అక్కడ చెట్లు శిలలుగా ఎందుకు మారాయి?

Google+ Pinterest LinkedIn Tumblr +

( ప్రముఖ రచయిత,కవి వాడ్రేవు చిన వీరభద్రుడు ఇటీవల అత్యంత ప్రాచీన మైన నేల మీద కోట్ల సంవత్సరాల నాటి వృక్షాలను చూసి,స్పందించి తన ఫేస్‌బుక్‌ లో ఇలా రాశారు)

విలుప్పురం జిల్లాలో విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకి పరిశీలకుడిగా వచ్చి వారం రోజులయ్యింది. కొత్త ప్రాంతం, కొత్త బాధ్యత. కాని, నేనొక అత్యంత ప్రాచీనమైన భూమిమీద తిరుగాడుతున్నానని నాకు తెలియడానికి ఆట్టే సేపు పట్టలేదు. సాంప్రదాయికంగా తమిళ భూగోళాన్ని ఏడు నాడులుగా విభజించారు. ఉత్తర తమిళదేశం తొండనాడు. దక్షిణ తమిళదేశం పాండ్యనాడు, ఉత్తరచోళనాడు, కావేరికి దక్షిణంగా దక్షిణచోళనాడు, పశ్చిమంగానూ, నైరుతిదిశగానూ ఉండేది కొంగునాడు, కేరళప్రాంతం చేరనాడు, శ్రీలంక ప్రాంతం ఈలనాడు, పడమటి సముద్రతీరం తుళువనాడు. ఇందులో తొండనాడుకీ, పాండ్యనాడుకీ మధ్యగా ఉండేది నడునాడు. విలుప్పురం నడునాడుకి చెందిన ప్రాంతం. ఒకప్పుడు దక్షిణ ఆర్కాటుగా పిలవబడే పూర్వపు కడలూరుజిల్లానుండి 1993 లో కొత్త జిల్లాగా విడివడ్డాక కూడా తమిలనాడులోని అతి పెద్దజిల్లాగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ జిల్లాని కూడా రెండుగా విభజించబోతున్నారు. తమిళ శైవాన్ని మేల్కొల్పిన ముగ్గురు నాయన్మారుల్లోనూ ఇద్దరు, అప్పర్, సుందరర్ విలుప్పురానికి దగ్గరలోనే పుట్టి పెరిగారు. మూడవవారైన తిరుజ్ఞాన సంబంధర్ కడలూరుకి దక్షిణంగా, చిదంబరానికి సమీపంలో నాగపట్టణం జిల్లాలోని శీర్ కాళిలో జన్మించారు. విలుప్పురానికి ఉత్తరంగా ఉన్న తిరువణ్ణామలై లో అరుణగిరినాథులు, మాణిక్యవాచకర్ సంచరించి కవిత్వం చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతమంతా శివవిభూతి మయంగా గోచరిస్తోంది.

ఎక్కడ అడుగుపెట్టినా ఒక శివాలయమో, పెరుమాళ్ కోవెలనో కనిపిస్తుంది. అక్కడ ఒకరో, ఇద్దరో, ముగ్గురో నాయన్మారులో, ఆళ్వారులో సంచరించి, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఒకటో, రెండో, మూడో పదికాలో, పాశురాలో చెప్పి ఉంటారు. ఆ గోడల మీద ఏదో ఒక పదికాన్ని రాతిలోనో, పాలరాతిలోనో చెక్కి ఉంటారు. శిలాక్షరాలుగా కవిత్వం నిలిచిపోయిన నేలమీద తిరుగాడుతున్న నాకు మరొక శిలాక్షరసముదాయం కనిపించింది.

సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ స్టేషన్లు తనిఖీ చేస్తూ నిన్న దాదాపుగా పాండిచ్చేరి సరిహద్దుల్లో ఉన్న ‘తిరువక్కరై’ అనే ఊరు చేరాను. అక్కడ కూడా ఒక ప్రాచీన శివాలయం, ఒక దుర్గాలయం ఉన్నాయి.

ఆ ఊరు పొలిమేరల్లో ఒక అద్భుతం చూసాను.

అక్కడ ఇప్పటికి రెండుకోట్ల సంవత్సరాల కిందట (అవును, మీరు సరిగానే చదువుతున్నారు, రెండుకోట్ల సంవత్సరాలే) నదీ ప్రవాహాల్లో, వరదల్లో పైనుంచి ఎక్కడినుంచో కొట్టుకొచ్చిన వృక్షాలు శిలలుగా మారిపోయిన దృశ్యం కనిపించింది. పెద్ద పెద్ద చెట్ల కాండాలు, ఒక్కొక్కటీ దాదాపు తొమ్మిదడుగుల నుంచి నలభై అయిదు అడుగుల కైవారం కలిగినవి, ఏళ్ళ తరబడి ఆ మట్టిలో కప్పడిపోయి, శైలీకరణ చెంది, గండశిలలుగా మారిపోయాయి. భూగర్భ శాస్త్రంలో petrification అని పిలిచే ఒక ప్రక్రియలో, ఆ చెట్లలోని, జీవపదార్థం నెమ్మదిగా ఖనిజపదార్థంగా మారిపోయింది. కాని, వాటి ఆకృతి చెక్కు చెదరలేదు. చూడటానికి, అవి అప్పుడే నరికి, అడితీ లో పోగేసిన పెద్ద పెద్ద కొయ్య దుంగల్లాగా ఉన్నాయి.

