ఫుడ్ ప్రాసెసింగ్ హబ్’ గా నవ్యాంధ్ర

Google+ Pinterest LinkedIn Tumblr +

ఫుడ్ ప్రాసెసింగ్ హబ్’ గా నవ్యాంధ్ర

  • ఉపాధి కల్పన
  • పేదరిక నిర్మూలన
  • పేదల ఇంట్లో పండ్లు
  • రోడ్ల పక్కన నీడ

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను విస్తరించడానికి చర్యలు ప్రారంభించింది. ఇవి మూడు రకాలుగా ఉండబోతున్నాయి. మొదటిది-  ఇంటిగ్రేటేడ్ పుడ్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నది. వీటిని ఒక్కొక్కటి 30 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. వీటిలో కనీసం 10 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి. ప్రాజక్టు వ్యయం 20 కోట్లు పరిమితితో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం వీటికి గ్రాంట్ గా ఇస్తున్నది.

రెండవది- ఇంటిగ్రేటెడ్ కన్టేయినర్ డీపోలు, ఇవి తొలుత కాకినాడ, చిత్తూరులో మొదలవుతున్నాయి. కాకినాడ పోర్టును ఇందుకు సంబంధించిన ఎగుమతులకు  వినియోగించుకోనున్నారు.

మూడవది- కోకోనట్ బోర్డ్ తరహాలో రాష్ట్రంలో బనానా బోర్డు, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలనేది మరొక ప్రతిపాదన. ఇంకా ఇందుకు సంబంధించిన ఇతర రాయతీలు ఇలావున్నాయి. ఆహార ఉత్పత్తులను రవాణా చేసే కన్టేయినర్ల కొనుగోలుకు పది లక్షల పరిమితికి లోబడి 50% సబ్సిడీ ఇస్తున్నారు. ఏడాదికి 5 లక్షలు మించకుండా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెని ఉత్పత్తి మొదలయిన ఏడాది నుంచి, 3 ఏళ్ళ కాలపరిమితికి లోబడి అది రవాణా చేసే ఆహార ఉత్పత్తుల (పెరిషబుల్) రవాణా చార్జీల ఖర్చులో 30% తిరిగి చెల్లించడం జరుగుతుంది.

ఇటువంటి ఆకర్షణీయమైన రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో, 4 వేల కోట్ల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి బహుళ జాతి కంపెనీలు ఈ నెల 3 వ తేదీన ధిల్లీ లో జరిగిన ‘వరల్డ్ పుడ్ ఇండియా’ సదస్సులో ముఖ్య మంత్రి  చంద్ర బాబు నాయుడు సమక్షంలో ఎం.ఒ.యు. లు చేసుకున్నాయి. వీటిలో యునైటెడ్ అరబ్ ఏమిరిటాస్ కు చెందిన షరాఫ్ గ్రూప్ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంభందించిన లాజిస్టిక్ సదుపాయాల కల్పనకు 2 వేల కోట్లు పెట్టుబడితో ముందుకొచ్చింది. ఇంకా హల్దీ రామ్, జనని, కేవెంటార్, బిగ్ బాస్కెట్ వంటి  కంపెనీలు ఈ జాబితాలో వున్నాయి.

ఇందుకు అవసరమైన ముడి ఆహార ఉత్పత్తుల నిరంతర సరఫరా మీద కూడా ప్రభుత్వం సమాంతరంగా ద్రుష్టి పెట్టింది.

రాష్ట్రంలో మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ వ్యవసాయం సాంప్రదాయ సాగుబడి స్థానంలోకి రావాలంటూ నిపుణులు చెబుతున్న నేపధ్యంలో- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రామీణ అభివృద్ధి శాఖలు; ఉపాధి హామీ, పేదరిక నిర్మూలన వంటి పధకాలలో అందుకు అనుగుణమయిన మార్పులు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గత ఇరవై ఏళ్లుగా డ్వాక్రా గ్రూపుల కోసం క్రియాశీలంగా పనిచేస్తున్న ’సెర్ప్’ కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పధకం (ఎం.జి.ఎన్.ఆర్.జి.యస్) తో అనుసంధానం చేసిన పండ్ల తోటల పెంపకం అందుకు చక్కని ఉదాహరణ అవుతుంది. 2016-17 సంవత్సరానికి 50 వేల ఎకరాల్లో పండ్లతోటల పెంపకం లక్ష్యంగా మొదలైన ఈ పధకం, 2017-18 ఆర్ధిక సంవత్సరానికి లక్ష ఎకరాలు లక్ష్యంగా అమలు చేస్తున్నారు. ఈ నవంబర్ 15 నాటికి 49,739  మంది రైతులు 53,187.74 ఎకరాల్లో మొక్కలలు నాటడం పూర్తిచేసి ఇందుకు సంబంధించిన మొదటి దశ లక్ష్యాన్ని పూర్తి చేసారు. తూర్పు గోదావరి- 99.93% శ్రీకాకుళం-99.54% పశ్చమ గోదావరి-99% పూర్తిచేసి మొదటి 3 స్థానాల్లో వుండగా ఒక్క చిత్తూరు (67.63%) మినహా అన్ని జిల్లాలు 90% పైబడిన లక్ష్యాలను సాధించాయి.

