కొండకి కాపలా కాస్తున్న సైనికుడిలా… ఆ వెదురు కుటీరం

Google+ Pinterest LinkedIn Tumblr +

అరణ్య స్పర్శ 2:

మారేడిమిల్లి – రంపచోడవరం మెయిన్ రోడ్డు మీదనే రెండెకరాల విస్తీర్ణంలో కొండ మొదట్లో చెట్ల మధ్య శ్యాం గారు నిర్మించిన ఆ వెదురు కుటీరం కళాత్మకంగా, కవితాత్మకంగా వుంది. నిజానికి ఆయన ప్రణాళికకి అనుగుణంగా అదింకా పూర్తి కాలేదు. కర్రలమీద నుండి పైకెక్కితే ఒక హాలు, రెండు బెడ్రూములతో ప్రస్తుతానికి ఒక పదిమంది వుండే విధంగా తయారు చేసారు. కొండకి ఏటవాలుగా కట్టినందువల్ల రూముల్లో జారుతున్న ఫీలింగ్ కలిగింది. అంతా వెదురు సామాగ్రి. కింద ప్రత్యేకంగా కట్టిన వాష్ రూంస్ లో తప్ప ఎక్కడా మరో ఇనుము, ప్లాస్టిక్ వినియోగం లేదు. అత్యంత సహజ సిద్ధ వాతావరణంలో ఆ వెదురు కుటీరం కొండకి కాపలా కాస్తున్న సైనికుడిలా దర్జాగా కనబడింది. శ్యాం గారి అభిరుచికి ఫిదా అవకుండా వుండలేం. ఆయన ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి కట్టుకున్న వెదురింటికి కేర్ టెకర్ గా టూరిజం, ట్రెక్కింగ్, అడవి వంటకాల ప్రత్యేక నిపుణుడు, కొండరెడ్డి గిరిజనుడు అమర్నాధ రెడ్డిని నియమించుకున్నారు. ఆ ఆవరణలోని పచ్చని చెట్ల మధ్య ఒక ఎండిపోయిన చెట్టు కూడా వుంది. మిగతా పచ్చని చెట్లన్నీ కలిసి ఆ చెట్టుకి రక్షణనిస్తూన్నట్లుగా వుంది.

భోజనం అనంతరం ఒక ఆటోలో రంపచోడవరం బైలుదేరాం. మధ్యదారిలో గోదావరి బేసిన్లోని భూపతిపాలెం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ డాం చూసాం. చాలా అందంగా వుంది. దీన్నే సీతపల్లివాగు అని అంటారు. నిండైన నీటి మధ్యలో ఎండిన చెట్లు ఓ వైవిధ్య సుందర దృశ్యం. రంపచోడవరం నుండి కొండ మీదకి మా ట్రెక్కింగ్ మొదలైంది. మా గైడ్ గా వచ్చిన బాపిరాజు అనే 17 ఏళ్ళ కొండకాపులకి చెందిన అడవిబిడ్డ మేం ఎంత దూరం పైకి ఎక్కినా కూడా “ఇంకెంతండీ! ఒక కిలోమీటరే, అర కిలోమీటరే” అనంటూండే వాడు. ఒకసారైతే “ఇంకో అర కిలోమీటరే” అన్న తరువాత కూడా కొద్దిసేపాగి అడిగితే “ఇంకెంతండీ ఉంకో కిలోమీటరే” అనేవాడు. బహుశ ఈ ఆదివాసులకి దూరం అనేది అసలు సమస్య కాదేమో అనిపించింది. దూరాలు, భారాలు మనలాగా మోటారు బళ్ళకి అలవాటు పడ్డ వాళ్ళకే కానె తమ జీవనంలో రాయీ రప్ప, డొంక వంక, చెట్టూ చేమల్ని భాగంగా చేసుకున్న గిరిపుత్రులకి కాదేమో అనిపించింది. కొన్నిసార్లు కొండ ఎక్కటం కష్టంగా అనిపించింది. “మీరు ఫిట్ గా వుంటేనే ఈ ట్రెక్కింగ్ పెట్టుకోండి.” అని శ్యాం గారు ఎందుకన్నారో అర్ధమైంది. మాతో లైట్ వెయిట్ మొబైల్ టెంట్స్, నూనె, పప్పు, ఉప్పు, బియ్యంతో కూడిన వంట పదార్ధాలు, టెట్రా పాలపాకెట్లు వున్నాయి. అంత బరువునీ బాపిరాజు సులువుగా మోసేస్తున్నాడు. అక్కడొకటి గమనించాను. గిరిజనులెవ్వరూ ఊబకాయంతో లేరు. అందరూ సన్నగా, ఆరోగ్యంగా వున్నారు.

వెళుతున్న దారిలో ప్రకృతి అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నది. కాలుష్యానికి దూరంగా నీరు, గాలి, చెట్టూ, రాయి…అన్నీ ఒక్కో చోట ఒక్కో రకంగా ఒక గొప్ప సౌందర్యంతో తళుక్కుమన్నాయి. అడవిలోని నిశ్శబ్దంలో కూడా ఒక అద్భుతమైన శ్రావ్యత వుంది. అలసటగానూ అనిపిస్తున్నప్పటికీ ఒక తాదాత్మ్యంతో ముందుకెళుతున్నాం. ఒక్కోసారి మనిషంత ఎత్తు రాళ్ళని ఒకరికొకరం చేతులు పట్టుకొని పైకెక్కాం. సగం దూరం వరకు కొండ పైనుండి పారుతున్న జలధార సవ్వడి వింటూ దాని పక్కనే ట్రెక్కింగ్ సాగించాం. కొండల పైనుండు ఓ అజ్ఞాత ప్రాంతం నుండి ఉబికి వస్తూ జరజరా పాకుతూ కిందకి జారిపోతున్న ఈ జలధార పక్కనుండే మేము కొండ పైకి ఎక్కాము. నీరు కిందకి జారుతుంటే మేం కొండ పైకి ప్రవహించాం. అంత ఛలిలోనూ మాకు చెమట్లు పట్టాయి. మధ్యలో కొంత మైదానంగా వున్న చోట వరి, పసుపు పంటలు కనిపించాయి. అదో మనోహర దృశ్యం. మధ్యలో చింత చెట్ల మీదకి రాళ్ళేస్తూ చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు, సన్నటి కాలిబాటలు, పొలం గట్ట్ల మీద నడుస్తూ, మళ్ళీ కొండెక్కుతూ అలా ఏకధాటిగా సుమారు మూడు గంటల తరువాత “పెదకొండ” అనే కొండరెడ్ల గ్రామానికి చేరుకున్నాం.
– Aranya Krishna

Share.

Leave A Reply