‘కరువుకు..చెక్’‌డ్యాములు!

Google+ Pinterest LinkedIn Tumblr +

మహిళా కూలీలు.. రైతులుగా మారారు. కాపరులు పశుసంపదకు యజమానులయ్యారు. బతుకు దెరువు కోసం వలస పోయిన కుటుంబాలు తిరిగివచ్చి సొంతూళ్లో సేద్యం చేసుకుంటున్నాయి. ఒకే ఆలోచన.. అనేక సమస్యలకు పరిష్కారమైంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలను సమన్వయం చేసింది. ఈ క్రమంలో వాగులపై నిర్మించిన చెక్‌ డ్యాములు.. కరువుకు ‘చెక్‌’ పెడుతున్నాయి. వాన చినుకులకు పరుసవేది విద్య నేర్పుతున్నాయి. అవే నీళ్లు.. మట్టిని బంగారంగా మారుస్తున్నాయి. 

ఒకప్పుడు.. ఆ గ్రామాల్లో వాన లు లేవు. సాగునీటి వసతి లేదు. అడుగంటిన భూగర్భ జలాలు. ఉన్నంత లో వాడుకుందామన్నా.. విద్యుత్‌ సమస్యలు. ఇన్ని కష్టాల మధ్య ఎలాగోలా పంట పండినా.. గిట్టుబాటు లేదు. చాలీచాలని ఆదాయం తో అనేక కుటుంబాలు వలస బాట పట్టాయి. కానీ, అదంతా గతం. నాలుగేండ్లుగా అక్కడ అనేక మార్పులొచ్చాయి. జల సంరక్షణ, మహిళల ఉమ్మడి కృషితో ఆయా కుటుంబాలు సాగు సంబురంలో మునిగి తేలుతున్నాయి. మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాధార రైతులను ఆదుకొనేందుకు, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ముందుకు వ చ్చింది. సంకల్ప్‌, డవ్‌, రీడ్‌, స్కోప్‌ తదితర స్వచ్ఛంద సంస్థల సహకారంతో కరువును జయించారు. ఆ ఫలితాలే ఇవన్నీ..

ఎలా చేశారు?

గ్రామగ్రామానా సభలు నిర్వహించారు. నీటి వనరుల పునరుద్ధరణ, వాన నీటి సంరక్షణ, వాటర్‌షెడ్‌ ప్రాధాన్యం గురించి రైతులకు వివరించారు. పొలాల్లో పడిన వాన నీటిని అక్కడే ఎలా ఆపుకోవచ్చో.. చిన్ననీటి కుంటలు, ఊట కుంటలు, రాతి డ్యామ్‌లు, రాళ్ల కట్టలతో వాననీటిని ఎలా ఒడిసి పట్టుకోవచ్చో తెలియజెప్పారు. పంట కుంటలు ఏర్పాటు చేయడం.. నిల్వనీటి ద్వారా పంట కీలక దశలో బిందు, తుంపర్ల సేద్యం చేయడం.. భూగర్భజలాలను వృద్ధి చేయడం.. మెట్ట ప్రాంతాల్లో వాననీటిని సద్వినియోగం చేసుకొని కాంటూర్లు, చెక్‌డ్యామ్‌లు, అడ్డుకట్టలు నిర్మించడంపై అవగాహన కల్పించారు. రైతులే శ్రమదా నం చేసి, ఆయా పనులను పూర్తి చేసుకున్నారు. నిజానికి, వాటర్‌షెడ్‌ విజయవంతం కావడంలో మహిళలే విశేష కృషి చేశారు. 

రైతుగా మారిన కాపరి..

మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట (శ్రీశైలం రోడ్‌) అటవీ మార్గంలో ఉండే మైలారం గ్రామానికి చెందిన కోట్ల రామకృష్ణయ్య, భార్యతో కలిసి ఆరేండ్ల క్రితం వరకూ పశువుల కాపరిగా బతికేవాడు. వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు మొదలయ్యాక ఈ దంపతులు తమ రెండెకరాల బీడు భూమిని సాగులోకి తెచ్చారు. ఇప్పుడు స్ప్రింక్లర్లు పెట్టి పశుగ్రాసం పండిస్తున్నారు. బ్యాంకుల రుణసాయంతో రెండు పశువులు కొన్నారు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. తెలంగాణ ప్రభుత్వ సాయంతో వంద గొర్రెలు, 20కి పైగా బర్రెలను కొని, పశుపోషణ చేస్తూ నెలకు రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు.

సేంద్రియ చెరకు, కూరగాయలు..

మెదక్‌ సమీపంలోని ఖాసీంపూర్‌ గ్రామ రైతులు, ఒక చెక్‌డ్యామ్‌ సాయంతో వాన నీటిని ఒడిసిపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో కూలీపనుల మీద ఆధార పడి బతికిన అనిత, శోభమ్మ తమ రెండు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేయడానికి ‘స్కోప్‌’ సంస్థ సాయం చేసింది. ‘అందరిలాగే రసాయన ఎరువులు వాడినప్పుడు కొంత కాలం పంటలు బాగానే పండాయి. తర్వాత పెట్టుబడులు పెరిగి, దిగుబడులు క్రమంగా తగ్గిపోయాయి. నష్టం రాసాగింది. దీంతో పెద్దగా పెట్టుబడి లేని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాను. వాటర్‌షెడ్‌ తుంపర సేద్యాన్ని నేర్పింది. చెరుకు, ఉల్లి, కంది, శనగ, జొన్న వేసి మంచి దిగుబడులు తీశాం. చెరకు కూడా సేంద్రియ పద్ధతిలోనే పెంచుతున్నాం. రసాయనాలు వాడిన రైతుల కంటే మాకు ఎక్కువ దిగుబడులు రావడం చూసి, మరికొందరు రైతులు సేంద్రియ సాగువైపు వస్తున్నారు’ అని ఆ ఇద్దరు మహిళలూ ఉత్సాహంగా చెప్పారు.

సుస్థిర జీవనం దిశగా..

వాటర్‌షెడ్‌ వల్ల రైతుల్లో జల సంరక్షణపై అవగాహన పెరిగింది. తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేయడం తెలుసుకున్నారు. సేంద్రియ విధానంలో బహుళ పంటలు పండిస్తూ సుస్థిర వ్యవసాయం చేస్తున్నారు. భూగర్భ జలమట్టం పెరిగింది. రైతుల వలసలు తగ్గాయి. భూమి లేని నిరుపేదల జీవనోపాధి మెరుగుదలకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. దీంతో వారికీ ఆదాయాలు వస్తున్నాయి. చేతివృత్తులు, కుల వృత్తులనూ కాపాడుకున్నారు. ‘రైతు బంధు’ పథకంలో అందుతున్న ఆర్థిక ఆసరాతో పంట పెట్టుబడి కోసం అప్పులు చేసే దుస్థితి పోయింది. ఏది పడితే అది పండించకుండా, భూసార పరీక్షలు చేసి నేల స్వ భావానికి తగ్గ పంటలే సాగు చేస్తున్నారు. భూగర్భజలాలున్నాయి కదా.. అని యథేచ్ఛగా తోడేయకుండా డ్రిప్‌ ఇరిగేషన్‌ చేపట్టి నీటిని పొదుపుగా వాడుతున్నారు. వృథాగా పోయే వాన నీటిని ఒడిసి పట్టి.. సమష్టిగా సాధించిన జల విజయం ఇది.

