పవన్‌కళ్యాణ్‌ అభిమాన హీరోలు వీరే

Google+ Pinterest LinkedIn Tumblr +
 ( ‘చదువుకునే రోజుల నుండి, ఇప్పటివరకు ఎన్నో దెబ్బలు తిన్నాను, గుర్తింపు ఉన్న నాకే ఇలా జరిగితే సగటు మనుషులకు దిక్కేంటి?’ అని ఆవేశంగా పవర్‌స్టార్‌ టేబుల్‌ మీద చరచగానే మా నోట్‌ ప్యాడ్స్‌ ఎగిరి పడ్డాయి. సగటు సినీజీవులకంటే పవన్‌ వ్యక్తిత్వం విభిన్నం. వ్యవస్ధలో జరుగుతున్న సామాజిక దుర్మార్గాలను చూసి తీవ్రంగా చలించి పోతాడు కానీ, వాటిని ఎదుర్కొనే కార్యాచరణలో స్పష్టత ఉండదు. బహుశా ఆయన్ని గైడ్‌ చేసే సరైన మిత్రులు లేరని పిస్తుంది. గంటన్నరకు పైగా సాగిన ఈ సంభాషణలో ఆఫ్‌ ది రికార్డుగా చాలా విషయాలు చెప్పినప్పటికీ కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ ఇస్తున్నాం. ప్రజారాజ్యం ఏర్పాటుకు ముందు ఒక సాయంత్రం పవన్‌తో జరిపిన ఫేస్‌ టు ఫేస్‌ ఇది. అప్పటి చేగువేరా స్ఫూర్తి ఇప్పటి జనసేనానిలో ఎక్కడ కనిపించక పోవడం ఒక వైరుధ్యం.  – Editor/Ruralmedia )
” ఆలోచనల నుండే సినిమాలు పుడతాయి. సినిమాలు సందేశం ఇవ్వడానికీ కలలుకనడానికీ సహాయపడతాయి. సినిమాలో హీరోలు చేసింది నిజ జీవితంలో జరగాలనే రూలేమీ లేదు. ఇప్పుడున్న స్థాయికి చేరుకుంటానని అనుకోలేదు. సినిమాలే నా జీవితంగా భావించాను. అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చాక నేను కన్న కలల్ని, ఆశయాల్ని నిజ జీవితంలో సాధించగలననే ఆశ నాలో వుండేది. కలలు సాకారం కావాలంటే మనం చెప్పే నీతుల్ని నిజ జీవితంలో ఆచరించగలగాలి. నేను వాటిని ఆచరించాను కాబట్టే సామాన్య ప్రజలకు సేవ చేయగలననే నమ్మకం ఏర్పడిరది.
నిజమైన హీరోలు వారే..
నిజజీవితంలో సన్మార్గంలో నడిచేవారే నా దృష్టిలో నిజమైన హీరోలు. నేను తెరపై హీరోనైతే సమసమాజ స్థాపనకు కృషి చేసే ప్రతి ఒక్కరూ నా దృష్టిలో నిజమైన హీరోలు. ఇప్పటివరకు నేను నటించిన సినిమాల సక్సెస్‌ను ఎంజాయ్‌ చెయ్యలేదుగానీ, ఎప్పుడైతే రాజకీయ బాట పట్టి ప్రజా జీవితంలో అడుగు పెట్టానో, ఆ క్షణం అభిమానుల స్పందన చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నాను. రాజకీయాల్లోకి రావడం నిజమైన మార్పుకు సంకేతంగా భావిస్తున్నాను.
 ఆయనే నాకు స్ఫూర్తి…
క్యూబా విప్లవ కెరటం చేగువేరా జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయనే నాకు స్ఫూర్తి. భీంరావ్ రాంజీ అంబేడ్కర్ ,లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లు నాకు ఆదర్శం. సాధ్యమైనంతవరకు వీరి అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నిస్తాను. ఖాళీ సమయం దొరికితే సోషల్‌ సైన్స్‌ పుస్తకాల్ని తిరగేస్తాను. ఇక సినిమాల్లో నాకు నచ్చిన దర్శకులు మణిరత్నం, సత్యజిత్‌రే, రుత్విక్‌ ఘటక్‌, రాజ్‌కపూర్‌, గురుదత్‌, అకీరా కురసోవాలు నాకు ఎంతో ఇష్టం. వీరేగాక ఇప్పటిదాకా నాతో పనిచేసిన దర్శకులందరూ నాకు ఇష్టమే. సబ్జెక్టుకు న్యాయం చేస్తారనే నమ్మకం కలిగాకే నేను వారితో పనిచేశాను.
సింగపూర్‌ని చూసి నేర్చుకో…
మనకంటే తర్వాత మానవ మనుగడ సాధించిన సింగపూర్‌ లాంటి చిన్న దేశంలో ఇది పూర్తిగా సాధ్యమైంది. భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక నుండి బతుకు తెరువు కోసం వెళ్ళి స్థిరపడ్డ సింగపూర్‌ వాసుల్ని, దేశాన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి.”
  ధైర్యం ఇవ్వగలిగే చదువు కోసం
 ప్రతి ఒక్కరికీ సమాన విద్య లభించాలి. నేడు పేద ప్రజలు గవర్నమెంట్‌ స్కూళ్ళలో చదివితే సంపన్నుల పిల్లలు కార్పొరేట్‌ స్కూళ్ళలో చదువుతున్నారు. ఈ వ్యత్యాసం అంతరించి విజ్ఞానం కలిగే చదువు, బతకడానికి అవసరమయ్యే చాదువు, మనిషి ధైర్యం ఇవ్వగలిగే చదువు, మనిషిలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోధి చేసే చదువు కావాలి, అలాంటి చదువును అందించే విద్యా వ్యవస్థ రావాలన్నదే నా తొలి కోరిక, ఆశ. ప్రభుత్వ ఉద్యోగం కోసం చదవడం మాని, తమ కాళ్ళపై తాను నిలబడి బతికేందుకు పనికొచ్చే విద్య కావాలి. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచే చదువులు రావాలి.
శ్రమ చేసే వ్యక్తి శ్రామికుడిగానే మిగిలిపోతున్నాడు. కోట్లు సంపాదించేవారు ఇంకా ఇంకా సంపాదిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ ఆర్థిక అసమనాతలు తొలగి సమసమాజ స్థాపన జరగాలన్నదే నా ఆకాంక్ష.
 ఏమిటీ వివక్ష
shyammohan with powerstar

