శ్రీసిటీలో ‘దిశ ‘ ప్రారంభం

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీసిటీలోని మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు, పరిసర గ్రామాల స్త్రీల సమస్యల పరిష్కారానికి దోహదపడే ‘దిశ సహాయ కేంద్రం’ శ్రీసిటీలో ప్రారంభమైంది. స్థానిక డీఎస్పీ విమలకుమారి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సతీమణి మమతా సన్నారెడ్డి సోమవారం ఉదయం దీనిని ప్రారంభించారు. శ్రీసిటీ ట్రేడ్ సెంటర్ లోని డీఎస్పీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక వసతులతో దీనిని ఏర్పాటు చేశారు. 
ఈ సందర్భంగా డీఎస్పీ విమలకుమారి మాట్లాడుతూ, వివిధ సమస్యలతో వచ్చే మహళల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు, వారికి తగు సలహాలు సూచనలు ఇచ్చి పరిష్కారం చూపేవిధంగా ఈ సహాయక కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. ఫిర్యాదు చేసిన మహళలకు సరైన మార్గనిర్దేశం చేయడంతో పాటు సమస్య పరిష్కారం వరకు వారికి అందుబాటులో వుండడమే ఈ కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా ఆమె పేర్కొన్నారు. దిశా సహాయక కేంద్రం 24/7 పనిచేస్తుందని, ఓ మహిళా పోలీసు ప్రతినిధి అందుబాటులో వుండి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఎలాంటి భయం, అనుమానాలు లేకుండా మహిళలు ఇక్కడకు వచ్చి వారి ఫిర్యాదులు తెలుపవచ్చని, ఫిర్యాదుదారులు కోరితే వారి వివరాలు కూడా రహస్యంగా వుంచబడుతుందని తెలిపారు. 


స్వల్ప వ్యవధిలో శ్రీసిటీలో దిశా సహాయక కేంద్రం ఏర్పాటు చేసినందుకు డీఎస్పీ విమలకుమారికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రాష్ట్రాలు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 25 వేలకు పైగా మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు వున్న శ్రీసిటీలో ఈ రకమైన సౌకర్యం వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనిని మంజూరు చేసినందుకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వారికి కృతఙ్ఞతలు తెలిపారు. సమస్యల్లో వుండి పోలీసుల సహాయం రక్షణ కోరే మహిళలకు  ‘సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’గా వుందడమే కాకుండా, మరింత మహిళా-స్నేహపూర్వకంగా పోలీసులు దృష్టి సారించడానికి ఈ కేంద్రం ఉపకరిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 
శ్రీసిటీలోని పలువురు మహిళా హెచ్ఆర్ మేనేజర్లు, మహిళా ఉద్యోగులు, పరిసర గ్రామాల మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Share.

Leave A Reply