 2005లో విలువ ఆధారిత పన్ను (వాల్యూ ఆడెడ్ టాక్స్) ప్రవేశపెట్టారు. వినోదపు పన్ను రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పరోక్ష పన్ను. ఆక్ట్రాయి స్థానిక సంస్థలు విధించే పన్ను. ఇవి కాక ఎప్పటికప్పుడు సర్ చార్జి, సెస్ పేరుతో అదనంగా విధించే పరోక్ష పన్నులు ఎన్నో ఉంటున్నాయి. మొత్తంగా పరోక్ష పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో రు. 8.63 లక్షల కోట్లు అందాయి. ఇవి రోజురోజుకూ పెరుగుతున్నాయి కూడ.

ఏ వస్తువైనా, సేవ అయినా ఉత్పత్తి అయ్యే చోటు నుంచి చివరి వినియోగదారు దగ్గరికి చేరేసరికి నాలుగైదు మజిలీలు దాటవలసి ఉంటుంది. దీన్ని ఆయా వస్తువుల, సేవల విలువ చక్రం (వాల్యూ చెయిన్) అంటారు. ఈ విలువ చక్రంలో ఉత్పత్తిదారు నుంచి దేశవ్యాపిత లేదా రాష్ట్రవ్యాపిత పంపిణీదారుకు చేరడం మొదటి ప్రయాణం. ఆ పంపిణీదారు ప్రాంతీయ, జిల్లా స్థాయి శాఖకు గాని, బడా టోకు వ్యాపారికి గాని ఆ వస్తువులు పంపుతారు. అది రెండో ప్రయాణం. ఆ శాఖ లేదా బడా టోకు వ్యాపారి అంతకన్న కింది స్థాయిలో ఉండే టోకు వ్యాపారులకు పంపుతారు. అది మూడో ప్రయాణం. సాధారణంగా ఈ టోకు వ్యాపారులు పట్టణ స్థాయిలో, తాలూకా/మండల స్థాయిలో ఉండి తమ పరిధిలో ఉండే చిల్లర వ్యాపారులకు సరుకులు పంపుతారు. ఇది నాలుగో ప్రయాణం. ఆ చిల్లర వ్యాపారుల దగ్గర వినియోగదారులు కొనుక్కుంటారు. అది ఐదో ప్రయాణం. కొన్ని వస్తువులలో ఇంతకన్న ఎక్కువ స్థాయిలు, ప్రయాణాలు ఉండవచ్చు. కొన్ని వస్తువులలో ఒకటి రెండు స్థాయిలు తగ్గవచ్చు కూడ. ఇప్పుడు ఉన్న పన్నుల వ్యవస్థలో ఇన్ని మజిలీలలో ఏ మజిలీలోనైనా పన్ను మీద పన్ను పడే అవకాశం ఉంది. అంటే అంతిమంగా వినియోగదారు వస్తువు ఉత్పత్తి ధర మీద ఒకే పన్ను మాత్రమే కాక, అప్పటికే ముందరి మజిలీలలో చెల్లించిన పన్ను మీద పన్ను కూడ చెల్లించవలసిన పరిస్థితి ఉంది. ఉత్పత్తిదారు కొన్న ముడిసరుకుల మీద పన్ను, ఉత్పత్తి అయిన వస్తువు మీద పన్ను, ఆ వస్తువు రవాణా మీద పన్ను, ఆ వస్తువు నిలువ మీద పన్ను, ఆ వస్తువు అమ్మకం మీద పన్ను అనే పద్ధతిలో పన్నులు ఉన్నట్టయితే పన్ను భారం మితిమీరుతుందని, ఏ వస్తువు మీదనైనా గత మజిలీలో చెల్లించిన పన్నును తీసివేసి, కొత్తగా చేరిన విలువ మీద మాత్రమే పన్ను విధించే పద్ధతి ప్రవేశపెట్టాలని ఒక వాదన సుదీర్ఘకాలంగా ఉంది. అందువల్లనే అమ్మకపు పన్నును తొలగించి, విలువ ఆధారిత పన్ను ప్రవేశపెట్టారు.