horticultre-narsipatnam-ruralmedia

horticultre-narsipatnam-ruralmedia

ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన యస్.సి, యస్.టి మరియు సన్న, చిన్నకారు రైతులు కనీసం అర ఎకరం నుంఛి గరిష్టంగా 5 ఎకరాల మెట్ట లేదా మాగాణి అయితే 2.5 ఎకరాలు వరకు ఉంటే ఈ పండ్ల తోటలు పెంపకం చేపట్టవచ్చు. పేద, నిరుపేద కుటుంబాలలో స్థిరమైన ఆదాయ మార్గాలను మరియు జీవనోపాధులను ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యము. యస్.సి, యస్.టి మరియు సన్న, చిన్నకారు రైతులను లబ్దిదారులుగా ఎంపిక చేసి వారి పొలంలో పండ్ల తోటలు చేపట్టడం మరియు 3 సంవత్సరాల పాటు ఇన్ పుట్స్ సహాయం, మొక్కల పరిరక్షణ కాపలా (వాచ్ అండ్ వార్డ్) కొరకు వేతనం ఇచ్చి వారు దీర్ఘకాలిక ఆస్తులను పొందే విధంగా చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యము.

    ఈ పధకం కాలవ్యవధి 3 సంవత్సరాలు. ఈ మూడు  సంవత్సరాల పాటు రైతుకు ఇన్ పుట్స్ సహాయం అందుతుంది., పంట రకాన్ని బట్టి మరియు నాటిన మొక్కలలో కనీసం 75% పైబడి బ్రతికి ఉన్న మొక్కలకు ఒక ఎకరానికి మూడు సంవత్సరాల పాటు సుమారు గా రూ.56000/- నుండి రూ.1,43,000/- వరకు చెల్లింపులు చేయబడతాయి. పంట దిగుబడి మొదలయ్యాక ఆ పంట  ఫల ఆదాయం పూర్తిగా లబ్దిదారునిదే.

ఇక ఎటువంటి భూమి లేని చిన్న సంఘాలలో వున్న నిరుపేద సభ్య్లులకోసం రోడ్ల మార్జిన్లలో ‘ఎవేన్యు ప్లాంటేషన్’ చేపట్టడం జరిగింది.

avenue plantation-at vijayanagaram

avenue plantation-at vijayanagaram

ఈ ఏడాది నవంబర్ 15 నాటికి 9,853.68 కి.మీ. పొడవున 39,41,473 మొక్కలు నాటడం పూర్తియింది. అయితే దీనికి కూడా పండ్ల తోటల పెంపకం తరహాలోనే లబ్దిదారునికి ప్రయోజనం కల్పిస్తున్నారు. వీటిలో ప్రధానంగా ఎస్.సి. ఎస్.ఎస్టి. సభ్యులు ఉంటున్నారు. వీరిని ‘వృక్ష సేవక్‘ అంటున్నారు. వీరునాటే మొక్కలలో కూడా నీడ ను ఇచ్చే మొక్కలతో పాటు మామిడి, చింత, నేరేడు, బాదం వంటివి ఉంటున్నాయి. కాపు మొదలయ్యాక ఫలసాయం మీద పూర్తి హక్కులు వీరికే వుంటాయి. ఈ మేరకు వీరికి చెట్టు పట్టా ఇస్తున్నారు. ‘వృక్ష సేవక్’ గా నియమించిన ఇద్దరు నిరుపేద చిన్న సంఘం సభ్యురాళ్ళు కు ఒక్కొక్కరికి 200 మొక్కల చొప్పున కేటాయిస్తున్నారు. వీరు మొక్కలకు నీరు మరియు సహజ ఎరువులు అందిస్తూవాటిని సంరక్షించాలి. ఇందుకు -మొదటి సంవత్సరానికి సుమారుగా రూ. 54,064/- రెండవ సంవత్సరానికి రూ. 40,704/- మూడసంవత్సరానికి సుమారుగా రూ. 40,704/- మొత్తంగా మూడు సంవత్సరాలకు గాను సుమారుగా రూ. 1, 35,472/-లభిస్తుంది. ఇక పండ్ల తోటల రైతులు వర్మీకంపోస్ట్నుఎరువులు మాత్రమే వాడాలి. వీరికి రసాయన ఎరువులకు ఎటువంటి సహాయం అందించబడదు. ఈ ఎరువులు ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. మొదటి సంవత్సరం మొత్తం మొక్కలలో 20 శాతం చనిపోయిన మొక్కల స్థానంలో మరల మొక్కలు నాటుకోవచ్చు.

’సెర్ప్’ చేపట్టిన ఈ రెండు పధకాల వల్ల సమాంతరంగా- రాష్ట్రంలో జరుగుతున్న ఈ పుడ్ ప్రాసెసింగ్ రంగ పారిశ్రామీకరణ, ఎగుమతులతో పాటుగా ఉపాధి కల్పన, అదనపు హరిత విస్తీర్ణం వల్ల పర్యావరణ పరిరక్షణ, సన్న, చిన్నకారు రైతులు నిరు పేదల కుటుంబాల్లో ఆరోగ్యకరమైన ఆహారం అందడానికి అవకాశం కలుగుతున్నది.

 

                            

Share.

Leave A Reply