సినిమా అంతా లేత ప్రాయపు ప్రేమ

Google+ Pinterest LinkedIn Tumblr +


” గంటు మూటే ” కన్నడ సినిమా గురించి…
జీవితం ఎన్నో ఎత్తుపల్లాలను చూపిస్తుంది. మంచికో చెడుకో కొంత మంది మనుషులని మన జీవితాల్లోకి అనుమతించి కొన్ని బరువులని మన భుజాల మీద నించి దించింతే.. కొన్ని బరువులని హృదయం మీద బలవంతంగా మోపి దించుకోలేనంత దుఃఖాన్ని మర్చిపోలేనంత బాధనీ మిగులుస్తుంది.

అపురూపమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మనం బ్రతికేస్తాం. కొద్ధి మంది బతికేయడానికి జ్ఞాపకాలుంటే చాలు. అలా ఒకమ్మాయి తన యవ్వనంలోకి అడుగుపెట్టే రోజుల్లో స్కూల్ వయసులో ఒక అబ్బాయితో ప్రేమలో పడితే ..ఆ ప్రేమ తనని ఎలా హత్తుకుందీ..??.. ఎలా వదిలేసిందీ ?? అనే కథా అంశంతో తీసిన సినిమా.. ” గంటు మూటే ” ..

డిగ్రీ ముగించిన అమ్మాయి.. పరీక్ష ఫలితాలని కూడా పట్టించుకోకుండా .. స్నేహితులతో కలవకుండా ఒక్కత్తే ట్రెక్కింగ్ కి బయలుదేరుతుంది. కొండ చివర వరకు వెళ్లి.. అక్కడి ప్రశాంతతని శ్వాసిస్తూ తనకి నిశ్శబ్దం ఎంత ఇష్టమో చెబుతూ తన గతంలోకి మనల్ని తీసుకెళుతుంది.

ఈ సినిమా కథ పాతదే కదా అని అనిపించినా.. చెప్పిన విధానం వల్ల ప్రేక్షకుడు కథతో పాటు సీరియస్ గా ప్రయాణం అవుతాడు..

8వ తరగతి చదివే వయసులో ప్రేమ ఏంటి అనిపించొచ్చు..
అమ్మాయిని ప్రేమించడం వల్లే మగవాళ్ళ జీవితాలు అక్కడే ఆగిపోతున్నాయా అని అనుమానం రావచ్చు.
జీవితంలో చదువు ఎంత ముఖ్యం ఫెయిల్యూర్ అనే భయాన్ని పిల్లల్లో ఎంత మోపుతున్నారూ ..విద్యార్థుల ఆత్మహత్యలకు వాళ్ళ చదువు చేస్తున్న చేటు మార్కులు మోపుతున్న భారం.. ఇలా ఎన్నయినా ఆ సినిమా చూసి డిస్కషన్ చేయొచ్చు.

****
ప్రేమ ఏ వయసులో అయినా పుట్టొచ్చు.. ప్రేమకి ఈ వయసే సరైంది అని ఏ వయసు పరిమితుల్లేవు. అలాంటి పరిమితులకు లొంగకుండా వృద్ధాప్యం వరకు ప్రేమ నాజూగ్గానే ఉంటుంది ..

ప్రేమ ప్రేమగానే ఉంటే బాగుంటుంది.కానీ అది మన సమయాన్ని ఆక్రమిస్తుంది..దానికంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరుకుంటుంది. ఒక గుర్తింపు ఆకర్షణ కావాలనుకుంటుంది.అదే సమయంలో వర్తమానంలో జరిగే ఎన్నో సంఘటనలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అదే బాధ్యత వహిస్తుంది.

***
ఆత్మహత్యలు చేసుకోటానికి ఎంతో ధైర్యం కావాలి అంటారు. అలా ఎంతో ధైర్యం వచ్చినప్పుడే నిరాశావాడంతో కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా బ్రతికే శక్తి ఉందని నేర్చుకుని తగ్గొచ్చు కదా..

ఆత్మ హత్య చేసుకునేప్పుడు మనుషులు చాలా ముఖ్యమైన విషయం మర్చిపోతారు…వాళ్ళతో రోజు తిరిగే వ్యక్తులు కావచ్చును.. లేదా వాళ్ళ కుటుంబసభ్యులు కావచ్చు.. ఇలా ఆత్మన్యూనతకి గురవ్వద్దు అని ఎవరికి వాళ్లే చెప్పుకోవచ్చు కదా..

జీవితాంతం మర్చిపోలేని ఒక గుదిబండ గుండెమీద మోపి వాళ్ళు వెళ్ళిపోతే మోసే వ్యక్తికి ఎంత కష్టoగా ఉంటుందో ఆలోచించండి. ఈ సినిమా ఆ విషయాన్ని బాగా డిస్కస్ చేస్తుంది.

***
ఇది రూప రావ్ అనే దర్శకురాలు తీసింది. సినిమా అంత లేత ప్రాయపు ప్రేమ నిజాయితీ చెడకుండా చాలా సహజంగా ఉండేట్టు తీశారు. నటీ నటులు ముఖ్యానంగా మీరా పాత్ర నటించిన అమ్మాయి చాలా బాగా నటించారు.

సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది చూడండి.
……..
మెర్సీ మార్గరెట్
13.1.2020

Share.

Leave A Reply