Cheers to Super Mario…

Google+ Pinterest LinkedIn Tumblr +

సికిందరాబాద్‌ స్టేషన్‌ నుండి బెంగళూరు బండి మరో పదినిముషాల్లో బయలు దేరుతుందనగా, ఆటో దిగి, ఫ్లాట్‌ ఫాం మీదకు వచ్చాను. స్లీపర్‌ కోచ్‌ నుండి మోహన్‌ గారు చేతులూపు తున్నారు. ఇంతలో వెనుక నుండి వెంకట్‌ …
‘వచ్చేశా…గురూ…’ అని నా భుజం మీద చేతులేశాడు. అతని చేతిలో ఆల్ఫా బిర్యాని ప్యాక్‌లు నోరూరిస్తున్నాయి. అందరం భోగీలోకి వెళ్లాం.
ఇక రైలు కదల బోతుంటే…
‘‘ మనోళ్లంతా వచ్చారా అబ్బా…’’ అని కూల్‌గా విండో పక్కన సిగరెట్‌ దమ్ము లాగుతూ అడిగారు మోహన్‌.
‘‘ ఇంకా ఒకరు రావాలి బాస్‌…’’ అని అనబోతుంటే…
అపుడే … చెమటలు తుడుచుకుంటూ బ్యాగ్‌తో లోపలికి వచ్చాడు మృత్యుంజయ.
బండి కదిలింది…
శంకర్‌, భూక్యా శ్రీనివాస్‌లు పై బెర్త్‌లో ఫారిన్‌ కార్టూన్‌ పెస్టివల్స్‌ గురించి మాట్లాడుకుంటున్నారు.
సుభానీ తన కార్టూన్‌‌ ఆల్బం ని తెరిస్తే… మీసం చివర చిటికెన వేలితో గోక్కుంటూ, మురిపంగా చూస్తున్నాడు మోహన్‌.
రాజు గారికి బెంగళూరులో ఏర్పాట్లు గురించి చెబుతున్నాడు శేఖర్‌.
దాదాపుగా హైదరాబాద్‌ కార్టూనిస్టులంతా అదే ట్రైన్‌లో ఉన్నాం. పత్రికల్లో పనిచేస్తున్న వాళ్లం నాలుగు రోజుల కార్టూన్లు ముందే ఎడిటర్‌ కి ఇచ్చేసి వచ్చాం.
‘‘ ఇంతకీ బాపు గారు వస్తారంటావా.? నరేంద్ర నిన్నే నమ్ముకున్నాడు…?’’ అని నా వైపు అనుమానంగా చూశాడు మోహన్‌. చేతిలోని కూల్‌ డ్రింక్ ని సిప్‌ చేస్తూ…
‘‘ ఆయన గురువు గోపులు కూడా వస్తున్నాడు. ఎయిర్‌ టిక్కెట్లు పంపించాం… ’’ అన్నాను.
‘‘ గోపులు గురించి వినడమే తప్ప ఎన్నడూ చూడలేదె… రేపు గురుశిష్యులను చూసే అవకాశం … వాటే వండర్‌ ….’’ అని ఆనందం తట్టుకోలేక, బిర్యానీ ఓపెన్‌ చేయనా అన్నాడు వెంకట్‌.
…………….
ఈ సందడి అంతా దేనికంటే …
కర్నాటకలో మూడు రోజుల కార్టూన్‌ ఫెస్టివల్‌కి మాలో నలుగురిని పిలిచారు IIC నరేంద్రగారు.
‘ మనోళ్లందరినీ తీసుకు పోదాం…మైసూరు ఫ్యాలెస్‌ చూడాలబ్బా, అక్కడ రవివర్మ ఒరిజినల్‌ పెయింటింగ్స్‌ ఉన్నాయి… ఏర్పాట్లు చూడు..’ అని మోహన్‌ ఆర్డర్‌ వేశాడు. ఏమి చేస్తాను మోహన్ నా బలహీనత….
ఆ విధంగా మా జర్నీ మొదయింది.
మర్నాడు బెంగళూరులో దిగాం. నరేంద్ర గారు మా గ్యాంగ్‌ని చూసి కంగారు పడకుండా గెస్ట్‌ హౌస్‌ బుక్‌ చేసి, ఎన్ని రోజుంటారో మీ ఇష్టం అన్నారు సంతోషంగా….
కార్టూన్‌ వర్క్‌షాప్‌లు, ఉపన్యాసాలతో ఒక రోజు గడిచింది. రెండో రోజు అనుకుంటా, నేను వెంకట్‌ ఎయిర్‌ పోర్ట్‌కి వెళ్లి బాపు గారిని వారి గురువుతో సహా తీసుకొచ్చాం.
ఇంతలో నరేంద్రగారు హడావడిగా వచ్చి…
‘‘ గోవా నుండి మారియో వచ్చారు. మోహన్‌ గారిని చూడాలంటున్నారు …’’ అన్నారు.
ఒక్క సారి… Illustrated weekly డబుల్‌ స్ప్రెడ్‌లో బొంబాయి జీవితాన్ని క్యారికేచర్‌ చేసిన మారియో డ్రాయింగ్స్‌ గుర్తుకు వచ్చాయి.
అప్పటికే మోహన్ నీ తీసుకొని గుజ్జరప్పా ప్రెస్ క్లబ్ కి వెళ్లి పోయారు.
మా కార్టూనిస్టులంతా బాపు, మారియో చుట్టూ తిరుగుతూ, కార్టూన్లు చూపిస్తూ సలహాలు అడుగుతున్నారు. vins, jaydev,Teevee, suresh sawant,trayambak sharma,narendra ల తో మాకు భాస్కర్ ఫోటోలు తీస్తున్నాడు. ఆ రాత్రి విధాన సభ ఎదురుగా ఉన్న కబ్బన్ పార్క్ లోని ప్రెస్ క్లబ్ లో మాకు
కర్నాటక మిత్రులు ఇచ్చిన అతిధ్యం మరువ లేనిది .
మర్నాడు ఉదయం మైసూరు, బృందావన్‌ గార్డెన్స్‌కి బయలు దేరాం.
పచ్చని పొలాల మధ్య మా మినీ బస్ దూసుకు పోతుంది. అదొక అరుదైన అనుభవం.
మాతో పాటు జోకులు వేస్తూ ,భుజాల మీద చేతులు వేసి ఉల్లాసంగా తిరిగారు మారియో… మా టీమ్ స్పిరిట్ చూసి, చివరికి మాకు మోహన్ మాఫియా అని పేరు పెట్టారు.
ఒక ఇండియన్‌ లెజెండర్‌తో కలిసి మైసూర్ రోడ్‌ పక్కన టీ తాగిన అనుభవం ఇది!!
ఈ రోజు ఆయన పుట్టిన రోజు.
ఆ నాడు మాతో ఉన్న…
వెంకట్‌,శేఖర్‌, బాపు, మోహన్‌లు ……..
కేక్‌ కట్‌ చేసి మారియోకి బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఉంటారు స్వర్గంలో…

Share.

Leave A Reply