అయితే ఇదంతా సైద్ధాంతిక వాదన మాత్రమే. పన్నులు ఎలా ఉన్నప్పటికీ, ఉత్పత్తిదారులే ఉత్పత్తి వ్యయం కన్న చాల ఎక్కువ ధరలు పెట్టడం, మధ్య దళారీలు మితిమీరిన లాభాలు వేసుకోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. పన్నులు ఇబ్బడి ముబ్బడిగా ఉండడం వల్ల వాటిని కూడ చివరి వినియోగదారులే భరించవలసి వస్తున్నది. అందువల్ల వినియోగదారులలో ధరల పెరుగుదల గురించి అసంతృప్తి, వ్యతిరేకత పెద్ద ఎత్తునే ఉన్నాయి. ఈ అసంతృప్తిని చల్లార్చడానికి వ్యాపారస్తులు సాధారణంగా నెపం పన్నుల వ్యవస్థమీదికి నెడుతుంటారు. అలా పన్నుల వ్యవస్థమీద ప్రజల్లో చాల కోపం, అసహనం పేరుకుని ఉన్నాయి. ఈ కోపావేశాలను పునాదిగా వాడుకుని పాలకులు పన్నుల సంస్కరణకు జనామోదం సంపాదిస్తున్నారు. ప్రజల్లో అక్రమధనం మీద, అవినీతి మీద ఉన్న కోపావేశాల పునాదిపై పెద్దనోట్ల రద్దుకు మౌనాంగీకారం సాధించినట్టుగానే ధరల పెరుగుదల మీద అసంతృప్తిని పన్నుల వ్యవస్థమీదికి మళ్లించి, పన్నుల వ్యవస్థ మార్పుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉత్పత్తిదారులు ముడిసరుకులు కొనేటప్పుడు పన్ను చెల్లించి, తయారైన వస్తువు మీద ఎక్సైజ్,  రవాణా, నిలువ, అమ్మకం పన్నులు చెల్లించడం వల్ల వినియోగదారుకు ధరలు పెరుగుతున్నాయని, ఈ పన్నులన్నీ తొలగిస్తే ధరలు తగ్గుతాయని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాగే రాష్ట్రాల పన్నులు తొలగిపోతే అన్ని చోట్లా ఒకే రకమైన తక్కువ ధరలు ఉంటాయని అంటున్నారు. ఇన్ని రకాల పన్నులు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పన్నులు, ఆ పన్నుల మధ్య హెచ్చుతగ్గులు వంటివన్నీ కలిసి చాల గందరగోళాన్ని సృష్టిస్తున్నాయనీ, ఈ అన్ని పన్నులను రద్దు చేసి, వాటి స్థానంలో ఒకే పన్నును ప్రవేశపెట్టడం హేతుబద్ధమైన విధానమనీ అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 17 పరోక్ష పన్నుల స్థానంలో ఒకే పన్నుగా జి ఎస్ టి ఉంటుందని అంటున్నారు.

ఈ పన్నుల విధానంతో సమస్యలు

ప్రస్తుత పన్నుల విధానంతో కొన్ని సమస్యలు ఉన్నమాట నిజమే. వాటిని పరిష్కరించవలసిన, సంస్కరించవలసిన అవసరమూ నిజమే. ఒక వస్తువు విలువ చట్రంలో అనేక చోట్ల పన్నులు ఉండగూడదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పన్నులు ఉంటే రాష్ట్రాల పారిశ్రామికీకరణ మీద, జన జీవితం మీద ప్రభావాలు ఉంటాయి గనుక అది వీలైనంతవరకు తగ్గాలి. పరోక్ష పన్నులు తగ్గి ప్రత్యక్ష పన్నులు పెరగాలి. పన్నులు ఎగవేతకు అవకాశం లేని స్థితి ఉండాలి. పన్ను చెల్లింపుల లెక్కలు, పర్యవేక్షణ, నిఘా వ్యవస్థలు సులభంగా ఉండాలి. మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు సమానంగా పాలనా నిర్వహణా వ్యవస్థ పెరుగుతూ దాని వ్యయానికి తగినట్టుగా పన్నుల ఆదాయం పెరగాలి. ప్రస్తుత పన్నుల విధానంలో ఈ మార్పులు అవసరమైనవి కాగా, కొత్తగా ప్రవేశపెడుతున్న జి ఎస్ టి ఈ సమస్యలను సాకుగా చూపుతున్నది గాని, నిజంగా వాటిని పరిష్కరించబోవడం లేదు.