1781 లో యూరోప్ కి చెందిన ఒక ప్రకృతి శాస్త్రజ్ఞుడు మొదటిసారి వాటిని చూసి తక్కిన ప్రపంచానికి పరిచయం చేసాడట. ఇప్పుడు ఆ ప్రాతమంతా, దాదాపు వంద హెక్టార్ల మేరకు ఆ శిలాజాలు విస్తరించి ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఒకచోట చేర్చి నేషనల్ ఫాసిల్ వుడ్ పార్క్ గా భద్రపరిచారు. తిరువక్కరైలో ఉన్న ఆ శిలోద్యానవనంలో అటువంటి శిలావృక్షాలు దాదాపుగా రెండువందలదాకా ఉన్నాయి. పెద్ద పెద్ద రంపాలతో కోసినట్టు కనిపిస్తున్న ఆ శైల వృక్షాకృతుల్లో దశాబ్దాలూ, శతాబ్దాలూ కాదు, సహస్రాబ్దాలు వలయాలు వలయాలుగా కనిపిస్తున్నాయి,

ఆ పార్కు కి కొంత దూరంలో దిగువగా ఒక నది ఉందంటే అక్కడికి కూడా వెళ్ళాను. శంకరాభరణిగా పిలిచే ఆ నదిలో నీళ్ళు లేవుగాని, శిలలుగా మారుతున్న దారుశకలాలు పడి ఉన్నాయి. ఒక శకలాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను. ఒక కపాలాన్ని తన చేతుల్లోకి తీసుకున్న హేమ్లెట్ కి కూడా ఆ క్షణం నాకు కలిగిన స్పందనలాంటిది కలిగి ఉండదు. ఆ శకలంలో రెండువందల లక్షల ఏళ్ళ కిందటి ఆ తరుకాండం దాదాపుగా శిలగా మారిపోయి కనిపిస్తున్నది. దాదాపుగా మట్టిగా మారిపోయిన ఆ చెట్టు బెరడులో సిలికాన్ శిలగా పొరలు పొరలుగా గడ్డకట్టిపోయి కనిపిస్తున్నది. భూమికి మాత్రమే అనుభవం కాగల అద్భుతం అది. కాని, ఒక మానవుడిగా, నాకు మరింత అద్భుతంగా గోచరించిన విషయం, ఆ శిలాశకలంలో, ఇంకా పూర్తి శిలగా మారిపోకుండా, మట్టిపెళ్ళలుగా కనిపిస్తున్న ఒకప్పటి చెట్టు ఆనవాళ్ళు. జీవపదార్థం ఎంత బలమైనదో నాకు ఆ క్షణాన మెరుపులాగా సాక్షాత్కరించింది.

2,00,00,000 సంవత్సరాల తర్వాత కూడా, ఆ చెట్టులో ఒక భాగం ఇంకా రాయిగా మారడానికి పూర్తిగా సిద్ధపడటం లేదు. రాయిగా గడ్డకట్టిపొవడానికి ముందు మరి కొన్ని శతాబ్దాల పాటు మట్టిగానే మనుగడ సాగించాలనుకుంటున్నది.

vadrevu.ch,veerabhadrudu, At National Fossil Wood Park, Tiruvakkarai

కానీ, ఆదిమానవులకి తెలుసు, శిలలు కూడా సజీవాలేనని. కాలక్రమంలో ఘనీభవించిన ప్రాణపదార్థాలేనని. అవి కూడా ఎన్నో కోట్ల ఏళ్ళముందటి చెట్లే. ఇంతకీ చెట్టంటే ఏమిటి? మట్టికీ, సూర్యుడికీ మధ్య నడిచిన సంభాషణనే కదా. వర్షమూ, వరదా అంటే ఏమిటి? సముద్రానికీ, సూర్యుడికీ మధ్య సాగిన సంభాషణనే కదా. అక్కడ చెట్లు శిలలుగా మారిపోయాయంటే ఏమిటి? సూర్యుడనే నాయనారు నేరుగా చెట్లకాండాల మీద రాసిన కవిత్వం శిలాక్షరంగా మిగిలిపోయిందనే కదా.

నాకు అప్రయత్నంగా రూమీ గుర్తొచ్చాడు. ఆయన కవిత్వంలో జగత్ప్రసిద్ధాలైన ఈ పంక్తులు గుర్తొచ్చాయి:

నేనొక ఖనిజంగా మరణించి ఒక వృక్షంగా మొలకెత్తాను
ఒక వృక్షంగా మరణించి ఒక జంతువుగా ప్రభవించాను
ఒక జంతువుగా మరణించి, ఒక మనిషిగా తలెత్తాను
ఇంక నేనెందుకు భయపడాలి? మృత్యువు నన్నేమి చేస్తుంది?

నేడొ, రేపో నేను మనిషిగా కూడా మరణిస్తాను
అప్పుడు దేవదూతలతో కలిసి పయనిస్తాను
ఇక ఆ దివ్యాత్మని కూడా త్యజించగలిగానా,
నేనొక అవాజ్మానసలోకం చేరుకుంటాను. (Report/Pics By/Vadrevu CH Veerabhadrudu/FaceBook)

Share.

Leave A Reply