శ్రీసిటీలో జాబ్ పోర్టల్ ప్రారంభం

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్ర ఆర్థిక, శాసన వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం మధ్యాహ్నం శ్రీసిటీలో పర్యటించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ, కళాశాలల ఏర్పాటు ప్రతిపాదనపై పరిశ్రమల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకోవడం, వారి సహకారం కోరడం పర్యటన ఉద్యేశ్యం కాగా, మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఆర్థిక) ఎస్ఎస్ రావత్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎ.శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, సత్యవేడు ఎమ్మెల్యే కె.ఆదిమూలం ఇందులో పాల్గొన్నారు. 
వీరికి సాదర స్వాగతం పలికిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంత్రి, ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు శ్రీసిటీ పర్యటనకు రావడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. నైపుణ్యతను పెంపొందించడం ద్వారా రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వ చిత్తశుద్ధి వీరి పర్యటన ద్వారా ప్రతిబింబిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తాము అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. 
పరిశ్రమల సీఈఓలు, సీనియర్ మేనేజర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, శ్రీసిటీ అభివృద్ధిని అభినందించారు. దేశంలో విజయవంతమైన మరియు అత్యంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్న వ్యాపార నగరాల్లో ఒకటైన శ్రీసిటీకి అన్నివిధాలా మద్దతు ఇవ్వడం మా కర్తవ్యం అని ఆయన తెలిపారు. 
విద్యార్థుల నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి, రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని అన్నారు. విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్యాలను అందించడం కోసం, పరిశ్రమ-ప్రభుత్వ భాగస్వామ్యం ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్య శిక్షణ అవసరం, విద్యార్థుల నుంచి ఎలాంటి నైపుణ్యాలను ఆశిస్తున్నారో, ప్రభుత్వానికి వ్రాతపూర్వకంగా సూచనలు, అభిప్రాయాలను తెలియచేయాలని పరిశ్రమ ప్రతినిధులను మంత్రి అభ్యర్థించారు. తద్వారా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిపై  స్థిరమైన నమూనాను రూపొందించి కార్యాచరణ చేస్తుందన్నారు. 

ఎస్ఎస్ రావత్, శ్రీకాంత్ మాట్లాడుతూ, పరిశ్రమల భాగస్వామ్యంతో స్థిరమైన నమూనాతో ప్రభుత్వం రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి విశ్వవిద్యాలయం మరియు కేంద్రాలను ఏర్పాటు చేయనుందన్నారు. పరిశ్రమ వర్గాల సూచనలనుసరించి, వారి అవసరాల మేరకు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో పాఠ్య అంశాలను పొందుపరచడం జరుగుతుందన్నారు. 

మంత్రి అభ్యర్థనపై స్పందిస్తూ పలువురు పరిశ్రమల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. విద్యార్థులకు మంచి పరిజ్ఞానం ఉందని, అయితే నైపుణ్యాలు సరైన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారు. సుశిక్షితులైన విద్యార్థులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమ ఎదురుచూస్తోందన్నారు. ఐటిఐ స్థాయి నుంచి ఇంజనీరింగ్ స్థాయి వరకు పాఠ్యాంశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు.

అనంతరం మంత్రి శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూసారు. థెర్మాక్స్ పరిశ్రమను సందర్శించి అందులోని శిక్షణాకేంద్రాన్ని పరిశీలించారు. 
శ్రీసిటీ జాబ్ పోర్టల్ ను ప్రారంభించిన మంత్రి.. పర్యటనలో భాగంగా శ్రీసిటీ నూతన జాబ్ పోర్టల్
sricityjobs.in  ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. పరిశ్రమలకు, అభ్యర్థులకు ఇరువురికి పరస్పరం ఉపయోగకరంగా ఈ ఆన్లైన్ పోర్టల్ ను ప్రత్యేకంగా రుపొందించినట్లు శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో పరిశ్రమలు వారికి ఉద్యోగ ఖాళీలను ఉంచుతుందని, అభ్యర్థులు నేరుగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరోవైపు అభ్యర్థులు వారి విద్యా వివరాలను పోర్టల్ లో పొందుపరిస్తే అవసరం మేరకు పరిశ్రమలు వాటిని స్వీకరిస్తుదన్నారు. శ్రీసిటీ చర్యలను మంత్రి ప్రశంసించారు. 

Share.

Leave A Reply