పందిరి.. మనిషికి నీడనిస్తుంది, పెండ్లికి కళ ఇస్తుంది, మొక్కకు ఊతమిస్తుంది. ‘ పందిరి పంట’ రైతుకు లాభమూ ఇస్తుంది. కరీంనగర్ జిల్లాలోని ఓ రెండు గ్రామాల మహిళలు పందిరి సేద్యంతో జీవితాల్ని బాగు చేసుకున్నారు. ఆదాయాన్ని పెంచుకున్నారు. సేంద్రియ మార్గాన్ని ఎంచుకోవడంతో మట్టికి బలం వచ్చింది. మట్టి బలపడితే, పంట బలపడినట్టే, పంట బలపడితే రైతు బలపడినట్టే! అప్పులు చేయాల్సిన అవసరం లేకుండానే.. కూతురు పెండ్లికో కొడుకు పెండ్లికో ఇంటి ముందర పందిరి వేసుకోవచ్చు.
సుందరగిరి గ్రామంలో, సమ్మవ్వకు మూడు ఎకరాల పొలం ఉంది. భూగర్భజలాలు పుష్కలం. అయినా వరి జోలికి వెళ్లకుండా కూరగాయలు పండిస్తున్నది. దానికి కారణం ఉంది. సమ్మవ్వకు మట్టి మీద ప్రేమ. భూసారం దెబ్బతింటుందన్న భయం. కానీ, అంతంతమాత్రం రాబడితో ఎంతకాలమని ఎవుసం చేస్తుంది. ఆ సమయంలో నిపుణుల సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది. జనవికాస్ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహంతో పందిరి సేద్యం వైపు అడుగులు వేసింది. ‘మేం గతంలో కాకర పంటను నేల మీద సాగుచేసేవాళ్లం. ఎకరాకు ఆరు టన్నుల కాయలు మాత్రమే వచ్చేవి. పందిరి సాగు గురించి జనవికాస్ చెప్పడంతో ధైర్యం చేశాం. నాబార్డ్ (జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు)పందిర్లు వేసుకోవడానికి సాయం చేసింది. దీనివల్ల పది నుంచి పదిహేను టన్నుల వరకు దిగుబడి పెరిగింది. బీర, టమాటా కూడా పండిస్తున్నాం. ఆదాయం పెరగడంతో మాతో పాటు నలుగురు కూలీలకూ పని దొరికింది’ అంటారామె. ఇది సమ్మవ్వ అనుభవమే కాదు, ఆ గ్రామంలో మహిళా రైతులు మాట కూడా.
వర్షాధార సేద్యంలో ఎప్పుడూ ఓ సమస్య ఉంటుంది. సకాలంలో వానలు రాకపోతే, రైతుల కష్టానికి తగిన ఫలితం ఉండదు. అప్పుల పాలు అవుతాడు. ఈ నేపథ్యంలో ఒక చిన్న ఆలోచనతో నూతన సాగుపద్ధతుల ద్వారా మెరుగైన దిగుబడులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు కరీంనగర్ జిల్లాలో కొందరు మహిళా రైతులు. చిగురుమామిడి మండలంలోని గ్రామాలు… సుందరగిరి, బొల్లోనిపల్లి . ఇక్కడ వర్షపాతం తక్కువ. తీవ్రమైన నీటి ఎద్దడి. పరిష్కారంగా జనవికాస్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నాబార్, ‘ఫార్మ్‌సెక్టార్ ప్రమోషన్ ఫండ్’ పథకాన్ని అమలు చేసింది. ఈ రెండు గ్రామాల్లో 50 మంది రైతులను ఎంపిక చేసి, ఆధునిక పద్ధతిలో పందిరి కూరగాయల సాగుతో శిక్షణ ఇచ్చారు. ఆ బృందంలో మహిళలు కూడా ఉన్నారు. వారికి కొత్త మెలకువలతో అధిక దిగుబడి సాధించడం ఎలాగో నేర్పించారు. ఆ పాఠాలు వాళ్ల జీవితాల్నే మార్చాయి.
