ఇంద్ర భవనం కాదు, పంచాయితీ ఆఫీసు…

Google+ Pinterest LinkedIn Tumblr +

గుర్రపు డెక్క మొక్కే కదా అని వదిలేస్తే, జల చరాలకు ప్రాణవాయువు అందదు.కుంటల్లో నీటి నిలువ తగ్గి పోతుంది. ఈ సంగతి తెలుసు కొని ముందుగా పనికి రాని ఆ పచ్చ దనాన్ని తొలగించారు ఆ గ్రామస్తులు. అక్కడితో ఆగకుండా ప్రతీ ఇంటికే కాదు, ఆ ఊర్లోకి అడుగు పెట్టిన బాటసారులకు కూడా మరుగు దొడ్లు నిర్మించారు. చెత్త నుండి ఎరువును తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ ని తరిమి కొట్టారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి దోమలకు దిక్కు తోచని పరిస్థితి కల్పించారు. 
అయిదేళ్ల క్రితం అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడిన చినఅమిరం గ్రామం నేడు అడుగడుగునా అభివృద్దితో కళకళలాడుతోంది. ఈ కృషి వెనుక ఉన్న బుద్ధరాజు శ్రీనివాసరాజు చదివింది అయిదో తరగతి మాత్రమే, అయినప్పటికీ, ఊరిబాగుకోసం అభివృద్ది పాఠాలు వంట బట్టించుకున్నారు.సర్కారీ గ్రామీణాభివృద్ది పథకాలను, తమ గ్రామానికి వినియోగించడంలో విజయం సాధించారు. 

పశ్చిమ గోదావరిజిల్లా, భీమవరం పట్నానికి కూతవేటు దూరంలో ఉన్న చినఅమిరం లో అడుగు పెట్టగానే, అద్దంలా మెరిసే రహదారుల పక్కనే పచ్చని మొక్కలు,బాటసారుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు కనిపిస్తాయి. బహుళ అంతస్తుల భవనాలు ఒక వైపు, సంప్రదాయ లోగిళ్లు మరోవైపున. అడుగడుగునా పచ్చదనంతో పల్లె కళకళలాడుతోంది. గ్రామపంచాయితీ ఆఫీసు ఎక్కడా అని గ్రామస్తులను అడిగితే అద్భుతమైన అధునాతన ప్యాలస్‌ వైపు చూపించారు. దాని ఎదురుగా మంచినీటి చెరువు, మధ్యలో గౌతమబుద్ద విగ్రహం. ఆ గ్రామ ప్రగతికి చిహ్నంగా కనిపించాయి. 
సమష్టి చైతన్యం 
బుద్ధరాజు శ్రీనివాసరాజుకు పెద్ద చదువు లేకపోయినా, చదువుకున్న ఊరి యువతీయువకులను కూడగట్టి ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలను బాగా అధ్యయనం చేసి, వాటికి తన సొంత నిధులు కలిపి, ప్రజల శ్రమ దానంతో మురికి కూపంగా మారుతున్న తమ గ్రామాన్ని ముత్యంలా మార్చాలనుకున్నాడు. 
గ్రామ ఆదాయం పెంపుతో మొదలు… 
ప్రజల సాయంతో వంద శాతం పన్నుల వసూలు చేయడం వల్ల గతంలో రూ.12లక్షలే ఉన్న పంచాయితీ ఆదాయం నేడు రూ.63,25,987కి పెరిగింది. 
వీధిలైట్లుగా ఎల్‌ఇడీ బల్బులు వాడకం వల్ల ,కరెంట్‌ బిల్లు 40శాతం తగ్గింది. 
గ్రామపంచాయితీ కార్యాలయానికి సోలార్‌ విద్యుత్‌ వాడకం వల్ల కరెంటు బిల్లు 70% తగ్గింది. 
గ్రామ ప్రధాన కూడళ్ళలో రూ.1,40,000 ఖర్చుతో సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. గ్రామంలో అన్ని ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు కోసం ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోక పనులు నత్తనడక నడుస్తుంటే రాజు తన సొంత నిధులను రూ. 8.50 లక్షలు వ్యయం చేసి పనులు పూర్తి చేశారు. 
ప్లాస్టిక్‌ రహిత పల్లె 
ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ఇక్కడ ఒక ఉద్యమమే నడిచి ఇపుడు ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా మారడం వెనుక ప్రజల చైతన్యం ఉంది. గ్రామంలోని 200 షాపుల్లో ప్లాస్టిక్‌ బ్యాగుల బదులు క్లాత్‌బ్యాగ్‌లు వాడాలని గ్రామస్తులంతా తీర్మానం చేసి, ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. 
స్వచ్చభారత్‌ నినాదంతో ప్రభుత్వాలు పారిశుద్ధ్యానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన రాజు గ్రామపంచాయితీ పాలక వర్గం సహకారంతో రూ.55 లక్షల ఖర్చుతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఎక్కడ చూసినా చెత్త కుప్పలతో, పారిశుధ్ధ్యం అంతంతమాత్రంగా ఉండే గ్రామం పరిశుభ్రంగా కనిపిస్తోంది. 
దోమలు పెరగకుండా, భూర్భ డ్రైనేజీలు నిర్మించారు. ఊరికి దూరంగా, డంపింగ్‌ యార్డుని నిర్మించి, వీధుల్లో చెత్త సేకరించ డానికి 2168 డబ్బాలు ఏర్పాటు చేశారు.చెత్తనుండి ఎరువును తయారు చేసే అందమైన కేంద్రాన్ని నిర్మించారు. స్వచ్ఛ గ్రామాలకు కేంద్రప్రభుత్వం ఇచ్చే నిర్మల పురస్కారాన్ని సైతం అందుకొని నాటి నుంచి అభివృద్ధిలో మరింతగా ముందుకు వెళ్తూ అవార్డుకు వన్నె తెస్తోంది. 


