రాజస్తాన్‌ కి స్ఫూర్తి, ఈ తెలంగాణ పల్లె

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకప్పుడు అక్కడ బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడక్కడ పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యమంత్రి జల స్వావలంబన్‌ పథకం, ఆ రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది. అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే, 13 జిల్లాల్లో వానాకాలంలో తప్ప కనిపించని పచ్చదనం నేడు కనువిందుచేస్తోంది. వాలు ప్రాంతాల్లోని భూముల్లో, చతుర్విధ జలప్రక్రియ చేపట్టి వాన నీటిని అక్కడి ప్రజలు ఒడిసిపడుతున్నారు. ప్రకతి వైపరీత్యాలకు ప్రకతి నుంచే పరిష్కారం వెతుక్కోవచ్చని ఎడారి నేల రాజస్తాన్‌కి నేర్పింది తెలంగాణలోని ఒక మారు మూల పల్లె గొడిగార్‌పల్లి. పదండి ఆ గ్రామంలో ఏం జరిగిందో చూద్దాం… 
తెలంగాణ,కర్నాటక సరిహద్దుల్లోని ఆ ఊర్లోకి ప్రవేశించక ముందే, పొలిమేరల్లోనే నేలంతా అడుగు ఖాళీ లేకుండా ఆకుపచ్చని చీరలు ఆరబెట్టినట్లు ఉంటుంది. ఊరి కూడలి దగ్గరున్న గుడి ట్యాంక్‌లో నీళ్లు పొంగి పొర్లి చిన్నకాలువై పారుతుంటాయి. 
‘ మా తాతల కాలంలో చేతికి అందేలా బాయిలో నీరుండేది. చెంబులు, బిందెలతో నీటిని తోడుకునేటోళ్లం, బకెట్లతో, ఇంటికి తీసుకెళ్లేటోళ్లం… మల్లా ఆ రోజలు ఇంతకాలానికి తిరిగి వచ్చినయి …’ అని మాతో సంతోషంగా అన్నారు, గొడిగార్‌పల్లి రైతులు. 
నాలుగు సూత్రాలు… మూడు పంటలు 
రెండువేల గడపలున్న ఈ గ్రామం సంగారెడ్డి జిల్లా ,కోహీర్‌ మండలంలో ఉంది. సాగు భూమి 1200 ఎకరాలు. ఒకపుడు అక్కడ వర్షం కురిస్తేనే పంట,లేకుంటే వలసలే… నేడు జల సంరక్షణలో ఈ గ్రామం జాతీయ గుర్తింపు పొందడం వెనుక ప్రజల ఐకమత్యం ఉంది. 2002 లో అప్పటి నీటిపారుదలశాఖ ఛీఫ్‌ ఇంజినీర్‌, ఐక్యరాజ్యసమితి సలహాదారు, టి.హన్మంతరావు గ్రామస్తుల భాగస్వామ్యంతో, చేపట్టిన చతుర్విధ జలప్రక్రియ వల్ల ఈ రోజు నీటి ఎద్దడిని తప్పించుకుంది. నాలుగు రకాల జల ప్రక్రియ అంటే, 1) వర్షపునీరు 2) ఉపరితల నీరు 3) భూగర్భ నీరు 4) భూమి తేమ అనే వాటిని ఎలా వినియోగించుకోవాలో చెప్పే శాస్త్రీయ పద్ధతి. ఆ క్రమంలో ప్రజలంతా నేల తాకిన వర్షపు బొట్టును అక్కడే ఇంకేలా, పరిగెత్తే నీటికి నడక నేర్పి, నడిచే నీటిని నిల్వ చేసి, నిల్వ ఉన్న నీటిని భూమిలో ఇంకింప చేశారు. 
వర్షం పడినపుడు వాలుకు పోయే నీటిని ఒడిసి పట్టడానికి చిన్న చిన్న గుంతలు, కందకాలు తీశారు. అవసరమైన చోట గట్లు కట్టారు. నీరు ఇంకేలా ఊట గుంతలు నిర్మించారు. నీరు ఎక్కువగా నిల్వ ఉండేలా, పంటకుంటలు నిర్మించారు. 
బియ్యం ఇచ్చి పనులు చేయించారు… 
‘ మా పొలాల్లో టెంట్‌లు వేసి, అక్కడే హన్మంతరావు మాతో ఉంటూ మాతో మట్టికట్టల పనులు చేయించారు. కొంత పని అయ్యాక డబ్బులు సరిపోక పోతే, ఆనాటి కలెక్టర్‌ లారీల్లో బియ్యం తెచ్చి కూలీగా ఇచ్చి పనులు పూర్తి చేయించిండ్రు, ఇట్ల 5 ఏండ్లు అందరం పనులు చేసినవం. 2500 ఎకరాలకు కేవలం రూ. 30 లక్షల ఖర్చుతో నీరందించాం. ప్రస్తుతం ఈ గ్రామంలోని 350 పైగా ఉన్న బోర్లలో నీరు పుష్కలంగా ఉన్నయి. ఏడాదికి మూడు పంటలు పండుతున్నయి… ‘ అన్నారు గ్రామ సర్పంచ్‌ అనసూయమ్మ. 
ఈ గ్రామం కర్నాటక సరిహద్దుల్లో ఎగువన ఉండటం వల్ల కురిసిన వానంతా కర్నాటక వైపు జారిపోయేది. ప్రజలు చేపట్టిన జలప్రక్రియతో వాననీరు ఊరి పొలిమేరలు దాటకుండా ఆపి, భూమిలో తేమను పెంచారు. 
మట్టికట్లలతో మస్తునీళ్లు 
ఇరవై ఏండ్ల క్రితం ఇక్కడ భూగర్భ జలాలు 38 లీటర్ల లోతుకు పడిపోయినయి, ఈ సమస్య పరిష్కారానికి హన్మంతరావు సారు చెప్పిన ప్రకారం పొలాల్లో 150 మట్టికట్టలు కట్టినం ఇక్కో మట్టికట్ట 50 మీటర్ల పొడవు, 10 మీటర్ల లోతులో ఉండేలా గుంతలు తీసి, వాన నీటిని ఇంకింప చేసినం. వానలు లేనపుడు బోర్ల సాయంతో సాగు చేసేటోళ్లం. మాకు దగ్గరలోనే, పెద్ద చెరువు ఉన్నది కానీ, వానలు లేక చెరవు డెడ్‌ స్టోరీజీకి చేరింది. అయినప్పటికీ భూగర్బ జలాలు సమృద్ధిగా ఉండటంతో పంటలకు ఇబ్బంది లేదు. ” ఏపుగా పెరిగిన జొన్న పొలాలను చూపిస్తూ, చెప్పాడు ఆయకట్టు ఛైర్మన్‌ ఎల్లారెడ్డి. 
సమీప గ్రామాలైన బెడంపేట, శేకాపూర్‌, పర్సవెల్లి, మల్కాపూర్‌లలో ఎండాకాలం మాత్రమే కాదు వర్షాకాలంలో కూడా నీటి కోసం జనం కటకటలాడుతున్నారు, కాని గొట్టిగారి పల్లె ప్రజల ముందు చూపు వల్ల ఆ ప్రమాదం నుండి బయట పడ్డారు. 