మూడు పంటలు, రెండు రెట్లు ఆదాయం

పర్వతాపూర్‌కు చెందిన నాగమణికి నాలుగెకరాల భూమి ఉంది. కానీ అదంతా బీడు. ఒకప్పుడు జొన్నలు పండించేవారు. వచ్చే ఆదాయం పంట పెట్టుబడికే సరిపోయేది కాదు. వాన నీటిని భూమిలోకి ఇంకించే పనులు చేపట్టడం వల్ల, భూగర్భ జలమట్టం పెరిగింది. ఇప్పుడు ఉల్లి, పసుపు, పెసర పండిస్తున్నారు. ఎకరానికి ఏడాదికి రూ.80 వేల నుండి రూ.95 వేల దాకా ఆదాయం వస్తున్నదని నాగమణి సంబురంగా చెబుతున్నారు. గతంలో రూ.40 వేలు కూడా వచ్చేది కాదని, నాటి నష్టాలను గుర్తు చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో జల సంరక్షణ ప్రభావంతో పలువురు రైతులు వరి కూడా సాగు చేస్తున్నారు.

కూలీ నుంచి యజమానిగా

రంగారెడ్డి పల్లి (రంగారెడ్డి జిల్లా)కు చెందిన లక్ష్మి, వెంకటేష్‌ దంపతులకు మూడెకరాల భూమి ఉంది. వర్షాధారంపై వేరుశనగ పండించేవారు. పెద్దగా లాభాలేమీ రాలేదు. పంటలు లేకపోతే నేల బీడుగా మారుతుందని, నష్టమైనా సాగును ఆపలేదు. ఆదాయం సరిపోక ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లేవారు.ఆ సమయంలోనే ‘సంకల్ప్‌’ అనే స్వచ్ఛంద సంస్థ.. వాటర్‌షెడ్‌ కార్యక్రమం గురించి చెప్పింది. దీంతో ఆ దంపతులు వ్యవసాయ వ్యూహాన్ని మార్చుకున్నారు. రెండెకరాల్లో 320 బత్తాయి మొక్కలు పెంచారు. ఇప్పుడు ఆ తోట నిండుగా కాసిన బత్తాయి పండ్లతో కళకళలాడుతున్నది. 95 టన్నుల వరకూ దిగుబడి రావచ్చని వారు చెబుతున్నారు. మరో ఎకరంలో పశుగ్రాసం పెంచుతున్నారు. వీరికి రెండు పశువులు ఉన్నాయి. ‘వాటర్‌షెడ్‌ పనులు చేపట్టాక, మా ప్రాంతంలో ఐదు పంట కుంటలు, రెండు చెక్‌డ్యామ్‌లు వచ్చాయి. ఎండిన బోరులో నీటి మట్టం పెరిగింది. పండ్ల తోట మీద, పాల మీద ఆదాయం వస్తున్నది. మరో ఇద్దరికి పని కల్పించే స్థాయికి చేరుకున్నాం’ అని సంతోషంగా చెబుతున్నారు లక్ష్మి.

తిరిగొచ్చిన వలసజీవులు

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం వెల్‌చాల్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ హమీద్‌ కుటుంబానికి ఐదెకరాల భూమి ఉంది. నీటి వసతి లేక పడావు వడ్డది. సాగు చేద్దామని ప్రయత్నిస్తే విత్తనాలు, కూలీలకు పెట్టిన ఖర్చు కూడా తిరిగి వచ్చేది కాదు. దీంతో సాగును వదిలేసి, బతుకు దెరువు కోసం భార్యతో కలిసి గల్ఫ్‌బాట పట్టాడు. వాటర్‌షెడ్‌ కార్యక్రమాలతో వ్యవసాయంలో వస్తున్న మార్పుల గురించి తెలిశాక, గ్రామానికి తిరిగి వచ్చారు. అదే సమయంలో, ఎండిపోయిన బోర్‌లో నీటిమట్టం పెరిగింది. బీడు భూమిని సాగులోకి తెచ్చి, మామిడి తోట పెంచారు. అంతరపంటలుగా మక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు.  

Share.

Leave A Reply