“మీ వాట్సాప్ జోలికి ఎవరూ రాకుండా ఉండాలంటే ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి?
మీ స్మార్ట్ ఫోన్లో ఏ భాషనైనా ఎలా అర్థం చేసుకోవచ్చు?
మీ ఫేస్బుక్ హ్యాక్ కాకుండా ఉండాలంటే?
మీ యూట్యూబ్ చానెల్లో పదివేల సబ్ స్ర్కైబ్స్ని ఎలా పొందాలి?
యూట్యూబ్‌లో వ్యూస్ పెరగడానికి అద్భుతమైన ట్రిక్స్ తెలుసా?
అరగంటలో ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకుంటారా ?
రండి.. నాతో కనెక్ట్ అవ్వండి..” అని పిలుపునిస్తున్నాడు యువ టెక్నాలజీ నిపుణుడు రాచకొండ శ్రీధరాచారి. అలా అని, అతనేం ఇంజినీరింగ్ పట్టభద్రుడు కూడా కాదు. ఒకనాటి, కమ్మరి కొలిమి కార్మికుడు.

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కి చెందిన రాచకొండ శ్రీధరాచారి కుటుంబానిది చాలా పేదరికం. తండ్రి సుదర్శనాచారి కమ్మరి కొలిమిలో పనిచేస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆర్థిక ఇబ్బందుల మధ్యనే శ్రీధర్ పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పట్టా అందుకున్నాడు. కానీ, సరైన ఉద్యోగం రాలేదు. తండ్రితో పాటు కొలిమి పనికి వెళ్లి, ఇంటి ఖర్చులకు సాయపడేవాడు. మూడేండ్లపాటు వెల్డింగ్ పనులు చేశాడు. కానీ, ఆ వృత్తి ఏనాడు సంతృప్తిని ఇవ్వలేదు. ‘టెక్నాలజీ ద్వారా మనుషులను కలపడం ఎలా?’ అనే ఆలోచన మాత్రం బుర్రలో గింగిర్లు కొట్టేది. ఖాళీ సమయంలో కంప్యూటర్ టెక్నాలజీ మీద అవగాహన పెంచుకున్నాడు. వెల్డింగ్ పనికి గుడ్‌బై చెప్పి, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. ఒక చానెల్లో ఆర్టిస్ట్‌గా చేరాడు. ఆ తరువాత తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో ‘కనెక్టింగ్ శ్రీధర్ ’అనే యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేశాడు. ఇంగ్లిష్ తెలియని వాళ్లకోసం..
‘నాకు కంప్యూటర్ పరిజ్ఞానం అంటే ముందు నుంచీ ఆసక్తి. ఆ జిజ్ఞాస కొద్దీ వెబ్‌సైట్స్, యూట్యూబ్ సెర్చ్ చేసినపుడు ఎన్నో ఆసక్తికర విషయాలను గుర్తించాను. అయితే, ఇవన్నీ తెలుగులో ఎక్కడా లేవు. నాలాగే అసక్తి ఉన్న యువతకు వాటిని మాతృభాషలో పరిచయం చేయడానికి, రెండేండ్ల క్రితం ఓ యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేశాను. టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, నెలకు ఇరవై అయిదు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి వరకూ 266 వీడియోలు రూపొందించాను. వాటిని యూత్ బాగా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. రోజూ… ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా 60 నుండి 80 మంది వరకు టెక్నాలజీ సందేహాలను అడుగుతుంటారు. చాలామంది ఉత్సాహంగా యూట్యూబ్ చానల్ ప్రారంభిస్తారు. ఆతర్వాత, చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు, నేను కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను. వీలైనంత వరకు అలాంటి వారికి సాంకేతిక సహాయం అందిస్తున్నాను. అలా నా చానెల్‌కి 30వేల మందికిపైగా సబ్‌స్ర్కైబ్ అయ్యారు. సమాజానికి ఉపయోగపడే చానల్స్‌ని ఉచితంగా ప్రమోట్ చేస్తున్నాను. నాకు తెలిసిన టెక్నిక్స్‌ను అందరికీ పంచడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాను” అంటాడు శ్రీధర్. పెద్దచదువులు చదివి, రాని అవకాశం కోసం ఎదురుచూస్తూ.. కాలాన్ని వృథా చేయకుండా ఆసక్తి ఉన్న రంగంలో జీవితాన్ని అందంగా మలుచుకుంటున్నాడు శ్రీధర్. వెల్డర్‌గా జీవితాన్ని ప్రారంభించి, నేడు టెక్ గురుగా కొన్ని లక్షల మంది వీక్షకుల అభిమానం సంపాదించాడు. జీవితం సాఫీగా నడవడానికి సరిపడా సంపాదించుకుంటున్నాడు కూడా!
శ్రీధర్ తో మాట్లాడ తారా…@connectingsridhar instagram follow అవ్వండి.
యూట్యూబ్ చానెల్ లింక్ …https://www.youtube.com/channel/UC7uf…
చానెల్ పెట్టే ముందు..
1, తొందరపడకుండా, ముందుగా యూట్యూబ్ గురించి పూర్తి అవగాహన పెంచుకోవడం అవసరం. సంబంధిత టెక్ వీడియోలు చూడండి. 2,టెక్నాలజీలో మంచి చెడులు తెలుసుకోండి. చానెల్ ప్రారంభించే ముందే.. రోజుకు ఒకటా, వారానికి ఒకటా.. ఎన్ని చేయగలరన్నది నిర్ణయించుకోండి. ఆ ప్రకారంగా అప్లోడ్ చేయాలి 3,వీడియో టైటిల్ ఆకట్టుకునేలా ఉండాలి. మీరు పెట్టే వీడియోలలో వినోదంతోపాటు విజ్ఞానం కూడా ఉండాలి. 4,సమాజానికి హాని కలిగించే, విశ్వాసాలను రెచ్చగొట్టే అంశాల జోలికి అసలు వెళ్లవద్దు. 5,వంటల నుండి వ్యవసాయం వరకు.. జనానికి ఉపయోగపడే కార్యక్రమాలను వీడియోలుగా చేస్తే విజయం మీ తలుపు తట్టడం ఖాయం. అలా, యూ ట్యూబ్ మీ ఆదాయ వనరుగా మారుతుంది. 6, కొందరు సోషల్ మీడియాలో షార్ట్‌కట్‌లో వ్యూయర్స్‌ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అవన్నీ యూట్యూబ్ నిబంధనలకు వ్యతిరేకం. ఆ అంకెలూ శాశ్వతం కాదు.
-Shyammohan