ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఎలా?

Google+ Pinterest LinkedIn Tumblr +

స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రాంతం ఉత్తరాంధ్ర. కానీ తర్వాత అన్ని రాజకీయ పార్టీలూ ఉత్తరాంధ్రను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నాయే తప్ప అభివృద్ధిపై ఫోకస్ పెట్టలేదన్నది నిర్వివాదాంశం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాల్లో విస్తరించిన ఏజెన్సీ పరిస్థితి మరీ దారుణం. పుష్కలంగా వనరులున్నా… అభివృద్ధికి నోచుకోలేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులు రాలేదు. ఉత్తరాంధ్రలో ఆదివాసీ ప్రాంతాలు, గణనీయమైన సంఖ్యలో ఆదివాసీ జనాభా ఉంది. వీరి అభివృద్ధి కోసం 2012లో విడుదలైన ‘అరకు డిక్లరేషన్’ను- ఏజెన్సీ ప్రాంతాలలో అమలు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరణాత్మక సూచనలు చేసింది. ఆ సూచనలు ఇంతవరకూ అమలులోకి రాలేదు. గిరిజన యూనివర్సిటీకి అతీగతీ లేదు.
మామిడి పండ్లు నుంచి తెనె వరకు ఉత్తరాంధ్ర ఏజెన్సీలో దొరకని పదార్థాలు లేవు. అంతర్జాతీయ క్వాలిటీలో లభిస్తాయన్నీ. అందుకే గిరిజన ఉత్సవాలు చేసినంతమాత్రాన సరిపోదు… వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

యాపిల్ పంటకు అనుకూలం : చలికాలం అరకు- పాడేరు ఏజెన్సీకి వెళ్తే జమ్మూకశ్మీర్ లో ఉన్నట్లే ఉంటుంది. అందుకే దీన్ని పేదల ఊటి అన్నారు. ఇక్కడ లంబసింగి ప్రాంతంలో యాపిల్ పంటకు అనుకూల వాతావరణం ఉంది. కొన్నిచోట్ల ఆపిల్ పండించి చూపారు. దీన్ని ఏజెన్సీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించారు.

కమ్మని అరకు కాఫీ :
కమ్మని కాఫీకి కేరాఫ్ అడ్రస్ అరకు. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కాఫీ గింజలకు పెట్టిందిపేరు. దీనికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తోంది గిరిజన కో ఆపరేటీవ్ సొసైటీ. అరకు కాఫీకున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే విదేశాల్లోనూ స్టాల్స్ ఏర్పాటుచేయాలి. భారీ స్థాయిలో కాఫీ గింజలను సాగుచేయాలి. కర్నాటక కాఫీని వెనుకకు నెట్టాలంటే ఈ సాగును ప్రోత్సహించేందుకు భారీగా పెట్టుబడులను ఆహ్వానించి సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. పాడేరు ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. దీన్ని రెండు లక్షల ఎకరాలకైనా పెంచాల్సిన అవసరం ఉంది.

పర్యాటకుల స్వర్గధామం :
అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను , ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ఆంధ్రాలోని ఏకైక ప్రాంతం అరకులోయ. ఢిల్లీలో అడుగుపెట్టే ప్రతిపర్యాటకుడు రాజస్థాన్ చూడాలనుకుంటాడు… అలాగే హైదరాబాద్, ఆంధ్రా చూడాలనుకునేవారు అరకు తిలకించకుండా వెనుకడుగువేయరు. కానీ వారికి తగ్గ సదుపాయాలు మన ఏజెన్సీలో లేవు. ఇందుకోసం ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి అభివృద్ధి చేయాలి. కాఫీ తోటలకు, ప్రశాంత వాతావరణానికి, అందమైన జలపాతాలకు, పచ్చని ప్రకృతి రమణీయతకు అరకు అద్దం పడుతుంది. తగిన ప్రచారం కల్పిస్తే ఊటి, కొడైకెనాల్ కు ఏమాత్రం తీసిపోని ప్రాంతం అరకు ఏజెన్సీ. విశాఖ నుంచి అరకు రైలులో వెళ్తే… మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు దర్శనమిస్తాయి.అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. బొర్రా గుహలు అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.ప‌చ్చ‌ని చెట్లూ, కొండ చరియలూ, పచ్చని తివాచీ పరిచినట్టుండే పచ్చిక మైదానాలూ ఇక్క‌డికొచ్చే సందర్శకులను ఆకట్టుకుంటాయి. పద్వాపురం గార్డెన్, కటికి, తాటిగుడ జలపాతం ఇలా అన్నీ పర్యాకులకు కనువిందే చేసేవే. పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తే… గిరిజన యువతీ యువకులకు ఉపాధి లభిస్తుంది. అంతేకాదు… ఇది ఎవర్ గ్రీన్ కూడా.

మార్కెటింగ్ సదుపాయాలు ;
గిరిజన ప్రాంతంలో పండే పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల తక్కువ ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి గిరిజనులకు తప్పుతుంది. దళారులకు చెక్ పెట్టినట్లు అవుతుంది.

గిరిజన యూనివర్సిటీ : విజయనగరంలో తలపెట్టిన గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేసి … ఉపాధికల్పించే కోర్సులు ప్రవేశపెడితే… గిరిజనుల్లో వెలుగులు నిండుతాయి. వారు మోసగాళ్లబారిన పడకుండా ఉంటారు.

ముగింపు : ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలుగులు నింపే, ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి. అందులో స్థానికులకు – ఆ ప్రాంతం నుంచి వేరే చోట స్థిరపడ్డ చిత్తశుద్ధి ఉన్న ప్రముఖులకు స్థానం కల్పించాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అభివృద్ధి సాధించొచ్చు.
Dr Srinubabu Gedela, CEO PULSUS

Share.

Leave A Reply