151 రోజుల్లో, జగన్‌ ఏం సాధించారు?

Google+ Pinterest LinkedIn Tumblr +
Arjamma,kunduluru

Ground report, జగన్‌@151
” గత పదేళ్లలో మా ఊర్లో ప్రభుత్వ ఉద్యోగం పొందిన వాళ్లని చూడలేదు. ఈ సారి ముగ్గురికి ఉద్యోగాలొచ్చాయి. ఇద్దరికి గ్రామ సచివాలయ ఉద్యోగం, ఒకరికి గ్రామ వాలంటీర్‌ ఉద్యోగం వచ్చింది. ఊరంతా సంబరం చేసుకున్నాం !! ” అని అన్నారు,
తూరుపు గోదావరి జిల్లా, వరరామచంద్రపురం మండలం, కుందులూరు గ్రామపంచాయితీ పరిధిలోని తెల్లవారి గూడెం గ్రామస్తురాలు అర్జమ్మ. ఆమె ఒక స్వచ్ఛంద సంస్దలో పనిచేస్తున్నారు. అయితే ఆమె మరోమాట కూడా అన్నారు. ” జగన్‌ గారు ఎన్ని ఉద్యోగాలిచ్చినా, వేళాపాళా లేని కరెంట్‌ కోతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండీ, గత ఐదేళ్ల లో ఈ పరిస్ధితి ఎన్నడూ లేదు…”
వైఎస్‌ జగన్‌, 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టి 25.10.2019 నాటికి 151 రోజులు అవుతున్న సందర్భంగా ‘రూరల్‌ మీడియా’ ఆంధ్రప్రదేశ్‌లో ఒక ర్యాండమ్‌ సర్వే నిర్వహించినపుడు ప్రజల నుండి భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉత్తరాంధ్ర , రాయలసీమ,కోస్తాంధ్ర ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో మా టీమ్‌ క్షేత్రస్ధాయిలో ప్రజలను, స్వచ్ఛంద సేవా కార్యకర్తలను, పాత్రికేయులు, యువతను కలిసినపుడు, వారు వ్యక్తం చేసిన అభిప్రాయలు ఇవి .
ఉద్యోగాలు
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను సష్టించిన తీరు పట్ల తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ” నాలుగు నెలల్లోనే దాదాపు రెండు లక్షలమంది వలంటీర్లను, లక్షాముప్పై వేలమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను ప్రకటించి అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.” అని నందిగామకు చెందిన ఒక టీడీపీ కార్యకర్త అన్నారు.
అసలు ఉద్యోగమే దొరకదేమో అనుకుంటున్న లక్షలాది మందికి జగన్‌ చేసిన ప్రయోగం ఆశలు కల్పించింది. కొత్త ప్రభుత్వం ఈ రకంగా, ఉద్యోగాలు సష్టించకపోతే ఇన్ని లక్షలమందికి అవకాశం వచ్చేదికాదు కదా.. వారంతా నిరుద్యోగులుగానే మిగిలి పోయేవారు.
అయితే హడావడిగా చేసిన ఈ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయిన వారిలో కొందరు ఆందోళనకు గురయ్యారు.
పరీక్ష రాసి, ఎంపికయి,సర్టిఫికేట్‌ వెరీఫికేషన్‌ ప్రక్రియ కూడా అయిన వారిలో కొందరికి ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్న విషయం ఈ సర్వేలో వెల్లడి అయింది.
” బిఏ డిగ్రీ అర్హతతో పరీక్ష రాసి సచివాలయ ఉద్యోగానికి ఎంపికయ్యాను. కానీ ఇంత వరకు ఉద్యోగంలోకి తీసుకోలేదు. అదేమని అడిగితే, ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ ఒక్కటే పనికి రాదు. ఇంటర్‌ మార్కులు కూడా కావాలంటున్నారు…” అని,తూరుపు గోదావరి జిల్లా, అమలాపురం మండలం కామనగరువు పంచాయితీకి చెందిన ఒక నిరుద్యోగి నిరాశగా అన్నాడు.
ఈ అభ్యర్ధి చదివిన బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ లక్ష్మారెడ్డిని సంప్రదించినపుడు,’ ఇది యూజీసీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ, ఇక్కడ డిగ్రీ తీసుకున్న వారెందరో ఐఎఎస్‌,ఐపీఎస్‌లకు ఎంపికయ్యారు. మెగసెసే అవార్డు పొందిన బెజవాడ విల్సన్‌ కూడా ఇక్కడే డిగ్రీ చదివారు..” అని వివరించారు. దీని పై ప్రభుత్వం దృష్టి సారించి అభ్యర్దులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని నిరుద్యోగులు కోరుతున్నారు.
70 శాతం మంది మెచ్చిన జగన్‌ నిర్ణయాలు
1, ఆరోగ్యం
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి, ఇతర రాష్ట్రాల ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో, ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పేద ప్రజలకు గొప్ప వరంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
శ్రీకాకుళం జిల్లా, ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం కోసం రూ. 600 కోట్లతో మంచినీటి పథకం ప్రకటించడం పట్ల ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2, సామాజిక పింఛన్‌లు
అవ్వా తాతలకు వ ద్ధాప్య పింఛన్‌ను, ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకు పెంచి, పింఛను పొందడానికి అర్హత వయసును 65 నుంచి 60కు తగ్గించడం పట్ల సంతోషంగా ఉన్నారు. దీని వల్ల అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం కలుగుతుందని అంచనా.
3, బడుగు వర్గాలు
45 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుటుంబానికి వచ్చే ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగు విడతల్లో మొత్తంగా రూ. 75 వేలు ఆర్థిక సాయం.
దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌.. వల్ల పోలీసు కుటుంబాల్లో ఆత్మస్ధ్యయిర్యం నింపింది.
కాపు కార్పొరేషన్‌కు తొలి బడ్జెట్‌లోనే రూ. 2 వేల కోట్లు నిధులు.. 5 ఏళ్ళలో రూ. 10 వేల కోట్లు కేటాయింపునకు రంగం సిద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల కాపు సామాజిక వర్గంలో జగన్‌ పట్ల విశ్వసనీయత పెరిగింది.
4,ప్రజారవాణా
సామాన్య ప్రజల నిత్యావసర రవాణా వ్యవస్ధ , ప్రగతి రథ చక్రాలైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా, క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడం ఒక విప్లవాత్మక,కార్మిక పక్షపాత చర్యగా అన్ని వర్గాల ప్రజలంటున్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకునే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌(మధ్యంతర భ తి) ప్రకటన కూడా ఉద్యోగుల్లో సంతోషం నింపింది.
5, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు
ఆశా వర్కర్ల జీతాలు రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు, అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు రూ. 10,500 నుంచి రూ.11,500కు పెంపు. అంగన్‌ వాడీ ఆయాల జీతం రూ. 6 వేల నుంచి రూ. 7 వేలకు పెంపు. డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌ పర్సన్‌లకు గౌరవ వేతనం రూ. 3,000 నుంచి రూ. 10 వేలకు పెంపునకు నిర్ణయం పట్ల గ్రామీణ మహిళలు వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
6, విద్య
ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖల్నిమార్చి ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ కాంపౌండ్‌ వాల్‌, సరైన టాయ్‌లెట్లు, మంచినీటి సదుపాయం, తదితర మౌలిక వసతుల కల్పన,
అమ్మ ఒడి ద్వారా.. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ. 15,000, ఇంటర్మీడియేట్‌ అనంతరం ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం ఏటా రూ. 20 వేలు, సాలూరులో ట్క్రెబల్‌ యూనివర్సిటీ, పాడేరులో ట్క్రెబల్‌ మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు లాంటి నిర్ణయాలను పేరెంట్స్‌ హర్షిస్తున్నారు.