సమాఖ్యకు తగిన పన్నుల విధానం

అసలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పన్ను ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోకపోతే, దేశమంతా ఒకే రకమైన పన్ను అనే వాదన హేతుబద్ధమైనదనే అనిపిస్తుంది. భారతదేశం ఒక ఉపఖండం. ఇక్కడ వేరు వేరు వాతావరణాలు, వస్త్రధారణలు, ఆహారపుటలవాట్లు, సాంస్కృతిక ఆచారాలు, జాతులు ఉన్నాయి. ఆయా సమాజాలలో మనుషులు వాడే వస్తువులు, సేవలు ఆ భిన్న సంస్కృతిని బట్టి ఉంటాయి. ఉన్ని దుస్తులు వాడకుండా కశ్మీర్ లో మనుగడే కష్టం, ఉన్ని దుస్తుల వాడకం దక్షిణ భారతదేశంలో అవసరమే లేదు. గోధుమ తినే ప్రాంతాలు వేరు, వరి తినే ప్రాంతాలు వేరు. వర్గాల మధ్య మాత్రమే కాదు, ప్రాంతీయ పరిస్థితులను బట్టి కూడ ఒక ప్రాంతంలో అత్యవసరమైన వస్తువు, మరొక ప్రాంతంలో సౌకర్యంగా, మరొక ప్రాంతంలో విలాసంగా కనబడే ప్రత్యేక పరిస్థితి భారతదేశానిది. అటువంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ధర, ఒకే పన్ను అనే పద్ధతి అసహజం మాత్రమే కాదు, అసాధ్యం, అర్ధరహితం. ఒక వస్తువు ఎక్కువ వినియోగంలో ఉన్నచోట, నిత్యజీవితావసరమైతే తక్కువ పన్ను, తక్కువ వినియోగంలో ఉన్నచోట, విలాసంగా ఉన్న చోట ఎక్కువ పన్ను అనేది సహజ న్యాయసూత్రం. అలా దేశంలో విభిన్న జీవన ప్రమాణాలు, పరిస్థితులు ఉన్నందువల్లనే పన్నుల విధానం విభిన్నంగా ఉంది.

అలాగే రాజ్యాంగ రచనలో ఈ జాతుల సమాఖ్య అవగాహన ఉన్నందువల్ల కొంత, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తన వనరులను, అవసరాలను బట్టి ఎటువంటి పన్ను విధానం అవలంబించాలో స్వేచ్ఛ ఇవ్వాలనే ఆలోచన కొంత కలిసి పన్నుల విధానంలో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు రూపొందించడం జరిగింది. తమ ప్రాంతీయ పరిస్థితులను బట్టి ఏ వస్తువుల మీద పన్ను మినహాయింపు ఇవ్వాలో, ఏ వస్తువు మీద ఎంత పన్ను విధించాలో రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలోకి తేవడం జరిగింది. ఇప్పుడు ఆ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని బలవంతంగా తొలగించి దేశమంతటా ఒకే రకమైన పన్నుల విధానం అమలు చేస్తామనడం నిరంకుశత్వమే అవుతుంది.

ప్రపంచీకరణ విధానాల తర్వాత, దేశంలోకి విదేశీ పెట్టుబడులు, వ్యాపారాలు రావడం మొదలయ్యాక, వాటిని ఆకర్షించడానికి కూడ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ తమ పన్నుల విధానాలను, పన్ను రేట్లను మార్చే వైఖరి అవలంబించాయి. ఇది పెట్టుబడి ప్రవేశానికి కొన్ని అవకాశాలు కలిగించినట్టు కనిపించింది గాని వాస్తవంగా ఈ ఎర్రతివాచీ పరిచే పద్ధతి పెట్టుబడి చలనానికి అవరోధాలను కల్పించి, గందరగోళం సృష్టించింది. తమ అవకాశాలు పెరుగుతూ, గందరగోళం తగ్గాలని విదేశీ, స్వదేశీ పెట్టుబడి ప్రస్తుతం కోరుకుంటున్నది.

జి ఎస్ టి గురించి ప్రభుత్వ ప్రకటనలు

జి ఎస్ టి అమలు లోకి వస్తే జాతీయ మార్కెట్ ఏకీకృతమవుతుందనీ, పన్నుల మీద పన్నులు ఉండవనీ, దేశమంతా ఒకే పన్ను ఉంటుందనీ, వ్యాపార లావాదేవీల గురించి ప్రభుత్వానికి సమర్పించవలసిన పత్రాలు తగ్గి, పన్నుల చెల్లింపు సులభతరమవుతుందనీ, పన్నుల వసూళ్లలో సమర్థత పెరుగుతుందనీ, అందువల్ల ఎక్కువ పన్నులు వసూలవుతాయనీ, జాతీయాదాయంలో 2 శాతం పెరుగుదల ఉంటుందనీ, ఒక లక్ష కొత్త ఉద్యోగాలు వస్తాయనీ, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత పన్ను కోల్పోయే మాట నిజమే అయినప్పటికీ ఆ కోల్పోయే పన్ను ఆదాయానికి నష్టపరిహారం చెల్లిస్తామనీ ప్రభుత్వం చాల ప్రకటనలు చేస్తున్నది. కాని ప్రభుత్వ ప్రచారంలో అతి ఎక్కువ భాగం అతిశయోక్తులు, అబద్ధాలు, అర్ధసత్యాలు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా వాస్తవాలను, నిజంగా ఉండగల పర్యవసానాలను తొక్కిపెట్టి, మరుగుపరచి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నది.

జి ఎస్ టి అమలయ్యే పద్ధతి

జి ఎస్ టి గురించి ప్రభుత్వం చెపుతున్న అబద్ధాలను విశ్లేషించుకోబోయే ముందు, 2017 జూలై 1 నుంచి జి ఎస్ టి ఎలా అమలవుతుందో చూడాలి. ఇప్పటికే జి ఎస్ టి కౌన్సిల్ అనే ఒక దేశస్థాయి విధాన నిర్ణాయక సంస్థ 2016 సెప్టెంబర్ లో ఏర్పాటయింది. కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ జి ఎస్ టి కౌన్సిల్ గత పది నెలల్లో పదిహేను సార్లు సమావేశమై ఏయే వస్తు, సేవల మీద ఎంత శాతం పన్ను విధించాలో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంది. జూన్ 3న జరిగిన పదిహేనో సమావేశంలో 1211 వస్తువుల మీద, సేవల మీద ఎంతెంత శాతం పన్ను విధించాలో నిర్ధారించింది.

జి ఎస్ టి కౌన్సిల్ నిర్ణయించిన ప్రకారం, వార్షికాదాయం రు. 20 లక్షలు, ఆ పైన ఉండే వ్యాపార, సేవా సంస్థలన్నీ కూడ జి ఎస్ టి చెల్లింపుదార్లుగా నమోదు చేసుకోవాలి. ఈశాన్యరాష్ట్రాలకు మాత్రం ఈ వార్షికాదాయ పరిమితి రు. 10 లక్షలుగా నిర్ణయించారు. అలాగే ఆన్ లైన్ లావాదేవీలు నడిపే సంస్థలన్నీ కూడ తమ ఆదాయంతో నిమిత్తం లేకుండా జి ఎస్ టి నమోదు చేయించుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఆదాయం పొందుతున్న ప్రతి వ్యక్తీ ఆ ఆదాయపు పరిమాణంతో సంబంధం లేకుండా జి ఎస్ టి నమోదు చేయించుకోవాలి.

అయితే ఈ జి ఎస్ టి కౌన్సిల్ గురించి గుర్తించవలసిన విషయమేమంటే, దీనిలో ఏ నిర్ణయమైనా జరిగేందుకు సమావేశంలో పాల్గొన్నవారిలో నాలుగింట మూడు వంతుల (75 శాతం) మంది ఆమోదించాలి. ఆ కౌన్సిల్ లోని 29 రాష్ట్రాల ప్రతినిధుల వోట్ల విలువ 67. కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్న ఇద్దరు మంత్రుల వోట్ల విలువ 33. అంటే కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఏ ప్రతిపాదన కూడ నెగ్గే అవకాశం లేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే మాట మీద నిలబడినా వారి వోట్లు 75 శాతం కావు గనుక వారి మాట నెగ్గదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రభావంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలను కలిపి ఎప్పుడైనా తన మాట చెల్లించుకోవచ్చు. మరో మాటల్లో చెప్పాలంటే రాష్ట్రాలకు ఏ అధికారమూ లేకుండా చేసి కేంద్రమే అన్ని అధికారాలనూ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ జి ఎస్ టి కౌన్సిల్ ఒక ప్రధాన సాధనంగా ఉంటుంది.

ప్రభుత్వం చెపుతున్న అబద్ధాలు

ఒకవైపు ఇంత అక్రమంగా జి ఎస్ టి కౌన్సిల్ ను ఏర్పాటు చేసి, జి ఎస్ టి అమలు చేయడానికి శరవేగంగా ముందుకు కదులుతున్న ప్రభుత్వం మరొకవైపు జి ఎస్ టికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి చెపుతున్న మాటలన్నీ అబద్ధాలే.

దేశమంతా ఒకే పన్ను అని చెపుతున్నప్పటికీ వాస్తవంగా మూడు రకాల పన్నులు ఉండబోతున్నాయి. ఆ మూడు రకాల పన్నుల మధ్య గందరగోళాన్ని ఇప్పటివరకూ పరిష్కరించలేదు. అంతేకాదు, వస్తువుల మీద, సేవల మీద ఆరు స్థాయిల పన్నులు ఉండబోతున్నాయి. కొన్ని వస్తువులు, సేవలు పన్ను నుంచి మినహాయింపు (0 శాతం పన్ను) పొందగా, మరికొన్ని వస్తువులు, సేవల మీద 3 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్నులు ఉండబోతున్నాయి. అంతేగాక, ప్రభుత్వాలకు బంగారు గుడ్లుపెట్టే బాతు వంటి పెట్రోలియం ఉత్పత్తులను, మద్యాన్ని అసలు జి ఎస్ టి పరిధి నుంచే మినహాయించారు. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న, వినియోగించక తప్పని పెట్రోల్, డీజిల్, ఎల్ ఎన్ జి, సి ఎన్ జి వంటి పెట్రోలియం ఉత్పత్తుల మీద పాత పన్నుల విధానమే కొనసాగితే జి ఎస్ టి విప్లవాత్మకమైనదనడంలో అర్థం లేదు. అలాగే ప్రభుత్వాల ఎక్సైజ్ ఆదాయానికి పెద్ద వనరు అయిన మద్యాన్ని జి ఎస్ టి పరిధి నుంచి మినహాయించడం పాలకులు చెపుతున్న జిఎస్ టి ఘనతను తామే అపహాస్యం చేసుకుంటున్నారనడానికి సూచన. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే విధించి ఉన్న సెస్సు (అదనపు పన్ను) లను కూడ జి ఎస్ టి నుంచి మినహాయించారు. అంటే పేరుకు జి ఎస్ టి గరిష్టంగా 28 శాతం అన్నప్పటికీ, సెస్సులు కలిసి మొత్తం పన్నులు 43 శాతం దాకా చేరే అవకాశం ఉంది. ఈ మినహాయింపులు, చేర్పులు అన్నీ చూస్తే జి ఎస్ టి పట్ల ఏకాభిప్రాయం కూడగట్టడానికి, ప్రజలను భ్రమల్లో ముంచడానికి ప్రభుత్వం లేని గొప్పలు చెపుతున్నది గాని, స్వయంగా దానికే జి ఎస్ టి సాధించే ప్రయోజనాల మీద నమ్మకం లేదని అర్థమవుతుంది.

అలాగే పన్ను చెల్లింపు పద్ధతులు, పన్ను లెక్కలకు సంబంధించిన పత్రాల సమర్పణ విషయంలో కూడ జి ఎస్ టి ప్రభుత్వం చెపుతున్నంత విప్లవకరంగా, వినూత్నంగా, ప్రయోజనకరంగా ఉండబోవడం లేదు. ఇప్పుడు వేరువేరు రకాల పన్నులు వేరువేరు స్థాయిల్లో చెల్లిస్తున్న ఉత్పత్తిదారులు, అమ్మకందారులు, వివిధ సేవలు అందించే వృత్తి నిపుణులు అందరూ కూడ ఇకనుంచి తమ జి ఎస్ టి చెల్లింపును ఆన్ లైన్ లో మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటయిన జి ఎస్ టి నెట్ వర్క్ అనే వ్యవస్థ డాటాబేస్ ను నిర్వహిస్తుంది, సేవలు అందిస్తుంది. అంటే ఇక ప్రతి ఒక్క వ్యాపార సంస్థ తప్పనిసరిగా కంప్యూటర్ నిపుణుల సహాయం తీసుకోవాలి.

పన్ను చెల్లింపుదారులు తాము చెల్లించవలసిన పన్ను లెక్కలు వివరించే, చివరికి ఎంత పన్ను చెల్లించాలో నిర్ధారించే పత్రాలను రిటర్న్స్ అంటారు. ఇప్పటివరకూ ప్రతి పన్ను చెల్లింపుదారూ ఏడాదికి ఒకసారి రిటర్న్స్ ఆదాయ పన్ను శాఖకో, వాణిజ్య పన్నుల శాఖకో సమర్పించవలసి ఉండేది. జి ఎస్ టి అమలులోకి వచ్చాక ప్రతి పన్ను చెల్లింపుదారూ ప్రతి నెలా మూడు సార్లు (10వ తేదీ, 15వ తేదీ, 20వ తేదీ) ఆన్ లైన్ రిటర్న్స్ సమర్పించాలి. అవి కాక ఒక వార్షిక రిటర్న్ సమర్పించాలి. అంటే ఒక రాష్ట్ర పరిధిలోపలే లావాదేవీలు నడిపే చెల్లింపుదారు సంవత్సరానికి ముప్పై ఏడు రిటర్న్స్ సమర్పించాలి. ఒకవేళ ఆ పన్ను చెల్లింపుదారు ఇతర రాష్ట్రాలతో కూడ సంబంధంలో ఉన్నట్టయితే కేంద్ర జి ఎస్ టి రిటర్న్స్, అంతర్రాష్ట్ర జి ఎస్ టి రిటర్న్స్ కూడ సమర్పించాలి. ఏ లెక్కా భౌతిక రూపంలో, పత్రాలలో ఉంచుకోనక్కరలేదు. కాగితపు లెడ్జర్లు, ఖాతా పుస్తకాలు అవసరం లేదు. ఇవన్నీ కూడ ఆన్ లైన్ లోనే, డిజిటల్ రూపంలోనే ఉండాలి. ఒక్క రిటర్న్ బదులు ముప్పై ఏడు రిటర్న్స్ సమర్పించవలసి రావడం సరళీకరించడం ఎలా అవుతుందో పాలకులకే తెలియాలి.

