ఆమె శిల్పాలు… ఆన్‌లైన్‌లో హాట్‌కేక్స్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

గర్భవతిగా ఉన్న ఆమెను భర్త వద్దనుకున్నాడు… 
బీఈడీ చేసినా టీచరయ్యే అవకాశం ఆమెకు రాలేదు. అయినా కుంగిపోలేదు. తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంది. మహిళలు అరుదుగా ఎంచుకునే శిల్పకళను నేర్చుకుంది. చంటిబిడ్డను చూసుకుంటూనే కళలో పట్టుసాధించింది. ఫేస్‌ బుక్‌ ద్వారా ఆర్డర్లు సంపాదించి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన రాయలసీమ మహిళ కథ ఇది. ఆత్మవిశ్వాసం అనే ఉలితో తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకుంటున్న భువనేశ్వరిని కలుసుకుందాం రండి…
ఆళ్ళగడ్డ గ్రామం శిల్పులకు ప్రసిద్ధి. దేశం నలుమూలలా ఎక్కడ శిల్పాలు అవసరమైనా ఈ గ్రామం వైపే చూస్తారు. ఇక్కడ ఈ కళలో పురుషులదే ఆధిపత్యం. కళలన్నింటిలో కఠినమైన శిల్పకళను జీవనోపాధిగా ఎంచుకునే మహిళలు చాలా అరుదు. ఒకవేళ ఎంచుకున్నా , అందులో రాణించటం అంత తేలికైన విషయంకాదు. అయితే కర్నూలుజిల్లా, ఆళ్ళగడ్డకు చెందిన భువనేశ్వరి శిల్పకళనే బతుకు తెరువుగా మార్చుకొని, రాళ్లను దేవతామూర్తులుగా, వినూత్నమైన కళారూపాలుగా, జాతీయనాయకుల విగ్రహాలను మలుస్తున్నారు. ఆమె చేతిలో రూపుదిద్దుకుంటున్న గహాలంకరణ వస్తువులు, దేవతా ప్రతిమలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.
భర్తకు దూరంగా, కళకు దగ్గరగా 

 Bhuvaneswari/ Female sculpture artist

Bhuvaneswari/ Female sculpture artist

భువనేశ్వరి ఊహించని విధంగా ఈ వత్తిలో అడుగుపెట్టింది. డిగ్రీ చదివి బీఈడి పూర్తిచేసిన భువనేశ్వరికి అమె తల్లిదండ్రులు… అందరిలాగే వివాహం చేశారు. అయితే కొద్దిరోజులకే కాపురంలో కలహాలు మెదలయి, గర్భవతిగా పుట్టింటికి వచ్చిన ఆమెను భర్త వద్దనుకున్నాడు. కాపురానికి తీసుకెళ్లకపోవటంతో భువనేశ్వరి తల్లిదండ్రులవద్దే ఉండాల్సివచ్చింది.
తండ్రే గురువు …. 
అమ్మానాన్నలకు భారం కాకుండా సొంతగా తన కాళ్లపై నిలబడాలనుకుంది భువనేశ్వరి. టీచరైతే బాగుంటుందని ప్రసవం తరువాత అనేక ప్రయత్నాలు చేసింది. అవకాశం రాలేదు. టీచర్‌ కాలేకపోయానని కుంగిపోకుండా వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళను వత్తిగా ఎంచుకుంది. అప్పటివరకు ఉలిపట్టని అమె తండ్రిదగ్గర విగ్రహాలు చెక్కటం నేర్చుకుంది. చంటిబిడ్డను చూసుకుంటూనే శిల్పకళలో పట్టుసాధించింది.
సోషల్‌మీడియాలో మార్కెట్‌ అవకాశాలు 
శిల్పాలను తయారు చేయటం ఓ ఎత్తైతే వాటిని అమ్ముకోవటం మరోఎత్తు. శిల్పులందరు ఎదుర్కొంటున్న మార్కెటింగ్‌ సమస్యలను గమనించిన భువన వినూత్నంగా ఆలోచించింది. ఫేస్‌ బుక్‌ వంటి సోషల్‌మీడియాను మార్కెటింగ్‌కి ఎంచుకుంది. తాను రూపొందిస్తున్న విగ్రహాల ఫోటోలను ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేస్తూ ఒక పేజీని క్రియేట్‌ చేసింది. ప్రారంభంలో అంత స్పందన లేనప్పటికి రానురాను మంచి ఆదరణ లమెుదటి సంపాదనభించింది. ప్రస్తుతం దేశ, విదేశాలనుంచి ఆర్డర్లు వస్తున్నాయి. జీవితానికి సుస్ధిరత ఏర్పడింది.

bhuvaneswari3

bhuvaneswari

మెుదటి సంపాదన 
నేను తయారు చేసిన కొన్ని విగ్రహాలు , గృహాలంకరణ వస్తువుల ఫోటోలు ఫేస్ బుక్  లో  పోస్ట్ చేసేదాన్ని . వాటిని చూసిన ఓ విదేశీ వనిత ఫేస్ బుక్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆరడుగుల బుద్దుడి విగ్రహం , రెండు నీటితొట్లు , ఓ డైనింగ్ టేబుల్ సెట్ ఆర్డర్ ఇచ్చారు. అదే నాకు వచ్చిన మెుదటి ఆర్డరు . అదే నా మెుదటి సంపాదన కూడా . కొన్ని నెలల తరువాత ఇండియా వచ్చిన ఆ విదేశీ వనిత .. నన్ను కలిసేందుకు స్వయంగా మా ఇంటికే వచ్చారు. జీవితంలో ఇదో మరిచిపోలేని తీపి జ్ఞాపకం. ” అంటారు భువనేశ్వరి. ఓవైపు శిల్పకళతో తీరికలేకుండా ఉన్న భువనేశ్వరి మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకూ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. అందుకోసం వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమౌతోంది. భవిష్యత్తులో తాను ఏ హోదాలో ఉన్నా.. శిల్పకళను మాత్రం వదిలనంటోంది. ఈ రంగంలో మరింతగా ఎదిగి తన కుమారుడికి బంగారు భవిష్యత్తు నందించడమే తన లక్ష్యమని చెబుతోంది భువనేశ్వరి.

”’ నైపుణ్యంతో పాటు,శారీరక శ్రమతో ముడిపడి ఉన్న ఈ కళలో మగాళ్లు మాత్రమే రాణిస్తారు. ఇలాంటి కళలో మా కూతురు సాధిస్తున్న విజయాలు ఆనందం కలిగిస్తున్నాయి. భర్త తోడు లేక పోయినా నిరాశపడకుండా కళే జీవితంగా, అంతులేని ఆత్మవిశ్వాసంతో మాకు భారం కాకుండా తన జీవితాన్ని తానే అద్బుతమైన శిల్పంలా… తీర్చిదిద్దుకుంటోంది. ఆమె ప్రతిభకు విదేశీ ఆర్డర్ల తోపాటు, ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి.” అంటారు ఆమెతండ్రి ఆచారి.
– డి. ఎల్‌. నరసింహ , ( 9494235732 )

Share.

Leave A Reply