7, గిరిజనులు
” ఇంత వరకు మా గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలు రూ. 400 నుంచి రూ. 4000కు పెంపు, ప్రమాదవశాత్తు పెద్ద దిక్కును కోల్పోయిన గిరిజన కుటుంబాలకు, వైయస్‌ఆర్‌ బీమా పథకం కింద రూ. 5 లక్షలు ఆర్థిక సాయం లాంటి పథకాలు మాకు భరోసాను ఇస్తాయి.” అని అరకు మండలం,పెదలబుడు గ్రామ గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు.
8, రైతులు…
ప్రతీ రైతు కుటుంబానికి వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ఏటా రూ. 12500. విడతల వారీగా 50 వేల రూపాయల నగదు చెల్లింపు, ప్రమాదవశాత్తూ చనిపోయినా లేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి వైయస్‌ఆర్‌ బీమా ద్వారా రూ. 7 లక్షల నష్టపరిహారం చెల్లింపు కూడా రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచింది.
9, మద్యనిషేధం…
సంపూర్ణ మద్యనిషేధం తీసుకువస్తానని వై.ఎస్‌ .జగన్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినప్పుడు, చాలామంది నమ్మలేదు. కానీ… పాలనలోకి వచ్చిన తర్వాత.. జగన్మోహనరెడ్డి మద్యనిషేధం దిశగా తన తొలిప్రయత్నంలోనే, మద్య నిషేధం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. మద్యనిషేధం జరుగుతుందనే ఆశలను కల్పిస్తున్నాయి. తొలి అడుగుగా, బెల్ట్‌ షాపులు మూయించి, మద్యం దుకాణాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించడానికి పూనుకుంది. విక్రయాలు ప్రారంభించినప్పుడే 20శాతం దుకాణాల సంఖ్యను తగ్గించారు. అదే తొలి అడుగు. అమ్మకాల వేళలను ఉదయం 11 నుంచి రాత్రి 8వరకే పరిమితం చేశారు. దాంతోపాటు ధరలు పెంచారు. ఇవి మలి అడుగులు. ఇది కూడా వినియోగం మీద ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ నిషేధం దిశగా మలిఅడుగులుగా గృహిణులు నమ్ముతున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు సంక్షేమం కోసం, ప్రధానంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తుండటాన్ని అన్ని ప్రాంతాల వారు స్వాగతించారు.
30 శాతం మంది వ్యతిరేకిస్తున్న అంశాలు
1, అవినీతి, పైరవీలకు తావు లేని ఇసుక విధానం అని, ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇసుక ఇంటికి చేరుతుందన్న ప్రభుత్వ ప్రకటనలో వాస్తవం లేదని అందరూ అంటున్నారు. అందరికీ ఇసుకను అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని భవననిర్మాణ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
2, ప్రజల సమస్యల పరిష్కారానికి స్పందన అనే కార్య క్రమం ఉంది కానీ, ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై తక్షణ పరిష్కారాలు అమలు అవ్వడం లేదని రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రజలంటున్నారు.
3, ”గత 150 రోజులుగా ఏదో సమయంలో విద్యుత్‌ కోతలు ఉంటున్నాయి. దీని వల్ల రాత్రుళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పొలాలకు నీరు పెట్టుకోలేక పోతున్నాం. గత ఐదేళ్లలో ఈ సమస్య ఎపుడూ ఎదురు కాలేదు. వానా కాలంలోనే ఇలా ఉంటే వేసవిలో ఎలా ఉంటుందో…” అని చిత్తూరు జిల్లా ,రామకుప్పం మండలం, శివాజీనగర్‌ తండా ప్రజలు అంటున్నారు. వీరే కాదు ఈ సమస్య పై అన్ని ప్రాంతాల నుండి నిరసన ఉంది.