ఇక జి ఎస్ టి వల్ల ధరలు తగ్గుతాయనేది ప్రజలను మాయచేసే మరొక పెద్ద అబద్ధం. వస్తువుల, సేవల ధరలు కేవలం పన్నుల విధానం వల్ల మాత్రమే పెరగడం లేదు. ఉత్పత్తిదారుల, మధ్య దళారీల లాభాపేక్ష, ఉత్పత్తి వ్యయానికన్న ఎంతో ఎక్కువ ధర నిర్ణయించడం, సుదీర్ఘమైన విలువ చట్రాలు, ధరల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం లేకపోవడం, ఉన్నా పనిచేయకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ధరల పెరుగుదల జరుగుతున్నది. ఆ కారణాలలో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించకుండా, పన్నుల విధానాన్ని మార్చడం ధరల సమస్యను పరిష్కరించదు.

జిఎస్ టి వల్ల ఒక లక్ష ఉద్యోగాలు వస్తాయనేదీ, జాతీయాదాయం 2 శాతం పెరుగుతుందనేదీ ఏ ఆధారమూ, ఏ తార్కిక వాదనా లేని పచ్చి అబద్ధాలు. నిజానికి ఈ విధానం వల్ల చిన్న వ్యాపారస్తులు ఎందరో వ్యాపారం నుంచి తోసివేయబడతారు గనుక ఉన్న ఉద్యోగాలే ఊడిపోతాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పన్నుల శాఖల పని చాలవరకు తగ్గిపోతుంది గనుక ఆ ఉద్యోగులందరినీ తొలగించడమో, ఇతర ఉద్యోగాల్లో సర్దడమో చేయవలసి వస్తుంది. కొత్త ఉద్యోగాలు రావడం కల్ల. జాతీయాదాయం పెరుగుతుందనే అంచనాకు కూడ ఎటువంటి ఆధారమూ లేదు. అలా పన్నుల విధానంలో ఈ మాత్రం మార్పు చేస్తే జాతీయాదాయం రెండు శాతం పెరిగే అవకాశమే ఉంటే సంక్షోభంలో ఉన్న ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడ ఈ పరిష్కారం వైపు చూసి ఉండేవే. పైగా ఈ రెండు శాతం పెరుగుదల అనే అబద్ధాన్ని జి ఎస్ టి కౌన్సిల్ పన్ను రేట్లు నిర్ణయించడానికి చాల ముందునుంచే ఊదర కొడుతున్నారు. పన్ను రేటు 5 శాతం ఉండబోతుందా, 28 శాతం ఉండబోతుందా తెలియకుండానే, దాని ఫలితంగా జాతీయాదాయం 2 శాతం పెరుగుతుందని ప్రభుత్వ అధికారిక ఆర్థికవేత్తలు చేసిన ప్రగల్భాల ఊహాగానాలు అదిగో పులి అంటే ఇదిగో తోక అనడమే.

రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే పన్ను ఆదాయానికి నష్టపరిహారం ఇస్తామని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నది గాని ఆ నష్ట పరిహారాన్ని ఐదు సంవత్సరాలకు కుదించింది. దేశ చరిత్రలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో, నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలు చూస్తే ఈ హామీ కూడ అనుమానాన్ని మిగులుస్తుంది.

