శ్రీసిటీ గ్రామాల్లో కోవిడ్ సేఫ్టీ కిట్లు పంపిణీ

Google+ Pinterest LinkedIn Tumblr +

కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ గ్రూప్ (ఎస్ జె సీ జీ) మంగళవారం(29.9.2020) శ్రీసిటీ పరిధిలోని ఐదు గ్రామాల్లో సుమారు 3 లక్షల రూపాయల విలువైన మాస్కులు, శానిటైసర్లు పంపిణీ చేశారు. ఒక్కో ఇంటికి 400 రూపాయల విలువచేసే 30 మాస్కులు, 500 మి.లీ. శానిటైజర్ చొప్పున ఐదు గ్రామాల్లోని 866 ఇళ్లకు అందచేశారు. శ్రీసిటీ పరిధిలో మే, జూన్ మాసాలలో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదైన చెరివి, మాదనపాలెం, చిగురుపాలెం, తొండూరు, తొండూరు సొసైటీ గ్రామాలలో ఈ సాయం అందించారు. 
శ్రీసిటీ ఫౌండేషన్ సమన్వయంతో స్థానిక ఐసాన్ కంపెనీ ఆవరణలో మంగళవారం ఉదయం శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ గ్రూప్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాస్కులు, శానిటైసర్లను పై గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లకు అందచేయగ, తదనంతరం కార్యదర్శులు, వాలంటీర్లు ద్వారా ఇంటింటికి పంపిణీ జరిగింది. ఐసాన్ పరిశ్రమ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జపనీస్ కంపెనీస్ గ్రూప్ చైర్మన్ మసాహిరో యమగుచి, జపాన్ పరిశ్రమల ప్రతినిధులు మసాహికో వటనబే (ఇసుజు), టిట్సుజి హిరానో (పయోలాక్స్ ), యసుహరు కమో (ఐసాన్), శ్రీసిటీ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. 
 ఈ సందర్భంగా మసాహిరో యమగుచి మాట్లాడుతూ, 2017లో ఏర్పాటైన శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ గ్రూప్ (ఎస్ జె సీ జీ) వరుసగా నాల్గవ ఏడాది తమ సీఎస్ఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కోసం ఈ తరహా సాయం అందించినట్లు పేర్కొన్నారు. 
శ్రీసిటీ జపనీస్ కంపెనీస్ గ్రూప్ (ఎస్ జె సీ జీ) యొక్క చొరవను అభినందించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇక్కడ పారిశ్రామిక వాతావరణాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తున్నతరుణంలో శ్రీసిటీ మరియు చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించలేమన్నారు. ప్రస్తుతం జపనీస్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమం పరిసర ప్రజల పట్ల తాము చూపుతున్న శ్రద్ధను ప్రతిబంబిస్తుందన్నారు. శ్రీసిటీ ప్రాంతాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఇక్కడ పనులు త్వరితగతిన ప్రారంభం కావడానికి అటు ప్రభుత్వ అధికారులు, ఇటు శ్రీసిటీ సిబ్బంది చేసిన కృషికి గ్రామస్థులు అందించిన సహకారం అద్భుతమంటూ, వారి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. 

కాగా, జపనీస్ గ్రూప్ తమ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా గతంలో శ్రీసిటీ పరిసర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డెస్కులు, స్కూల్ బ్యాగులు, లైబ్రరీ పుస్తకాలు పంపిణీ, మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టారు. 

Share.

Leave A Reply