4, గత ప్రభుత్వాల వలె కాకుండా, తమ ప్రభుత్వంలో మాత్రం పూర్తి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు, బదిలీలుంటాయని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నప్పటికీ ఉద్యోగాలు, బదిలీల విషయాల్లో ప్రజా ప్రతినిధుల జోక్యం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
5, బదిలీల విషయంలోనూ కొందరు ప్రజాప్రతినిధులు మండల, డివిజన్‌ స్థాయిల్లో హవా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తమకు పూర్తి అనుకూలంగా వ్యవహరించే ఉద్యోగులను, పోలీసులను బాగా డిమాండ్‌ ఉన్న స్థానాల్లో నియమించుకున్నారని, కృష్ణాజిల్లాలో ప్రజల నుండి వస్తున్న ఆరోపణలు.
పాత్రికేయుల స్పందన
” ఎవరెన్ని వక్రభాష్యాలు చెబుతున్నప్పటికీ.. జగన్‌ పరిపాలనలో యువతరానికి కొలువులు ఏర్పడ్డాయనే మాట నిజం. వారి జీవితాలకు కొంత మేర భద్రతను, నిశ్చింతను ఇచ్చే ఉద్యోగాలను ప్రభుత్వం లక్షల సంఖ్యలో కల్పించింది. యువతరానికి ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం చాలా దృఢ మైన సంకల్పంతో అడుగులు వేస్తోంది.” ఒక సీనియర్‌ పాత్రికేయుడు మాతో అన్నారు.
పరిణితి గల నాయకుడిగా….
జగన్‌ పాలనలో లోపాలను ఎత్తి చూపి నిర్మాణాత్మక విమర్శలు చేయకుండా,
ప్రతిపక్ష నేత, జనసేన అధినేత కేవలం విష ప్రచారం చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి జగన్‌ హుందాగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడా ప్రతిపక్షం ఆరోపణలు, విమర్శలను ప్రస్తావించడం లేదు. కేవలం ఉద్యోగాలు పొందినవారు నిజాయితీగా పనిచేయాలని, ప్రజలకు సేవలందించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని హితబోధ చేస్తున్నారు. ప్రతిపక్షనాయకులు రెచ్చగొట్టేలా ఎన్ని విమర్శలు చేస్తున్నా, అసలు చంద్రబాబు,పవన్‌ల ఊసే ఎత్తడం లేదు. నిశ్శబ్దంగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పనిలో నిమగ్నమవుతూ, పరిణితితో వ్యవహరిస్తూ, ముందుకు పోతున్న జగన్‌ పట్ల అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది.
ఇసుక విషయంలో కట్టడి చేసి, బెల్ట్‌ షాపులు మూసేసి, వైన్‌ షాపులు తగ్గించేస్తూ, రికమెండేషన్లు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న జగన్‌ పాలన కొందరికి రుచించడం లేదు.
జగన్‌ మాత్రం క్లీన్‌ గవర్నమెంట్‌ను నడపాలని చూస్తున్నారు. అవినీతి, అడ్డగోలు సంపాదన సమస్యేలేదని చెబుతూ వస్తున్నారు. కట్టడి చేస్తున్నారు. అయితే విద్యుత్‌ కోతలు, ఇసుక కొరత నుండి ప్రజలకు విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది. సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక అయినప్పటికీ స్వల్పకారణాలతో వందలాది మందికి అప్పాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వకండా ఆపడం నిరుద్యోగుల్లో నిరాశను పెంచింది. అసలు ఇంత హడావడిగా లక్షాముప్పయి వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చే కంటే, ఏడాదికి 50 వేల ఉద్యోగాలు చొప్పున ఇచ్చుకుంటూ, వెళ్తే నిరుద్యోగులకు ఊరట, ఉద్యోగాలు కల్పిస్తున్నారు అనే భావన ప్రజల్లో ఉండిపోయేది. ఏజ్‌ బార్‌ అవుతున్న వారికి తొలివిడత అవకాశం కల్పించడం వల్ల సుధీర్గ కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట కలిగేది.
రాబోయే కాలంలో ప్రజలకు మరింత దగ్గర అవడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.
( శ్యాంమోహన్‌,రూరల్‌ మీడియా)

Share.

Leave A Reply