శిక్షణ ఉపయోగపడింది
‘పందిర్ల మీద సాగు వల్ల మాకు గతంలో కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. పంటలకు తెగులు రాకుండా వేస్ట్ డీకంపోజ్ వాడుతున్నాం. ఇంగువ ద్రావణం, ఆవు మూత్రం, పిడకల బూడిద కలిపిన విత్తనాలు నాటితే తెగులు రాకుండా ఉంటుందని సేంద్రియ సేద్యం శిక్షణలో మాకు నేర్పించారు. ఇపుడు, చాలా కుటుంబాలు కూరగాయల సాగులో నిమగ్నమయ్యాయి’ అంటారు సుందరగిరికి చెందిన బొల్లి సుమలత. ‘గతంలో కూరగాయలు పండించేటోళ్లం కానీ, చీడపీడల దెబ్బకి చాలా తక్కువ దిగుబడి వచ్చేది. బీర, కాకర నేల మీద పాకించడం వల్ల కాయల్లో నాణ్యత తగ్గిపోయేది. పందిర్ల్ల పై పండించడంతో కాయలు పొడవుగా ఎదుగుతున్నాయి. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది” అంటున్నారు ఎండ్ర భారతమ్మ. ‘పండించే విధానంలో ఈ చిన్న మార్పు వల్ల బీర, కాకర, సొర.. ఇలా ప్రతి పంటలో అధిక దిగుబడి సాధ్యం అవుతోంది’ అంటున్నారు, బొల్లోనిపల్లికి చెందిన బొల్లి అమృతమ్మ. ఆ బృందంలో రాధాకృష్ణ అనే యువ రైతు కూడా ఉన్నాడు. ఏదో ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేసేవాడు. పదిహేను వేల జీతం వచ్చేది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ కాస్త సంపాదనతో కుటుంబ భారం మోయడం అసాధ్యం. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే పందిరి సాగు గురించి తెలిసింది. ప్రస్తుతం సేంద్రియ పద్ధ్దతిలో కూరగాయలు పండిస్తూ నెలకు రూ.20 నుంచి 25 వేల ఆదాయం పొందుతున్నాడు.
జనవికాస్ చొరవ
చిగురుమామిడి మండలాన్ని తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంగా జనవికాస్ గుర్తించింది. అందుకే సుందరగిరి, బొల్లోనిపల్లి గ్రామాలలో ఉన్న కొద్దిపాటి భూగర్భజలాలతో ఎక్కువ దిగుబడిని సాధించడానికి రైతులకు తోడ్పాటు అందించింది. ‘నేల మీదతో పోలిస్తే, పందిర్ల మీద తీగజాతి కాయగూరల సాగుతోనే రైతులు తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. నాణ్యమైన సేంద్రియ విధానంలో పండించడం వల్ల గిట్టుబాటు ధరలూ అందుతున్నాయి’ అంటున్నారు కరీంనగర్ జిల్లా నాబార్డు అధికారి పి.అనంత్. సేంద్రియ పంటకు ధ్రువీకరణ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు.
‘పందిరి కూరగాయల సాగు ప్రాజెక్టు ద్వారా రెండు గ్రామాలలో యాభై మంది రైతులతో సేంద్రియ విధానంలో సాగుబడి చేస్తున్నాం. పందిర్ల మీద పెంచడం వల్ల యాభై శాతం అదనంగా దిగుబడి పెరిగింది. ఈ విధానంలో నాటిన 60 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తున్నాయి. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు త్వరగా చెడిపోవు. నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటున్నాయి…’ అంటారు జన వికాస్ గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి సంపత్ కుమార్.
తెలంగాణలో తొలి ప్రాజెక్టు…
దేశంలోనే తొలిసారిగా నాబార్డ్ ఆర్థిక సాయంతో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు ఇది. జనవికాస సంస్థ ద్వారా అమలు చేశారు. రైతులకు నష్టాలు రాకుండా దిగుబడి పెంచడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. రైతులకు ఉద్యాన నిపుణులతో శిక్షణ ఇప్పించి, సేంద్రియ సాగు పై అవగాహన కల్గించారు. జీడిమెట్లలోని ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్‌కు క్షేత్ర పర్యటన కోసం తీసుకొని వెళ్లారు. ప్రతి రైతూ 10 గుంటలలో పందిరి కూరగాయలు, మిగతా 30 గుంటలలో టమాటా, మిర్చి, వంకాయ, బెండకాయ మొదలైనవి సాగుచేస్తున్నారు. 9 ఫీట్ల రాతి స్తంభాలను సమకూర్చి తామే పందిర్లు వేయించారు. కూరగాయల విత్తనాలు, మల్చింగ్ షీట్స్, వర్మీ కంపోస్ట్, వేప పిండి.. మొదలైనవి అందించారు. ఈ రైతులు పంట మార్పిడి పద్ధతిని అనుసరిస్తున్నారు. దీని వల్ల నేల సారం కోల్పోకుండా ఉంటుంది. ఒక పంట దెబ్బతిన్నా మరో పంటతో గట్టెక్కవచ్చు.