Checkdam @Rajastan


రాజస్తాన్‌ కి స్ఫూర్తి… 
” నీటి సంరక్షణ కోసం రాజస్తాన్‌ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి జల స్వావలంబన పథకం’ ఏర్పాటు చేసి, తెలంగాణలోని గోడిగార్‌ పల్లిలోని చతుర్విధ జల ప్రక్రియను స్టడీ చేయమన్నారు. 2010లో ఇక్కడి జలసంరక్షణ పద్దతులు తెలుసుకొని, దానికి ఆధునిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి, మొదటి దశలో 3,529 గ్రామాల్లో జల సంరక్షణ పనులు పూర్తి చేశాం. నీటి నిల్వ గుంతలను శాస్త్రీయంగా తవ్వి, కందకాలను తీశాం. వీటికి చుట్టుపక్కల చెట్లు నాటాం. దిగువ ప్రాంతాల్లో చెక్‌డ్యాములు, నీటి కుంటలను తవ్వించాం. ఫలితంగా కరవు ఎక్కువగా ఉండే, బాన్సువార, ఝూలవాడ జిల్లాల్లో సైతం పది అడుగుల లోతులో నీరు ఉబికి వస్తోంది. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 250 ప్రాంతాల్లో 150 ప్రదేశాల్లో భూగర్భ జలాలు పెరిగాయి.” అని రాజస్తాన్‌ రివర్‌ బేసిన్‌ అథారిటీ’లో ఇంజనీర్‌గా పనిచేసిన వాసు పాలగుమ్మి అన్నారు. 
రాష్ట్రమంతటా చాలా చోట్ల నీళ్లు లేక పంటలు ఎండి పోతుంటే ఇక్కడ మూడు పంటలు పండిస్తున్నారు. రెండో పంటగా వెయ్యి ఎకరాలు సాగవుతోంది. అల్లం, చెరుకు, పసుపు, వంటి వాణిజ్య పంటలు, సోయ, మొక్కజొన్న, ఆలుగడ్డ, కాయగూరలు సాగుచేస్తున్నారు. ఇక్కడి అల్లం కు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఒకపుడు సైకిలు మీద తిరిగిన రైతులు నేడు బైకులు,కార్లు, ట్రాక్టర్లు మెయిన్‌టైన్‌ చేస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. నలుగురు నడిచే దారిలో నడవకుండా, నాలుగు సూత్రాలు పాటించిన ఈ ఊరు జల నిపుణులకు ఒక కేస్‌స్టడీగా మారింది. 
భారీ ప్రాజెక్టుల పేరుతో కోట్లు ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు సాగు నీరందించే గొప్ప ప్రయోగం గోడిగారిపల్లి అని అధ్యయనాలంటున్నాయి. 
……………. 
శ్యాంమోహన్‌ (9440595858) 

Share.

Leave A Reply