బొట్టు ,బొట్టు ఒడిసి పట్టి…

Google+ Pinterest LinkedIn Tumblr +


”ఒకపుడు తాగడానికి కూడా నీళ్లు దొరికేవి కాదు. మా గ్రామస్తులంతా ఏకమై ఎక్కడ కురిసిన వర్షాన్ని అక్కడే ఇంకే పనులు చేశాక , పంటపొలాలకే కాక తాగునీటి సమస్య కూడా తీరింది. 
పశు వులకు కూడా నీళ్లు దొరుకుతున్నాయి” అని వెలుగు నిండిన కళ్ళతో చెప్పింది లక్ష్మి. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మడలం,మహదేవ్‌పురం పంచాయితీలో రెండెకరాల బీడు భూమి ఉంది ఆమెకు. కానీ సాగు నీటి సదుపాయం లేక ఆ భూమిని అలాగే వదిలేసి కూలీపనులకు పోయేది. 2008లో నాబార్డ్‌ ఈ ప్రాంతంలో భూగర్భజలాల అభివృద్ధికోసం ఏఎస్‌డిఎస్‌ సంస్థతో కలిసి పనులు ప్రారంభించడంతో ఈ కోయ గిరిజనుల జీవితంలో మార్పు వచ్చింది. వాలు ప్రాంతంలో కందకాలు తవ్వి, ఫారంపాండ్స్‌ నిర్మించడంతో కురిసిన వాననీరంతా భూమిలోకి ఇంకి భూగర్భజలమట్టం పెరిగింది. దీంతో మడకం లక్ష్మి తన పొలాన్ని సాగులోకి తెచ్చి కొంత భూమిలో జామాయిల్‌ చెట్లు నాటి మిగతా భూమిలో మిరప, మినుములు, పెసలు, గోంగూర పెంచుతూ ఆదాయం పొందుతున్నారు. త్వరలో వరిపంటకూడా సాగు చేయబోతున్నట్టు లక్ష్మి అంటున్నారు. 
పాడి పంటలకు లోటు లేదు.. 
వాటర్‌షెడ్‌ పనుల వల్ల భూగర్భ జలాలు పెరిగి వేసంగిలో కూడా తమ గ్రామంలో సాగునీటికి లోటు లేదంటున్నారు మహదేవ్‌పురం గ్రామస్థులు భద్రయ్య, రాధాకృష్ణ. 
తమకున్న రెండు ఎకరాల్లో, ఎకరంన్నర లోమిర్చి, మరో అరెకరంలో కూరగాయలు, గోంగూర, బచ్చలి పండిస్తున్నారు. గతంలో ఎండిపోయిన బోరులో, వాటర్‌షెడ్‌ పనుల వల్ల జలమట్టం పెరిగి ప్రస్తుతం నిరంతరం నీరు ఇస్తోంది. వరికంటే కూరగాయల మీదనే ఆదాయం ఎక్కువగా వస్తోందని సంతోషంగా చెబుతున్నారు ఈ రైతులు. 
పండిన కూరగాయలను స్థానిక మార్కెట్‌కి తరలించి స్వయంగా అమ్ముకొని లాభాలు పొందుతున్నారు. 
”మహదేవ్‌పురం వాటర్‌షెడ్‌ కమిటీ గ్రామస్థులందరినీ ఏకంచేసి వాటర్‌షెడ్‌ పనుల్లో భాగస్వాములను చేయడంతో మా బీడుభూమిలో నేడు బంగారం లాంటి పంటలు పండుతున్నాయి. ఎండిన బోర్లలో ఏడాదంతా నీళ్లు ఊరుతున్నాయి. నాబార్డ్‌ ఇచ్చిన భరోసాతో రైతులంగా సంతోషంగా ఉన్నారు”. అంటారు రూరల్‌మీడియాతో భద్రయ్య,రాధా కిష్ణ.  pic/k.rameshbabu/ruralmedia

Share.

Leave A Reply