shyammohan with powerstar

కొన్నేళ్ళ క్రితం నేను జైలులో ఓ ఖైదీని కలిశాను. అతడు ఓ చిన్న నేరంపై అండర్‌ ట్రయల్‌ ఖైదీగా జైలుకు వచ్చాడట. కోర్టులో అతడికి బెయిల్‌ లభించినా బెయిల్‌ ఫీజు కట్టడానికి 250 రూపాయలు లేకపోవడంతో ఆర్నెళ్ళుగా ఐలులోనే మగ్గుతున్నాడు. మర్డర్లు, మానభంగాలు చేసిన కరడుగట్టిన నేరగాళ్ళు దర్జాగా సమాజంలో తిరుగుతుంటే పేద ప్రజలు ఎంత వివక్షకు గురౌతున్నారో చూడండి. లా అండ్‌ ఆర్డర్‌లో పూర్తిగా మార్పు రావాలి.
 స్త్రీలు ఆర్థికంగా …
ఇటీవల నన్ను కలిసిన ఓ మహిళ ‘అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరగడం దేవుడెరుగు, పట్టపగలే మాకు రక్షణ లేదని’ వాపోయింది. మహిళలకు కాన్ఫిడెన్స్‌ ఇచ్చే సమాజం రావాలి. లా అండ్‌ ఆర్డర్‌ సరిగ్గా ఉండి, సవ్యంగా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇంట్లో భర్త సంపాదన మీద ఆధారపడ్డ మహిళలెందరో నేటికీ ఎన్నో అవమానాల్ని, ఛీత్కారాల్ని మౌనంగా భారిస్తున్నారు. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలమనే ధైర్యం వచ్చినప్పుడే అన్యాయాల్ని ఎదిరించగలరు. గృహ హింస, వేధింపులకు గురి అవుతున్న వారికి గవర్నమెంట్‌ ప్రత్యామ్నాయ సహాయక చర్యలు చేపట్టినప్పుడే మహిళలు పురోగమిస్తారు.
ప్రేమ లేనిదే..!
మనిషి బతకడానికి గాలి, నీరు ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. ప్రేమ లేనిదే మనిషి జీవితానికి ఎగ్జిస్టెన్స్‌ (మనుగడ) లేదు. ప్రేమ ఉన్న చోటే ఎదుటివారిని అర్థం చేసుకునే తత్వం, తోటి వారికి సహాయపడే గుణం అలవడుతాయి. ఇది బాల్యం నుండే మొదలవుతుంది. చిన్నప్పుడు అమ్మానాన్నల ప్రేమ, కాస్త పెద్దయ్యాక అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఇలా కుటుంబ సభ్యులతో ప్రేమ చిగురిస్తుంది. తర్వాత భార్య, భర్త, పిల్లలతో మనం ప్రేమను పెంచుకుంటాం మనిషి జీవితాంతం వివిధ దశల్లో ప్రేమ వెన్నంటే వుంటుంది.
‘నువ్వు ఉన్న చోటే ఆలోచిస్తూ.. నాలుగ్గోడల మధ్య కలలు కంటూ కూర్చుంటే ఏమీ సాధించలేవు. ప్రజల మధ్య అడుగుపెడితే ఎన్నో అద్భుతాల్ని సాధించగలవు’ ఇదే న ఫిలాసఫీ.”
 – shyammohan(9440595858)
Share.

Leave A Reply