అంతులేని పేదరికాన్ని భరించలేకపోయారు. తమ జాతిలో ఆడపిల్ల పుడితే అమ్మేయడమో, చంపేయడమో చేసేవారు. ఎక్కడ ఉపాధి దొరికితే, అక్కడికి వలస వెళ్లి బతికేవారు. కానీ, అదంతా గతం, దశాబ్దాల క్రితం. ఇప్పుడీ తండాల్లోని ఆడబిడ్డలే ఊరికి వెలుగురేఖలయ్యారు. మగవాళ్లు విఫలమైన చోట దర్జాగా ఉపాధిని సృష్టించుకున్నారు.స్వయంసమృద్ధితో ప్రగతివైపు పయనిస్తున్నారు..
మోచేతుల వరకూ నిండుగా ధరించే రబ్బరు గాజుల బలియా, వీటి మధ్యలో వెండి కడియం రోల్డ, చెవులకు వెండి బుట్టల టోపీ, ముక్కుకు బంగారపు రింగు బైరియా, కాళ్లకు ధరించే ఇత్తడి కడియాలు.. మెడలో వెండి కడియం.. వీటన్నింటినీ ధరించి నిండుగా బతకడం లంబాడాల జీవన శైలి. క్రమంగా అంతరించి పోతున్న ఈ సంప్రదాయాన్నికాపాడుకునే ప్రయత్నం ఇప్పుడు మొదలైంది.
చేతివృత్తికి గిరాకీ
లంబాడా మహిళలనే కాకుండా, ఈ కాలపు యువతులను కూడా ఆకట్టుకునే బంజారా మిర్రర్ వర్క్‌కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఆధునిక డిజైన్లతో దుస్తుల తయారీలో నైపుణ్యం చూపించడానికి అవకాశమున్న చేతివృత్తి ఇది. అందుకే పేద గిరిజనులకు ఆలంబన అయింది. ఉపాధిగా ఊతమిస్తున్నది.
సంగారెడ్డి జిల్లా కేంద్రం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో, జరాసంగం మండలంలోని గుట్టల మీద విసిరేసినట్టుంటాయి.. వనంపల్లి, భోజ్యానాయక్, టోపియానాయక్ తండాలు. అక్కడ రెండొందలకు పైగా లంబాడా కుటుంబాలున్నాయి. ఒకప్పుడు కరవు కారణంగా వ్యవసాయ పనులు లేక మగవాళ్లు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఆడవాళ్లు కూలి పనులు చేసుకుంటూ, పశువులను మేపుకుంటూ జీవించేవారు. ఈ నేపథ్యంలో వారి బతుకుదెరువులో మార్పు తేవాలని, వివేకానంద యూత్ అసోసియేషన్ సంకల్పించింది. మరుగున పడిన వారి సంప్రదాయ చేతి వృత్తులకు జీవంపోసి, వాటి ద్వారానే జీవనోపాధి కల్పించాలని నిర్ణయించింది.
బంజారా మిర్రర్ వర్క్, అద్దాల రవికల తయారీలో శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యానికి మెరుగులు దిద్దింది. ఆయా తండాల్లోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న చురుకైన 90 మంది మహిళలను ఎంపిక చేసి, బంజారా వస్త్రాల డిజైనింగ్, నగల తయారీలో 15 రోజులపాటు ఇండ్ల దగ్గరే శిక్షణ ఇప్పించారు వివేకానంద యూత్ అసోసియేషన్ ప్రతినిధులు. అంతేకాదు, ఈ సంఘం లంబాడాల సంప్రదాయ వృత్తులకు ఆధునిక నైపుణ్యాలను జోడించి, కొత్త డిజైన్ల రూప కల్పనకు ప్రోత్సహించింది. వారు ప్రాణంపోసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపర్చడం ద్వారా సుస్థిర ఆదాయం లభించేలా చేసింది.
…….
సుస్థిర జీవనం..
“గతంలో మా దుస్తులను మేమే తయారు చేసుకునేటోళ్లం. అయితే, ముడి సరుకుల పెట్టుబడికి కష్టంగా ఉండటంతో ఆ పని ఆపేసి, కూలీకి వెళ్తున్నం. ఇప్పుడు సాయం అందడంతో ఇండ్ల దగ్గరే తయారు చేసుకుంటున్నం. కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం వస్తున్నది..” అని చెబుతున్నారు భోజ్యానాయక్ తాండాలో తన ఇంటి ముందే మరో ఇద్దరు మహిళలతో కలిసి రవికలకు అద్దాలు కుడుతున్న ఛాందీబాయి సంతోషంగా. “మా ఆయన బిల్డింగ్ పనులకు పట్నం వైపు పోతడు. మాకు మంచిగ ట్రైనింగ్ ఇవ్వడంతో సంప్రదాయ దుస్తులు మేమే కుట్టుకుంటున్నం. ఇంతకు ముందు ఎండల్ల కూలీ పనులకు పోయేటోళ్లం. ఇపుడు మా ఇళ్ల దగ్గరే పనిచేసుకుంటున్నం. మగ్గం మీద చేసిన రవికలకు మంచి డిమాండ్ ఉంది. మాకు లోన్ ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నయి..” అని చెప్పింది టోపియానాయక్ తాండాకు చెందిన మమతాబెనర్జీ. అక్కడ ఇంటర్ వరకు చదివిన యువతి ఈమె ఒక్కరే. “వీరు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. హైదరాబాద్‌కు చెందిన జ్యూట్ యూనివర్స్, జ్యూట్ప్లానెట్ సంస్థలు తండాలకే వచ్చి, తగిన ధర చెల్లించి, మార్కెట్ చేస్తున్నాయి..” అంటున్నారు వివేకానంద యూత్ అసోసియేషన్ ప్రతినిధి దశరథం.
నైపుణ్యాలు పెంచడమే కాకుండా బ్యాంకుల నుండి రుణాలు, మార్కెటింగ్ వంటి అంశాల్లోనూ వివేకానంద సంస్థ అవగాహన కల్పించింది. దీనివల్ల ఇక్కడి మహిళలు బృందాలుగా ఏర్పడి యూనిట్లు పెట్టుకుంటున్నారు.
- ఒక చిన్న ప్రయత్నం, ఈ పేద మహిళల జీవితాల్లో ఆర్థిక మార్పునకు కారణమయింది.
- క్రమంగా కనుమరుగవుతున్న సంపద్రాయ వస్త్రశైలికి తిరిగి ప్రాణం పోస్తున్నారు.
- బంజారా స్త్రీలు శుభకార్యాలకే కాదు, ప్రతి నిత్యమూ ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలనే ధరిస్తున్నారు.
- ప్రతి ఇంటి ముందూ.. దారాలతో రంగుల పూసలు గుచ్చుతూ.. అద్దాలు, వెండి బిళ్లలు అమర్చిన రవికలు కుడుతూ ఆత్మవిశ్వాసంతో దర్శనమిస్తారు.
- తల నుంచి నడుము వరకు ధరించే గాగ్రాలకు డిజైన్లు అల్లుతూ సంతోషంగా కనిపిస్తారు.
- గ్రామీణ ఉద్పాదకత పెరిగి, స్వయం సమృద్ధి దిశగా వారు అడుగులు వేస్తున్నారు.
-శ్యాంమోహన్ (9440595858)
-కే రమేశ్ బాబు