జి ఎస్ టి ప్రతిపాదనల చరిత్ర

ఇంతకూ ఈ కొత్త పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రపంచీకరణ ఆర్థిక విధానాలలో భాగంగా మొదలయ్యాయి. దేశమంతా ఒకే మార్కెట్ గా మార్చదలచిన బహుళజాతిసంస్థల, దళారీ పెట్టుబడిదారుల కోరికల్లో పన్నుల విధానాన్ని మార్చడం ఒక ముఖ్య అంశం. అందువల్లనే 1990లలోనే అమ్మకపు పన్ను నుంచి విలువ ఆధారిత పన్నుకు మారడానికి ప్రయత్నాలు మొదలై, 2005లో ముగిశాయి. పరోక్షపన్నుల పద్ధతిలో సంస్కరణలు సూచించడానికి పాత ఎన్ డి ఎ ప్రభుత్వం నియమించిన కేల్కర్ టాస్క్ ఫోర్స్ 2003లో ఇచ్చిన నివేదికలో ఇన్నిరకాల పరోక్ష పన్నులను రద్దు చేసి విలువ ఆధారిత పన్ను (ఏ మజిలీలో ఎంత విలువ సమకూరిందో ఆ విలువ మీద మాత్రమే పన్ను) వేసే సమగ్ర జి ఎస్ టి రూపొందించాలని సూచించింది. యుపిఎ పాలనలో 2006-07 బడ్జెట్ లో 2010 ఏప్రిల్ నాటికి జాతీయ స్థాయి జి ఎస్ టి ప్రవేశపెట్టాలని అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రతిపాదించాడు. ఆ కొత్త పన్ను నమూనాను, దాని మార్గదర్శక సూత్రాలను రూపొందించడానికి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. అ కమిటీ 2009 నవంబర్ లో తన తొలి చర్చా పత్రాన్ని విడుదల చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలు కోరింది. పన్నుల విధింపులో, వసూళ్లలో రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడ అధికారం ఇచ్చింది గనుక రాజ్యాంగ సవరణ బిల్లును 2011 మార్చ్ లో లోకసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును పరిశీలన కోసం ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘానికి పంపించారు.

మరొకపక్క కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఉన్నతాధికార సంఘం నిర్ణయం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జి ఎస్ టి నమూనా రూపొందించడానికి ఒక కమిటీని 2012 నవంబర్ లో నియమించారు. ఆ కమిటీ తన నివేదికను 2013 జనవరిలో సమర్పించగా, రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం నిర్ణయించింది. జి ఎస్ టి గురించి మరింత వివరమైన అధ్యయనం జరిపి, ఆచరణయోగ్యమైన సూచనలు చేసేందుకు మరో మూడు అధికారుల కమిటీలను నియమించారు. ఈలోగా పార్లమెంటు స్థాయీ సంఘం తన మార్పులు, చేర్పుల సూచనలతో 2013 ఆగస్టులో నివేదిక సమర్పించగా రాజ్యాంగ సవరణ బిల్లు కొత్త ముసాయిదా తయారయింది. ఆ బిల్లు ముసాయిదా మీద కూడ ఎన్నో చర్చలు జరిగి, మార్పులు చేర్పులు జరుగుతూ 2015 మే వరకూ ఆ బిల్లుకు తుది మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. చివరికి ఆ బిల్లు 2015 మే 6న లోకసభలో ఆమోదం పొందింది. కాని రాజ్యసభలో ఆ బిల్లుకు ఆటంకాలు వచ్చాయి. అక్కడ కూడ ఒక పరిశీలనా బృందాన్ని నియమించగా అది 2015 జూలై 22న తన నివేదిక ఇచ్చింది. చివరికి 2016 ఆగస్ట్ 3న ఆ బిల్లు రాజ్యసభలో కూడ ఆమోదం పొందింది. అలా రాజ్యాంగ సవరణ జరిగి, పన్ను విధింపు మీద రాష్ట్రాల హక్కు తొలగించిన తర్వాత కేంద్ర జి ఎస్ టి, సమీకృత జిఎస్ టి, కేంద్రపాలిత ప్రాంతాల జి ఎస్ టి, కొత్త పన్ను వల్ల రాష్ట్రాలకు జరిగే నష్టానికి పరిహారం అనే నాలుగు బిల్లులను 2017 ఏప్రిల్ 5న లోకసభ ఆమోదించడంతో జిఎస్ టి చట్టబద్ధంగా మారింది. ఈలోగా ఏర్పడిన జిఎస్ టి కౌన్సిల్ పది నెలల్లో పదిహేనుసార్లు సమావేశం కావలసి వచ్చింది. ఇవన్నీ ముగిసి జూలై 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ ప్రకటించింది.

ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠా తగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు ఈ గందరగోళానికి కారణం. ఈ వ్యవహారంలో ప్రజా ప్రయోజనాలు అనేవేమీ లేవని, కేవలం భారత మార్కెట్ ను పంచుకోవడానికి, మార్కెట్ నుంచి రాగల లాభాలను పంచుకోవడానికి బహుళ జాతి సంస్థలు, వారి దళారీలు ఆడుకున్న బేరసారాల వల్లనే, ఎత్తులు పై ఎత్తుల వల్లనే ఈ రచ్చ అంతా జరిగింది.

భారత పాలకుల అసలు ప్రయోజనాలు

జి ఎస్ టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారులను, వ్యాపారులను దెబ్బతీసి సువిశాల మార్కెట్ మీద గుత్తాదిపత్యం సంపాదించుకోవడానికీ ఉవ్విళ్లూరుతున్న బహుళ జాతి సంస్థలకు, వారి దళారులకు మేలు చేకూర్చేటందుకే జి ఎస్ టి అమలులోకి వస్తున్నది. వారి ఆర్థిక ప్రయోజనాలూ, సంఘ్ పరివార్ సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలూ కలిసి మార్కెట్ ఏకీకరణ – ఒకే జాతి, ఒకే పన్ను అనే లక్ష్యాలు తీర్చడానికే జి ఎస్ టి.

రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న అధికారాలన్నిటినీ తొక్కివేసి, కేవలం కేంద్ర ప్రభుత్వపు బొటనవేలి కింద పనిచేసేలా, కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలకు లొంగిపోయేలా చేయడానికి జి ఎస్ టి ఉపయోగపడుతుంది. ఇరవై తొమ్మిది రాష్ట్రాల అధినేతలతో బేరసారాలు జరిపి, ఒక్కొక్కరినీ సంతృప్తి పరిచే బదులు ఒకే గుత్తాధిపత్య కేంద్ర ప్రభుత్వ అధినేతలను తమ గుప్పిట్లో పెట్టుకోవడం సులభమని బహుళ జాతి సంస్థలు చేసిన దురాలోచన ఫలితమే జి ఎస్ టి. దేశపు వైవిధ్యాన్ని, ఆయా రాష్ట్రాల వనరులను, అవసరాలను బట్టి తన ప్రత్యేక పన్నుల విధానాన్ని రూపొందించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకుండా దేశపు సమాఖ్య స్వభావాన్ని దెబ్బ తీస్తుంది జి ఎస్ టి. కొత్త పన్నుల విధానపు భారంతో, ప్రత్యేకించి ప్రతి అంశమూ ఆన్ లైన్, కంప్యూటర్ పరిజ్ఞానంతో చేయవలసి రావడంతో దేశవ్యాప్తంగా లక్షలాది చిన్న ఉత్పత్తిదారులు, చిన్న వర్తకులు చితికిపోయి, కేవలం బహుళ జాతి సంస్థల, దళారీల ఉత్పత్తులు, వ్యాపార శాఖలే దేశమంతా రాజ్యం చేసే పరిస్థితి తీసుకురావడానికే జి ఎస్ టి. పన్నుల భారం తగ్గుతుందనీ, కొన్ని వస్తువులు చౌకగా మారుతాయనీ ప్రభుత్వం చెపుతున్నవి పచ్చి అబద్ధాలని గతంలో ఎన్నో బడ్జెట్లలో పన్నులు తగ్గినప్పుడు ప్రజలు గుర్తించారు. పన్నులు తగ్గినప్పటికీ, తగ్గిన పన్నుల లాభాన్ని ఉత్పత్తిదారులు, వ్యాపారులు పంచుకున్నారు గాని ప్రజలకు బదిలీ చేయలేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే బీడీలు, వస్త్రాలు, స్త్రీలకు అత్యవసరమైన సానిటరీ నాప్ కిన్స్ వంటి సరుకుల మీద, ఎన్నో అత్యవసరమైన సేవల మీద 18 శాతం, 28 శాతం గరిష్ట పన్నులు విధిస్తున్న కొత్త పన్నుల విధానం బంగారం వంటి విలాస సరుకుల మీద అతి తక్కువగా 3 శాతం పన్ను విధించింది. అంటే పన్నుల విధింపులో ఎంత మాత్రం హేతుబద్ధత లేని, ప్రజా ప్రయోజనాల దృష్టి లేని పన్నుల విధానం ఇది. సరిగ్గా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లాగనే సామ్రాజ్యవాద యజమానులకు జీ హుజూర్ జో హుకుం అని తీసుకున్న నిర్ణయమే తప్ప ఇది మరేమీ కాదు. సరిగ్గా పెద్ద నోట్ల రద్దు లాగనే దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవనాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే చర్య ఇది. (Cartoon Courtesy – Zunar )

………………………………………………………………..

Disclaimer:  The opinions expressed within this article are the personal opinions of the author. The facts and opinions appearing in the article do not reflect the views of Ruralmedia and  Ruralmedia does not assume any responsibility or liability for the same.

…………………………………………………………………………

 

Share.

Leave A Reply