సూర్యోదయానికి ముందే పంచింగ్‌… 
” ప్రగతికి చిరునామాలా చినఅమిరం ఉండాలని, పంచాయితీరాజ్‌ శాఖ నిధులతో స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దాం. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, దాతల సహకారంతో స్వచ్ఛమైన పల్లెగా తీర్చిదిద్దుతున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరం ఊరిబాగే లక్ష్యంగా పని చేస్తాం.రూ. కోటి ఖర్చు చేపి పంచాయితీ భవనం నిర్మించాం.దీనికి ప్రభుత్వ నిధులు రూ.13లక్షలు మంజూరైతే మిగతాది మా గ్రామస్తులం సమకూర్చుకున్నాం. సూర్యోదయానికి ముందే మా పంచాయితీ పారిశుధ్య కార్మికులు పంచింగ్‌ చేసి పనిలోకి చేరి, ఊరిని శుభ్రం చేయడం ప్రారంభిస్తారు.పల్లెప్రగతి పై అధ్యయనం చేస్తున్నవారెందరో మా ఊరిని చూసి వెళ్తున్నారు. నేను పెద్దగా చదువుకోక పోయినా, చదువుకున్న మా ఊరి యువతరం చేయూతతో ముందుకు సాగుతున్నా, మా ఇద్దరు కుమారులను ఇంజనీరింగ్‌ చదవిస్తున్నాను.” అంటారు మాజీ సర్పంచ్‌ బుద్ధరాజు శ్రీనివాసరాజు. 
” ప్రతిష్ఠాత్మకంగా15కిలోమీటర్లు వరకు నిర్మించిన భూగర్భ డ్రైనేజీ జిల్లా స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్లాస్టిక్‌ నిరోధించడంలో, మెరుగైన పారిశుధ్ధ్యంలో మా కృషికి పంచాయితీ రాజ్‌ శాఖ నుండి నిర్మల్‌ పురస్కారం పొందడం మాకు మరింత బాధ్యత పెంచింది.” అంటారు మాజీ సర్పంచ్‌ అన్నపూర్ణ. 
ఇంటింటికీ జలధార 
” గోదారి పక్కనే ఉన్నా ఒకపుడు తాగునీటిని కొనుక్కొనే వాళ్లం. ఆర్ధిక స్తోమతు లేని వారు దూరం నుండి బిందెల్లో మోసుకొచ్చుకునే వారు. రెండేళ్లపాటు, రాజు గారు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేశారు. నేడు ఆ బాధలు తప్పాయి. ప్రతీ ఇంటికి కుళాయి ఇచ్చారు.చెరువులో నీటిని శుద్ధి చేసి పంపుతున్నారు.” అంటారు చినఅమిరం గ్రామస్తులు. 
2,200 గడపలున్న ఈ గ్రామంలో ప్రతీ ఇంటికి టాయిలెట్‌, తాగునీటి సౌకర్యం కల్పించారు. 
మద్యం షాపులు మూయించారు… 
ఈ ఊర్లో ఒకపుడు ఆరు మద్యం షాపులు,ఒక బార్‌ ఉండేది. ఆడవాళ్లంతా ఏకమై వాటిని మూయించారు. మగవారిని తాగుడు నుండి దూరం చేసి ,పనులకు పంపుతున్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగాక రాజకీయ పార్టీల గొడవలకు స్థానం లేకుండా పోయింది. ఎవరు ఏ పార్టీలో ఉన్నా అభివృద్ధిలో మాత్రం అంతా ఒక్కటై నిలుస్తారు. సంక్రాంతి కోడి పందాలకి ప్రసిద్ధి అయిన ఈ ప్రాంతంలో చినఅమిరం ప్రజలు మాత్రం తిమిరం పై పందెం కాసి విజయం సాధించి ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నారు. 
శ్యాంమోహన్‌(9440595858) 

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg42, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply